జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి “ఉదయశ్రీ” [ఖండ కావ్యముల సంపుటి]

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 4]

అరుణరేఖలు

ఆనాడు నా శిథిల జీవితానికి ఒక మధురప్రభాతం. నాహృదయంలో ఒక ఉదయశ్రీ.

 

కన్నులు విప్పి చూచాను. శ్రీమతినీ చిరంజీవినీ విడిచి బరువు గుండెతో మేడమెట్లు దిగే గౌతమబుద్ధుని కారుణ్యమూర్తి కనిపించింది. ఆయన ఆర్దనేత్రాంచలాల్లో కరుణాకుమారి తొంగి చూచింది.

 

ఆమె వదనంలో అయోధ్యానగరం అంతఃపురాల్లో నుంచి దండకారణ్య పర్ణకుటిలో తన జీవిత సౌభాగ్యం వెతుక్కుండే ఊర్మిళాకుమారి ఉత్కంఠ తొణుకు లాడుతూ వుంది.

 

ఆమె కంఠంలో పాషాణ హృదయుల ప్రక్కలక్రింద రెక్కలు వీడి నలిగి నశించిపోయే పూలబాల జాలిపాట మెల్లమెల్లగా మ్రోగుతూవుంది.

 

ఆమె నిట్టూర్పులో గంగానది గట్టుమీద నిలిచి నిర్ఘాంతపోయి ఏటి కెరటాలలో పడి ఎక్కడెక్కడికో కొట్టుకుపొయ్యే కొడుకు వైపు నిశ్చల నిరీహ నేత్రాలతో చూచే కుంతీకుమారి గుండెలచప్పుడు వినిపిస్తూవుంది.

 

ఆమె ఆర్ద్రనేత్రాల్లో మృత్యుదేవత వెంట ఒంటరిగా పతికోసం పరువెత్తే సతీమణి సావిత్రి ప్రణయస్వరూపం ప్రతిబింబిస్తూ వుంది.

ఆమె చల్లనిచేతుల్లో కరుణామయి రాధిక హృదయవిపంచి అమృతరాగాలు ఆలపిస్తూవుంది.

ఆమె కన్నీటి కెరటాలలో భారతమాత బాష్పధారలు ప్రవహిస్తూవున్నాయి. ఆమె నిట్టూర్పులు నన్ను మానవుణ్ణిచేశాయి. ఆమె కన్నీళ్ళే నాలోని కవిత్వం. ఆమె నా కరుణామయి. నా జీవిత సహచరి. నా కళ్యాణమూర్తి. నా ఆరాధ్యదేవి.

భగవంతుడు కరుణామయుడు – సృష్టి కరుణామయం. జీవితం కరుణామయం. ప్రపంచం కరుణలో పుట్టి కరుణలో పెరిగి కరుణలోకే విలీన మౌతుంది.

కరుణకూ కవికి అవినాభావ సంబంధం వుంది. కరుణ లేకపోతే కవికి వ్యక్తిత్వం లేదు. కవి లేకపోతే కరుణకు అస్తిత్వం లేదు.

ఈనాడు నా శిథిల జీవితానికి ఒక మధుర ప్రభాతం. నాహృదయంలో ఒక ఉదయశ్రీ.


అంజలి

పుట్టబోయెడి బుల్లిబుజ్జాయి కోసమై

     పొదుగుగిన్నెకు పాలు పొసి పోసి

కలికి వెన్నెల లూరి చలువ దోసిళ్ళతో

     లతలకు మారాకు లతికి యతికి

పూల కంచాలలో రోలంబమునకు రే

     పటి భోజనము సిద్ధపరచి పరచి

తెలవారకుండ మొగ్గలలోన జొరబడి

     వింత వింతల రంగు వేసి వేసి

 

తీరికే లేని విశ్వ సంసారమందు

అలిసిపోయితివేమో దేవాదిదేవ!

ఒక నిమేషమ్ము కన్నుమూయుదువు గాని

రమ్ము! తెరచితి మా కుటీరమ్ము తలుపు!!

 

కూర్చుండ మాయింట కురిచీలు లేవు! నా

     ప్రణయాంకమే సిద్ధపరచనుంటి

పాద్యమ్ము నిడ మాకు పన్నీరులేదు! నా

     కన్నీళ్లతో కాళ్ళు కడుగనుంటి

పూజకై మావీట పుష్పాలు లేవు! నా

     ప్రేమాంజలులె సమర్పించనుంటి

నైవేద్యమిడ మాకు నారికేళము లేదు! నా

     హృదయమే చేతి కందీయనుంటి

 

లోటు రానీయ నున్నంతలోన నీకు

రమ్ము! దయసేయు మాత్మపీఠమ్ముపైకి

అమృతఝురి చిందు నీ పదాంకములయందు

కోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి!

