“అద్దం ఎప్పుడూ అపద్ధం చెప్పదు. నిస్సంకోచం ఎక్కువ దీనికి.” మనసులో అనుకున్నాడు మహదేవ్ . అతను అద్దం ముందు నిలబడి పది నిముషాల పైనే అవుతోంది. ఎన్నడూ లేనిది ఈరోజెందుకో అదే పనిగా అద్దం లో చూసుకోవాలనిపిస్తోంది అతనికి. కొన్ని కార్యాలకు కారణాలు ఉండవు. చేతివేళ్ళను జుత్తులోకి పోనిచ్చాడు.చెంపల దగ్గరి వెంట్రుకలు నెరిసాయి. అలాగే నుదుటి దగ్గిరవి కూడా. “ముప్ఫై ఆరేండ్లకే ఇలా నెరిసిపోతే మరి నలభై దాటేసరికి…….” కొనసాగడం ఇష్టం లేనట్టు ఆగిపోయింది ఆలోచన.
ఒక్కసారి కిటికీ బైటకు చూసాడు. పచ్చిక బయల్లో ఒక పాలపిట్ట ఆహారం వెదుకుతోంది.
“ఆ పాలపిట్ట వయసెంతో ? దాని రెక్కల పై మెరుపు అలానే ఉంది. వయసు పెరిగితే రెక్కల్లో శక్తి తగ్గిపోతుందేమో గానీ రెక్కల పై మెరుపు తగ్గదు”. కొద్దిపాటి ఈర్ష్య కలిగింది.
మనసు ఆలోచనల్తో మళ్ళీ ముందుకురికింది.
“కస్తూరి మృగం మలం సుగంధం. పునుగు పిల్లి చెమట పరిమళ ద్రవ్యం. జంతుకోటిలో శ్రేష్టుడు మానవుడు కదా కానీ వీడి చెమట, వీడి మలం ఎవరైనా పూసుకుంటారా ! దేవుడు ఎంత పక్షపాతి…కాదు….తెలివైనవాడు. జంతువులకు మనిషికున్న అహంకారం లేదు కాబట్టే వాటి శరీర వ్యర్థాలకు కూడా విలువ ఉండేట్టు చేసాడు.” తను చాలా తాత్త్వికంగా ఆలోచిస్తున్నట్టు అనిపించింది. తెల్ల వెంట్రుకలు తాత్త్వికతకు దారి వేస్తాయా ?ఉండొచ్చు. సినిమాల్లో రుషులందరికీ తెల్లటి గడ్డాలే ఉంటాయి మరి.
ఈ ఆలోచనల్తో అద్దంలో ముఖం మరింత ముదురుగా కనిపిస్తున్న భావన కలిగింది మహదేవ్ కు. తెల్ల వెంట్రుకలు మరణానికి గుర్తులు. ఎంత ఎక్కువగా ఉంటే అంత దగ్గిరగా ఉంటుంది మృత్యువు. గుండె పట్టేసినట్టు అనిపించింది. బైట మబ్బు పట్టిన ఆకాశం, మహదేవ్ మనసు ఒక్కలా ఉన్నాయి.
“త్వరగా తెముల్తారా అవతల ఆఫీసు వ్యాన్ వచ్చి వెళ్ళేట్టుంది”. అలారం మోగినంత ఖచ్చితంగా, కర్కశంగా మోగింది సుశీల గొంతు. దువ్వెనతో మరోసారి తల దువ్వి గది నుండి బైటకు వచ్చాడు మహదేవ్ . కాఫీ గ్లాస్ తో నిలబడ్డ తన శ్రీమతి,సుశీలను, ఒకసారి పరీక్షగా చూసాడు. తనకు ఆవిడకు మధ్య ఐదేళ్ళే తేడా. కానీ సుశీల జుత్తు సగం పండిపోయింది. దేహం కూడా పెరిగిపోయింది. ఆవిడకు జుత్తు నెరిసిన విషయం తెలుసో లేదో !. “మళ్ళీ ఏమవయింది ? బొమ్మలా నిలబడ్డారు….టైమెంతైందో చూసారా !”
