మృత అభిసారికలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

కదులుతాయి కన్నీరు కారుస్తాయని
శవాలనం గానీ

వాటికన్నా గొప్పవేమీ కాదు

ఆటవిడుపు వాంఛలు తీర్చే వారి దేహాలు

సానుభూతంటే ఎరుగని సహనం వారి సొంతం

దేహాలపై గాయాలెన్నో విరబూసినా

వాటిలో కూడా మధువునెతుక్కునే

తుమ్మెదల రూపాలను

కన్నీటితో కడుగుతూ మరో తేటిని

వెదికేందుకు

ముఖం పై నవ్వు దీపాలను వెలిగించాల్సిందే

భాగ్యము వారిది కాదంటూ వారి కన్నీళ్లు

చెప్పకనే చెబుతున్నాయి

ఐనా అర్ధాలతో మనకు పనేమిటోయి

అందాలతో గానీ

రా వారి దేహాలపై నీ కోర్కెల పంజా విసురు

చిమ్మిన వారి రక్తాన్ని అత్తరుగా పూసుకుని

ఆమె వెచ్చని కన్నీళ్లు ఆ అత్తరు ఘాటును

తగ్గించక ముందే

నీ పురుష సుగంధాన్ని ఈ నాగరిక లోకానికి

చూపు

భయపడకోయ్ ఓ రోజాకలి తీర్చిన

నిన్నెందుకామె  శపిస్తుంది

అయితే గియితే ఆమె రాతనలా రాసిన ఆ

దేవుణ్ణి తప్ప

ఐనా మగాడిని శపించడం ఏ ఆడదాని

కన్నీళ్లకొచ్చు.

Your views are valuable to us!