జోరున కురుస్తున్న వర్షం.
రైతు ఒకడు విసిరి విసిరి చల్లుతున్న విత్తనాల్లా పడుతున్న జల్లులు.
నీళ్ళతొట్టిలో పసిపాప చేతులాడిస్తుంటే తుళ్ళిపడి నీళ్ళ శబ్దంలా అప్పుడప్పుడూ వస్తున్న ఉరుములు.
ఆ రాత్రి, ఆ రైల్వే ప్లాట్‍ఫామ్ శవాసనం వేసిన వానిలా నేలబారుగా పడుకొనివుంది.
ఎండ వేడికి ఉబికి వచ్చిన బొబ్బల్లా అక్కడక్కడా సిమెంట్ బెంచీలు. వాటిపై నిద్రలో జోగుతున్న యాత్రీకులు కొందరు. సామాన్లకు కాపలా కాస్తూ ఇంకొందరు.
లాల్‍చంద్ గడియారం కేసి చూసాడు. 10.00 గంటలు కావొస్తోంది. రైలు రావడానికి ఇంకా ఒక గంట సమయం ఉంది. చిన్న ఊరు, ఎక్కువగా రైళ్ళు ఆగని స్టేషన్ కాబట్టి ప్లాట్‍ఫామ్ పై అంగళ్ళు ఎక్కువగా లేవు. ఒకేవొక్క హోటెల్ ఉంది కానీ దాని మొహం నచ్చక అక్కడకు పోలేదు లాల్‍చంద్.
ముందురోజు సాయంత్రం ఆ ఊరొచ్చాడు. తన క్రింద పని చేసే టెక్నీషియన్ పెళ్ళి. మంచివాడు, కష్టజీవి, తనను ఎంతగానో గౌరవించేవాడు కనుక రాక తప్పలేదు. పెళ్ళి ముహూర్తం అర్ధరాత్రికి ఉండింది. పొద్దున పదింటికల్లా పెళ్ళిసత్రం దాదాపు ఖాళీ. కానీ తను వెళ్ళాలంటే ఒకేవొక ట్రైన్, అదీ రాత్రికి మాత్రమే ఉండడంతో అప్పటిదాకా ఆగక తప్పలేదు. హోటెల్ ఒకదాంట్లో గదిని బుక్ చేసారు కానీ ఆ గది కంటే పెళ్ళి సత్రమే బాగుండడంతో అక్కడే ఓ మూల కుర్చీ వేసుకుని కూర్చుండిపోయాడు.
పాపం, ఆ కుర్రాడేమో పెళ్ళి కొడుకులకుండే హడావిడిలో కూడా అప్పుడప్పుడూ వచ్చి, తనవాళ్ళను తీసుకొచ్చి, పరిచయాలు చేయించాడు. వాళ్ళెవ్వరికీ ఇంగ్లీష్, హిందీలు రావు. తనకు తెలుగు రాదు. కనుక ఆ పరిచయాలు నవ్వులతో మొదలై చేతులు కలపడంతో ముగిసిపోయాయి. అ జానా బెత్తెడు ఊర్లో చూడ్డానికి కూడా ఎలాంటి ఆకర్షణలు లేవు. ఆ ఊరు ఓ నిర్భాగ్యుని తలరాతలా బోసిగా ఉంది. మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనాలు. ఆపై సత్రంలో ఉండలేక బైటకొచ్చాడు. కొంతదూరం నడవగా ఓ సినిమా థియేటర్ కనబడింది. అది ఎప్పుడైనా కూలిపోవొచ్చు. ఏదో తెలుగు సినిమా ఆడుతోంది. సత్రంలో భాషరాని వాళ్ళతో నవ్వలేక నవ్వుతూ మొహాలు చూసుకోవడం కంటే అర్థంకాక పోయినా తెరపై బొమ్మల్ని చూడొచ్చని అనుకున్నాడు. సినిమా పేరు ఏమిటని అక్కడున్న ఓ వ్యక్తిని హింగ్లీషులో అడిగాడు. అతను కొంచెం జాలి, కొంచెం సానుభూతి కలిసిన మొహంతో “గూఢచారి” అన్నాడు. పేరుతో బాటు వాల్ పోస్టర్ కూడా మాంచి రంగురంగులుగా కనబడ్డంతో లోపలికెళ్ళాడు లాల్. “హై క్లాసు” టికెట్ కొన్నాడు. అది ఏవిధంగా హై క్లాస్ అని మనసు గీపెడుతున్నా పెద్దగా పట్టించుకోలేదు.
