శ్రీలు పొంగిన జీవగడ్డయు-రాయప్రోలు సుబ్బారావు రచన

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 5]

శ్రీలు పొంగిన జీవగడ్డయు,
పాలు పారిన భాగ్యసీమయి,
వ్రాలినది ఈ భరతఖండము
భక్తి పాడర తమ్ముడా

వేద శాఖలు పెరిగె నిచ్చట,
ఆదికావ్యం బందెనిచ్చట,
బాదరాయణ పరమ ఋషులకు
పాదు సుమ్మిది చెల్లెలా

విపినబంధుర వృక్ఖవాటికన
వుపనిషన్మధు నొలికెనిచ్చట
విపులతత్వము విస్తరించిన
విమలతలమిదె తమ్ముడా

సూత్రయుగముల శుధ్ధవాసన
క్షాత్రయుగముల శౌర్యచండిమ
చిత్రదాస్యముచే చరిత్రల
చెరిగిపోయెనె చెల్లెలా

మేలికిన్నెర మేళవించీ
రాలు కరగగ రాగమెత్తీ
పాలతీయని బాలభారత
పదము పాడర తమ్ముడా

నవరసమ్ములు నాట్యమాడగ
చివురుపలుకులు చెవులువిందుగ
కవితలల్లిన కాంతహృదయుల
గారవింపవె చెల్లెలా

దేశగర్వము దీప్తిచెందగ
దేశచరితము తేజరిల్లగ
దేశమరసిన ధీరపురుషుల
తెలిసి పాడర తమ్ముడా

పాండవేయుల పదును కత్తులు
మండి మెరసిన మహిత రణకధ
కండ కల చిక్కని తెనుంగుల
కలసి పాడవె చెల్లెలా

లోకమంతకు కాకపెట్టిన
కాకతీయుల కదనపాండితి
చీకిపోవని చేవపదముల
చేర్చిపాడర తమ్ముడా

తుంగభద్రా భంగములతో
పొంగినింగిని పొడిచి త్రుళ్ళి
భంగపడని తెనుంగు నాధల
పాటపాడవె చెల్లెలా

Your views are valuable to us!