రచన : బులుసు వేంకటరమణయ్య
ప్రచురణ: బుక్‍మన్స్
గమనిక: కాపీరైట్ హక్కులు పుస్తక ప్రచురణకర్తలవి. |
దివాను జగన్నాథ రాజు గారు తన దగ్గర నున్న కాగితాలను చూచుకుంటూనే, ఎదుట కొంచెం దూరంలో చేతులు కట్టుకుని నించుని వున్న దరఖాస్తుదారుని మనవిని వింటూ వున్నారు.
‘మహాప్రభువులు కరుణించాలి! చాలా బీదబ్రాహ్మడిని, పెద్ద కుటుంబం. ఏ ఆధారమూ లేదండి, ప్రభువుల అనుగ్రహం తప్ప! ఏదన్నా వుద్యోగం ఇప్పించి, యీ కుటుంబాన్ని పోషించాలని ప్రార్థన.’ అని ఎదుట నించుని వున్న సోమనాథం వినయ విధేయతలతో మనవిచేశాడు.
దివాను సోమనాథంవైపు దృష్టి మరల్చి ‘ఏమయినా ఖాళీలుంటే నువ్వింత బతిమాల నక్కర్లేదయ్యా! మా సంస్థానం పనీ జరగవసిందేగా! అయితే నేమీ? ఇప్పుడే మిన్నీ ఖాళీ లేవు’ అన్నాడు.
సోమనాథం చేతులునులుపుకుంటూ ‘చిత్తం, చిత్తం! ప్రభువులు తలుచుకుంటే ఏ ఖాళీ అన్నా వస్తుంది. ఈ బీదకుటుంబం వొక్కటి పోషించడం ప్రభువులకి ఒక లెక్కలోది కాదు’ అన్నాడు.
దివాను నిదానించి చూస్తూ ‘నీ గోడు నువ్వు చెప్పడం సబబుగానే వుంది. కాని నేను తలుచుకుంటే యే ఖాళీ అయినా వస్తుందనడం సరిగా లేదు. నీకు ఖాళీ కావాలంటే ఎవర్నయినా బర్తరఫు చెయాలన్నమాట! నీలాంటి బీదవాడి కుటుంబం పొట్టమీద కొట్టాలన్న మాటా కదూ! విజయనగరం సంస్థానంలో అలాంటి పని యెన్నటికీ జరగదు’ అన్నాడు.
సోమనాథం గడగడలాడిపోయాడు. “చిత్తం, చిత్తం! మరొకరిని బర్తరఫుచేసి, ఆ పని నా కిప్పించాలని నేనే కోరలేదు ప్రభూ! సర్వేజనా సుఖినోభవంతు! ధర్మసంస్థానం అయిన ప్రభువుల సంస్థానంలో అలాంటిపని యెన్నటికినీ జరగదని తెలుసును ప్రభూ! తమరు తలిస్తే ఏదో ఒక పని కల్పింపగలరనీ, ధర్మసంస్థానం-ఒక బీద కుటుంబం మలమల మాడిపోతూ వుంటే చూస్తూ ఊరుకోదనీ ధైర్యంతో అలా అన్నాను ప్రభూ!”
జగన్నాథరాజు గారు కొంచెం అలోచనలో పడ్డారు.
“చిత్తం, చిత్తం. నేను కొంతకాలం వక కోమటి గుమాస్తాగా పనిచేశాను. చిఠా అవర్జాలు బాగా వ్రాయగలను. ఎలాంటి లెక్కనయినా సులభంగా చేస్తాను. తికమకల్లో వున్న లెక్కలను శీఘ్రంగా చిక్కు విడదీయగలను. ఆ కోమటి, తన కుమారుడికి తరిఫీదు ఇమ్మని చెప్పి, వాడు అన్నీ గ్రహించాక నాకు ఉన్నపాటున ఉద్వాసన చెప్పాడండీ!’
“ఏవయినా ఇళ్ళు కట్టించే అనుభవం ఉందా? ఏ పనివాళ్ళకి ఎంత యిస్తే గిట్టుబడి అవుతుందో-పని లోటూ, లొసగూ లేకుండా జరుగుతుందో తెలుసా?”
“చిత్తం, చిత్తం. బాగా తెలుసునండి. మా సెట్టి గారు కట్టించిన భవంతిపని నా చేతి మీదుగానే జరిగిందండి! అణా, పైసలుతో కూడా లెక్కలు సమంగా అప్పగించే వాడిని. ఆయన చాలా సంతోషించి వక పట్టుశాలీ పంచెల చాపు బహుమానంగా ఇచ్చారండి. పని పసందుగా వుందంటూ కితాబు యిచ్చారండి.”
