41 total views , 1 views today
డబ్బుకు జ్ఞాపకశక్తి ఉండదు
ఉంటే, గింటే వాడు నీ ఉపకారాన్ని మర్చిపోతాడా?
అప్పట్లో, అప్పటప్పట్లో
నీ జబ్బల్లో డబ్బు
నిబ్బరంగా దర్పాన్ని పొదిగినప్పుడు
వాడో పిల్లకాకి
నీ చూపుడువేలు ఉండేలు దెబ్బకి
ఎగిరిపోయి, “కా” మనేవాడు
మరుక్షణంలో మళ్ళీ వాలేవాడు
నువ్వో – లాలనగా నీ డబ్బు దర్పపు జబ్బల్లోకి
ఇరికించుకొని ముద్దల్ని తురికేవాడివి
………
మొదటిసారిగా నువ్వు పడ్డావు చూడు
రంగు వెలిసిన గడప తట్టుకు బోర్లా పడ్డావు చూడు
చెప్పులేని కాలి గోరు లెగిసిపోయేలా పడ్డావు చూడు
అప్పుడు చూడాలి వాడ్ని
అంతెత్తున ఆకాశంలో గద్ద ఎగిరేది
చచ్చిన ఎలుక కోసమే
………
ఇప్పుడు నాకు బల్ ఖుషీగా ఉందిలే
ఆడెక్కడో లెగిసిన రెసెషన్ సునామీకి
ఆ ఎలుక శవం గద్ద పిల్ల కాకిగాడు
రాలేపోయాడు
నీకు ముకం చూపించేందుకు రాలేకపోయాడు
తలకొరివేగా నీక్కావల్సింది!
డబ్బుకు మల్లేనే!
నిప్పుకు బంధుత్వం తెలీదులే తాతా!!