తాను పుట్టి బుద్దెరిగి నలబయ్యైదేళ్ళు దాటీవరకూ విజయనగరం కోటకన్నా విశాలమైన కట్టడాన్ని గాని, గంటస్తంభం కన్నా దర్జాగా ఉన్న కట్టడాన్ని గాని చూడని దాలినాయుడు, డిల్లీలో మూడు రోజులూ తిరిగి కుతుబ్‌మీనార్, ఎర్రకోట, ఇలాటివన్నీ వింత వింతగా చూసేడు. వీటికి మించిన వింత ఈరోజు పార్లమెంటు ఆవరణలో ఎదురయింది. కారణం అక్కడ అప్పుడే పరిచయమైన ఇద్దరు వ్యక్తులు.
తాను మండలం ఆఫీసుకి వెళితే అక్కడ తహసీల్దారు కోసం గంటలు గంటలు వెయిట్ చెయ్యాలి. అలాంటి తహసీల్దారుని గంట వెయిట్ చేయించగలిగే ఆర్డీవో రేంకు అధికారి, తన బాల్యమిత్రుడు అప్పలనాయుడు, వీళ్ళిద్దరికీ ఇంత గౌరవం ఇస్తునాడు. వీళ్ళిద్దరూ ఇంత చదువుకున్నవాళ్ళు, తమ నైపుణ్యానికి ఇంత డిమాండు ఉన్నవాళ్ళు. తనతో కూర్చొని టీ తాగడమేకాకుండా, తనతోనే కష్టాలు చెప్పుకొని ఏడ్చేసారు కూడా. గతమూడురోజులుగా చూసిన వింతలన్నా ఇదే డిల్లీలో తానుచూసిన అతిపెద్ద వింత. ఆలోచిస్తే అంతా కలలా ఉంది.
అసలేమయిందంటే…..
ఆ చదువుకి, అప్పలనాయుడి ఇంట్లోవాళ్ళకన్నా దాలినాయుడే ఎక్కువ మురిసిపోయేవాడు. అప్పలనాయుడు సెలవుల్లో తమ ఊళ్ళో ఉన్నన్నాళ్ళూ, తాటికాయలు కొట్టేవాడు. మామిడిపళ్ళూ, జీడీపిక్కలూ, తేగలూ, సీతాఫలాలూ సేకరించి ఇస్తూ ఉండేవాడు. వైజాగులో చదివేరోజుల్లో, అప్పలనాయుడు ఊరొచ్చినప్పుడు, తన స్నేహితుడితో, “నాకు జీతం పుట్టేకా, నిన్ను నా కర్చులతో వైజాగైనా తీసుకెళ్ళి, బీచీ చూపించాలిరా!” అనేవాడు.
చదువు పూర్తయి ప్రభుత్వ టీచర్ అయేడు. అక్కడితో ఆగకుండా పరీక్షలు రాసి మరో ఐదేళ్ళకి ఎమ్మార్వో అయేడు. పదిహేనేళ్ళ తర్వాత ఈమద్యే ఆర్డీవో గా ప్రొమోషన్ వచ్చింది. తాను ఎమ్మార్వోగా చేసే రోజుల్లో మండల పరిషత్ అద్యక్షుడు ఇప్పుడు పార్లమెంటుకి ఎన్నిక కావటంతోపాటు, జాతీయ వ్యవసాయ కమీషన్ మెంబరు అయ్యేడు. అతడు ఏరికోరి అప్పలనాయుణ్ణి తన ఆఫీసులోకి తీసుకెళ్ళేడు.
ఇప్పుడు అప్పలనాయుడి డ్యూటీలు, మన దాలినాయుడి మాటల్లో, “ఎంపీగోరికి స్పీచీలు రాయడం, రికాడ్రు సూడ్డం, ఆయన లేన్నాడు ఆయిన్ని కల్డానికొచ్చినోల్ల కట్టసుకాలు కనుక్కోని, ఆళ్ళిచ్చిన కాయితాలు వొంజి పెట్టడం, ఆయన ఎవుల్తోని మాట పడకుండా సూడ్డం, ఆయనకి ఎవులనైనా కల్డం ఇష్టం లేకపోతే, ఈడే ఆళ్ళని అడ్డీసి, ఆయనకి బదులు ఈడు మాట కాయడం, ఇలాటాటి కోసరం ఈణ్ణి ఆయన గారు ఏసుకున్నాడుట. జీతం, నాతం, బత్తెం అన్నీ గవర్మెంటే. పని మాత్తరం, ఎంపీగోరికాడ. నెలకి ఒకసుట్టు ఇమానంల డిల్లీ ఎల్లి రావాలట. అంతపెద్దోడు ఆడిప్పుడు.”
ఎప్పుడొ శ్రీకృష్ణుడు, కుచేలుణ్ణి ఇంటికొస్తే గుర్తెట్టుకుని బహుమానం చేసినట్టుగా, అప్పలనాయుడు మాత్రం దాలినాయుడు తన ఇంటికి రాకపోయినా, ఇరవయ్యేళ్ళ క్రితం తను ఇచ్చిన మాట గుర్తు పెట్టుకొని ఒకసారి డిల్లీ చూపించాలి అనుకున్నాడు. తన అత్తవారి తరపు చుట్టాల్లో ముఖ్యులు పదిమంది ఒకేసారి డిల్లీ బయలుదేరినప్పుడు, దాలినాయుడికి రైలుటిక్కెటు కూడా తనే పంపేడు. ఆంధ్రాభవన్‌లో వీళ్ళ బస.
కుతుబ్‌మీనార్ చూసి, ఇది గంటస్తంభం కన్నా పెద్దదేనే అనుకున్నాడు. అలాగే, డిల్లీ ఎర్రకోట కేంద్ర ప్రభుత్వం స్వాధీనంలో ఉంది అని తెలియగానే, “మన విజినారం రాజుగారి కోటనే గవర్మెంటు తీసీసుకుంది, ఇది ఏపాటి?” అనుకున్నాడు.
తిరుగు ప్రయాణం ఎల్లుండి అనగా, దాలినాయుడు తన స్నేహితుణ్ణి అడిగేడు. “పార్లమెంటు ఎలాగుంటాది? ఎంతుంటాది?” అని. అప్పుడు, తన బంధువులకి చెప్పకుండా దాలినాయుడొక్కడికీ పార్లమెంటు విజిటర్స్ పాసు తీసుకొని, తీసుకెళ్ళి గేలరీలో కూర్చోబెట్టేడు. పదినిమిషాల్లో దాలినాయుడికి ఏమీ తోచకపోయేసరికి తగు జాగ్రత్తలు చెప్పి, పార్లమెంటు ఆవరణలో తిరగమని చెప్పేడు.
అలా దాలినాయుడు పార్లమెంటు కేంటీను లో వరండాలో తిరుగుతూ ఉంటే, ఒక మూల ఉన్న ప్రత్యేక గదిలో ఒక తెల్లవ్యక్తి వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు వినిపించి. కిటికీలోంచీ చూసేడు. ఏడుస్తున్న తెల్లవ్యక్తి ఎదురుగా ఇంకొకాయన సూటూబూటూ పిల్లిగెడ్డం అనబడే ఫ్రెంచ్ కట్, అదీ ఉంది. లోపలికెళ్ళడం మర్యాద కాదు అనుకొని, కిటికీ దెగ్గర నిలుచున్నట్టు ఒక చెవి అటు వేసేడు. మధ్యలో చూసీచూడనట్టు ఒక కన్నూ వేసేడు. ఎందుకంటే ఇంగ్లీషువాళ్ళు ఏడవడం అతడికి వింత.
ఆ తెల్లమనిషి వెక్కుతూ వెక్కుతూ గొణుక్కుంటున్నడు. “నేనేటి చేసేను? అన్నీ ఆళ్ళే అనీసుకుంతన్రు. ఆ పొద్దు నన్ను పొగడమని నేనడిగేనా? అప్పుడు పొగిణ్ణోలు ఇప్పుడెందుకు తిట్టాల? అంత కానిపని నేనేటి చేసీసేను?” ఇలా వెక్కుతూ బేర్ బేర్ మని ఏడుస్తున్నాడు.
దాలినాయుడికి అది అచ్చ తెలుగు ఏడుపూ, ఇంకా చెప్పాలంటే తన విజీనారం ఏడుపూ అని తెలిసిపోయింది. చూడ్డానికి తెల్లగా, ఇంగ్లీషోడిలా ఉన్నా విజయనగరం భాషలో ఏడవటం దాలినాయుడి ఆశ్చర్యాన్ని పెంచింది. అతణ్ణి కొంచెం పరిశీలించాడు. పిట్టలదొర టోపీ, ట్రేవెలింగ్ బేగూ, మెడలో కెమేరాకి బిగించిన మూరడు నల్లటి గొట్టం.
రెండో ఆయన, అరవైఏళ్ళకి దెగ్గిర పడుతున్నట్టు ఉన్నాడు. గొణుక్కుంటున్నవాడి ఎదురుగా కూర్చొని చూస్తున్నాడు. సూటూబూటూ, వేసుకొని, టై కట్టుకున్నాడు. చూస్తే, నోట్లోంచి తెలుగుముక్క వొచ్చీవోడిలా లేడు. అంతలో అతడి ఫోను వాగింది. ఫోను ఎత్తి, “ఎసేస్……. నైస్ దట్ యు రీచ్‌డ్ సింగపోర్ వెలినెడ్వాన్‌స్. నావ్ ఐమిన్ డెలీ, రీచింగ్ దేర్ బై టుమోరో మోణింగ్. మీట్ మీ ఎట్ ఎయిర్‌పోర్టిట్‌సెల్ఫ్. జస్ట్ ప్రిపేర్ యువర్సెల్ఫ్ వెల్. ఈ విల్ రికమెండ్ యు టు ఎఫ్ఏవో టీం. బట్ యూ హేవ్ టు ఇంప్రెస్ దెం. ఐ డొంట్ ఇంటర్‌ఫియర్ విత్ దెయిర్ జడ్జ్‌మెంట్. బెస్టాఫ్ లక్.”