సినిమా మొదలైంది.
పోను పోనూ కొంచెం బాగున్నట్టే అనిపించసాగింది. సినిమాలోని కథానాయకుడు ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగంలో చేరి, గూఢచారిగా మారి దేశాన్ని అడుగడుగునా రక్షించేస్తున్నాడు. మొత్తానికి రెండున్నర గంటల్లో దేశరక్షణ ఐపోయింది. మళ్ళీ సత్రానికి వచ్చాడు. “సారు సామాన్లు ఉన్నాయి గానీ సారు కనబడ్డం లేద”ని చెప్పడంతో కంగారు పడిపోతున్న పెళ్ళికొడుకును, అతని తండ్రిని తనకు ఏమీ కాలేదని ఓదార్చాడు లాల్. వాళ్ళిచ్చిన టీ పుచ్చుకున్నాడు. సమయం ఐదు గంటలు. సత్రంలో జనసంఖ్య ఇంకా పల్చనైపోయింది. అమ్మాయి, అబ్బాయి వైపు తల్లిదండ్రులు, దగ్గరివాళ్ళు తప్పించి మిగతా అందరూ వెళ్ళిపోయారు. ఆ ఉన్నవాళ్ళు కూడా సామాన్లు సర్దే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక బయల్దేరడం మేలనిపించింది లాల్ కు. అదే విషయం ఆ కుర్రాడికి చెప్పి, వీడ్కోలు తీసుకుని, రైల్వే స్టేషన్ వైపుకు కదిలాడు. అలా ఆరు గంటలకు వచ్చిన వాడు ఆ సిమెంట్ బెంచ్ మీదే కాలక్షేపం చేస్తున్నాడు.
మళ్ళీ వాచ్ కేసి చూసాడు. 9:10 కావొస్తోంది.
అంతలో వెనక నుండి ఎవరో పరుగెత్తుకొచ్చారు. దాదాపు తన మీదనే బ్యాగ్ పడేసిన ఆ వ్యక్తి ఎవరా అని చూడసాగాడు లాల్. ఆ వచ్చిన వ్యక్తి మొహం కనబడని విధంగా లెదర్ జాకెట్ హుడ్ వేసుకొనివున్నాడు. నెత్తిన వేసుకున్న హుడ్‍ను తీస్తుండగా పరీక్షగా చూసాడు లాల్. యువకుడే. ఫ్రెంచ్ గడ్డం. ట్రిమ్ చేసిన మీసాలు. కుడి చెవికి ఒక బంగారపు పోగు. “ఎవడో నాలాంటి మహా పట్టణవాసినే!” అనుకున్నాడు లాల్.
తన వైపే చూస్తున్న లాల్ కేసి చూసి “హెలో…” అన్నాడు ఆ యువకుడు. “హాయ్!” అన్నాడు లాల్.
“నేనిక్కడ కూర్చోవచ్చా?” అన్నాడు తన లెదర్ జాకెట్‍ను బెంచీపై ఆరవేస్తూ. లాల్ బదులు చెప్పలేదు. అది తెలుగు అని మాత్రమే అర్థమయింది అంతే.
లాల్‍కు అర్థం కాలేదని గ్రహించినట్టుగా “కెన్ ఐ సిట్ హియర్?” అన్నాడా ఫ్రెంచ్ గడ్డపు కుర్రోడు. “ఓహ్..ష్యూర్..” అన్నాడు లాల్ కొద్దిగా జరుగుతూ. “థాంక్యూ…” అంటూ బెంచ్ పై కూలబడ్డాడు అతను.
