గొప్పోణ్ణవటానికి దగ్గిర దారేది గురూ?

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 4]

సీ|| వెలిసిన గోడపై వేసిన మసకలు
గమ్మిన బొమ్మలు కదిలి నట్లు

తోచు మార్మిక చిత్రతోరణాలు! తెగ వే
ధించెడి మనను బాధించెడి గత

కాలపు గాయాల్ని కళ్ళకు మరల మ
రల చూపించెడి హర్రరులు! హుషారు

లను పెంచు ఫాంటసీలు! చదివి చూడవోయ్
మమ్మల్ని తెలుసుకో మనసు మర్మ

 

తే|| మంటు చాలెంజి విసిరేటి పజిలు గళ్ళు!
మనసు భాషను తెలిపేటి మార్మికాల
లెక్క తేల్చేటి పదనిధులు*! గహనాలు!
నిదర చెట్టుకు పూసేటి విరులు- కలలు!!

______________________________
* పదనిధులు = Vocabulary (list of key words)
______________________________________

ఉపోద్ఘాతం:

విజయవాడ లయోలా కాలేజిలో చదివుకునేటప్పుడు నేనూ మా ఫ్రెండూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నాం. మా కాలపు కుర్రాళ్లకి ఘంటసాల ఇంకా టచ్ లోనే వున్నాడుగా, వాడు హఠాత్తుగా ఒక ఘంటసాల పాట యెత్తుకున్నాడు, “బ్రతుకంత బాధగా కన్నీటి ధారగా” అని. వెంటనే దానికి జవాబుగా  నేను, “బ్రతుకూ కన్నీటి ధారలలోనే బలి చేయకూ” అని యెత్తుకున్న.

తెగ నవ్వుకున్నాం.

సినిమా పాటలు రాసేవాళ్ళు యే మూడ్లో వుంటే ఆ మూడ్ కి పనికొచ్చే పాట రెడీగా వుంచారు. బహుశా ఆ రెండు పాటలూ ఒకడే రాసినా ఆశ్చర్యపోనక్కర లేదు గదా! కొన్ని పాటలయితే బహురూపుల మాదిరి ఒకే పాట యే మూడ్ లో వుంటే ఆ అర్ధానికి పనికొస్తాయి. అలాంటివాటిలో ఒకటి, “ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నం” – అదే యేడుపు పాటా, అదే వోదార్పు పాటా అవుతుంది మరి!

కవిత్వంతో పని లేని వాళ్ళు బండిచక్రంతో పోలుస్తారు కాలాన్ని, తిరుగుతూ వుంటే పై ఆకు కిందకీ కిద ఆకు పైకీ వస్తాయని.కానీ నాకు ఈ పోలిక తప్పనిపిస్తుంది, యెందుకంటే రిపీట్ అవుతున్నవి సన్నివేశాలు కాదు, మన భావాలు మాత్రమే!ఒకసారి తప్పు చేసేశాక దిద్దుకోవటం అసంభవం, ఫలితాన్ని అనుభవించటమే శరణ్యం. స్ప్రింగు పై నుంచి చూస్తే సర్కిల్ లాగ కనపడినా పక్క నుంచి చూస్తే యే రెండు పాయింట్లూ కలవవని.

మనిషి బతుకూ అంతే! ఒకసారి చేసిన తప్పుని దిద్దుకోవటం కుదరదు – పరిహారం చెల్లించుకోవటమూ తప్పదు. గతంలో చేసిన తప్పులకు యేడుస్తూ కూచున్నా ముందు కెళ్ళలేం. ఇతర్లు చేసిన తప్పుల నుంచీ వాళ్లకి తగిలిన దెబ్బల నుంచీ నేర్చుకోవటం ద్వారానే మనం తప్పులు చెయ్యకుండా ఉండగలుగుతాం. అన్నీ మన స్వానుభవం మీదనే నేర్చుకోవడమంటే ’నిప్పు కాలుతుందిరా’ అంటే చెయ్యి పెట్టి చూసి తెలుసుకుంటాననడంలా వుంటుంది!