దాలినాయుడికి అది మామూలింగ్లీసులా లేదు. తమ ఊరి ఇంగ్లీషు మేష్టారుకీ అర్ధం కాదేమో అని భయపడ్డాడు. టీవీలో అమెరికా వాళ్ళు మట్లాడినట్టు మాట్లాడేడు.
పెద్దాయన ఫోను పెట్టేసరికి మొదటివాడి ఏడుపు తగ్గింది. పెద్దాయన చెప్పేడు. “ప్రతీ వృత్తిలోనూ అనుకోని ఇబ్బందులొస్తాయి. అసలేమయిందో చెప్పకపోతే నీకు ఎంత నష్టం జరిగిందో నాకెలా తెలుస్తుంది? నీదీ నాదీ ఒకదానికొకటి పొంతనలేని వృత్తులే ఐనా, ఇద్దరం విజినారం వాళ్ళం. ఇద్దరం బీబీసీకి పనిచేసేం.”
దాలినాయుడి ఆతృత మరింత పెరిగింది. లోపల ఇద్దరూ విజినారం వాళ్ళే. ఇంక ఆగలేకపోయేడు, ద్వారందెగ్గిరకెళ్ళి “బాబూ, ఇజీనారం నించొచ్చేను. ఒక్క సిటం లోపల కూకోవొచ్చా?” అని అడిగాడు. పెద్దాయన రమ్మనటంతో వెళ్ళి కూర్చున్నాడు.
దాలినాయుడు ఏడుపు ఆపిన వ్యక్తితో అన్నాడు. “బాబూ, అడుగుతన్నని మరింకేటనుకోకండి. తవురిని సూత్తే, ఇంగ్లీసోల్లలాగున్నారు. మాటసూత్తె మాకాసి లాగుంది?” అని.
“అనుకోడాంకేటుంది…?” అని ఆగి, “మీపేరు?” అన్నాడు.
“దాల్నాయుడు. మాది ఇజీనారం జిల్లా సింతలొలస. తవరిద్దురూ, నాయుడూ అని పిలండి సాలు.”
“నాయుడుగారూ, మేము ఆంగ్లో ఇండియన్స్‌మి,” దాలినాయుడి అయోమయం చూసి, విడమరిచి చెప్పేడు. “మా ముత్తాతలు ఇంగ్లాండోలే. మా తెల్లోలు ఈ దేశం వొగ్గీసినప్పుడు, ఇక్కడ చిన్నచిన్న ఉజ్జోగాల్లో ఉన్న కొంతమంది, తిరిగి ఇంగ్లాండెల్లి ఏ ఊళ్ళేలాల, అక్కడ మాత్రం ఏటుండిపోయింది అని ఇక్కడే ఉండిపోయేరు. మాది అలాటి కుటుమానమే. ఇటుకాసి తక్కువగానీ, మెడ్రాసు కాసి మా ఆంగ్లో ఇండియన్స్ ఒక్కో టౌనులోనీ నాలుగేసి పుంజీల కుటమానాలు ఉంతయి. మా చర్చీలు వేరు. మతం పుచ్చుకున్నోల చర్చీలకు మావు ఎల్లం. మా చర్చీల్లంట ఇంగ్లీసు వాక్యం అల్లకి అర్దం అవదు. మావోలు పల్లెటూర్లకాసి తక్కువ. అందరూ టౌనుల్లంటే. నాపేరు గేర్ బ్రిల్. మా సావాస గాళ్ళకి నోరు తిరక్క, గేరుగోడు అనీవోరు. మా నాన్నమ్మకాడ సదువుకున్నోల్లు మాత్రం గిర్లు బాబు అంతారు.”
అంతలో టీలు వచ్చాయి, ముగ్గురూ తాగుతూ ఉంటే మళ్ళీ మొదలెట్టేడు.
“గాంధీతాత సచ్చిపొయీసెరికి మా నానమ్మ ఇజీనారం బళ్ళో పాటాలు చెప్పీది. ఆ తరవాత మా నాన్నకీ గవర్మెంటు బళ్ళోనే మేస్షు ఉజ్జోగం వొచ్చీసెరికి మన విజీనారం జిల్లా పుట్టనేదు. సగం విసాపట్నం, సగం సికాకుళం. జిల్లా వొచ్చిన పదేళ్ళకి రిటారయేడు. సీపురుపల్లి కాణ్ణుంచి కొత్తొలస దాకా సేనా పల్లిటూళ్ళంట బళ్ళలో చేసేడు. ఐతేటయిందీ? ఇటుకాసి మావోళ్ళు లేక మానాన్నకి పెల్లి ఆలీసమైపోయింది. ముప్పై ఐదు దాటేకా, మెడ్రాసుకాసి మావోళ్ళులోనే ఎవులో నాదారోల్లు ఉంతే ఆల బొట్టిని మా అయ్యకిచ్చేరు. మాయమ్మకి ఇప్పుడికీ తెలుగు సరింగ రాదు. అందల అరవం కలిసిపోద్ది. మాకు పుట్టిన కాణ్ణించి ఇంగ్లీసు బాగా వొస్తాది. మీలాటోలతో తిరగడం వల్ల నాకు తెలుగు బాగా వొచ్చీసింది. ఏడాదికీ మూడునెల్లు తాతగారింట్లో ఉండీవోణ్ణి, దనకితోడు ఇంట్లో అమ్మ మొప్పీడం వొల్ల అరవం ఒచ్చీసింది. ఇలాగ మూడు బాసలూ వొంట బట్టించుకున్నాను గానీ, మరి ఏటో సదువు సరింగ అబ్బలేదు.”
కొంచెం మంచినీళ్ళు తాగి తిరిగి మొదలేట్టేడు.
“నాకు ఇరవయ్యేల్లొచ్చీసెరికి నాన్న రిటైరైపోయేడు. అప్పుడు, అడవుల్లంట తిరిగి ఫోటొలు తీసీవోల్ల ఎనకాతల ఆళ్ళ కెమెరాలు మోసి, ఐదూ పదీ సంపాదించుకునీవోణ్ణి. ఆలు నాకూ ఫోటూలు తియ్యడం మొప్పీసేరు. అలగ ముప్పై ఏళ్ళొచ్చీసెరికి టీవిలోళ్ళు అడిలంట తిరిగి ఫోటోలు తీసి ఆళ్ళకిచ్చే కాంట్రాక్టు ఉజ్జోగం ఇచ్చేరు. ఆళ్ళకి గంటలు గంటలు సూటింగు చేసి పంపితే, ఆల్లు పదినిమసాలో పావుగంటో, టీవీల చూపించీవోలు. దాంతోనే నాకు మంచి జీతం వొచ్చీసీది. అప్పుడేనాకు అవార్డ్లు ఇచ్చేరు. దేశదేశాలోల్లు పిల్చేరు. అదిచూసి నన్ను మన తెలుగోళ్ళు, ఈడు మావోడే అన్నారు. ఇజీనారం వోలు ఈడు మా ఈదుల్లోనే, మాతోనే నిక్కర్లేసుకొని ఆడేడని సన్మానాలు చేసేరు. నాను తీసిన వీడియోలు బీబీసీ వోలకి నచ్చి, ఆల్లు కూడా నేను అడివిల్లంట తిరుక్కోని తీసిన వీడియోలు సూపించడం మొదలెట్నారు. దశతిరిగింది, అంతా బాగుందనీసెరికి, నరదిష్టికి నల్లరాయి పగల్తాదని సాత్రం చెప్పినట్టు, ఇలగ నాకరమ కాలిపోయింది.”
మల్లీ ఒకసుట్టు బేర్ బేర్ మని ఏడుపు మొదలెట్నాడు. దాలినాయుడు ఓదార్పుగా చెయ్యి వెయ్యబోయినా పెద్దాయన వారించాడు. మళ్ళీ తేరుకొని మొదలెట్టాడు. “మూణ్ణెల్లక్రితం, ఒక రాష్ట్ర ముచ్చెమంత్రి నన్ను పిలిసినాడు. అంతపెద్దోడు కదా అని ఎల్లినాను. ఒక నాలుగురోజులు నన్ను ఆల్ల రాష్ట్రంల అడివల్లంట తిప్పుకున్నాడు. దానికి ముందు ఆర్రోజులు నాతోని కూకోని ఎటుకాసెల్లాల, అక్కడెంతసేపుండాల ఇయన్నీ రాసుకున్నారు. ఎలగైనా నాకేటీ బాధ? అతగాడూ ఆల్ల రాష్ట్రంల అడివిల్ల తిరిగితే, అడివికీ మంచిదేకదా, అని నానూ ఫుల్లుగ తిరిగీసినాను. బండ ఉంటే బందమీద కూకున్నాం. నేలమీదకి వోలిపోయిన చెట్టుకొమ్మమీద కూకున్నాం. చెరువుల్లంట తెప్పలమీద తిరిగీసేం. పొద్దోయినా గెస్టౌసుకి రాకుండ, అడివిలోనే గుడారమేసుకొని, నేలమీద గోనిగుడ్డ పరుసుకోని తొంగున్నాం. అందులోనే నాను మూడురాల్లు ఎట్టి, కర్రపుల్లలు ఎలిగించి, టియ్య పెట్టబోతూ ఉంటే, నాకాడ గిన్ని లాక్కోని, నానే టియ్య కాచుతానని చెప్పి నాకు టీ చేసీసి ఇచ్చీసేడు. సెప్పకేం గానీ, టీ మాత్తరం గొప్ప రుచి. అప్పుడు చెప్పేడు. చిన్నతనంలో టీ కాచి అమ్మీవోణ్ణని. ముచ్చమంత్రి కాచిన టియ్య ఇంకెవులు తాగ్గల్రు అని పొంగిపోయేననుకో.”
దాలినాయుడెంత తక్కువ సదువుకున్నా, చురుకుబుర్ర కనుక, వెంటనే అడిగేసాడు. “బాబూ, మరి ముచ్చమంత్రి ఎటుకాసెల్లినా సుట్టూ పోలీసోల్లు ఉండ్రా?”