గడియారపు ముళ్ళు, సుశీల కళ్ళు చక్కగా సింక్రొనైజ్ ఐపోయాయి కాబోలు. మౌనంగా కాఫీ చప్పరించేసి, షూస్ బిగించుకొని లెదర్ బ్యాగ్ తీసుకున్నాడు. “అలా వెళ్ళిపోవడమేనా…..” గమ్మత్తుగా ధ్వనించింది సుశీల గొంతు. వెనక్కు తిరిగి అటు ఇటూ చూసి చిన్నగా నవ్వి సుశీల బుగ్గ పై ఓ చిటిక వేసాడు మహదేవ్.
ఫక్కున నవ్వింది ఆవిడ. అదే నవ్వు గత పదేళ్ళుగా తన జీవితం లో ఒక భాగమైంది అని అనుకుంటూ కళ్ళను ఒకసారి మూసి తెరిచి నవ్వి ముందుకు నడిచాడు మహదేవ్ .
*******
“సురేష్ రాలేదేం ?” వ్యాన్ లో ఎక్కుతూ అడిగాడు మహదేవ్ .
“కూతురికి బ్రెయిన్ హెమరేజ్ అయిందిట” నిర్లిప్తంగా చెప్పాడు మురళి.
మహదేవ్ కు తెలియకుండానే అతని కనుబొమలు ముడిపడ్డాయి. “ఏమిటీ ! ఎప్పుడయింది ఎట్లాగయింది?” ఆదుర్దాగా అడిగాడు.
“నాకూ వివరాలేవీ తెలీదు. పికప్ కోసం వెళితే రజనీష్ కు చెప్పాడంట”.
రజనీష్ వ్యాన్ డ్రైవర్ .
“నీకేమన్న డీటైల్స్ తెలుసునా రజనీ ” అదుపు చేద్దామన్నా సాధ్యం కాని ఆదుర్దా ప్రతిధ్వనించింది మహదేవ్ గొంతులో.
“సురేష్ సారు డీటైల్స్ చెప్పలేదు సార్ . పాపం ఆయన చాల దిగులెట్టుకున్నారు. అందుకని నేనూ ఏమీ అడగలేదు.”
వ్యాన్ దిగేద్దామని అనుకున్నాడు మహదేవ్. కానీ ఆఫీసులో ఆడిటింగ్ జరుగుతోంది. ఎలా వెళ్ళగలడు ?. “అదే నీ కూతురికి జరిగుంటే ?”. దూసుకొచ్చింది అంతరాత్మ. “దీనితో ఇదే చిక్కు. అన్నిటికీ అన్వయ, వ్యతిరేకాలు వెదుకుతుంది.” చిన్నగా విసుకున్నాడు. కిటికీ సగం తెరవగానే చల్లగాలి ఛళ్ళున కొట్టింది. అంతరాత్మే చలిగాలి రూపం లో వచ్చి తన చెంపను కొట్టిందని అనుకున్నాడు మహదేవ్ .
ఎఫ్ . ఎం రేడియోలో పాత హిందీ పాట రీమిక్స్ వస్తోంది. వికృతంగా, దుర్భరంగా ఉంది వినడానికి. పక్కనే ఉన్న మురళి అదే పాటను చిన్నగా పాడుతున్నాడు.
ముందు సీట్లో భానుమతి, షరీన్ గలగలా మాట్లాడుకుంటున్నారు.
తనొక్కడూ ఆందోళన పడుతున్నాడు. దేని గురించో స్పష్టం కావడం లేదు.
షరీన్ వేసుకున్న పోనీటైల్ అచ్చు గుర్రం జూలుకు మల్లే అటు ఇటు ఊగుతోంది. ఆమెకు మాట్లాడేప్పుడు తలను అటు ఇటు తిప్పడం అలవాటు. నల్లగా, ఒత్తుగా ఉన్నాయి వెంట్రుకలు. భానుమతి జుత్తు కూడా నల్లగా నిగనిగలాడుతోంది. కానీ ఆవిడ రంగేసుకుంది. మహదేవ్ , ఇక పై రంగేసుకోవాలని నిర్ణయించుకున్నడు.
వ్యాన్ సిగ్నల్ దగ్గర ఆగింది. రోడ్డు దాటుతున్న స్కూల్ పిల్లలు.చటక్కున సురేష్ కూతురి జ్ఞాపకం . ఆరేళ్ళ పిల్ల. పేరు స్వప్న లీన.