“సరే! ఇప్పుడు సంస్థానంవారు భీముని పట్నంలో సముద్రపువొడ్డున ఒక పెద్ద బంగళా కట్టించదలచుకుని వున్నారు. ఆ పని చేయించే పూచీ పడితే నీకు అప్పగిస్తాను. కావలసిన వస్తువులూ, కలపా మొదలైనవి తగిన ఖరీదుకి సులభంగా సప్లయి అయ్యేటట్లు మేం తాఖీదులు యిస్తాం. ఆరు నెలలు దాటకుండా బంగళా పసందుగా తయారు కావాలి.”
“చిత్తం, చిత్తం తప్పకుండా తమ ఆఙ్ఞ నెరవేరుస్తానండి. ప్రభువులు మెచ్చుకునేటట్లు చేయిస్తాను.”
“నువ్వు ఆరు నెలలపాటు ఆ పనిని చూడవలసి వుంటుంది. హోరాత్రాలు దానిమీదనే కన్ను వుంచాలి. ఏభయివేలు దాటకుండా అయేటట్లు చూడాలి. ఇది నీకు నచ్చినట్లయితే రేపట్నుంచే పని ప్రారంభించవచ్చు”
“చిత్తం, చిత్తం. ప్రభువుల ఆఙ్ఞకి వ్యతిరేకంగా చెప్పడానికి ఎవరికి సాధ్యమండి; ఏలినవారికి ఎలా తోస్తే అలా ఆఙ్ఞాపించవచ్చు.”
“సరే! సాయంకాలం కనపడు; అక్కడి ఠాణేదారుకి తాఖీదు వ్రాయించి ఉంచుతాము. నువ్వు అడిగినప్పుడల్లా అవసరమైనంత సొమ్ము అతను నీకు ఇస్తూ వుంటాడు. అక్కడి నౌకర్లు కూడా నీకు సహాయంగా ఉండేటట్టు ఏర్పాటు చేయిస్తాము.”
********
భీమునిపట్నంలో విజయనగరం మహారాజావారి బంగళా పని సోమనాథం యాజమాన్యం కింద చాలా చురుకుగా జరుగుతున్నది.
సోమన్న-అంటే-సోమనాథం తన కుటుంబంతో కూడా భీమునిపట్నం వచ్చి ఒక చిన్న యిల్లు అద్దెకు నిర్ణయించుకుని కాపురం పెట్టాడు.
రమారమి రెండు నెలలు గడచాయి.
సోమన్న యిలా శ్రద్ధగా పని చేయిస్తున్నాడు.
దివానుగారి ఆఙ్ఞ ప్రకారం అతడు పనికి కుదురుకున్నాడు; కాని ఈ పనివల్ల తనకెటువంటి లాభమో అతనికి తెలియదు. ఇంత జీతం యిస్తామని దివానుగారు సెలవివ్వలేదు; ఇంత ఇయ్యాలంటూ సోమన్నా అడగలేదు.
రెండు నెలలు కావచ్చినా ఒక నెల జీతమయినా అందక చాలా ఇబ్బందిపడుతున్నాది ఆ బీద కుటుంబం! బంగళా పని నిమిత్తం సోమన్న చేతిలో వేలకొద్దీ డబ్బు ఆడుతూ వుండేది. కాని అందులోంచి ఒక దమ్మిడీ కూడా అతను ముట్టడు. అలా తీసుకోవడం ద్రోహం చేసినట్లని అతని భావన.
రెండు నెలల జీతమూ ఒక్కసారిగా వస్తుందనీ, ఆ విషయమై దివానుగారికి యాదాస్తు పంపడం మర్యాద కాదనీ సోమన్న అనుకున్నాడు. కుటుంబం అవసరాల కోసం చిల్లర అప్పులు చెయ్యవలసి వచ్చింది.
రోజులపైని రోజులూ, వారాల మీద వారాలూ, నెలల మీద నెలలూ గడచిపోతున్నాయి. బంగళా పని చాలా చురుకుగానే జరిగిపోతున్నాది. కాని సోమన్నకు మాత్రం జీతంలో వక దమ్మిడీ కూడా అందలేదు.
అతను మనస్సులో చాలా కష్టపడ్డాడు. అయినా ఎవ్వరితోటీ యీ సంగతి చెప్పడం లేదు. బంగళా పూర్తి అయాక మొత్తమ్మీద సొమ్మంతా ఒక్కసారిగా ఇవ్వవచ్చని అనుకున్నాడు.
నిత్యఖర్చులకోసం అతను తన దర్భముడి ఉంగరాన్నే కాకుండా, భార్య మెడలోని మంగళసూత్రాల దగ్గరనుంచీ అమ్మవలసి వచ్చింది. ఆ యిల్లాలు పసుపుకొమ్ము మెడలో కట్టుకోవలసి వచ్చింది.