చేతులకున్న నీళ్ళను జాడించి, జుత్తును సరిచేసుకొని, మళ్ళీ చేతుల్ని దగ్గరకు తెచ్చి పరపరా రుద్దుకుని – “మై నేమ్ ఈజ్ గోవింద్…గోవింద్ కృష్ణ” అన్నాడు కుడిచేయిని ముందుకు చాస్తూ. “మై నేమ్ ఈజ్ లాల్‍చంద్. లాల్‍చంద్ కాల్రా” అన్నాడు లాల్. అలా ఇద్దరూ “బాండ్…జేమ్స్‍బాండ్” శైలిలో పరస్పర పరిచయాలు చేసుకున్నాక ట్రైన్ వివరాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఇద్దరిదీ ఒక్కటే మజిలీ…ఒకే ట్రైన్. బోగీలు వేరు వేరు. ఆ వచ్చిన గోవిందకృష్ణుడు తెలుగు వాడే. ఓ బహుళజాతి సంస్థలో ఏరియా సేల్స్ మేనేజర్. ఈ ఊళ్ళో ఉన్న స్టాకిస్ట్ తో పనివుండి వచ్చాడు. క్వార్టర్లీ సేల్స్ మీట్ కోసం హెడ్ ఆఫీస్ కు బయల్దేరాడు. లాల్‍చంద్ తన ఉద్యోగం, ఆ ఊరికి వచ్చిన కారణం చెప్పాడు.
“ఇట్స్ టూ కోల్డ్! కెన్ వి హావ్ కాఫీ?” అన్నాడు గోవిందుడు. కాదనలేక సరేనన్నాడు లాల్‍చంద్. భయపడుతూనే ఆ హోటెల్లోకి ప్రవేశించాడు. గోవిందుడేమో సదానందునిలా హాయిగా “రెండు కాఫీ” అని చెప్పేసాడు. “నాకు టీ కావాలి” అని చెప్పాలనుకున్నా చెప్పలేక ఆగిపోయాడు లాల్. కాఫీలొచ్చాయి. మనసులో జుగుప్స తాండవిస్తుండగా పెదవులతో నెమ్మదిగా కాఫీ రుచి చూసాడు. బుర్ర తిరిగిపోయింది. చాలా అద్భుతంగా ఉంది. “నెవర్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్” అన్న సామెత గుర్తుకొచ్చింది. హాయిగా ఆ వేడి వేడి కాఫీని జుర్రుకోసాగాడు లాల్. “అనదర్ థర్టీ మినిట్స్…” అన్నాడు గోవింద్. “ఎస్..ఎస్..ఇఫ్ దేరీజ్ నో డిలే…” అన్నాడు లాల్ నవ్వుతూ. “హాహాహా” అని గట్టిగా నవ్వాడు గోవింద్.
కాఫీ కడుపులో పడ్డాక వద్దన్నా నవ్వొస్తుందేమో?
బిల్ ఎవరు చెల్లించాలి అన్న రెండు నిముషాల పోరాటంలో తెలుగువాడైన గోవింద్ పంజాబీ కాల్రా పై నెగ్గాడు. మళ్ళీ బెంచ్ మీదకు చేరారు ఇద్దరూ.
“సో…లాల్ సార్…మీకు ఎంతమంది పిల్లలు?” అన్నాడు గోవింద్ యథాలాపంగా.
లాల్ వెంటనే బదులు చెప్పలేదు. కొన్ని సెకన్ల మౌనం తర్వాత “ఒక్కడే అబ్బాయి…” అని అన్నాడు. అతని గొంతు అతనికే వినబడలేదు. అంత లోగొంతుకతో మాట్లాడాడు. గోవింద్ చెవులు రిక్కించుతూ “సార్…” అన్నాడు. లాల్ గొంతు సరిచేసుకొని “ఒక్కడే…అబ్బాయి…” అన్నాడు.
“గుడ్…గుడ్…ఏం చేస్తున్నాడు?”
లాల్ మళ్ళీ మౌనం వహించాడు. వెంటనే స్పందించలేదు. అడగరానిది అడిగినట్టుగా అనుమానమొచ్చింది గోవింద్‍కు.
కాసేపటి నిశ్శబ్దం తర్వాత “నాకూ ఒక్కడే కొడుకు. ఏడేండ్లు. బట్,వాడు నాతో ఉండడం లేదు. ఆమెతో ఉంటాడు.” అన్నాడు గోవింద్, రైలు పట్టాల కేసి చూస్తూ. ఒక పట్టాగా తనని, మరొక పట్టాగా ఆమెను ఊహించుకుంటూ.
