మృతాభిసారికుడు

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 5]

 

వాడు సామాన్యుడు కాడు

సంధ్యారుణ కాంతి పుంజాలను కన్నుల దాచిన వాడు

అమావాస్య నిశికే తిమిరాన్ని అరువీయ గల

అంతరంగమున్నవాడు

సగం దేహాన్ని గోతిలో పూడ్చుకుని

నిత్యమా మృత్యువుతో బేరసారాలాడేవాడు

అవును! వేదన వాడి జీవన నాదమని తెలీక

ఒక్కో పోగునూ వాడింకా జాగ్రత్తగా అల్లుతూనే పోతున్నాడు

 

నవజీవన నాదం కోసం వెదుకుతూ

గతకాలపు వైభోగానికి నీళ్ళోదలలేక

అమాయకంగా కన్నీళ్ళోదులుతున్నాడు

నిజం! వాడు సంస్కృతికే సంస్కృతిని నేర్పిన వాడు

వొంటిపై ఇంద్రధనుస్సు వర్ణాలను తెచ్చిన వాడు

జలతారు వెన్నెల జిలుగులను అగ్గిపెట్టెన పెట్టి

ఈ లోకాన్నే అబ్బురపరచినవాడు

 

కాదు కాదు వాడిప్పుడు నిదురను వెలివేసి

స్వప్నాలను ఉరిదీసినవాడు

పొట్ట చేతపట్టుకున్నా బిచ్చమెత్తలేని అభిమానధనుడు

వేదనను తీరని వాంఛలను పడుగు పేకలుగా

తనపై తానే అర్ధాయుష్షు వస్త్రాన్ని నేసుకుంటున్న

మృతాభిసారికుడు.

 

********


Your views are valuable to us!