*********
బంగళా పసందుగా తయారయింది.
ఈ సంగతి సోమన్న దివాన్‌జీ సాహేబు వారికి తెలియజేశాడు.
అయిదు నెలలకే అంత పెద్ద బంగళా పూర్తి కావడం దివానుగారికి చాలా సంతోషం కలిగించింది. ఆ మర్నాడే ఆయన బంగళాను చూడడం కోసం భీమునిపట్నం వచ్చారు.
సోమనాథం దివానుగారిని బంగళా నాలుగు మూలలకీ తీసుకుని వెళ్ళి, తాను ఏ విధంగా ఏ పని చేయించినదీ వివరించి చెప్పాడు. దివానుగారు మనస్సులో చాలా సంతోషించినా, బయటికి ఏమిన్నీ ఉబకడం లేదు.
అమాంబాపతులు ఎంత అయిందీ ఆయన సోమన్నను అడగనూ లేదు ; సోమన్న తనంతట చెప్పడానికన్నా ఆయన అవకాశమూ యీయలేదు.
రెండు మూడు రోజుల్లో లెక్కలతోపాటు విజయనగరం రావలసిందంటూ ఆయన తాఖీదు మాత్రం యిచ్చాడు. తన జీతం సంగతి యేమిన్నీ ఎత్తుకోనన్నా లేదు. అది సోమన్నకి చాలా కష్టం అనిపించింది. విజయనగరం వెళ్ళీనమీదట తన సంగతంతా మనవి చేద్దామని మనస్సులో నిశ్చయించుకున్నాడు.
దివానుగారు వెళ్ళిపోయారు.
ఆయన ముభావం సోమనాథానికే కాకుండా, అతని మీద అభిమానం వున్న మరికొంతమందికి కూడా కష్టమని అనిపించింది.
అప్పటికపుడే ఆ వూరిలో కొన్ని వదంతులు పుట్టి నాలుగు మూలలకీ అల్లుకున్నాయి. సోమనాథం తగిన మర్యాదలు జరపడం లేదనీ, అందుకనే దివానుగారు ముభావంగా వున్నారనీ కొందరనుకున్నారు.
బంగళా పని ఆయనకు సుతరామూ నచ్చలేదనీ, అందుకోసమే తగిన సంజాయిషీ యివ్వడానికి విజయనగరం రావాలంటూ తాఖీదు చేశారనీ మరో పక్షంవారి అభిప్రాయం.
సోమనాథం చాలా డబ్బు కాజేశాడని దివానుగారి అనుమానమనీ, అందుకోసమే లెక్కలతో హాజరు కావాలని అన్నారనీ మరికొందరి ఊహాగానం.
ఇవన్నీ సోమనాథం చెవి సోకినాయి. అతని ధైర్యం కొంత సడలింది. మనస్సు పరిపరి విధాల పోయింది. ఏమి నిశ్చంచుకొనడానికీ సాధ్యం కాలేదు. ఇంతకూ తనకు రావలసిన జీతము రాదేమో అనే పెద్ద అనుమానం అతని మనస్సులో ప్రవేశించింది.
తానూ, తన కుటుంబమూ మలమల మాడుతూ, ఎంతో విశ్వాసంతో పనిచేస్తే వచ్చిన ప్రతిఫలం యిదా? అంటూ మనస్సులో సోమనాథం క్రుంగిపోయాడు.
*********
సోమనాథం జంకుతూ, జంకుతూ దివాన్‌జీవారి కచేరీ సావిట్లో ప్రవేశించాడు.
అక్కడ దివానుగారొక్కరే ఏవో కాగితాలు చూసుకుంటున్నారు. సోమనాథాన్ని చూసి, అతను వణుకుతూవున్న చేతులతో చేసిన నమస్కారాన్ని అందుకుని, కూచోమని సంఙ్ఞ చేశారాయన.
కాని సోమనాథం కూర్చోకుండా నిలిచియే ఉండి, దివానుగారి నోటినుంచి ఏ వాక్యాలు వెలువడతాయో వినడానికి వున్నాడు.
దివానుగారు సోమనాథం వేపు నిదానించి చూశారు.
ఇనాళ్ళ నుంచీ అతను పడుతూ వుండిన శ్రమ అతనిలో మూర్తీభవించి వుంది; చాలా చిక్కిపోయాడు కూడాను. అతని ముఖం మీద నిరాశ తాండవిస్తున్నాది.
దివాను జగన్నాథరాజుగారు సంగతంతా గ్రహించారు. ఇదివరకు కూడా ఇతరుల వల్ల సోమనాథం స్థితిగతులన్నీ విని వున్నారు.
“సోమనాథం! ఆ లెక్కల కాగితాలు యిలా ఇచ్చి నువ్వు ఆ బెంచీ మీద కూచుని, కాస్త విశ్రాంతి తీసుకో.”