 

 

లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర

     దీపాలు గగనాన త్రిప్పలేక

జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు

     మామూలు మేరకు మడవలేక

పనిమాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె

     గడియారముల కీలు కదపలేక

అందాలు చింద నీలాకాశ వేదిపై

     చుక్కల మ్రుగ్గులు చెక్కలేక

 

ఎంత శ్రమనొందుచుంటివో ఏమో సామి!

అడుగిడితి వెట్లో నేడు మా గడపలోన!

గుండె కుదిలించి నీముందు కుప్పవోతు

అందుకోవయ్య! హృదయపుష్పాంజలులను


ఉషస్సు

కర్కశ కరాళ కాలమేఘాల నీడ

లెగురుచున్నవి ప్రజల నెమ్మొగములందు!

క్రౌర్య కౌటిల్య గాఢాంధకార పటలి

క్రమ్ముకొన్నది దిగ్దిగంతమ్ము నెల్ల.

 

ఈ నిస్తబ్దత కంతరార్థ మెదియొ!! ఈ కారుమేఘాలలో

ఏ నిర్భాగ్య నిరర్థ నీరస గళం బెల్గెత్తి వాపోవునో!

ఈ నీరంధ్ర నిశీధ గర్భకుహర, మ్మే భావ గంభీరతా

పౌనఃపున్యము దాచెనో! వెలయవో ప్రాభాత శోభావళుల్!

 

ఈ చీక ట్లిక తెల్లవారవటె! లేనేలేవటయ్యా స్మిత

శ్రీ చైతన్య నవప్రభాతములు నిర్జీవ ప్రపంచాన! మా

ప్రాచీబాల కపోల పాళికలపై ప్రత్యూష సౌవర్ణ రే

ఖా చిత్రమ్ములు గీతు రెవ్వ రనురాగస్విన్న హస్తాలతో!


 

ఉదయశ్రీ

సుప్రభాతము! రాగోజ్జ్వల ప్రబోధ

మంధలోకాని కిడు జగద్బాంధవుండు

ఉదయమగుచుండె నవయుగాభ్యుదయమునకు

అరుణ కిరణాలతో కరుణార్ద్రమూర్తి.

 

చీకటిలో లోక మ్మిది

చీకాకై పోయె; సంస్పృశింపగవలె నీ

శ్రీకరముల, కరుణా కమ

లాకర తరుణ ప్రభాకరా! రావోయీ!

 

శుద్ధోదన రాజేంద్రుని

శుద్ధాంతము చిందె శాంతసుధల, అహింసా

సిద్ధాంత మొలుకు గౌతమ

బుద్ధుని చిరునవ్వులోన పులకీకృతమై!

 

 

ఉత్తిష్ఠ

చిన్నికుమారు చిర్నగవు చెక్కిలిలో పులకించు రాణి క్రీ

గన్నుల నీడలన్ సుఖముగా సుమడోలల తన్మయుండవై

ఉన్నత భర్మసౌధముల నూగెడి రాజుల చిన్నవాడ! నీ

కన్నులు విప్పి నల్ దెసలు సన్గొనరా! యిక నిద్రచాలురా!

 

నిదురన్ భంగము చేసినా ననుచుగానీ; కూర్మిదేవేరి ప

య్యెద బాంధవ్యము బాపుచుంటి నని కానీ, కిన్కగైకోకు! నీ

హృదయమ్మున్ హృదయేశ్వరీ హృదయమందే కాదు..సుప్త ప్రజా

హృదయాబ్జమ్ముల మేలుకొల్పు ’ఉదయశ్రీ’లో ప్రపంచింపరా!

 

ప్రేయసి ప్రేమలోన కనిపించెడి తీయని స్వర్గ మొక్కటే

ధ్యేయము కాదు, హీను లతిదీనులు మ్లానతనుల్ దరిద్ర నా

రాయణు లేడ్చుచుండిరి, తదశ్రువులన్ దుడువంగపొమ్ము నీ

ప్రేయసితోడ, నీ కట లభించును కోట్లకొలంది స్వర్గముల్!

 

బుద్ధుడవై సుషుప్తుల ప్రబుద్ధుల జేయుము, శాంతి సత్య ధ

ర్మోద్ధరణార్థమై బ్రతుకు నొగ్గుము, మానవ సంఘసేవయే

సిద్ధికి త్రోవ, వత్సలర చిందెడి ప్రేమ సుధా స్రవంతులన్

శుద్ధ మొనర్చు ముజ్జ్వలయశోధర! జర్జరిత ప్రపంచమున్!!

లెమ్మిక మేలుకొమ్ము! కదలింపుము క్రాంతిరథమ్ము శాంతి మా

ర్గమ్మున; కాంతి పుంజము లఖండములై నవ జీవన ప్రభా

తమ్ములు నింప, సర్వసమతాసుమకోమల మానవాంతరం

గమ్ముల ప్రేమసూత్రమున గట్టుము మంగళ తోరణమ్ములన్!

