జలపాతం

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 5]

ఆ జలపాతం ముందు
దోసిలి పట్టుకుని
ఎంతసేపుగా నిలబడ్డాను?

నిండినట్టే నిండి
తిరిగి తన అస్తిత్వంలోకే
ఆవిరైపోతూ…కవ్విస్తూ…

తడిసిన మనసు సాక్షిగా
అందీ అందని సంతకం కోసం
తెల్ల కాగితం విరహించిపోతోంది

అలుపెరుగని నృత్యానికి కూడా
చలించని ఈ బండరాళ్ళలో
కనీ కనిపించని చిరునవ్వేదో
దోబూచులాడుతూ…చిక్కుముడి విప్పుతూ.

మనిషి కందని రాగంతో
సాగిపోతున్న అంతులేని పాటలో
అపురూపమైన రహస్యమొకటి
అర్థమయ్యీ కానట్టు…

తన సమక్షంలో
నిమేషించని కన్నుల సాక్షిగా
విలీనమైపోతూ కూడా
అందుకోలేకపోతున్నాను…

Your views are valuable to us!