కొత్త మొక్కలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఇన్నాళ్ళూ తలుపు తెరిచే ఉంచాను
ఈ మధ్య దోమల్ని చంపలేక, వాటితో వేగలేక
మూసిన తలుపుల్ని మూసినట్లే ఉంచాను.

దోమల భయంవల్ల యెంత లాభించానో కానీ
మొత్తానికి మొత్తం నేనే
ఏదో పోగొట్టుకున్నట్లు  ఏదో బెంగ.!
మనసు నిండా దూరి
దాని సొదనంతా నింపేయడం మొదలుపెట్టింది.
ఈ సొదకంటే, దోమలే నయం అనుకునేంత…!

ఇన్ని రోజులూ  లోపల దాక్కొని చూసిందేమిటీ —
కొన్ని కర్టెన్లు ,కిటికీలు,కొన్ని గోడలు,వాటి వెలిసిపోయిన రంగులు,
కొన్ని రశీదులు,అసంపూర్తి కవిత్వపు కాగితాలు.!

***


ఇంత బంధించుకోవాలా
ఒక భయంతో, మరికొంత జాగ్రత్తతో-
దోమలు ఏం చేస్తాయి
దోమలకన్నా తెరిచిన తలుపులే నయం
బార్లా తెరిచాను తలుపుల్ని-

అప్పటిగ్గాని నాలోకి గాలి జొరబడలేదు
అప్పటిగ్గాని
బయట నాకోసం చిగురిస్తున్న కొత్త మొక్కల ముఖాల్లో
విప్పారుతున్న సంతోషాన్ని చూడలేక పోయాను.

***


తలుపులు తెరిస్తేనే
మొక్కగా మొలిచే అవకాశం ఉందని మరొకసారి అర్ధమైంది.

Your views are valuable to us!