కరుణామయి
నీ దరహాస చంద్రికలు నిండిన నా హృదయాంగణమ్ములో
లేదుగదా తమస్సు లవలేశము, ప్రేమసుధానిధాన! నే
డీ దయనీయదాసి భరియింపగలే దిక నీదు ప్రేమలో
పేదరికమ్ము – మేను మరపింపుము మోహన వేణుగీతికన్!
నీ యసితద్యుతుల్ కనుల నింపితి కాటుకచేసి – అల్లదే
తీయని పాటతో తలుపుదీసెను గుండెకు గున్నమావిపై
కొయిలకన్నె – నా వలపు కొండలపై కడకళ్లనుండి నే
రే యమునా స్రవంతి ప్రవహించెనురా; అనురాగవార్నిధీ!
“శ్రీయుతమూర్తియై కరుణచిందెడి చూపులతోడ స్వామి వేం
చేయును; పాదపూజ దయసేయును మా” కను సంబరాన, ఆ
ప్యాయముగా త్వదీయ పథ మారయుచున్నవి నేడు, పూచియుం
బూయని పచ్చపట్టు పరపుల్ గొని శ్యామల శాద్వలీ స్థలుల్.
నిద్దపు ముద్దుమోవి పయనించు భవన్మురళీరవమ్ములో
నిద్దుర వోయినట్లు శయనించె సమస్తము; సద్దులేని ఈ
యద్దమరేయి ఒంటిగ – రహస్యముగా – తపియించు గుండెపై
నద్దుకొనంగ వచ్చితి దయామయ! నీ చరణారుణాబ్జముల్!!
ఏది మరొక్కమాటు హృదయేశ్వర! గుండెలు పుల్కరింపగా
ఊదగదోయి! ఊదగదవోయి! సుధామయ యుష్మదీయ వే
ణూదయ రాగ డోలికల నూగుచు, విస్మృతిలో విలీనమై
పోదును నాదు క్రొవ్వలపు పువ్వుల ముగ్ధ పరీమళమ్ముతో!!
నీ చిరునవ్వు పాటలు ధ్వనించెడి మామక మానసమ్ములో
లేచెనురా! ప్రఫుల్ల మురళీరవళీ రమణీయ భావనా
వీచి – దృగంచలమ్ముల ద్రవించి స్రవించు మనోనురాగముల్
దాచుకొనంగలేని పసిదాననురా! విసిగింపబోకురా!
“ఇది యది” యంచు తేల్చి వచియింపగరాని విషాద మేదియో
హృది గదలించుచున్నది; దహింపగసాగె నిరాశ శుష్కమౌ
బ్రదుకును; స్నిగ్ధ శీతల కృపారస ధారల, దుర్దినమ్మునే
సుదినము చేయరా! యదుకిశోర! కృశాంగి ననుగ్రహింపరా!
నీరసమైన నీ ప్రణయినీ హృదయ మ్మిది చల్లచల్లగా
నీ రసగీతిలో కరిగి నీరయిపోవుచునుండె, మోహనా
కార! రవంత వచ్చి కనికారము జూపవయేని, కాలువై
యేరయి పొంగి పొర్లి ప్రవహింపదొ గోకుల మాకులమ్ముగన్!
ఈ కరుణామయీ హృదయమే ఒక ప్రేమ మహాసముద్రమై
లోకము నిండెరా! కడుపులో బడబాగ్నిని దాచి; కాంక్ష మ
ర్రాకయి తేలె; చక్కనిదొరా! శయనింతువుగాని పొంగి వ
చ్చే కెరటాలమీద; దయసేయుము గోప కిశోర మూర్తియై.
రాధనురా ప్రభూ! నిరపరాధనురా! అనురాగ భావనా
రాధన మగ్నమానసనురా కనరా; కరుణింపరా; మనో
వీధి పదేపదే కలకవేయుచునున్నవిరా పురా రహో
గాథలు – ఈదలేనిక అగాధ తమోమయ కాలవాహినిన్!!
పారవశ్యము
అది శరద్రాత్రి, గగన సౌధాంగణమున
దేవతా స్త్రీలు దీపాలు తీర్చినారు;
సరస రాకాసుధాకర కరములందు
కలమటంచు నవ్వె శృంగారసరసి.
పూచె వనలక్ష్మి, పిండారబోసినట్లు
పండు వెన్నెల జగ మెల్ల నిండిపోయె;
యమున శీతల సురభి తోయమున దోగి
చల్లగా…మెల్లగా…వీచె పిల్లగాలి.
ఆ మహోజ్వల రజని, మోహన విహార
నవ నవానంద బృందావనమ్ము నందు,
అమల యమునానదీ శాద్వలముల మీద,
లలిత బాల రసాల పల్లవ పరీత
మధుర మంజుల మాలతీ మంటపమున-
పాల రా తిన్నెపయి కల్వపూలతోడ
మాల గట్టుచు కూర్చున్న బాల యెవరు?
ప్రణయ మకరంద మాధురీ భరిత ముగ్ధ
లోచనమ్ములలోని యాలోచనమ్ము
లేమో – ప్రేమ సుధారస శ్రీముఖ మగు
ఆ ముఖములోని యాకాంక్ష లేమొ – త్రిజగ
తీ సముజ్జ్వల సౌందర్యతిలక మామె
ముద్దు చేతులలో ప్రేమ పుష్పమాల
అంద మొగవోయి ఏ కళానందమూర్తి
కంఠము నలంకరించునో –
“చిచ్చువలె చందురుడు పైకి వచ్చినాడు!
పెచ్చరిలినాడు గాడుపు పిల్లగాడు!
రాడు మోహన మురళీస్వరాలవాడు!
