ఆటకి పాటకి మాటకీ మధ్య, ప్రపంచ వార్తావాహినుల మధ్య
‘షార్ట్ కమర్షియల్ బ్రేక్’ లతో
దీర్ఘ చతురస్రపు కంప్యూటర్ తెరల ముఖాల్తో
వయాగ్రహాల యవ్వన కాంతుల్తో
0% వడ్డీతో అమ్మబోయే ఇన్‌స్టాల్‌మెంట్ జన్యుకణాల ప్రొడక్టులతో
వేపచెట్లు, పసుపు కొమ్ములు, బాసుమతీల విదేశీ పేటెంట్లతో
వ్యవసాయ దేశానికి దిగుమతయ్యే నిత్యావసరం బియ్యాల్తో
బ్రాండెడ్ పండ్లతో, మందులతో…
సున్నిపిండ్లు, పసుపుపూతలు లేని ఫేషియల్ కెమికల్ లోషన్‌లతో
కందులు, పెసలు, అనుములు, చిరుగింజలు, గుగ్గిళ్లు లేని
బర్గర్, చాకోబార్, టూటీఫ్రూటీల పల్లెటూళ్లతో
భాగోతాలు, చిరుతలాటలు, దసరావేషాలు
మందెచ్చులు, చిందువేషాల్లేని
ఎఫ్ టీవీలు, స్టార్ టీవీల్తో
కాలినడకల దేహదారుఢ్యాల్లేని
సూపర్ స్పెషాలిటీల సబ్సిడీ ఆపరేషన్ ఆరోగ్య మెనూలతో
నోరూరించే పచ్చళ్లులేని చిల్లీ, టమాటో సాస్‌లతో
ఏకాణా, దోవ్వాణా, చారాణా, ఆఠాణా.. ఏక్ రూపాయిల్లేని
విశ్వరూపమెత్తిన డాలర్లతో, యూరోలతో
కర్రసాములు, సాముగరిడీలు, కబడ్డీలు, వామనగుంటలు
ఉరుకులు, ఈతలు, చెట్టెక్కుడు, జిల్లగోనెల్లేని
బిలియర్డ్స్, గోల్ఫ్, టెన్నిస్, క్రికెట్‌ల స్పాన్సర్డ్ ఆటల్తో
పనుల్లో కోతల్లో కాంపుల్లో కదలికల్లో కాంతులీనే శరీరాల్లేని
జిమ్, బ్యూటీపార్లర్ల ప్రపంచసుందరి తయారీ ఫ్యాక్టరీల్తో
కార్మికుల్లేని పరిశ్రమల్తో, ఉద్యోగుల్లేని ఆఫీసుల్తో
జీతాల్లేని నెలల్తో, ఖజానాల్లేని ప్రభుత్వాల్తో
అప్పుచేసే క్రెడిట్ కార్డుల్తో, కలల్లేని రాత్రుల్తో, కరెంట్‌లేని బిల్లుల్తో
పిడికిళ్లులేని, నోరుల్లేని, నినాదాల్లేని ఊరేగింపుల్తో, ధర్నాల్తో
హక్కులడగనివ్వని తుపాకులు పేల్చే రాజకీయాల్తో
ఇంకా బతుకుకు భరోసానిచ్చే కులాల్తో, మతాల్తో
లెక్క పత్రాలలో మాత్రమే మిగిలే ఓటర్లతో
సంతోష విషాదాల్లో ఒకేలా వెలిగే మరల్లాంటి మనుషుల్తో
అమ్మలేని డాడీల్తో, డాడిల్లేని కాలనీల్తో
ఆప్యాయతల్లేని, పలకరింపుల్లేని అపార్టుమెంట్లతో
పదాన్వయం లేని పాటల్తో, లయల్లేని వాద్యాల్తో
ఎంతకీ ఒడవని బిల్లుల్తో, చిల్లుపడే జేబుల్తో
రోడ్డుమీద రక్తంలో పడి కొట్టుకుంటున్నవాడిని కూడా
లేవనెత్తలేని పరుగుల్తో పరాయితనాల్తో
ప్రభుత్వాల మనుగడల్లో దిశలు మార్చుకునే స్వయంప్రకటిత యుద్ధాల్తో
మేఘాల్లేని కృత్రిమ వర్షాల్తో
తిండిగింజలు పండించని పొలాల్తో
మరల్తో, తెరల్తో
మెరమెరల్తో మాయపొరల్తో
దేశాన్ని మహా మార్కెట్ చేద్దాం.
ఇక
జీవితాన్ని గ్లోబు చేద్దాం
గ్లోబులో జీవనరేఖలు లేకుండా చేరిపేద్దాం!!
???…?