“చిత్తం, చిత్తం” అంటూ సోమన్న కాగితాలు అందించి, జంకుతూ బెంచీ మీద కూలబడ్డాడు.
ఆ లెక్కలు చూసి దివానుగారు ఆశ్చర్య పడ్డారు!
ఏభయివేల పైచిలుకు ఖర్చు కాగలదనుకున్న బంగళా పాతికవేల తోటే తయారయినట్లు లెక్కలు స్పష్టంగా కనబడుతున్నాయి.
“సోమనాథం! బంగళా ఎంతలో కావాలని మొదట చెప్పి వున్నామో ఙ్ఞాపకం వుందా ?”
“చిత్తం, చిత్తం, యాభై వేలన్నట్లు గుర్తు.”
“అయితే యీ లెక్కలేమిటి, పిచ్చి బ్రాహ్మణుడా?” అంటూ ఆయన ఆ కాగితాలన్నిటినీ పర్రుమని చింపివేశారు!
సోమనాథునికిదేమీ అర్థం కాలేదు.
“నువ్వు బంగళాను చాలా బాగా కట్టించినందుకు చాలా సంతోషిస్తున్నాం. యాభై వేలు ఖర్చు పెట్టినా అలా ఎవ్వరూ కట్టించలేరు.”
“చిత్తం, చిత్తం. అది ఏలినవారి కటాక్షం.”
“నువ్వు చాదస్తపు బ్రాహ్మణుడవగుట చేత యిలా పిచ్చి పిచ్చిగా లెక్కలు వేశావు. మరొకరైతే యాభై వేలకీ కిట్టించి వుండరు.”
సోమనాథం ఏమీ మాటలాడలేదు.
“నువ్వు వక దమ్మిడి అయినా తీసుకోకుండా నానా కష్టాలూ పడి కాలం గడిపావు. మేము జీతం ఏదైనా ఏర్పాటు చేసి వుంటామని భ్రాంతి పడివుంటావు. ఇలాంటి వాటికి జీతం పద్ధతి ఏర్పాటులో లేదు.”
సోమనాథం నిలువునా నీరయిపోయినాడు. దివాను ఏమి అంటున్నదీ అతనికి అర్థం కాలేదు.
“అయినా, నువ్వు నిరుత్సాహపడవద్దు. ఇలా పని చేయించినందుకు నీకు తగిన ప్రతిఫలమే ముడుతుంది. యాభై వేల పనిని పాతికవేలలో ముగించి, సంస్థానం వారికి లాభం చూపించినందుకు నీకు అయిదు వేలు కట్నంగా యిస్తున్నాము.”
సోమనాథం ఆనందం పట్టలేకపోయాడు.
“నిజమే? నిజమే?” అని అతని నోటినుంచి అప్రయత్నంగా రెండు మాటలు వెలువడ్డాయి.
“నిజమే! ఇందులో అబద్ధం యేమీ లేదు. నువ్వు కంట్రాక్టరువనుకో! నీకు ఈ బంగళా కట్టించడానికి ముప్ఫయివేలకి గుత్తకిచ్చినా మనుకో. నువ్వెంత ఖర్చుపెట్టినదీ మా కవసరం లేదు. మా కోరిన పని పసందుగా ఉండడమే మాకు కావాలి. నువ్వు పాతికవేలే ఖర్చు చేస్తే-మిగిలిన అయిదువేలూ నీకు లాభం అన్నమాట!”
సోమనాథం ఏదో చెప్పబోయాడు.
“నువ్వు మరి మాటాడకు. నీవంటి చాదస్తుడిని నేనెక్కడా చూడలేదు. రేపు పొద్దున్న ముప్ఫయివేలకి లెక్కలు కట్టించుకుని రాసుకునిరా. ముప్ఫయివేలకి నీకు కంట్రాక్టుకు ఇచ్చినట్లు వ్రాసి ఉన్న యీ ఎగ్రిమెంటు మీద నువ్వు సంతకం చేస్తూ-నువ్వు పని ప్రారంభించిన తేదీ వెయ్యి. రేపు పొద్దున్న వచ్చి, ఆ కాగితాలు ఇచ్చి అయిదువేలూ తీసుకునివెళ్ళు.”
సోమనాథం కృతఙ్ఞతతో “చిత్తం, చిత్తం. ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదండీ ప్రభూ!” అని మనవి చేశాడు.
“ఇంతేకాదు, నీకు రేపటి నుంచీ యింజినీరింగు డిపార్టుమెంటులో నెలకు నలభై రూపాయీల మీద వుద్యోగం ఇవ్వడానికి యేర్పాటు చేయబడింది.”
సోమనాథం ఆనందంతో ఆకాశం అందుకున్నాడు.