“లేకేం. కాపోతే, మాము తిరిగిన అడివిల్లంట ముందు ఫారెస్టోలు, పోలీసులు జల్లెడట్టీసినారు. కాపోతే, ఒక్క గడ్డిపరకైన నలక్కుండ అడివిని, అడివిలాగుంచీసినారు. మాము తెప్పలో తిరగడానికి మొసళ్ళు లేని సెరువులు ఎంచేరు. మాము రాత్రి టెంటు ఏసుకున్న అడివిలో నక్కలూ, లేళ్ళూ, నెమలిపిట్టలూ తప్ప, ఎలుగుబంట్లైనా లేని చోట్లు చూసేరు. అదికాక, ఎటు తిరిగితే అటు యాబై గజాలవతల గుండ్రంగా పోలీసులు కాసీసి డూటీ చేసోరు. చెర్లో తెప్పల్లంట తిరిగినప్పుడు, నాలుగుబారల దూరంలో గజ ఈతగాళ్ళతో పెద్ద బోటు ఉండీది. ఒక్క తుపాగ్గుండూ పేల్లేదు గాని గానీ, అవుసరమైతే ఏనుగ్గున్నల మంద కూడా మమ్మల్నేటి సెయ్యలేనంత బందోబస్తు.”
దాలినాయుడికి నవ్వొచ్చీసింది. “అంటే, అదంతా నాటకం లాగుందే? ఎందుకు చేసేరంతవు? గవర్మెంటు దానికెందుకు కర్సు పెట్టాల? ముచ్చమంత్రి అంత దమ్మున్న మొగోడైతే ఆలెవురూ లేకుండ నీతోని కలిసి అడివిల తిరగాల” అన్నాడు, అప్రయత్నంగా.
పెద్దాయన కలుగజేసుకొని చెప్పాడు. “నాయుడూ, ముచ్చమంత్రి అన్నాకా, నాటకాలెయ్యకుండ ఉన్నోడు ఎవుడు? పోలియో టీకాలు ఎయ్యడేటి? వీధిని సీపురుతో ఒక సిటం తుడడేటి? సముద్రం వొడ్డుని బీచీల అక్కడక్కడా చెత్త పోయించి, మల్లీ దాని ఏరుతూ ఉండడేటి? ఇయన్నీ టీవీల్ల సూపించరేటి? నమ్మినోల్లు నమ్ముతారు, నవ్వినోల్లు నవ్వుతారు. ఇదీ అలగే. అడివితల్లిని నరికీసుకోకండి అని మనలాటి జెనాలకి సెప్పడానికి అలగ అడివిల్లంట తిరిగేడు. మీటింగలు ఎట్టి అడివిని కాపడండి అని చెప్పడం కన్న, నాటకమో, బూటకమో, ఇలగ సెప్పడం కుసింత గొప్ప కాదేటి?”
దాలినాయుడు కూడా వెంటనే, “నిజవే బాబూ, జెనాలు, నిజాలు చూసి ఎక్కడ వోట్లేత్తన్రు? ఏ నాటకమూ లేకపోతే ఆల్ల దినం ఎలగ తీరుతాది? మీరూ, ముచ్చమంత్రీ అడివికెల్లి మూణ్ణెలయ్యిందంటనరు. టీవిల ఎప్పుడూ సూపించేరు?”
గేర్‌బ్రిల్ మళ్ళీచెప్పేడు “నిన్నరాత్రి టీవీల వొచ్చింది. అరగంట సూపెట్టేరు. మా బీబీసీ వోడు ఊరుకోకండ, అందులో రెండు నిమసాల మరింత చిన్న సేంపీలు వీడియో ప్రెపంచకానికి చూపించీసేడు. ఇదిగో, ఇలగిలగ ముచ్చమంత్రి అడివిల్లంట తిరిగినాడు. నేలమీద తొంగున్నాడూ. అతగాడికి అడివి సూపించడానికెళ్ళినోడికి, ఆడెంత సిన్నోడైనా, కర్రలపొయ్యిమీద టియ్య కాచి ఇచ్చేడు, అని. ఎక్కెడెక్కిడి దేశాల్లో ఉన్న మనదేశమోల్లూ, ఇదిగో, బారద్దేశంల ఇంకే ముచ్చమంత్రి ఇలగ తిరిగీ దమ్మున్నోడు కాదు, ఇంత సిన్నోడికి మరేద చేసీ సమస్కారమున్నోడు కాదు. మిగిల్నోలంతా రాత్రంతా ఇంట్లో తొంగోని, టౌనుల్లంట తిరుక్కోని కబుర్లు సెప్పీవోల్లే. అని పొగిడీసినారు.”
సూటాయన అందుకున్నాడు, “ఆ ముచ్చమంత్రి అబిమానుల్ని, అళ్ళు చేసే బజినిల్ని సూత్తే, కంపరమేసేద్ది నాయుడూ. ఈళ్ళు పొగడ్డం ఇంటే బట్రాజులకి, బుడబుక్కలోలకీ సిగ్గుతో వొల్లు సచ్చిపోద్ది. అతగాడు అవుతార పురుసుడని ఒకడంతే, ఎప్పుడొ ముప్పై ఏల్లక్రితం బార్యనొగ్గీసేడని తెలిసి బుద్దుడని ఒకడంతడు. ఇంత దమ్మున్న మొగోడు మన దేశంలోనే పుట్టనేదని ఒకడు, అదేదో, ఈళ్ళు అందరి మొనగాడితనాలూ తక్కెడేసి తూకాలేసీసినట్టు చెప్పేస్తరు. ఈముచ్చమంత్రి చేసిన పనికి ఎప్పుడైనా గోరంత మంచి జరిగినా, కొండంత ప్రెచారం చేసీసి, అసలు గోరంత మంచీ కనపడకుండా కమ్మెస్తారు.”
దాలినాయుడు అడిగేడు “బాబూ, ముచ్చమంత్రి మీకు టియ్య కాచి ఇచ్చినప్పుడు ఎవులు వీడియో తీసేరు? ఆడు వీడియో తీత్తుంటే, మీకు నాటకం అనిపించలేదా?”
“నాయుడూ, అలాంటి చోట్ల ముందే, చెట్లుమీదా, టెంటు కర్రలమీదా, చెర్లో ఎలితే ఎనకాల ఇంకో బోటులోనీ కెమెరాలు బిగించీసి ఉంచుతారు. ఏటి చేసినా అందులో పడిపోద్ది. పదిగంటల వీడియో వొచ్చింది. అదంతా, మల్లీ మల్లీ చూసి, బాగ నాడెంగ అక్కడొక నిమసం, ఇక్కడొక నిమసం కలిపీసి అరగంట టీవీల్ల సూపించేరు. అందులోనే ఈ టియ్య కాచడలు, నేలమీద గోనిగుడ్డ ఏసుకొని తొంగేడాలు వొచ్చీసినాయి.”
ఏడుపుకి కారణం, దాలినాయుడు ఊహించేడు. “అందరూ అతణ్ణి పొగిడీసి, నిన్ను ఒగ్గీసెరని ఏడుపొచ్చిందా?”
“అలగైనా బాగే ఉణ్ణు. ముచ్చమంత్రితో ఎల్లినందుకు ఆ గవర్మెంటు పదో పరకో ఇచ్చీసింది. ఎక్కువో, తక్కువో, అది చూసి నాలుగు బేరాలు తగిల్తే అది నాకది సాల్దేటి. చూసినోళ్ళ పొగడతలు నాకేనాడూ ఒద్దు.”
దాలినాయుడికి అడక్కూదదని బుద్ది చెప్తున్నా, మనుసు పీకీసెరికి అడిగీసేడు. “బాబూ, పదో పరకో ఏటి సరిపోద్ది? రోజుకి వెయ్య లెక్కన ఓక పదివేలైనా అడక్కపోయేరా?”
“ఏదో మాటొరసకి అన్నాను నాయుడూ. ఆ పదిరోజులికీ, బసా బోజనమూ, కారూ కాక, గవర్మెంటు రోజుకి పదివేల్లెక్క మొత్తం లచ్చ రూపాయిలిచ్చిందిలే.”
“నచ్చరూపాయలే?” నాయుడి గుండాగిపోయినంత పని అయింది.
సూటాయన అన్నాడు. “నాయుడూ. అంతకన్నా ఇవ్వడానికి గవర్మెంటు రూల్సు ఒప్పుకోలేదో, ముచ్చమంత్రితో ఎళ్లడం చూసి, ఇతడిపేరూ, చేసిన పనీ, మరి నలుగురికి తెలిసి, నాలుగు బేరాలు తగుల్తాయని ఎల్లేడో గానీ, ఇతగాడు కొన్ని దేశాల అడవిల్లోకి ఎల్లినప్పుడు రోజుకి లచ్చ ఇవ్వడానికి చాలామంది ఉంటారు.”
“సరేలెండి నాబుర్రకి ఆలెక్కలు ఎక్కవు. అలగైతే నానూ మా అప్పలనాయుడిలాగ సదూకొనీవోణ్ణీ కదా? దానిగొడవ అలగుణ్ణియ్యండి. నచ్చరూపాయిలొచ్చినా ఏడుస్తున్నారా బాబూ?” అన్నాడు.
“అదికాదు నాయుడూ. ఆ ముచ్చమంత్రికి వొచ్చే మూడు నెల్లలో ఎలచ్చనులు ఉన్నాయట. ఆల్ల రాష్ట్రంలో ఎలచ్చన్లకి ఈ అడివిలో నాటకం వాడీసుకొని వోట్లు నొల్లీసుకుంతాడట. అందుకని ఆయనంటే కిట్టనోల్లు ముచ్చమంత్రిని తిడతన్రు.”
“ఓసి, ఈమాత్రానికి ఏడ్డం ఎందుకు బాబూ. మీకు టియ్య కాచి ఇచ్చినాయన్ని అందరూతిడతన్రనా?”