“ఓహ్! డివోర్స్డ్?” అని అన్నాడు లాల్.
“అవును! ఆరేళ్ళ క్రితమే విడాకులు తీసుకున్నాం.”
“అబ్బాయికి ఏడేళ్ళంటున్నారు. విడాకులు ఆరేళ్ళ క్రితం అంటున్నారు. అంటే?” అని అర్ధోక్తిలో ఆగిపోయాడు లాల్‍చంద్. అంతకు మించి అడగడం సభ్యత కాదనుకున్నాడు. అప్పటికే ఎక్కువ మాట్లాడినట్టుగా అనిపించసాగింది అతనికి.
“పిల్లవాడి మొదటి పుట్టినరోజు ఇంకో ఇరవై రోజులుందనగా కొట్లాడి వెళ్ళిపోయింది.” అన్నాడు గోవింద్. ఎందుకో గానీ అతను నవ్వుతున్నాడు.
“సాడ్…” అన్నాడు లాల్‍చంద్.
“అవును సార్! సాడ్ ఫర్ అజ్ అండ్ బ్యాడ్ ఫర్ ద బాయ్. కానీ ఏం చేద్దాం. విధిరాత అలాగుంది. అబ్బాయి పుట్టినరోజు జరిపేసాక నువ్వు వెళ్దువుగానీ అని బ్రతిమలాడాను. కానీ ఆమె వినలేదు.”
వాళ్ళిద్దరి మధ్య ఎలా సమస్య మొదలయింది, ఎలా పెరిగి పెద్దదయింది, చివరకు విడాకులకు ఎలా దారిసిందన్న విషయాల్ని చకచకా చెప్పాడు గోవింద్. సానుభూతి ప్రకటించడం మినహా తను చేయగలిగిందేమీ లేదని తెలిసిన లాల్‍చంద్ అప్పుడప్పుడూ తన బాధను ప్రకటిస్తూ వచ్చాడు.
అంతలో అనౌన్స్‍మెంట్ వచ్చింది. ప్లాట్‍ఫామ్ పైకి రైలు రాబోతోందని.
“మీరే అదృష్టవంతులు సార్. మీ అబ్బాయి మీతో ఉన్నాడు. మీరు రిటైర్ అవగానే చక్కగా చూసుకొంటాడు.” అన్నాడు గోవింద్ నవ్వుతూ.
లాల్‍చంద్ తలదించుకుని “నో గోవింద్ జీ! మీరే అదృష్టవంతులు. చాలా చాలా అదృష్టవంతులు. ఎలాగైనా సరే ఆమెతో రాజీ చేసుకోండి. అబ్బాయిని దగ్గరకు తెచ్చుకోండి” అని అన్నాడు
“అదేంటి సార్?” అన్నాడు గోవింద్ బెంచ్ మీద నుంచి లేస్తూ.
రైల్ వచ్చేస్తోంది.
లాల్‍చంద్ కూడా తన సామాన్లు తీసుకుని లేచాడు. గోవింద్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కుడి చేయి ముందుకు చాచాడు. గోవింద్ తన చేతిని చాచాడు.
అతని చేతిని గట్టిగా పట్టుకుని – “హిమాలయాల్లో ట్రెక్కింగ్‍కు వెళ్ళి, మా అబ్బాయి మంచు తుఫానులో చిక్కుకుని చనిపోయాడు. పదహారేళ్ళ క్రితం జరిగిన ఘటన. అయినా మేమిద్దరం ఇంకా తేరుకోలేదు. మీ ఇద్దరి మధ్య జరిగిన యాక్సిడెంట్ పెద్దదేమీ కాదు. మనసుంటే చాలు సరిచేసుకోవచ్చు. గెట్ యువర్ వైఫ్. గెట్ బ్యాక్ యువర్ సన్. అల్ ది బెస్ట్.” అన్నాడు లాల్‍చంద్.
నిశ్శబ్దాన్ని మింగివేసే శబ్దంలా బొయ్యిమని పెద్ద కూత వేస్తూ వాళ్ళిద్దరిని దాటుకుని దూసుకెళ్ళింది రైల్ ఇంజిన్.
*****