Like-o-Meter
[Total: 0 Average: 0]
నాదైన ఈ తోటలో
కొమ్మ మీద కురుస్తున్న
ప్రతి చుక్క ఓ పూవై పోతుంటే
ఆ తావిని మోస్తూ గాలికి పట్టిన స్వేదం
ముత్యాలౌతుంటే
రెక్క విప్పి ఆ తేటులు
మయూరాలనే మరపిస్తుంటే
నా మనసున రేగిన మోదమంతా
తుషారమై ఈ తోటంతా పరచుకుంటే
అపుడు నా రెప్పల చప్పుడు
ఆ కోకిలల పిలుపై తోచి
అందాల హిమనగాన్ని
స్వాగత తోరణంగా వెలయించి
ఆ వయ్యారి వసంతం
తన విలాస సౌధాన్నీ తోట గట్టుకుంటే
ఈ అందాలకు మైమరచి
ఆ తొలిసంధ్య పున్నమి జాబిలిని సాగనంపకుంటే
వ్యాహ్యాళికి బయలుదేరి ఆ మేఘాల చాటుగా
ఈ తోటను చూసి ఊహకందని స్వప్నమొకటి
వాస్తవమై వెలసిందని ఆ ఇంద్రుడు చేయి చాచి
నన్నీ తోటను దానమీయమని అడుగకుండునా?
**********