“ముచ్చమంతిర్నేటనుకుంటే నాకేటి బాధ? ఎగస్పార్టీ నాయకులు ముచ్చమంత్రిని పగటేషగోడు అని తిట్టీసి ఊరుకున్నారు. ఆలు కాక, మన్నాగ పేపర్లు, టీవీలూ, చూసుకోని రచ్చబండలకాడ మట్లాడుతారు చూసేరా. అల్లాటియే ఈ కంప్యూటర్లంట, సెల్లుఫోన్లంట ఉన్నాయిలే. ఎవుడు, ఎవుడికీ తెల్దు, ఎవులెక్కడున్నారో తెల్దు, మొకాలు చూసుకోరు గానీ, గొప్ప తగువులాడీసుకుంతరు. ఆలాటి తగువుల్లో, ముచ్చమంత్రి అంటే కిట్టనోడు ఎవుడో, పోతురాజు పూనీసినట్టు ముచ్చమంత్రిని తిట్టీసి, అతడితో ఎల్లినందుకు నన్నట్టుకొని, ఆపగటేసగాడీకి తానాతందానాగోడు అని అనీసినాడు. ఇంక, చూడు నాయుడూ, మన వీధి బాగోతంలో తొలి పదం అందిత్తే పాట మొత్తం పాడీసినోల్లు ఉంతరు కదా, అలాగ, ఈ ఒదియం లోపల నేను తిన్నవి, అవి తిట్లు గాదు. నాకు అడివంటే ఏటో తెల్దట. మైల్దూరంలో నక్క ఊళెడితే పెంట్రిలిపోతానట. కెమెరా నేకపోతే చెర్లోకే దిగనట. నడుంకి తాల్లు కట్టుకోకుండ సెట్టెక్కనేనట. నాలాటి ఊరూ పేరూ లేనోడికి, ఇలాటి పగటేసాల ముచ్చంత్రితో కలిసి నాటకం ఆడితే గానీ బేరాలు తగలవట. ఈ ఎలచ్చనులో ముచ్చమంత్రి మల్లీ గద్దెక్కితే ఆ పాపంలో నాకూ వోటా ఉంటాదట. ఇలాగ, ఆలకి తెలిసినివీ తెలీనివీ అన్నీ అనీసి తెగ తిట్టేత్తన్నారనుకో. నాలిక్కి నరంలేదంటం కదా, అలగనమాట.”
దాలినాయుడికి గేర్‌బ్రిల్ మీద జాలి వేసింది. “ఏటి బుద్దున్నోలెలగంతరలాగ? నువ్వేటి ముచ్చమంత్రికే ఓటు అనీసి గోలెట్టీసేవేటి? నీకలవాటైన పని నువ్వు సేసేవు.” దాలినాయుడు తన తీర్పు గేర్‌బ్రిల్ కి అనుకూలంగా ఇచ్చేడు.
సూటాయిన అన్నాడు. “నాయుడూ, నీకిందాకా చెప్పేనుకదా? ఆ ముచ్చమంత్రి బజిన గాళ్ళు ఎలాటోలో, అతగాణ్ణి అసయ్యించుకొనీవోల్లలోనూ అంతే తెలివైనోలు ఉన్నారు. ఈళ్ళ కోపం ఇంకేటీనేదు. నాయికులందరూ ఆ నాటకాలే ఆడినా, ఆలెవురికీ నాటకం సరింగ పండించడం రాదు. ఈ ముచ్చమంత్రికి ఎగస్పార్టీలో లీడ్రు, ఒక గుంటడు. క్రితం సారి ఎలచ్చన్లప్పుడు, ఈ గుంటడి జట్టులో ఒకడు, టీ కాచీవోడు ముక్యమత్రి ఏటి అని ఎవుడో, ముందూ ఎనకా కానుకోకుండ ఇగటమాడీసేడు. ఇంకేటుంది? ఇతగాడు, టీ షాపులోలందర్నీ రెచ్చగొట్టీసినాడు. అక్కడ టీ తాగుతున్నోలంతా ‘ఈ గుంటడి జట్టుకి టీ అమ్ముకున్నోడంతె అంత నిస్సాకారమా?’ అనీసి నానా మాట్లూ అనీసున్నారు. టీ కొట్టంటే నలుగురు వొచ్చిపోయే సోటు కదా. ఆదెబ్బతో, ఎలచ్చన్లో గుంటణ్ణి, ఈ టీకొట్టు నాయికుడు కాండ్రుమనిపించీసేడు.”
“గుంటడి అనువు ముచ్చమంత్రి బాగా కనిపెట్టీసేడనమాట.” దాలినాయుడు నవ్వుతూ అన్నాడు.
“మొన్నేటయిందనుకున్నావు? ఈ గుంటడు, అసెంబ్లీలో మొకం ఎర్రగా చేసీసి, గుడ్లగూబ లాగ కళ్ళేసీసుకొని, ఈముచ్చమంత్రి రాస్టాన్ని అలగ నాశనం చేసెత్తండు, ఇలగ నాశనం చేసేత్తండు అని దెబ్బలాడీసేడు. బాగా గడ్డెట్టేడని ఎగస్పార్టీ వోళ్ళు నలుగురూ చప్పట్ట్లు కొట్టిసేరు. అప్పుడు కూకొని ఉండిపోతే, ఆ బాబు నాటకం బాగానే పండీది. ఏటయిందో ఏటో? మల్లీ లేచేడు. ‘ముచ్చమంత్రిగోరూ, మీరు ఎన్నిసెడ్డ పన్లు చేసినా, మీమీద నాకేటి కోపం లేదు, మీరు బాగుండాల అని బగమంతుణ్ణి మొక్కుకుంతన్ను,’ అనుకుంటూ, తిన్నగా ముచ్చమంత్రి కాడికెళ్ళి, సిన్నగుంటడిలాగే అతగాణ్ణి కాగలించీసుకున్నాడు. ఎవులికేటీ అరదం అయ్యీలోపల, ఆళ్ళ పార్టీలో ఎవులికో కన్నుకొట్టీసినాడు. రేవట్నక్కల్లాగ కాసుక్కూర్చున్న టీవీలోళ్ళు ఆ కన్ను గీటీడాన్ని టీవీలల్ల చూపించీసినారు. నాటం ఏసినప్పుడు, స్టేజిమీద ఏడుసుకుంటూ పజ్జెం పాడినోడు, అక్కడికక్కడే నవ్వీసి మద్దెల గాడికి కన్నుగీటీసినట్టు బాగా పాణ్ణానా అని అడిగీసినట్టు ఐపోయింది. ఒకేళ అడగాలనుకుంతే, నాటకం ఐపోయేకా, రంగులు కడూక్కుంతున్నప్పుడూ అడగాల కదా? ఆళ్ళ ఆవేశం నవ్వులపాలు, సప్పట్లు ముచ్చమంత్రిపాలు. నాటకానికి కౌకిలి పడింది ఎగప్సార్టీ గుంటడు. ఆగుంటడు ముచ్చమంత్రి ముందు సాల్లేకపోతండని, మల్లీ ఇతడే గెల్చెత్తాడేమోనని, ఇదిగో ఈ ముచ్చమంత్రిని అసయ్యించికోనీవోళ్ళ కోపం”
“అదిసరే, బాబూ. ముచ్చమంత్రితో అడివికి ఎల్లడం తప్పెలాగౌతాది. మన గేరుబాబుని ఎందుకంత తిట్టీడం.” సూటాయన్నేఅడిగేడు.
“నీకింక ఇసయం అర్దం అవలేదు నాయుడూ. ఒకసారి నాటు మాటల్లో చెప్పేస్తను ఇనుకో. ముచ్చమంత్రి ఒదియాన్నే సెంబొట్టుకొని బైటి బూమికి ఎల్తన్నాడనుకో, అతడి బజనపరులు సెంటు కొట్టీసినట్టు ఆహా, ఓహో అనీసీ వోళ్ళైతే, ఆయన్ని అసయ్యించుకొనీవోళ్ళు, సీ, ఒకమడిసి సెంబట్టుకొని బైటికెల్తే ఇంత కంపు రావడం ప్రెపంచకం మీద ఎక్కడా సూడ్లేదు అని ముక్కులు మూసీసుకొని మరి వొదల్రు. మనం చూసి, ఆళ్ళు ఊపిరాడక సచ్చిపోతారేమో అని బయ్యం పడీపోతం. అలాటోలు, ముచ్చమంత్రికి పేరొచ్చే పనిలో ఎల్లినోణ్ణి, ఆయన కాచిన టీ తాగినోణ్ణి వొదుల్తారా. బీబీసీ దాకా ఎల్లిన ఇతగాడి పేరు కూడా ముచ్చమంత్రి కాతాలో పడిపోతే, ఆ గుంటణ్ణి వొచ్చే ఎలచ్చన్లలో మల్లీ కాండ్రుమనిపించీడూ?” దాలినాయుడికి విషయం మొత్తంవిడమరిచి చెప్పి, బ్రిల్లుబాబు వైపు తిరిగి,
“నువ్వు అడివిల తాగిన టీ కీ, ఇప్పుడు కాస్తున్న తిట్లకీ చెల్లు, మిస్టర్ గేర్ బ్రిల్” అన్నాడు.
“అంతేనటారా?” అంటూ మళ్ళీ బేర్, బేర్ మని ఏడ్చీసేడు, గేర్‌బ్రిల్ అనబడే విజయనగరపు ఆంగ్లోఇండియన్.
దాలినాయుడు గేర్‌బ్రిల్ కథని మరోసారి మననం చేసుకొని, ఉస్సురుమని నిట్టూర్చి, పెద్దాయనవైపు తిరిగి అడిగినాడు. “బాబూ, తమరి గురించి సెప్తారేటి.”
