నేను ఆలోచిస్తున్నాను
వేగంగా పరుగులు దీసే బస్సులు
బస్సుల వెనుక జనం పరుగులు
పిల్లల్ని కనిపెట్టుకొంటూ స్త్రీలు
దుమ్ము రేపుతూ బజార్లు
కంటికేమీ కన్పించడం లేదు
నేను ఆలోచిస్తూ వుంటాను
కనులెందుకు మూతబడతాయో ఆలోచిస్తున్నాను
ఆగాల్సిన చోట ఎందుకు ఆగవీ బస్సులు
క్యూలో ఎందుకు నిల్చోరీ మనుషులు
ఆఖరికి ఈ పరుగు పందెం ఎప్పటి వరకు?
దేశ రాజధానిలో
పార్లమెంట్ ముందు
దుమ్ము ఎప్పటి వరకు రేగుతూవుంటుంది?
నా కళ్ళు మూసి వున్నాను
నాకేమీ కన్పించదు
నేను ఆలోచిస్తూనే వుంటాను.
*****
హిరోషిమా
ఒక్కొక్క రాత్రి
ఆకస్మికంగా నా నిద్ర ఎగిరి పోతుంది
కళ్ళు తెరుచుకొంటాయి.
ఏ శాస్త్రజ్ఞులైతే
అణు అస్త్రాల్ని ఆవిష్కరించారో
వాళ్ళు
హిరోషిమా, నాగసాకి నరసంహార వార్త విని
రాత్రంతా ఎలా నిద్రపోగలరని
ఆలోచిస్తూవుంటాను.
దంతాల మధ్య ఇరికిన గడ్డిపోచలు
కంటిలో ఇసుక
పాదాల్లో గుచ్చుకొన్న ముళ్ళు
కన్నుల నిద్ర
మనశ్శాంతిని ఎగరగొడుతుంది.
సమీప బంధువు మృత్యువు
ఒకానొక ప్రియమైనవారు లేకపోవడం
పరిచయస్థులు ఎగిరిపోవడం
చివరాఖరికి పెంపుడు జంతువుల్నీ
పోగొట్టుకోవడం
గుండెలో ఎంత బాధ, విషాదం నిడుతుందంట
ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు
పక్కపై అటు ఇటూ పొర్లుతుండటంలోనే
రాత్రంతా గడిచిపోతుంది.
ఎవరి ఆవిష్కారంతో అది చివరి అస్త్రంగా మారిందో
ఎవరైతే 6 ఆగస్ట్ 1945 కాళరాత్రి
హీరోషిమా, నాగసాకిలో మృత్యు తాండవంతో
రెండు లక్షల పైచిలుకు మందిని బలిగొన్నారో
సహస్రాధికుల జీవితాల్ని అవిటి చేసారో
వారు కనీసం ఒక్క క్షణమైనా
తాను చేసిన పని తప్పని అనిపించదా?
ఒకవేళ అన్పిస్తే
కాలం వారిని బోనులో నిలబెట్టదా!
అలా అన్పించకపోతే
చరిత్ర వారిని ఎప్పటికీ క్షమించదు.
*****
మూల మలుపులో
నాకు దూరంగా వున్నదీ కన్పిస్తుంది.
గోడలపై రాతల్నీ చదవగలుగుతున్నాను
కాని, హస్తరేఖల్ని చదవలేను.
సీమాంతరాన మండుతున్న
అగ్ని గోళాలు కన్పిస్తున్నాయి
కాని, కాలి కింద పరుచుకున్న
కాలుతున్న బూడిద కన్పించడం లేదు
నిజంగానే నేను వృద్ధుణ్ణి అయినానా?
ప్రతీ డిసెంబర్ ఇరవై ఏడున
జీవితం మరో కొత్త మెట్టు ఎక్కుతాను
కొత్త మలుపు దగ్గర
ఇతరులతో తక్కువగానూ
నాలో నేనే ఎక్కువగానూ పోరాడుతాను.
నేను సమూహాన్ని నిశ్శబ్ద పరచలగను
కానీ సొంతానికి సమాధాన పరచుకోలేను
నా మనస్సు నా అంతరంగ న్యాయస్థానంలో నిల్చోబెట్టి
కిందికి పడదోసినప్పుడు
నా వాజ్ఞ్మూలమే నాకు వ్యతిరేకంగా సమర్పించుకొంటుంది
నేను ఓడిపోతాను
సొంత దృష్టిలోనే నేరస్థుడిగా మారుతాను.
సమీపం నీంచి గానీ సుదూరం నీంచి గానీ
అప్పుడు నాకేమీ కన్పించదు.
ఆకస్మికంగా నా ఆయువు దశాబ్దం పెరిగిపోతుంది.
నిజంగానే నేను
ముసలివాణ్ణి అవుతున్నాను.
(23-12-1993, పుట్టినరోజు సందర్భంగా)
*****
(సశేషం)