గడపలకి పసుపు రాయడం నుంచి బొడ్డుతాడు దాచటం వరకూ మన పెద్దవాళ్ళు యెంతో అనుభవసారాన్ని మన కందించారు. కానీ యేమి లాభం? నపుంసకుడికి లావణ్యవతిని కట్టబెట్టినట్టుంది ఇవ్వాళ్టి పరిస్థితి! యెప్పటికప్పుడే యెప్పటిదప్పుడే అనే ధోరణి పెరిగి ఒకప్పుడు యేం జరిగింది, దానివల్ల ఇవ్వాళ్టి మనం యెలా ప్రభావితుల మవుతున్నామో తెలిస్తే గదా ఇవ్వాళ మనం చేస్తున్న పనుల వల్ల మన తర్వాత తరం వాళ్ళ బతుకులు యెలా ప్రభావిత మవుతాయో తెలిసేది?

అందుకే మనవాళ్ళు మానవజాతి మనుగడని ప్రవాహం తో పోల్చారు. నిన్నా నేడూ రేపూ ల మధ్యన చక్కని సమన్వయంతో సాగే ఆ ప్రవాహం దారిలో ఊసర క్షేత్రాలు పెరగడం తో కొంచెం బలహీన పడింది.

దేశ చరిత్రలోని కొన్ని అనివార్యతలు:

ఈ దేశ చరిత్రలోని కొన్ని అనివార్యతలు నన్ను చాలా బాధ పెడుతున్నాయి .అనివార్యత అంటే ఒకటి – ముఖ్యంగా హాని చేసే దుస్సంఘటన – జరగబోతుందని తెలిసినా ఆపలేని నిస్సహాయత!

యెందుకొస్తుంది?

ఒకటి మనకి హాని కలిగిస్తుందనీ దాన్న్ని వొదిలేస్తే మంచి జరుగుతుందనీ తెలిసినా సరే వొదలకుండా గట్టిగా పట్టుకుని ఒక  విధ్వంసం యెదురయ్యే వరకూ అకర్మణ్యంగా వుండిపోతున్నాం. మొదటిసారి జరిగినప్పుడు దాని నుంచి నేర్చుకుంటే రెండవసారి జరగకుండా ఆపవచ్చు. కానీ నేర్చుకునే చురుకుదనం మనలో లేనట్లుంది?!

దారా షికో – గొప్ప పండితుడు, సజ్జనుడయిన ప్రభువు.మన భారతీయ సాంప్రదాయం పట్ల గౌరవాదరాలు వుండి మన సాహిత్యాన్ని పారసీ భాషలోకి తర్జుమా చేసి ప్రపంచాని కందించాలని కలలు గన్న దార్శనికుడు.

ఔరంగజేబు – ఈ దేశాన్ని యెంత దుర్మార్గమయిన పధ్ధతిలో నైనా సరే తనకు నచ్చిన మతానికి అంటుగట్టాలని చూసిన సంకుచిత మనస్తత్వం గలవాడు.

వీరిద్దరి మధ్యనా అధికార మార్పిడికి పట్టిన ఆ అయిదు నిముషాల కాలం హిందువులూ ముస్లిములూ అన్యోన్యంగా కలిసి వుండి వుండేవాళ్లేమో అని అనుకోవాల్సిన జరగని భవిష్యత్తు నుంచి ఇవ్వాళ మనం చూస్తున్న ఈర్ష్యా ద్వేషాలతో రక్తపుటేరులు పారించుకుంటున్న పరిస్థితి దాపరించింది!?

మొగలాయీ వంశంలో తండ్రి నుంచి కొడుక్కి అధికారం రావటం కూడా కుట్రలతోనూ కుహకాల తోనూ రక్త సంబంధీకుల్ని కూడా కత్తికి బలిచ్చి కూడా యేమాత్రమూ పశ్చాత్తప పడని విధంగా జరిగింది. యెంత పరమ శాంతంగా అధికారంలోకి వచ్చినా దారా అతని తమ్ముడైన  ఔరంగజేబు చేసిన మోసపు యుధ్ధంతో చరిత్ర చెత్తబుట్టలోకి క్రూరంగా విసిరివెయ్యబడ్డాడు!