* * * * *
“నాపేరు సంజీవు బావురు. నాదీ ఇజీనారమే. పేరు మనకాసి పేరులాగ ఉండదు. మరేట్లేదు. మా ఇంటిపేరు బావూరు. నాకు పెట్టినపేరు సంజీవిబాబు. ఇంగ్లీసులో రాసీసెరికి గుణింతం తేడా వొచ్చీసి, ఇక్కడోలందరూ బావురు అని పలికీవోరు. నాను ఇంటరు అవుతానే డిల్లీ వొచ్చీసేను. ఇక్కణ్ణించీ ఏకంగా లండన్ ఎలిపోయేను. పేర్లు రాయడాల్లో బాబు ఎగిపోయింది, సంజీవు ఉండిపోయింది, ఇంటీపేరు బావురు అయిపోయింది. ఇటూకాసి ఇంటీపేరు ఎనకాల సెప్తారులే. అలగ నాపేరు సంజీవ్ బావురు ఐపోనాది. ఒకుసారి డిల్లీ ఒచ్చినకాణ్ణించి మనవిజీనారం ల ఒకురోజైనా నిద్ర సెయ్యలేదు. మాయత్తోరికి తెలుగే రాదు. కలకత్తావోళ్ళు. మాయావిడి డాక్టరమ్మ. ఈ నలబయ్యేళ్ళూ, ఇందంటైతే డిల్లీ, ఇక్కడ పనిలేకపోతే, సింగపూరో, లండనో, అలగ ఎవుడు పని ఇత్తే ఆడి దెగ్గిరెకెల్లి పనిచేసుకునీవాణ్ణి. ఐతే, అసలు పాతికేళ్ళు కాలంలో ఒక్కురోజు కూడా గవర్మెంటు ఉజ్జోగం సెయ్యలేదు. ఒకేల గవర్మెంటులో ఎవురైనా ఏదైనా అడిగితే, పదిరోజులో, నెల్రోజులో, ఆపని చేసీసి, ఆలూ, నానూ అనుకున్న పదీ పరకా తీసీసుకినీవోణ్ణి గాని, ఒక ఆఫీసరు దెగ్గిరగాని, ఒక ముచ్చమంత్రి దెగ్గిరగాని సేతులు కట్టుకొనీ పని వొద్దనుకున్నాను.”
‘అందరూ గవర్మెంటుజ్జోగం కోసం నానా గడ్డి కరుత్తూ ఉంటే, ఇతను, ఏటి ఇలాగ?’ అని దాలినాయుడు బుర్ర గోక్కున్నాడు. “ఇంతకీ తమురు ఎలాటి పని సేత్తారు బాబూ?”
“నానొక్కరకం పని సెయ్యను నాయుడూ. కొన్నాల్లు సింగపూర్లో ప్రొఫెసరుజ్జోగం చేసేను. కొన్నాలు బీబీసీ కి రిపొర్టులు రాసిపెట్టేను. మరికొన్నాల్లు పేపరోళ్ళ దెగ్గిర ఉజ్జోగం చేసేను. ఇందాకల గేరుబాబు తో అడివిల తిరిగేడే, ఆ ముక్యమంత్రి కి ముందు ఇంకో ముచ్చమంత్రి ఉండోడు. అతడి అపీసులో మాత్రంఐదేల్లు గవర్మెంటు ఉజ్జోగం చేసేను. ఆ ఉజ్జోగం మానీసేకా, మల్లీ సింగపూరు ఎలీపోయినాను.”
“బాబూ, మరేటి, ఇన్ని ఉజ్జోగాలు మరిపోతే, జీతం, బత్తెం?”
“పర్లేదు నాయుడూ. ఏ ఉజ్జోగం చెయ్యకపోయినా బతకడానికి డబ్బుంది. నాకు నచ్చినపని, నాకు చేతనైన పని, ఎవులైనా చెయ్యమంతె ఆ పనికి డబ్బులు తీసుకొని చేస్తాను. ఎప్పుడూ నన్ను నలుగురు పిలిచి పని ఇస్తూనే ఉంటారు. ఇద్దరు ముగ్గురికి చేసి, నాలుగోవోళ్ళు ఆగితే ఆళ్ళకి చేస్తాను, లేకపోతే ఇంకొకలికాడ చేయించీసుకుంతరు.”
అంతలో గేర్‌బ్రిల్ అన్నాడు. “ఈయన రాసిన పుస్తకాలు సాలా దేశాలోళ్ళు సదువుతారు.”
వెంటనే, ఆపెద్దాయన, “ఇప్పుడా పుస్తకాల గొడవెందుకు గేరూ. మొన్నటి పుస్తకానికి తిన్న రోకటి పోట్లకి తల వోచిపోయింది. ఇంక రాయకూడదు అనీసుకున్నాను.” అంటూ పెద్దాయన చాలా విచారంగా ఉండిపోయేడు.
“పర్లేదు సార్. ఇప్పుడేటయింది? పుస్తకాలు రాసినోల్లలో రాష్ట్రపతులుగా పనిచేసినోల్లనే రోకటిపోట్లు వొదల్లేదు. మీరు ఇప్పుడు ఇంకొక పుస్తకం రాయండి. దానికి పదిలచ్చలు అడ్వాన్సు వొత్తాది.”
దాలినాయుడు అన్నాడు. “బాబూ, మియ్యిద్దరిని సూత్తే, రామాయనంల కిస్కిందకాండ గుర్తొస్తంది.”
“కొంపదీసి మేం గాని కోతుల్లాగున్నావేటి?” అని పెద్దాయన నవ్వేడు.
“అదేటి బాబూ అలాగంతారు? కిస్కిందకాడికి తొలీత రాములోరు వొచ్చీసెరికి, సుగ్రీవుడు ఏడుస్తండట. రాములోరు కొంచెం దైర్నెం సెప్పీసెరికి, నెమ్మదించి, మీరు, ఈ అడివిల్లంట ఏ పనిమీద తిరుగుతన్రు అని అడిగేడట. అప్పుడు రాములోరు ఏడ్డం మొదలెట్టేరుట. సుగ్రీవుడు దైర్నం సెప్పేడుట. అలగుంది. ఇందాకా మీరు గేరుబాబుని ఓదారిత్తె, ఇప్పుడు అతగాడు మిమ్మల్ని ఓదారత్తండు. పిట్టకథలకేటుంది గాని, గేరుబాబు చెప్పినట్టే, మీరూ తొలికాణ్ణుంచీ చెప్పండి.”
‘బావురు’ మని ఏడవకపోయినా, సూటూ బూటూ వేసుకున్నపెద్దమనిషి కూడా, మొహం విచారంగా మారింది. కళ్ళంట రెండో మూడో కన్నీటి చుక్కలు, అదేదో సినిమాలో సావిత్రి గ్లిజరిన్ లేకపోయినా లెక్కబెట్టి రెండు చుక్కలు కన్నీళ్ళు కార్చినట్టు, ఇతడి కళ్లలొంచే నాలుగు బొట్లు రాలేయి. గేర్‌బ్రిల్ ఓదార్చబోతూ ఉంటే దాలినాయుడు అతడు చెయ్యిపట్టూకొని ఆపీసి, “దుక్కం తీరా ఏడనీ” అన్నట్టు సైగచేసేడు.
సంజీవ్ బావురు తేరుకున్నాకా మరో డౌటు అడిగేడు. “బాబూ, మీరూ గేరుబాబు మీద ఇరవయ్యేల్లు పెద్దలాగ ఔపడతన్రు. ఆయబ్బాయి పుట్టీసెరికే మీరు డిల్లీకాసి ఎలిపోయేనంతన్రు. సుట్టారికం అవుకాసమేనేదు. తొలీత ఎక్కడ కలిసినారేటి?”
“పదేల్లకిందట, ఈ గేర్‌బ్రిల్ లండను బీబీసీ అపీసుకొచ్చినప్పుడు, నాను అక్కడ నా పని మీదున్నాను. అప్పుడు తొలీత కలడం. కుర్రోడు మనకాసే అని తెలిసీసెరికి ఏటో, మాయన్నియ్య కొడుకులాగౌపడ్డాడు అనుకో. ఆర్నెల్లకో ఏడాదికో ఎక్కడ కలిసినా ఒకసిటం ఇలగేకూకోని కట్టసుకం మాట్లాడుకునీవోల్లం.”
“ఈ పిట్టకథలకేం గాని బాబూ, మీ కథ ఎల్నియ్యండీ.”
“అంతా బాగానే ఉండీదనీసెరికి, నాను లండనులో సదువుకున్నప్పడు మాకు పాటాలు చెప్పిన పాత గురువుగోరు ముచ్చమంత్రి అయి, ఓరయ్యా, సంజీవా, నాను ముచ్చమంత్రి అయేను. ఇక్కడ ఎటు చూసినా గుంటనక్కలేన్రా, ఆళ్ళు అబద్దాలు చెప్పినా నాను కాసుకోలేను. నువ్వొచ్చి, నా సుట్టూ నాలుగు దిక్కులూ చూసి కనిపెట్టుకొందుగాని. నీకు అక్కడొచ్చిన జీతం ఎంతో చెపితే అపాటి ఇచ్చీలాగ సూత్తాను, అని కేకేసేరు.
గురువుగోరు పిల్చీసెరికి, ఎంతమాటండీ, జీతం ఊసు ఒగ్గియ్యండి. నా ఇక్కడ జీతం లెక్క ఒగ్గీసి, అక్కడ నాముందు ఈపని చేసీవోడికి ఎంత ఇత్తే అంతే ఇప్పించండి. ఏటైనా తగ్గితే గురుదచ్చిన అనీసుకుంటను, అని చెప్పి సింగపూరుజ్జోగం వొదిలీసి వొచ్చీసినాను. అలగ రావడమే తప్పయిపోయింది. ఏటనుకోకండి గురువుగోరూ, నాకు గవర్మెంటుజ్జోగం నప్పదు అనీసి దండం ఎట్టిసుంటే, ఒకుమాటతోటి చెల్లిపోయీది. ఈపాటికి నన్ను తిట్టుకున్నోడు ఎవడూ ఉండీవోడు కాదు. నాపేరే ఎవులికీ తెలిసీది కాదు. ఎవులిక కరమకి ఎవులు కర్తలు?” సంజీవు బావురు గారి గొంతు గధ్గద స్వరంలోకి మారింది. కళ్ళు మళ్ళీ చెమ్మగిల్లేయి.
