సాంధ్యశ్రీ
అంజన రేఖ వాల్గనుల యంచులు దాట, మనోజ్ఞ మల్లికా
కుంజములో సుధా మధుర కోమల గీతిక లాలపించు ఓ
కంజదళాక్షి! నీ ప్రణయ గానమ్ములో పులకింతునా – మనో
రంజని! పుష్పవృష్టి పయి రాల్చి నినున్ పులకింపజేతునా!
క్రొంజిగురాకు వ్రేళుల కురుల్ తడియార్చుచు కూరుచున్న అ
భ్యంజనమంగళాంగి! జడ యల్లుదునా – మకరంద మాధురీ
మంజుల మామక ప్రణయ మానస భావనలే ప్రఫుల్ల పు
ష్పాంజలి చేసి నీ యడుగులందు సమర్పణచేసికొందునా –
సంజవెలుంగులో పసిడిచాయల ఖద్దరు చీరగట్టి నా
రింజకు నీళ్ళువోయు శశిరేఖవె నీవు; సుభద్రసూతినై
రంజిత పాణిపల్లవము రాయుదునా – నిను మౌళి దాల్చి మృ
త్యుంజయమూర్తినై జమునితో తొడగొట్టి సవాలుచేతునా!
వైశాఖి
కుండలమీద పిచ్చికలు గుంపులుగూడె; నఖండ చండ మా
ర్తాండుడు చేటలన్ జెరిగె నగ్నికణమ్ములు; వెండినీ రదే
కొండలు నెత్తిపై పులుముకొన్నవి, రమ్ము శయింతు మీ లతా
మండపమందు, ప్రేమమయ మానసముల్ మధురించిపోవగన్
బుడుత డుయేలలో నిదురబోవుచునుండెను; పొట్లపాదుపై
ఉడుత పదేపదే అరచుచున్నది; పిట్టలు చెట్టుకొమ్మలన్
వడబడి కూరుచుండె; తలవంచెను చిట్టిగులాబి; గాడుపుల్
సుడిగొనుచుండె నో కుసుమసుందరి! మో మటు త్రిప్పబోకుమా
ఉండుము – లేవబోకుము కృశోదరి! నీ నుదుటన్ శ్రమాంబువుల్
నిండెను; పైపయిం దుడువనీ – సుషమా సుకుమారమైన నీ
గండయుగమ్ము వాడె వడగాలికి; ఊయలలోన వచ్చి కూ
ర్చుండుము – స్వేచ్ఛమై కలసి యూగుద మాశలు మిన్నుముట్టగన్.
ప్రాభాతి
రేగిన ముంగురుల్ నుదుట ప్రేమ సుధా మధురైక భావముల్
ప్రోగులు వోయగా నిదురవోవు దయామయి! నా యెడందలో
ఆగక పొంగు స్వాప్నిక రహస్యము లెవ్వియొ నీదు గుండెలో
దాగుడుమూతలాడ సరదా పడుచున్నవి కన్నులెత్తుమా!
ఈ గిజిగానిగూడు వలెనే మలయానిల రాగడోలలో
నూగుచునుండె నా తలపు లూరక; నీ కబరీభరమ్ములో
మాగిన కేతకీ సుమ సమంచిత సౌరభవీచి పైపయిన్
మూగి స్పృశించి నా హృదయమున్ కదలించుచునుండె ప్రేయసీ!
రాగము నందుకొన్నది తరంగిణి; బాలమరీచిమాలికిన్
స్వాగతమిచ్చె పద్మిని; హసన్ముఖమై మన దొడ్డిలోని పు
న్నాగము కుప్పవోసె సుమనస్సులు, కోవెలలో విపంచికల్
మ్రోగెను; లెమ్ము! పోదము! ప్రమోదముతో మనమాతృపూజకున్.
రాట్న సుందరి
రాటము మేళవించి, అనురాగము రాగము మాతృభూమిపై
పాటయి మ్రోగ, నూల్ వడకు పావన భారత భాగ్యలక్ష్మి! నీ
పాటల పాణిపద్మములు భవ్యము లయ్యెను – వేలులక్షలున్
కోటులు నూరుకోట్లు గయికొ మ్మివె ముద్దుల బావ దీవనల్.
పసుపుంబూతల లేత పాదములకున్ బారాణి గీలించి, నె
న్నొసటం గుంకుమ దిద్ది, కజ్జలము కన్నుందోయి గైసేసి, క్రొ
గుసుమంబుల్ తలదాల్చి, రాట్నముకడన్ గూర్చున్న నీమూర్తిలో
ప్రసరించెన్ జయభారతీ మధుర శోభా భాగ్య సౌభాగ్యముల్.
పండెను దేవి! నా వలపుపంటలు; పింజలు పింజలైన యీ
గుండెయె యేకుగా వడకుకొంటివి; నా బ్రతుకెల్ల దారమై
కండెలుగగట్టె నీదు చరఖాపయి; నేనిక చే రుమాలనై
యుండెద మెత్తగా పెదవు లొత్తుచు నీ వరహాల చేతిలో.
మధుర స్మృతి
ఆ మనోహర మధుర సాయంతనమున
ఉపవన నికుంజ వేదిపై నుంటి నేను;
చేత సుమరజ మూని వచ్చితిని నీవు
తిలకమును నా ముఖమ్ముపై దిద్ది తీర్ప.
ఒరిగి ఒయ్యరమొలుక కూర్చుండినావు
అందములరాణివై అస్మదభిముఖముగ;
చేరె మునుముందు నీ కుడిచేయి నాదు
ఆలిక ఫలకమ్ము తిలక విన్యాసమునకు.
పులక లెత్తించె తనువెల్ల చెలి! మదీయ
చిబుక మంటి పైకెత్తు నీ చేతివ్రేళ్ళు;
రాగరస రంజిత పరాగ రచ్యమాన
తిలక కళిక పరీమళమ్ములను చిందె.
“ఐనది సమర్చ, సొగ సింక అద్దమందు
చూచుకొను” డంటి వీవు నాజూకుగాను;
“అటులనా”యంచు నటునిటు సరసి, నీదు
చెక్కుటద్దమ్ము కడ మోము చేర్చినాను.
“ఎంత ముద్దుగ దిద్దితి వేది యేది”
యనుచు నొకరెండు ముద్దుల నునిచినాను;
పకపక మటంచు నవ్వి నీ పాణితలము
అడ్డమొనరించితివి తళ్కుటద్దమునకు.
నాటి ప్రేమార్ద్రతిలక మీ నాడు విజయ
దీక్ష నిప్పించు రక్తార్ద్ర తిలకమయ్యె;
ప్రియతమా! రమ్ము చేయెత్తి పులుచుచుండె
అమ్మ మనలను కరుణ కంఠమ్ము తోడ.