ఒక్కోసారి
చిరపరిచితమైన పరిసరాలే
పర్యాటక స్థలంగా మారిపోతాయి
మళ్ళీ అవే పరిసరాలు
చోద్యం చూస్తున్నట్లు అగుపిస్తాయి
ఆహ్లాదాన్నిచ్చే ఆ చెట్టు
ఒక్కోసారి చాల గంభీరంగా కనిపిస్తుంది
నిటారుగా విస్తరించిన శాఖలతో
దేనికైనా సిద్ధం అన్నట్లు
నేను సమస్య తో
తాదత్మ్యత చెందినపుడు
చెట్టూ పిట్టా ఒక్కోసారి
నాకన్నా గొప్పగా గోచరిస్తాయి
ఒక్కోసారి
రక్షించేవాడెవడో ఉన్నాడనే
విశ్వాసం అచంచలమైనపుడు
ఎందుకీ బెంగ, భయం, అభద్రతా భావం?
ఒక్కోసారి అనిపిస్తుంది
నిజమైన విశ్వాసం
కష్టసుఖాలకతీతమని
ఇన్ని తెలిసీ మనసు
ఒక్కోసారి నిరాశకు, నిర్లిప్తతకు గురౌతుంది
మళ్ళీ ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకొని పనిలో
నిమగ్నమౌతుంది
ఒక్కోసారి అనిపిస్తుంది
ఆ అచంచలమైన విశ్వాసం
ఉండీ లేనట్టుగా ఉండడమే
ఉనికిని ప్రశ్నార్ధంగా మారుస్తుందని!
ఆ అచంచలమైన విశ్వాసం నాకు దక్కేది ఎలా?
మళ్ళీ మళ్ళీ తిని, పనిచేసి, నిద్రించి
రోజులు గడచిపోయినట్లు
మళ్ళీ మళ్ళీ నేను
నా నమ్మకానికే అమ్ముడైపోయినపుడా?