గేర్‌బ్రిల్ గ్లాసుతో నీళ్లందించేడు. ఆయన స్థిమితపడగానే దాలినాయుడు అడిగేడు. “బాబూ, అంత సత్తెకాలం మడిసి ముచ్చమంత్రి ఎలగయేడు?”
“ఇందాకల గేర్‌బ్రిల్ చెప్పిన కథలో ఎగస్పార్టీ గుంటడున్నాడా? ఈ టియ్య కాచిన ముచ్చమంత్రికి ముందు ఐదేళ్ళూ ఆళ్ళ పార్టీ గవర్మెంటులే. ఈ గుంటడి తల్లి, పెద్ద నాయరాలు. కావాలంటే గద్దెక్కీగల్దు గానీ, ఆవిడ ఏటనుకుందో, నాను ముచ్చమంత్రి అవను అనీసింది. పార్టీవోలు బెంగెట్టీసుకున్నారు. ఎందుకనేవు? ఈ గుంటడు ఇప్పుడే ఇలగున్నాడూ. అప్పుడు ఇంకా అద్దోనంగ ఉండీవోడు. ఒకుటడిగితె ఒకుటి చెప్పీవోడు. సబలో కునికీసీవోడు. కునుకుకాదు, ఆలోసించతనాడు అని ఎన్నిసుట్లు మసి పూసీగల్రు. నాయుళ్ళూ నాయరాళ్ళూ ఉన్న ఆ కుటుమానంలో ఈ అద్దోనం గుంటడెలగ పుట్టీసేడో అనుకుంతరు చూసినోలు. ఆల పార్టీవోలైతే కుసింత సాటుకెల్లి ఇదేమాట మనుసులో అనుకుని నవ్వీసుకుంతరు.”
“అదేటి సంజీవు బాబూ, అలగంతరు. ఇరట్రాజుకి కడుపుని ఉత్తరకుమార్డు పుట్టలేదేటి? దుర్యోదనుడి కడుపులో లచ్మన కుమార్డు పుట్టలేదా. అలగే ఇదీనీ. ముందుకెల్నియ్యండి.”
“ఈ గుంటడికి వెన్నుముదిరీవరుకూ ఎవుణ్ణి కూకోబెడితే మన కొంపకి అగ్గెట్టకుండా ఉంతాడా అని దివిటీలొటుకొని ఎతికీసేరనుకో. అదిగో, అప్పుడు, ఆ నాయరాలికి మా గురువుగోరు సత్తెకాలం మడిసిలా ఔపించేరు. మీరైతే పదిమందికి సదువు సెప్పినోల్లు, మీరు ముచ్చమంత్రి గద్దెక్కండి అని నాయరాలు చెప్పీసెరికి, ఇతను గాబరా పడిపోండు. నానేటి ఎమ్మెల్లే కాదుకదా, ఒక వాడ్రు మెంబరుగా కూడ గెల్లేను. నానేటి ముచ్చమంత్రి ఏటి, అని. గద్దెమీద కన్నేసిన గుంటనక్కలు అప్పుడే ఒకడికాలు ఒకడు లాగీసుకొని దభీదభీమని కింద పడిపోనారు. ఈబాబు కాలు లాగాలని ఎవులికైన ఎలగ అనిపిస్తాది? ఈబాబు ఎవురికాలైనా లాగితే అప్పుడు ఈబాబు కాలు ఎవులైనా లాగీసునేమో. అప్పుడు మాగురూగోరు, కాల్లు లాగీసుకొని కిందడిపోయిన గుంటక్కల్ని చూసి, ‘ఈలేటి నామటింటరమ్మా? ఒక సిటం ఉంటే అందరూకలిసి నాకాల్లు లాగేస్తరు అన్నాడు. అన్నాడు. “నాయరాలేటందీ? మీరు గద్దెమీద కూకొండి. ఏటి సెయ్యాలో నాకు సెప్పండీ. నాసేతిలో బెత్తం ఉంటాది. మిమ్మల్ని ఈ గుంట్నక్కలేటీ అనవు అంది.”
దాలినాయుడు ఆశ్చర్యపోయేడు. “అదేటది? గద్దెక్కినోడే బెత్తం వాడాల కదా? నాయరాలు బెత్తం ముచ్చమంత్రికియ్య లేదా?”
“బాగుంది దాల్నాయుడూ. గద్దెక్కితే నలుగురికీ సమాదానం సెప్పుకోవాలి. అసలుబలం ఉన్న బెత్తాన్ని ఉంచుకొని పక్కన్నించుంటే, గద్దెమీద సత్తెకాలం మనిసి బైటోలకి సమాదానాలు సెప్పుకుంతాడు. కిందోలంతా నాయరాలి బెత్తానికి బయం పడతారు.”
“నాయరాలిది బలే ఎత్తు బాబూ. ఒకురకంగ, కుర్చీలో మనిసిని కూకోబెట్టకుండు రుమాలు గుడ్డేసీసినట్టే.” దాలినాయుడు ఆశ్చర్యపోయేడు.
“గద్దెమీద కూకున్నాకా, మా గురూగోరు నన్ను పిలిచి, సంజీవూ నీకు తెలీందేముంది? ఇక్కడ ఎవులికీ అమ్ముడుపోనోడివి నువ్వే అన్నారు. నాను ఒకుటే అడిగినాను. గురూగోరూ, నన్ను మీరు పిలిసేరు. నాను మీకోసరమే పని సేత్తాను. మల్లీ మీకు నచ్చన్నాడే ఎల్తాను గానీ, ఏ గుంటనక్కకి నచ్చకపోయినా ఆలమాట మీద నన్ను ఎలిపోమని చెప్పనని మాటియ్యండి సాలు అన్నాను. మాటిచ్చీసినారు. అబద్దం ఎందుకు? నాయరాలికి నచ్చకపోయినా ఎలిపోమనొద్దని నానూ అడగలేదు. ఆయన కుర్సీయ్యే నాయరాలి దయ ఐతే, ఆయన నాకేటి అడ్డుపడగల్డు. అలగే నాలుగున్నరేళ్ళు పనిచేసేను.”
“బాగుంది బాబూ. వాడ్రు మెంబరుగా గెల్లేని ఆయనా, గవర్మెంటు ఉజ్జోగం కిట్టని మీరూ కలిసి, ఆ నాయరాలి పడగకింద, గుంట నక్కల మజ్జిన అంతకాలం పనిచేసేరా, ఇడ్డురమే?”
“ఆ రోజులొకలాగ గడిచేయా? గెడకర్ర మీద కూకున్నట్టే. నానూ, మాగురువుగోరూ కలిసి ఒకసారి, గవర్మెంటు పనిలో, ఎంతకూలీ పెంచితే మంచిది అని రాత్రీ పొగులూ లెక్కలేసి కూలీ పెంచేం. నాను బైటున్న ఇలేకర్లకీ ఏటిచెప్పేనూ? ఇదంతా ముచ్చమంత్రి సొయంగా పెన్నూ పేపరూ ఒట్టుకొని లెక్కలేసి పెంచింది. ఆయిన పుట్టిన్రోజుకి ఇచ్చిన బగుమతి అనీసేను. పెజలందరూ మాగురూగోరిని, మెత్తనోడు అనుకున్నం గానీ, కుసింత గట్టోడేన్రోయ్ అనీసుకోడం మొదలెట్టిసినారు. ఇంక సూడయ్యా, ఆరాత్రి, గుంటనక్కల అడావుడి. మాగురువుగోరు నాయురాలి ఇంటికెల్లి, ‘ఇప్పుడే బైటికెల్లి, కూలీ లెక్కలు మీ అబ్బాయి తెలివే, నాకేటి తెల్దు అని సెప్పేత్తాను.’ అన్నారు. ‘ఇప్పుడొద్దులెండి, ఎవులూ నమ్మరు.’ అనీసింది నాయరాలు. బెత్తం ఆవిడిసేతిలో ఉండగా పేరు ముచ్చమంత్రికి రావడం ఆవిడికెలా నచ్చుతాది? మర్నాడు తెల్లారుతూనే మా గురువుగారు నన్ను దెబ్బలాడిసేరు. ఎవుల్నడిగి నాపుట్టిన్రోజు బగుమానం అని చెప్పీసినావు? అలాటివి సెప్పలంతే ఒకుసుట్టు నాయరాలికి సూపించాలని తెలీదా? అని. నాను ఒల్లకుండిపోనాను. బైటికొచ్చేకా, ఒక గుంట్నక్క చెప్పింది. అన్నిలెక్కలూ ఏసేకా, నాయరాలికి చూపెడితే, ఆవిడ గుంటడిచేత కూలీల కష్టాలమీద మాట్లాడించి ఆళ్ళ కూలి పెంచమని చెప్పించేకా, అప్పుడు గవర్మెంటు పెంచినట్టు చెయ్యాలట. అలగైతే, ప్రెజలు గుంటడు ముచ్చమంత్రి ఐతేబావుణ్ణు అనుకుంతరు. వొచ్చేఎలచ్చన్లనాటికి గుంటడీకి వెన్నుముదిరి ముచ్చమంత్రి అవ్వగల్డట. ముచ్చమంత్రి గద్దెమీద ఎవులు కూకున్నా గుంటడి వెన్ను ముదిరీవరుకేనట. వినీసి ఊరుకున్నాను. గుంట్నక్కల్తోటి ఏటి వోదిత్తాం.
“ఇలాటివి సమచ్చరానికి ఒకసుట్టైనా ఏదో ఒకుటయీది. నాలుగేళ్ళూ దాటీసెరికి గుంటనక్కలు నాయురాలి సెవిలోని ఊళలెట్టీసినాయి. మాగురువుగోరికి నామీదే సికాకొచ్చీసింది. నన్ను కేకలేసీసేరు. ‘ఏటి ఊరికే ముచ్చమంత్రి కుర్చీపరువు, నా పరువు అంటావు? నువ్వూ నానూ ఆ కుటమానం ఉప్పు తింటన్నం. ఆ కుటుమానం పరువు కన్నా ఈ కుర్చీ పెద్దదనుకునవేటి? ఆవిడికి కోపం రాకుండ నాదెగ్గిర పని చేసుకో’ అనీసేరు గురువుగోరు. అప్పుడు ఆయన కష్టకాలంలో ఉన్నారు. ఆ టైములో నానూ ఆయనమీద అలిగీసి ఎలిపోడం ఎందుకని ఆగిపోయేను, గానీ, ఆఉజ్జోగం నాకు ఒకులెక్క కాదు.”
