నిట్టూర్పుల నిప్పు కణికల్ను కనురెప్పల పొత్తిళ్ళలో దాచి
అందమైన నా పాలరాతి సుందర వనానికి
పచ్చల మణిహారాల్లా చిరునవ్వుల సొగసులను పొదుగుతూ
అలసిసొలసిన నా చూపుల చెక్కిళ్ళపై
అలవోక పలకరింపుగా చిరు గాలి నును స్పర్శ
పుట్టిన మరుక్షణం నుండీ రాగ బంధాల బాంధవ్యం ముప్పేట హారాల్ను
పేనుకుంటూ విప్పుకుంటూ కలనేత సొగసుల చెమరింపులో
కలల షడ్రుచులనింకా ఆస్వాదించనే లేదు.
నట్టనడి నెత్తి మీదకు పాక్కుంటూ
నత్తనడకలతో సాగిన నెలబాలుడు సూరీడి కి
యవ్వనం మత్తెక్కి పడమటి కొండల దూరాన్ని కొలిచే
జిగీష నధిరోహించి వాయువేగాన పరుగులు పెడుతూ
పునాదుల పఠిష్టత పూర్తవలేదు
గోడల నగిషీలు చెక్కడం ఇదిగో ఇప్పుడే కదా
ఆకాశం కప్పుకింద ఆలోచనల తామరతంపర
ఓ కొలిక్కి రానేలేదు
చూరట్టుకు వేళ్ళాడే నిరాశ నిస్వనాల గొంతునొక్కి
రేపటి ఊహలోకపు చిత్రాల్లో
హరివిల్లు నాట్యాలను చిత్రించుకుంటూ
తప్పటడుగుల తకిటతదిమిలో నేను.