 

గుటగుటలాడ ప్రాణములు గొంతుకలో వసి కన్ను గొల్కులన్

బొటబొట రాల బాష్పకణపుంజము, బోరున నేడ్చు నల్లదే

కటికి కసాయి కెంపు చురకత్తి గనుంగొని గొర్రెపిల్ల; సం

దిట గదియింపవే! దిగులు దీర్పవె! ముద్దుల బుజ్జగింపవే!!

 

ఈ మహి స్వర్గఖండ మొనరింపుము! ఘోర హలాహలమ్ము ది

వ్యామృత మాచరింపుము, “జయోస్తు” కుమార! శిరస్సుపై అహిం

సా మకుట ద్యుతుల్ దశదిశల్ వెలిగింప ప్రపంచ మెల్ల నీ

ప్రేమ రసైక వృష్టి గురిపింపుమురా! కరుణాకళాధరా!


కరుణమూర్తి

ఈ ప్రగాఢ నిగూఢ మధ్యే నిశీధి

గడియ కదలించుచున్న సవ్వడి యిదేమి?

ఇప్పు డంతఃపురమ్మునం దెవరు వీరు

మూసియున్నట్టి తలుపులు దీసినార?

 

తెర తొలగ ద్రోసికొని చనుదెంచుచున్న

ముగ్ధ మోహన కారుణ్యమూర్తి యెవరు?

అందములు చిందు పున్నమచందమామ

కళ దరుగుటేమి కాలమేఘాలలోన?

 

నిండు గుండెలపై వ్రాలి నిదురవోవు

ఏ హృదయదేవి పావన స్నేహమునకు

ద్రోహ మొనరించి ప్రక్కకు త్రోసిపుచ్చి

వచ్చెనో కాక – వదన వైవర్ణ్య మేమి?

 

 నమ్మి జీవన సర్వస్వ మమ్ముకొన్న

ప్రణయమయి శాశ్వతప్రేమబంధనములు

త్రెంపుకొని బైటపడు ప్రయత్నింపులేమొ-

తడబడుచు కాళ్ళు గడపలు దాటవేమి!

 

ఒడలు తెలియక ప్రక్కపై బడి, యనంత

మోహనస్వప్నలోకాలలో హసించు

ముద్దుపాపాయి చిరునవ్వు ముత్తియములు

దొరలుచున్నవి వాలు కందోయి తుదల!

 

గేహమే వీడలేకనో! గృహిణితోడ

స్నేహమే వీడలేకనో; శిశువుమీది

మోహమే వీడలేకనో; సాహసించి

దేహళిని దాట నింత సందేహపడును?

 

ప్రణయ భాగ్యేశ్వరీ బాహు పాశ మట్లు

జారిపొలేక ముందుకు సాగనీక

వెంట జీరాడుచు భుజమ్ము నంటి వచ్చు

నుత్తరీయాంచలము చక్కనొత్తడేమి?

 

కేలుగవ సాచి ఆర్ద్రనేత్రాల తోడ

మెట్టు మెట్టుకు పాదాల జుట్టుకొనెడి

ప్రేయసీ కల్పనా ప్రతిబింబ శత స

హస్రముల గాంచి నిస్తబ్ధు డగుచు నిలుచు!

 

పడియు ముందుకు, వెనుకకే ప్రాకులాడు

ప్రభువు చరణాలు స్ఫటిక సోపాన పంక్తి;

గాలి కెదురుగ సెలయేటి జాలులోన

పయనమగు రాజహంస దంపతుల భంగి.

 

ఆ మహోన్నత భర్మ హర్మ్యాలు దిగుట

ఏ మహోన్నత సౌధాల కెక్కజనుటొ?

ఈ వన విహారములు త్యజియించి చనుట

ఏ నవ విహారములు సృజియించుకొనుటో;

 

లలిత లజ్జావతీ లాస్య లాలనములు

కనెడి కన్నులు సత్య నర్తనము కనెనొ;

శ్రీ చరణ మంజు మంజీర శింజితములు

వినెడి వీను లంతర్వాణి పులుపు వినెనొ;

 

మినుకు మినుకున గుడిసెలో కునుకుచున్న

దీప మంపిన దీన సందేశ మేమొ;

స్వర్ణశాలలపై భ్రాంతి సడలి, జీర్ణ

పర్ణశాలల మార్గమ్ము పట్టినాడు;

 

ఆపుకొలేని హృదయమ్ము నదిమిపట్టి

దూరమగుచుండె ప్రభువు సంసారమునకు’

శ్రీయు – శ్రీమతియును – చిరంజీవి లేని

ఈ “మహానిష్క్రమణ”కర్థ మేమికలదో?

 

కాంతిలోనుండి కటికి చీకటులలోన

కలిసిపోవుచునున్నాడు కరుణమూర్తి’

కటికి చీకట్లలోనుండి కాంతిలోన

పతితపావనుడై బయల్పడగనేమొ!!

Your views are valuable to us!