పల్లవి : పరిచయాల పొదరింట్లో గళమెత్తిన కోయిలలై
పాడుచున్నవో చెలీ మన మనసులే
అనుభవాల తీరంలో అలుపెరుగని పయనంలో
ఒక్కటై! సాగుతున్నవో చెలీ మన ఊహలే
చరణం: మేఘమల్లె సాగిపోతూ గగనానికి గిలిగింతలిడుతూ
మెరిసి మాయమయ్యే వేళ హరివిల్లులు పూయించేద్దాం
లోకాన్నే నవ్వించేద్దాం
గాలికూయలూగేటి పూబాలతో శృతి కలిపి
పరవశమను రాగాన అందరినీ మురిపించేద్దాం
మధురిమలను పంచేద్దాం
ll పరిచయాల ll
చరణం: కిలకిలమను గువ్వలకు మన ఎదసడులను నేర్పేద్దాం
కొండలలో కోనలలో కులాసాగ పాడిద్దాం
తొలివెలుగుల తేరులపై సాగుతు, మనమిద్దరమూ
కమ్మని వలపుల తలపులతో
అణువణువును మేల్కొల్పేద్దాం
మరో ప్రభాత గీతికతో ఈ ప్రకృతికి హారతి పట్టేద్దాం
ll పరిచయాల ll