సురేష్ మంచి భావుకుడు. కవితలు, కథలు స్వతహా రాయకపోయినా విపరీతమైన అభిమానం. అనర్గళంగా వాటి పై మాట్లాడగలడు. మహదేవ్ కు అంత ఆసక్తి లేకపోయినా సురేష్ స్నేహం తో కొద్దో గొప్పో సాహిత్య పరిచయం ఉంది. సురేష్ కూతురి పేరును మహదేవ్ సూచించినట్టే స్వప్న లీన అని పెట్టాడు. పెళ్ళైన ఎనిమిదేళ్ళకు మహదేవ్ ఒక కూతురి తండ్రైనాడు. అందుకే సురేష్ కూతురితో అంత అనుబంధం ఏర్పడింది. ఆ పిల్ల బహు చురుకు. మాంచి చలాకీ. చదువులో మాత్రం అత్తెసరి మార్కులైనా తెలివి అమోఘం . మంచి కంఠ స్వరం .
ఉన్నపళంగా హారన్లు మోగడం తో మహదేవ్ ఆలోచన చెదిరింది. పచ్చ సిగ్నల్. ముందుకురుకుతున్న వాహనాలు. రొద. ధూళి. తల పగిలిపోతున్నట్టు అనిపించింది
మహదేవ్ కు. కళ్ళు మూసుకున్నాడు.
*******
మొబైల్ మోగింది. “హలో” అన్న మహదేవ్ మరో నిముషం లో జనరల్ మేనేజర్ గదిలో ఉన్నాడు.
“ఈజిట్ ! దట్ గర్ల్ హ్యాజ్ పాస్డ్ అవే ! సో సాడ్ . యూ కెన్ లీవ్ నౌ అండ్ కన్వే మై కండోలెన్స్ టు సురేష్ ” అధికారికంగా సంతాపాన్ని ప్రకటించేసి మళ్ళీ ఫైల్లో చూపులు దూర్చేసాడు జీ ఎం .
“థాంక్యూ సర్ ” అంటూ బైటికొచ్చాడు మహదేవ్ .
*******
సురేష్ ఇల్లు దగ్గరికొస్తున్న కొద్దీ మహదేవ్ కు గుండె దడ హెచ్చింది. అతను చావుని చూడని వాడేం కాదు. అవ్వ, తండ్రి, ఒక మేనమామ ఇహలోక ప్రయాణం చాలించడం దగ్గర నుండి చూసాడు. కానీ ఇదొక కొత్త అనుభవం . కళ్ళ ముందే పుట్టి, చలాకీగా ఆడుకుంటున్న ఓ పసిపాప అర్ధాంతర నిర్గమనం .
లోనికి అడుగుపెట్టగానే దగ్గరకు దూసుకు వచ్చి గట్టిగా కావలించుకున్నాడు సురేష్ . ఏం చేయాలో తోచక తను కూడా గట్టిగా పొదివి పట్టుకున్నాడు మహదేవ్ . ఏవేవో మాట్లాడుతున్నాడు సురేష్. మహదేవ్ పాప వైపు తదేకంగా చూసాడు. నిద్రపోతున్నట్టుగా ఉంది ముఖం . పాట పాడుతూ ఉందేమో అన్నట్టు పెదవులు కొద్దిగా విచ్చుకుని ఉన్నాయి. ఫ్యాన్ గాలికి పాప నుదుటి పై ముంగురులు కదులుతున్నాయ్ . రింగులు తిరిగిన నల్లటి ముంగురులు. చటక్కున కళ్ళు మూసుకున్నాడు మహదేవ్ .
శాశ్వతాశాశ్వతాల స్థాయీ భావలు అతనిలో చెలరేగుతున్నాయి. అస్తి, నాస్తి ప్రశ్నల శర పరంపర అతని మనసు గుండా దూసుకెళుతున్నాయి. కొద్ది సమయం తరువాత కళ్ళు తెరిచిన మహదేవ్ ముఖం నిశ్చలంగా ఉంది. నిర్మలంగా ఉంది.
*******
బుద్ధుడవడానికి బోధి వృక్షమే అవసరం లేదు.
******