దారా సైన్యంలోని ఒక వ్యక్తిని కొనేశాడు, తక్కువ సైన్యంతో యుధ్ధానికి వచ్చి వెనక్కి తిరిగి పారిపోతున్నాట్టు నటించాడు. ఈలోపు పాదుషా సైన్యంలోని అతని పావు “ప్రభూ, తమరు గజం మీద నుంచి కన్నా అశ్వం మీద నుంచి అయితే మరింత చురుగ్గా కదలగలరు” అనడంతో అమాయకంగా హౌడా మీద నుంచి దిగాడు. సమయం కోసం చూస్తున్న ఔరంగజేబు పాదుషా వోడిపోయి వెనక్కి తిరుగుతున్నాడని హడావుడి చేశాడు.

అంతే! ఓడిపోతున్నామనుకున్న సైన్యం హుషారుగా రెచ్చిపోయింది, గెలుస్తున్నామనుకున్న సైన్యం దిగ్భ్రాంతితో చతికిల బడింది – ఫలితం తారుమారయింది! కేవలం కొన్ని మొహిరీల అదనపు సంపాదన కోసం అనామకుడైన ఆ లంచగొండి సైనికుడు  చేసిన పని భారతదేశ చరిత్రని యెంత వూహించని మలుపు తిప్పిందో చూశారుగా! ఇవ్వాళ రక్షణ శాఖ లోని వున్నతాధికారులే అవినీతికి పాల్పడుతున్నారని తెలుస్తుంటే దేశ భవితవ్యం గురించి నిర్భయంగా వుండగలమా?

దారా షికో ఆస్థానంలో కవిగా తెలుగువాడైన పండిత జగన్నాథ రాయలు వుండేవాడు. దారా షికో పతనం తర్వాత ఢిల్లీ వొదిలి దేశాటనలో కాలం గడిపాడు. కథలు, కావ్యాలు రాయలేదు గానీ ఇతని వ్యంగ్యవైభవం అసామాన్యం! అతనిలా అంటాడు –

“ఓ గాడిదా! రోజంతా బట్టల మూటలు మోసి వీపు విరగ్గొట్టుకుని ఈ గుగ్గిళ్ళు తినడం దేనికి? రాజుగారి అశ్వశాలలో హాయిగా విందు భోజనమే చెయ్యవచ్చు గదా! కాపలావాళ్ళు గుర్తు పట్టి తంతారు గదా అంటావా, అక్కడ నూటికి తొంభయ్ శాతం మంది గుర్రానికీ గాడిదకీ తేడా తెలియని వాళ్ళే వుంటారు. మిగిలిన ఆ పదిమంది మాటా రాజుగారి దగ్గిర చెల్లదు.”

అప్పటి రాజస్వామ్యంలోనూ ఇప్పటి ప్రజాస్వామ్యంలోనూ పరిస్థితి ఒక్క లాగానె వుంది కదా, యెంత మందకొడి తనం? అనివార్యతలన్నీ విషాదాన్నే మోసుకొస్తున్నాయని తెలిసినా ఇప్పటికీ చిన్న చిన్న వాట్ని కూడా ఆపలేకపోవడానికి మందకొడి తనమే కారణం కదా!

మెరుపులా మెరిసే వెళ్ళిపోయే గొప్పవాళ్ళు

అయితే ఇంత మందకొడిగా బతికే అసంఖ్యాక ప్రజల మధ్య నుంచి అప్పుడప్పుడూ తమ జీవిత కాలంలోనే కాలాన్ని పట్టి బంధించి గుప్పిట పట్టి చరిత్రని తమ సంకల్పాని కనువుగా మలుపు తిప్పి చూపించి అనంతకాలం వరకూ నడక ఆపని వాళ్ళూ వున్నారు. వాళ్ళింకా నడుస్తూనే వున్నారు, చూస్తున్నారా! వారి చిరంజీవిత్వం వెనక వున్న రహస్య మేమిటి?

బ్రహ్మ రహస్యమేమీ లేదు.

వాళ్ళొక కలగన్నారు దాన్ని కష్టపడి నిజం చేసుకున్నారు. అంతే!

