మనసుకూ ఆరు ఋతువులు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

మనసుకూ ఉన్నాయి సమయ సందర్భంగా

ఆవిష్కరించుకునే ఋతువులు

ఎక్కడో అదృశ్యంగా  అంతరాంతరాళాల్లో .

సన్నని చారల్లా తలలెత్తిన సస్య శ్యామలత

పుష్పక విమానాల్లో పూల సొబగులనూ

పుప్పొడి రాగాలను రంగుల తుళ్ళింతలనూ

నిలువెల్ల పరచుకునే ఘడియలు మళ్ళీ మళ్ళీ

మరలి వస్తూనే ఉంటాయి…

చురుక్కుమంటూ సూదిమొనల్లా గుచ్చిగుచ్చి

కాల్చి బూడిద చేసే వేడి కిరణాలు

మహోగ్రంగా మండిపడటం

ఎన్ని ఓదార్పుల అనునయింపుల నీళ్ళకడవలను గుమ్మరించినా

నాడినెత్తిన వెయ్యి సూర్యులు విస్ఫోటించడం

అదేమీ  కొత్తకాదుగా

చీకట్లు కమ్మినట్టు వెలుగులనెవరో దోపిడీ చేసినట్టు

గుంపులు గుంపులుగా విషాదాలు ఒక్కచోట చేరి

ఉమ్మడి సంతాపం ప్రదర్శించినట్టు

వాన మబ్బులు అల్లుకు అలుముకు పోయి

చిరు జల్లులో , చిన్నపాటి వాన తెరలో

అయితే గియితే గుండెను కడిగి పారేసే ఉప్పెన ముంపులో

అడపా దడపా అందరికీ సుపరిచితాలే

చల్లని మంచి గంధం లేపనం మసకతెర కప్పినట్టు

వాస్తవవానికి జోల పాడి పల్చని పరదా కప్పి

చుట్టు తారకలతో దాగుడు మూతల మంతనాలాడుతూ

సవిలాసంగా రాత్రిని గుప్పిట్లో పెట్టుకునే వెన్నలరేడు

సామ్రాజ్యాలూ అనుభ్వైక వేద్యమే…

ముందు తెలిసీ తెలియని అమాయకత నీటి  గోడలా

ఆపై సన్నజాజుల రెక్కల వానలా

ముదిముదిరి దట్టంగా తరుముకొచ్చే కంటి పొరలా

నరాల్లోకి అవ్యక్తపు బాధను గుచ్చి

వేళ్ళ కొసల్న దూరి వంకరలుగా మారుస్తూ

తెల్లారేసరికి తెల్లదుప్పటి కప్పేసే మంచు కాలాలకూ

కనిపించని అంతరంగం అతీతం కాదు

ఇహ రానే వస్తుంది

ఆకులు నమిలేసి అదృశ్యం చేసే గొంగళి పురుగు పాపలా

దబాదబా మొత్తి నేలకు పడగొట్టే ఈదురుగాలిలా

చీకట్లో ఒదిగికూచుని మొహం కనిపించనివ్వని నీడలా

కొవ్వులా పేరుకు పోయి వెలుగును మననివ్వని

గాజుగోడల ముదురు మరకల్లా

పూడుకు పోయిన గొటులో రాగాలు పలక్క ఏడ్పుతో ఉక్కిరి బిక్కిరయే

కోయిల కంటి కాటుకలా

మరింకేమీ మిగలక దారం తెగి అనంతం లోకి సాగే ఆఖరి క్షణాలు

వస్తూ పోతూనే ఉంటాయి

Your views are valuable to us!