తప్ప కేతెంతు నని మాట తప్పినాడు!”
అంత కంతకు నిట్టూర్పు లతిశయించె
కొమరు చెమటలు చిగురు చెక్కుల జనించె
వదన మరచేతిలో నట్టె వ్రాలిపోయె
పడె కపోలమ్ముపై నొక్క బాష్పకణము.
అంత లోపల సుశ్యామలాంగు డొకడు
అల్లనల్లన పుడమిపై నడుగు లిడుచు
వెనుకగా వచ్చి తన ముద్దు వ్రేళ్ళతోడ
గట్టిగా మూసె నామె వాల్గన్ను దోయి.
కమ్మ కస్తురి తావులు గమ్ముమనియె
లలిత తులసీ పరీమళమ్ములు చెలంగె
తరుణి తన్మృదులాంగుళుల్ తడవి చూచి
“కృష్ణుడో, కృష్ణుడో” యంచు కేకవేసె.
“సరస శారద చంద్రికా స్థగిత రజత
యామున తరంగ నౌకా విహారములకు
నన్ను రమ్మని చెప్పి బృందావనమున;
కింటిలో హాయిగా కూరుచుంటివేమి?
ఎంత తడవయ్యె నే వచ్చి – ఎంతనుండి
వేచియుంటిని – పొదరిండ్లు పూచి – వలపు
వీచికలు లేచి – హృదయాలు దోచికొనెడి
యీ శరజ్జోత్స్నలో – పుల్కరించి పొంగి
మ్రోతలెత్తెడి యమునానదీ తటాన!
ప్రేయసి నుపేక్ష సేతువే ప్రియవయస్య!
ఇంత నిర్దయ పూనెదవే దయాళు!
ఇంతగా చిన్నబుచ్చెదనే మహాత్మ!
ఇట్లు గికురింతువే నన్ను హృదయనాథ!”
కలికి యిటు వచ్చిరాని పేరలుక తోడ
సజల నయనాల జీవితేశ్వరుని గాంచె.
సరస సంగీత శృంగార చక్రవర్తి
సకల భువనైక మోహన చారుమూర్తి
రాధికా మానస విహార రాజహంస
మందహాసమ్ము కెమ్మోవి చింద పలికె.
“ఆలసించుట! కాగ్రహ మందితేని
వెలది! విరిదండ సంకెలల్ వేయరాదొ!
ముగుద! పూబంతితో నన్ను మోదరాదొ!
కలికి! మొలనూలుతో నన్ను కట్టరాదొ!
రాధికా క్రోధ మధురాధర మ్మొకింత
నవ్వెనో లేదొ? పకపక నవ్వె ప్రకృతి;
నవ్వుకొన్నది బృందావనమ్ము; యమున
నవ్వుకొన్నది, చంద్రుడు నవ్వినాడు;
విరగబడి తమ పొట్టలు విచ్చిపోవ
నవ్వినవి రాధ తలలోని పువ్వులెల్ల.
వాలుకన్నుల బాష్పాలు జాలువార
నంత రాధిక వివశయై అంఘ్రియుగళి
వ్రాలిపోయిన ప్రియుని కెంగేల నెత్తి
చిక్కుపడిన ముంగురులను చక్కనొత్తి
చెరిగిపోయిన తిలకమ్ము సరియొనర్చి –
“అవును లేవోయి! కపటమాయా ప్రవీణ!
ధీరుడవు మంచిశిక్షనే కోరినావు!
నిత్య సుకుమారమైన సున్నితపు మేను
నాదు చేబంతి తాకున నలిగిపోదె?
సొక్కి సొలిన నీ మోము చూడగలనె?
చేతు లెట్లాడు నిన్ను శిక్షింప నాథ!”
ఎంత నిర్దయురాలనో పంతగించి
కృష్ణ! నీచేత నిట్లు మ్రొక్కించుకొంటి –
నవ్య వనమాల కంఠాన నలిగిపొయె
చెక్కుటద్దాల తళుకొత్తె చిగురుచెమట
కొదుమ కస్తూరి నుదుటిపై చెదరిపోయె
బర్హిబర్హంబు చీకాకుపడియె మౌళి.
పొంద నేర్తునె నిన్ను నా పూర్వజన్మ
కృత సుకృత వైభవమున దక్కితివి నాకు;
విశ్వసుందర చరణారవింద యుగళి
ముద్దుగొని చెక్కుటద్దాల నద్దుకొను అ
దృష్ట మబ్బిన దొక్క రాధికకె నేడు,
తావకీన సౌందర్య సందర్శనాను
భూతిలో పొంగి ప్రవహించి పోదునోయి!
ఎంత కారుణ్య మున్నదో యెంచగలనె
కమలలోచన! నీ కటాక్షములలోన –
ఎంత లావణ్య మున్నదో యెంచగలనె!
ప్రేమమయమూర్తి! నీ ముద్దుమోములోన –
ఎంత మాధుర్య మున్నదో యెంచగలనె!
సులలితకపోల! నీ మృదు సూక్తిలోన –
ఎంత యమృతము గలదొ భావింపగలనె!
స్వామి! తావక మందహాసమ్ములోన –
ఎంత మైకము కలదొ యూహింప గలనె!
రాధికానాథ! నీ మధురాధరమున.”
అనుచు రాధిక పారవశ్యమున మునిగి
వ్రాలె మాధవు స్నేహార్ద్ర వక్షమునందు.
“రాధపై ప్రేమ యధికమో మాధవునకు
మాధవునిపైన రాధ ప్రేమయె ఘనమ్మొ”
ఈ రహస్యము నెరుగలే రెవరుగూడ
ప్రణయమయ నిత్యనూత్న దంపతులు వారు!