కాలం తెలియని ఒక స్థలంలో పరమ పురుషుడు పుట్టీ పుట్టగానే తన చుట్టూ వ్యాపించి వున్న యేమీలేనితనం చూసి బోరు కొట్టి ఒక 3D బ్రష్ ని కదిలించి ఈ అనంతకోటి విశ్వాల్నీ సహస్రాధిక భాను మండలాల్నీ యేది కిందో యేది మీదో తెలియని విశ్వ ఘనంలో “మునగానాం…తేలానాం” అంటూ వేలాడుతూ కదులుతున్న పాలపుంతల్నీ బృహత్తారల్నీ సృష్టించుకున్నాడు – తన ఆనందం కోసం! అనేకానేక జీవరాశుల్నీ సృష్టించాడు – చంపుతూ,పుట్టిస్తూ, యేడిపిస్తూ, నవ్విస్తూ – కాలక్షేపం చెయ్యడానికి!

అంతా అయిపోయాక బ్రష్ పక్కన పడేసి తీరిగ్గా చూస్తే యెక్కడో యేదో కనబడీ కనబడకుండా దాక్కున్నట్టు అనిపించింది! తనే సృష్టించుకున్న బ్రహ్మాండమంతా కలయదిరిగినా ఫలితం లేకపోయింది, విసుగెత్తి తన బదులుగా వెతకడం కోసం మనిషిని సృష్టించాడు!

తనకు మాత్రమే ప్రత్యేకమయిన సృజించే శక్తినీ అమరత్వాన్నీ తప్ప తనకున్న అన్ని శక్తుల్నీ – ముఖ్యంగా కనిపించిన దాన్ని బట్టి కనిపించని దాన్ని చూడగల బుధ్ధి చాతుర్యాన్నీ యేది చేయందగు నేది చేయందగదనే విచక్షణనీ ఇచ్చాడు. ఇచ్చి వెదకమన్నాడు గానీ అతను ఒక జీవితకాలం సరిపోదనేశాడు.

సరే, ఆ మనిషినే రెండుగా చేసి ఒక సగం నుంచి  ఆడ మనిషిని కూడా సృష్టించి వాళ్ళిద్దరికీ పెళ్ళి చేసి ఈ భూమి మీదకి దించాడు. ఆ లోపాన్ని సరి చెయ్యగలిగిన వాడికి తన సృజించే శక్తితో సహా అన్నీ ఇచ్చి తనంతవాణ్ణి చేస్తానని హామీ ఇచ్చాడు! సంతానం అయితే తామరతంపరగా పెరిగింది గానీ నూటికి తొంభయ్ శాతం మందకొడిగా తిరిగే వాళ్ళే. కేవలం పదిశాతం మందే భగవంతుడు విసిరిన ఛాలెంజిని టేకప్ చేశారు. “యేమీలెనితనం నుంచి వచ్చిన ఈ కనిపించే దాంట్లో యేది కలిస్తే పరిపూర్ణత్వం సిధ్ధిస్తుందో అది యేది?” అనే వెతుకులాటలో జీవితాల్ని అన్వేషణకి అంకితం చేశారు. అసలైన దైవత్వం సిధ్ధించలేదు గానీ కొసరుదైన అమరత్వం సిధ్ధించింది!

మీరూ ప్రయత్నించండి

మీరూ ప్రయత్నించండి. నేనూ ఖాళీగా వుండన్లెండి. దేవుడితో సమానం అయ్యే ఛాన్స్ వొదులుకుంటామా చెప్పండి! వెతుకుదాం…వెతుకుదాం…వెతుకుదాం – అలిసిపోతే నిదర పోదాం. ఆ నిదరలో ఒక కలొస్తుంది. ఆ కల, పైన చెప్పినట్టు – హర్రర్, ఫాంటసీ, పజిల్, క్లూ వర్డ్ – యెలా అయినా వుండొచ్చు! పీడకల వచ్చి వులిక్కిపడి లేచినా యెంత సేపు మేలుకుని వుండగలం? అదృష్టం ఈడ్చి తన్నే ఒక క్షణంలో వచ్చే కల మన లక్ష్యాన్ని కళ్ల ముందు బొమ్మ కట్టిస్తుంది.ఆ కల వెంట పయనమయితే మనమూ చరితార్ధుల మవుతాం?!

“గొప్పోణ్ణవటానికి దగ్గిర దారేది గురూ?”

“అర్జెంటుగా ఒక మంచి కల గనెయ్యటమే శిష్యా!”

*****

telugu podcasts from aavakaaya

Your views are valuable to us!