“బాగుందండీ. నాకేపరువూ వద్దో అనే మనిసికి పరువు పెంచే పని చేసేరు.” అన్నాడు దాలినాయుడు.
“మా గురువుగోరే ఎన్నిసుట్లు సెప్పినా ఇనకుండా, ఆయనొక మాట తూలినా ఒల్లకుండీవోణ్ణి. ఆయినే నాతోటి ఇసిగిపోయి, సంజీవూ, ఇంత సదూకున్నోడివి, నీకెన్నిసుట్లె సెప్పాలి, నాకేపేరూ వొద్దు, నువ్వు నాకాడ ఉండాలనుకుంతనవా, ఎలిపోతవా? అని అనీసి సికాకు పడిపోయేరు. నానూ ఇసిగిపోయినానేమో, ఆకరికి అనీసినాను, గురువుగోరూ, నాయరాలిపేరు నిలబెట్టడానికి నాను జీతం తీసుకోవట్లేదు. ఆవిడి పిలిత్తే వొచ్చినోణ్ణి కాదు. ఈ ఉజ్జోగాన్నొట్టుకొని గబ్బిలం లాగ ఏలాడే ఉద్దేశం నాకులేదు. నాకు ఏకుటుమానం ఉప్పూ అవుసరం నేదు. మీపరువూ మీకుర్చీ పరువూ నిలబెట్టడం మీకిష్టం లేన్నాడు ఈపని ఇంకెవులిచేతైనా చేయించుకొండి. నాను ఇంకొలాగ పనిచెయ్యలేను, అనీసేను. ఆయిన కూడా ఏటనుకున్నాడో, ఏటో? ఐతే అవుసరమైనప్పుడు మల్లీ పిలుత్తాను, నడిమద్దిలో నీకు ఉజ్జోగం దొరక్కపోతే అది దొరికిందాకా ఎవులికైనా చెప్పి ఇంకొక ఉజ్జోగం చూసీదా? అనీసేడు. అప్పటికి ఐదేల్లూ ఐపోడానికి ఆర్నెల్లు ఉందనుకో. నానూ అనీసినాను. గురూగోరూ, నాను మీకాడ సదువుకున్నోణ్ణి. దయా దర్మం ఉజ్జోగాలు నాకెందుకు? ఉజ్జోగం లేకపోతే ఇంట్లో తొంగుంతను. మాయావిడ ఆపాటి కూడెట్టకపోదు. అనీసి ఆ ఉజ్జోగం ఒగ్గీసి మల్లీ సింగపూరెలిపోయేను. ఏదో కిందా మీదా పడ్డాననుకో. మాగురువుగోరు పిల్డానికి ముందు చేసే ఉజ్జోగమే మల్లీ దొరికీసింది.”
దాలినాయుడు అడిగేడు. “బాబూ, ఆ సత్తెకాలం మనిషి గద్దె దిగిపోయింతర్వాత తర్వాత ఐదేళ్ళు గడిచిపోయినట్టుంది కదా, ఇప్పుడెందుకు ఏడ్డం?”
“ఆ ఉజ్జోగం నించి వొచ్చినతర్వాత, ఎక్కడ ఉజ్జోగం చేసినా, ఆ ఐదేళ్ళూ, నేను చేసినవన్నీ గుర్తుచేసుకోని, రాసుకోని, మూణ్ణెలక్రితం పుస్తకం రాసీసేను. అందులో, ఈ నాయరాలూ, గుంటడూ కలిసి, సింహం లాటి మాగురువుగోరిని ఎలగ లొంగదీయిస్సేరో, గుంటడికి వెన్ను ముదరకపోయినా వెదురుబద్దలు కట్టీసి, కోటు తొడిగీసి ఎలాగ మసిపూసెత్తాన్నారో, మా గురూగోరిమీద ఊరకుక్కలు అరుస్తున్నా, ఎలాగ బెత్తం సూపించకుండా ఊరుకున్నారో, అయన్నీ రాసీసేను. ఆ తర్వాతే ఈ రోకటిపోట్లు. ఇదిగో, ఆపుస్తకం కూడా ఈ గేర్‌బ్రిల్ అడివిలోకెల్లినప్పుడే ఒచ్చింది.”
“పుస్తకం చూసి నాయరాలు మిమ్మల్ని తిట్టిందేటి బాబూ?”
“చంపీసేవు నాయుడూ. నాయరాలికి నాజోలికి రాకపోతేనే తక్కువ నష్టం. ఆవిడ కోప్పడితే ఆ పుస్తకంలో ఏటుందో అనీసుకొని ఎక్కువమంది జెనాలు చదివీరూ? ఆవిడి ఆఊసే ఎత్తదు. అసలకి ఆవిడికిగాని గుంటడికి గాని నామీద కోపం ఉందని ఎవ్వులిముందూ అన్లేదు. మాటకి దొరికిపోతే రాజికీయం ఎలగౌతాది?”
“మరెవులు తిట్టినారు బాబూ?”
“ఇదిగో, ఈ గేర్‌బ్రిల్ ని తిట్టినట్టే, ఇప్పటి ముచ్చమంత్రి అంటే కిట్టనోళ్ళు నన్ను తిట్టీసేరు.”
“అదేటి బాబూ. తుంటు కొడితే పళ్ళు రాలేయని సాత్రం సెప్పినట్టుంది. ఈ గేరుబాబంతే అడివిల ఆయనిచ్చిన టియ్య తాగేడు. మీరు ఈ ముచ్చుమంత్రి మొకమే సూడ్లేదు కదా? మీ పుస్తకంలో ఆయన ఊసే ఎత్తలేదు కదా?”
“అదంతే నాయుడూ. నా పుస్తకంల నేను అసలు టీ కొట్టు ముచ్చమంత్రి గురించి ఒక్కుమాటా అనకపోయినా, ఈగుంటడి గురించీ, నాయరాలు గురించీ రాసీసేను కదా. ఈకుటుమానం నడిపీ పార్టీ లాబం లేదనీసుకునీవోళ్ళు, ఇంకొక నాయకుడు కనబడకపోయీసెరికి, మళ్ళీ టీ కొట్టుకే వోటేసేత్తరు అని ఆల బాధ. అందుకని గేర్‌బ్రిల్ ని పట్టుకొని, అడివంటే ఏటో తెలీనోడు అనీసినట్టే, నన్నట్టుకొని, అచ్చరాలు రానోడు, రాజకీయంతో బతికీసీవోడు, సత్తెకాలపు మనిషి మనుసు కట్టపెట్టినోడు, ఇంటిగుట్టు రట్టు చేసీసినోడు, ఇలాగ తిట్టీసినారు.”
“బాబూ, ఆలందరూ అడిన మాటలు, నా మనుసూ ఒప్పుకోదు. మీరూ రాజకీయం చేసోళ్ళైతే, మీ గురువుగోరికి నామాలెట్టీసి, నాయరాలు పడగ కింద చేరిపోయి, గుంటనక్కల్తో కత్తు కలిపీసీవోరు కాదేటి? కాకపోతే, అదిగో, అల్లా ఇంటిగుట్టు బయటెట్టీడం మాత్రం ఎందుకో నిజం లాగుంది బాబూ? తొందరపడ్డారేటో? మీగురువుగోరిని బజార్లోకి లాగీసేరేటో? మీరేటనుకున్నా నాకనిపించీసింది చెప్పీసేను”
“అలగడిగేవు బావుంది. ఇలాగ తొలీత రాసినోణ్ణి నాను కాదు. గాందీతాత కాలంలోనే మనకొక పేద్ద నాయకుడుండీవోడు. అతడి ఇల్లూ ఆఫీసూ ఒకుటే. అతనికింద నాలాగే పనిచేసీవోడికి, రాత్రీ పొగులూ అక్కడే ఉజ్జోగం. ఆలింట్లోనే ఒకు గదిలో ఉండీపోడం. అతగాడు ఎలాటి సంగతులు రాసీసేడు అనుకున్నావు? ఆ గొప్ప నాయకుడు, రాత్తుళ్ళు ఏ ఏ ఆడమనుసులు ఉన్న గదుల్లోకి దూరిపోయీవోడో రాసీసేడు.”
దాలినాయుడు “హన్నన్నా…” అని ముక్కుమీద వేలేసుకున్నాడు
“ఆనాయకుడు దొరల్ని తరిమీసెడని పెద్ద పేరులే. ఐతేటీ!?” ఆయనకి ఒకు దొరసానితో మంచి స్నేహంలే. ఇంతనాయకుడూ, ఆ దొరసాని నోట్లో సిగరెట్టెట్టుకుంతుంటే అగ్గిపుల్ల ఎలిగించినట్టు పోటోలు బయటెట్టీసేడు. అలాటి పుస్తకాలు మజ్జిన నా పుస్తకం ఏపాటి? నాను అసలు ఎవులి ఇంటి జోలికీ ఎళ్ళేలేదు. ఎంతసేపూ ఆపీసు, కాయితాలు మీటింగులు ఆగొడవలే రాసుకున్నాను. అవిటిల్లో కూడ, నాను రాసిన రాతలకన్నా గోరంగా ఆరోజుల్లో పేపర్లే రాసీసేయి. ఏటనీ? నాయరాలు, ఈ సింహం లాటి మనిసిని సర్కస్ చేయించెత్తందని, గుంటనక్కలు ఈ సింహం బొచ్చు పీకీసి ఇగటాలడుతన్నాయనీ, ముచ్చమంత్రి సంతకం ఎట్టిన కాయితాన్ని గుంటడు పర్రుమని చింపీసి ఇసిరీసేడనీ, ఫేక్ట్రీలు పెట్టివోల్లు ముచ్చమంత్రిని ఒకసుట్టు పలకరించీసి, యాపారమంతా, చిన్నదైతే గుంటనక్కల్తోటీ, పెద్దదైతే నాయురాలితోటీ మాట్లాడిసి, సివరాకరికి సంతకానికి ముచ్చమంత్రి కాడికి తెత్తన్రనీ, అతగాడు కల్లుమూసుకోని సంతకాలెట్టెత్తన్నాడని ఇలాగ రాసీసేరు. నాను ఆటన్నిటినీ ఇంకా దెగ్గిరగా చూసినా, అలాటివన్నీ పక్కనెట్టి పెద్దమనిసి లాగే రాసేను. న్యూసుపేపర్లు చదివీసి, ఆయన్ని చేవ లేనోడు అనుకునీవోల్లు నాపుస్తకం సదివితే, ఆళ్ళకి మా గురువుగోరెంత గట్టి మనిసో తెలుస్తాది.”
