Like-o-Meter
[Total: 0 Average: 0]
అలా వొక కిటికీ రెక్క ఓరగా తెరిచి వుంచి శబ్దాన్నీ, నిశ్శబ్దాన్నీ విను
ఆకాశంలో మేడ కట్టుకున్నా, నువ్వుండేది ఓ మురికి మూల గది అయినా.
ఇవాళో రేపో ఇప్పుడో అప్పుడో అటు వెళ్ళే వొక గాలి తరగని కాసేపు ఎలానో ఆపు,
జనారణ్యపు చౌరస్తాలో కిక్కిరిసి వున్నా, నువ్వు మరీ వొంటరివై ఎటో సంచరిస్తున్నా.
సంతోషానికో దుఖానికో గుండె గదిని సర్దిపెట్టు, వచ్చీ వెళ్లిపోయే అతిధే అనుకొని.
చిరునవ్వుకి చిరునామా నువ్వే అవ్వు, పొర్లి పొర్లి ఏడ్చే చీకటి వేళయినా.
పొందికగా రాయాలని అదే పనిగ అనుకోకు, పగిలి పొగిలే వేళ
చెదిరిన ముంగురులే నీ సంతకాలు అనుకో, వొళ్ళంతా వుప్పెనయి పొంగినా.
కొన్ని క్షణాలు విసిగిస్తాయి, నిజమేలే, కాదనను. ఇలా వుంటేనే జిందగీ, ఇదే సిల్ సిలా.
మనసు ఐమూలగా వాటికీ కాస్త చోటుంచు, అవి విసుగు పుట్టి విసిరేసిన బొమ్మల్లా వున్నా.