Like-o-Meter
[Total: 0 Average: 0]
పాట పాతదైతేనేమి?
ఆడే నాగులా మనసూగుతున్నప్పుడు!
దూరాన్ని క్షణాల్లో కొలిచి
కాలాన్ని మైళ్ళలోకి మార్చి
రాగాల రంగులరాట్నంపై
గిరగిరా తిరుగుతున్నప్పుడు
మాటరాని మూగదైనా
రెక్కలొచ్చిన పిట్ట ఒక్కటి
రెక్కలార్చిన చప్పుడటు
చుక్కలదాకా ధ్వనించినప్పుడు
గాలి తాళానికి తలనువూచే
దీపశిఖ తాదాత్మ్యతను
ఎత్తిచూపే గోడను చూడు
ఏదో గుర్తుకు రావడంలేదూ!
పాట పాతదైతేనేమి?
నీ చెవులకు ఆత్మ ఉన్నప్పుడు!!