ఒక్క అడుగు ముందుకేస్తే
నీకు తెలుసు నువ్వెక్కడుంటావో!
జీవితమంతా నడిచి నడిచి
అలసిసొలసిన నీకు
ఆ ఒక్క అడుగు వెయ్యటానికి అరక్షణం
అయినా పట్టలేదు!
ప్రయాణం విసుగనిపించిందో
అనుకున్న లక్ష్యం అందకుండా పోయిందో
ఇంటా బయటా నిన్నుమించిన
అసమర్థుడు, నిరాశావాది
వేరెవరూ లేరని
ఎవరేమన్నారో
ఆరంతస్థుల పైకెక్కి ఆ ఒక్క
ఆఖరి అడుగు అనంతంలోకి
వేశావు!
కానీ ఒక్క అడుగు వెయ్యడానికి
నువ్వు కూడగట్టుకున్న ధైర్యం
జీవించటానికి నీకుంటే
ఒక్క క్షణం ఆగి ఆలోచించి వుంటే
చరమదశ చేరటానికి
ఏ చరమదశలో నైనా
నిర్ణయం చెయ్యాల్సింది
నువ్వుకాదని నీకర్థమయి వుండేది.
నీ మనస్సు నిన్ను మోసగించివుంటుంది
నీ మేధస్సు నిన్ను తప్పుత్రోవ పట్టించివుంటుంది
నిన్ను అణదొక్కాలని అందరూ
పన్నే పన్నాగాలకి ఒకేఒక్క జవాబని
మృత్యువుని కోరి కౌగలించుకున్నావు
అది నీ చదువుని నీ విజ్ఞానాన్ని
అపహాస్యం చేయటం అని నువ్వనుకోలేదు.
నీ మృతదేహాన్ని చూసి విలపించే
నీ పిల్లల ఆర్తనాదాలమధ్య
నిన్ను చిన్నచూపు చూసాయని నువ్వనుకున్న
వ్యవస్థలు, న్యాయాలయాలు
చూపించే నిరాసక్తత నీ చావెంత
నిరర్థకమయిందో నొక్కి చెపుతాయి
బ్రతికుండి సాధించలేని దేన్నీ
మరణించి సాధించలేమనే
నిజాన్ని చాటి చెపుతాయి!.