“అదికాదు బాబూ, పేపరోల్లంటే ఆలొక రకం మనుసులు. నాలిక్కి నరం లేనట్టే, ఆల్లు రాసీదానికి నిలకడుండదు. ఈరోజు సదివిన పేపరు రేపటికి మర్సిపోతాం. మీ పుస్తకం పది కాలాలు నిల్చిపోతాదని ఆళ్ళ బెంగేమో?” దాల్నాయుడి అంచనా శక్తికి సంజీవ్ బావురు ఆశ్చర్యపోయేడు.
మళ్ళీ దాలినాయుడే అడిగేడు, “బాబూ, గేరుబాబుకి దైర్నెం చెప్పి, మీరూ అలగే బాదపడతారేటి?”
“నాబాధ జనాలు తిట్టూకుంటునారని కాదు నాయుడూ. పుస్తకం వొచ్చిన కాణ్ణించి, మా గురువుగోరు నన్ను కన్నెత్తి సూడ్డం లేదు, పన్నెత్తి పలకరించడం లేదు. మొన్న ఆయిన ఒకలింట్లో పెల్లికెల్తే, పెల్లిపెద్దలు నన్ను సరింగ పిలకపోయినా, మా గురువుగోరికి నమస్కారం ఎడదామని ఎల్లేను. ఆయన పక్కన కూకోని పలకరించినా నానెవులో తెలీనట్టే మొకం తిప్పీసుకున్నారు. ఆయినదెగ్గిర నాకు సిగ్గేటి అనీసి, గంటలోనే మూడుసుట్లు ఆయిన కాడ కూకుంతె, ఆయిన పెల్లి మజ్జిలో ఇంటికెలిపోయేరు. పిలవని పేరంటకానికెళ్ళి అక్కడ పెద్దమనిసిని పెల్లిమజ్జిలో ఎలిపోయినట్టు చేసీసెనని నలుగురూ సెవులు కొరికీసుకున్నారు. మా గురువుగోరు నాముకం సూడనంత తప్పుచేసీసేనా. ఇలగ చేసీకన్నా నలుగురిలో నన్ను లెంపకాయ కొటీసినా…..” మాటలు రాక ఆగిపోయేడు.
“అదికాదు బాబూ. ఆయనేమో, నాయురాలి ఉప్పు తిన్న మనిషి. మీరు ఆయన పరువుకోసం నాయరాలి పరువుని నడివీదిలో నిలబెట్టీసేరు. నాననుకోడం ఏటంటే, మీమీద మీ గురువుగోరికి మనుసులో కోపం ఉండదు బాబూ. కాపోతే ఒక తిరకాసుంది కద బాబూ? ఈ పుస్తకం రాసింతర్వాత కూడా మిమ్మల్ని గాని ఆయన పలకరించితే, చూసినోల్లు ఏటనుకుంతరు? మీకు సాటుగా కన్ను గీటీసి, మీచేత ఆయనే పుస్తకం రాయించీసేడు అనుకోరా? ఆయనకెందుకు ఆ మాట? ఆయన్నలగ ఒగ్గియ్యండి.”
ఈలోపల మరో సారి టీలు వచ్చాయి. ముగ్గురూ నిశ్శబ్దంగా టీలు తాగారు.
‘టీ’ అయీసెరికి, అప్పలనాయుడు ఏదో ఫైలు పట్టుకొని కేంటీను వేపు వచ్చి, వీళ్ళని చూసి గదిలోకి వచ్చి. పెద్దాయనతో, “గుడ్మాణింగ్ సార్,” అని, ఇటుతిరిగి “గుడ్మాణింగ్ మిస్టర్ గేర్‌బ్రిల్,” అని చెప్పేకా, దాలినాయుడితో, “నువ్విక్కడ ఏటిసేత్తన్నవురా?” అన్నాడు.
“ఆరామాయనం తర్వాత సెప్తానులే.” అన్నాడు దాలినాయుడు.
సంజీవు బావురు, తన బ్రీఫ్ కేసులోంచి ఏవో నాలుగు పేపర్లు తీసి అప్పలనాయుడికిచ్చేడు. అప్పలనాయుడు పేపర్లు ఫైల్లో పెట్టుకొని, చెక్కు ఇచ్చాడు. అలాగే గేర్‌బ్రిల్ కి ఒక చెక్కు ఇచి, ఒక కాగితంతీసుకున్నాడు.
అప్పలనాయుడికి కాగితం ఇవ్వగానే సంజీవూ, బ్రిల్లూ, మరోసారి షేక్‌హేండ్స్ ఇచ్చి, దాలినాయుడికేసి తిరిగి, “వస్తాం నాయుడూ, నీతోమాట్లాడి తేలిక పడిపోయేం.” అని చెప్పి వెళ్ళిపోయేరు.
వాళ్ళిద్దరూ వెళ్ళగానే, దాలినాయుడు, అప్పలనాయుడిని అడిగేడు. “ఆలిద్దరికీ ఏటిచ్చేవు, ఆలకాణ్ణించి ఏటి తీసుకున్నావు?” అని.
“మనజిల్లాకోసం పదికోట్లు గవర్మెంటు సేంక్షను అడిగేం. దానికి రాతకోతలు అన్నీ అయేకా, సంజీవు బావురూ గారికి సూపించి, ఆయన చేత తప్పులు దిద్దించుకుంతే మంచిది, అని నెలక్రితం ఈ కాయితాలిచ్చేను. అతను ఇప్పుడు తప్పులు దిద్దీసి, ఇంకా బాగా రాసి నాకిచ్చేడు. నాలాగ ఆయన్ని అడిగీవోలు చాలామంది ఉంటారులే. మనవిజీనారం అని ఎంపీగోరు మొహమాట పెట్టేస్తే, ఇదిగో ఈరోజుకి చేసేడు.”
“ఒరే, మర్యేద కాదని అడగలేదు. ఎంతిచ్చేవురా?”
“ఇరవైవేలు.”
“ఏటి? నాలుగు కాయితాలికి ఇరవైవేలా?”
“మరేటనుకున్నవు? ఈనాలుగుపేజీలూ దిద్దాలంతె ఆయన తలకింద తలగడా అంతేసి పుస్తకాలు తిరగెయ్యాలి. మొత్తం సదవకపోయినా, ఒకపూట కౌకులు పడదాడు.”
“మరి ఆ గేరుబాబుకి ఏటిచ్చేవు?”
“మన ఎంపీగోరి మనవడు, మొత్తం పదిమంది కాలేజీ జతగాళ్ళతో, కలిసి అడివిల పదిరోజులు తిరగడానికీ రాత్రుళ్ళు అక్కడే ఉండిపోడానికి ఇతగాడిని తోడు రమ్మన్నారు. కుదరదు, ఒప్పుకున్న బేరాలున్నాయి అంటే, ఈరోజు ఒదియిమే, సంజీవు గోరితో ఒకమాట చెప్పిస్తే, ఒప్పుకొని ఇక్కడికి ఒచ్చేడు. లచ్చరూపాయలు అడ్వాన్సు. ఆజట్టూ, ఇతడూ మాట్లాడుకోని తారీకులు ఖాయపెట్టుకుంటారు. బయల్దేరిన్నాడు మిగిలిన లచ్చా ఆలు ఇచ్చుకుంతారు.”
దాలినాయుడికి వింతగా ఉంది. తాను మండలం ఆఫీసుకి వెళితే అక్కడ గంటలు గంటలు వెయిట్ చెయ్యాలి. అలాంటి తహసీల్దారుని గంట వెయిట్ చేయించగలిగే అప్పలనాయుడు, వీళ్ళిద్దరికీ ఇంత గౌరవం ఇస్తునాడు. వీళ్ళు తనతో కూర్చొని టీ తాగడమేకాకుండా, తనతోనే కష్టాలు చెప్పుకొని ఏడ్చేసారు కూడా. డిల్లీలో మూడు రోజులూ తిరిగి గంటస్తంబం కన్నా ఎత్తైన కుతుబ్‌మీనార్, విజీనారం కోటకన్నా విశాలంగా, దర్జాగా ఉన్న ఎర్రకోట, ఇలాటివన్నీ చూసి చూసి అవే వింతలు అనుకున్నాడు. కానీ, వీళ్ళిద్దరూ, తమవృత్తులకు ఇంత డిమాండు ఉన్నవాళ్ళు, ఇంత చదువుకున్నవాళ్ళు, ఇన్ని దేశాలు తిరిగినవాళ్ళు కూడా ఇలా ఏడవడం అతడికి వీటన్నింటికన్నా పెద్ద వింతలా ఉంది.
Papam valla valla badhalu, valla uddhesyalu goppa goppa vallatho panchukuni malli evarichetho matalu padadam kanna, eami theliyani Dhalinayudu tho panchikovadam valla vaalla manasulo bharam thagginchadam Rachayitha gari manasutho alochisthey chalaa sababu ga anipinchindhi. Thank you so much Ravi sir for giving me access to read this story.