విగ్రహాలేగా అని విరగ్గొట్టారు
హద్దులేగా అని విడగొట్టారు
దమ్ముల్లో చెమ్మే ఉంటే
బొమ్మల్లో అమ్మల్ని చూసుకోవచ్చు
సరే…ఫోండి…విరగ్గొట్టో విడగొట్టో
మురిసిపోండీ….మురిగిపోండి!
నా నరం తెగితే నొప్పి నీకు తెలియదు
నీ నరం తెగితే……
నరం తెగ్గోసే వరం కోరుకొన్నావ్
ఇస్తానన్నది ఇటలీమాత
అస్తు…
స్వదేశీయుల్ని, నీ సోదరుల్ని
విదేశీయుల్లా విశ్లేషించే నీ తెలివికి
ఇచ్చేది ఇటలీ మాతే!
చచ్చేది నీ పొరిగింటోడే!
చరిత్ర తవ్వి తీస్తే తగిలేవి కంకాళాలే
ఏ కపాలం ఏ ప్రబుద్ధుడిదో
తేల్చగలిగే తంత్రం లేదు.
భావి చరిత్రకు సరిపోయేలా
పుర్రెల్ని ప్రోదిచేసావ్
నీ ఘన చరిత్రకు జడిసిన మనసులు
ఎండడం తథ్యం…ఎండలు మండడం సత్యం!
సరేలే!
సత్యం చెబితే శాపనార్థాలంటావ్
తర్కం వాడితే విద్రోహి అంటావ్
నీవు పట్టిన ఎలుకకి తోకల్లేవ్ తొండాలుంటాయంటావ్
నీ కాలి కింద ఏముందో చూసుకో
అడుసో, అరటి తొక్కో
లేక సాటివాడి గుండె ముక్కో!
ఉంటా దోస్త్
ఇప్పటికే ఎక్కువైంది
నీ బొంద
నా చింత!