గజపతుల నాటి గాధలు – గెలుపు

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 3.5]

రచన : బులుసు వేంకటరమణయ్య

ప్రచురణ: బుక్‍మన్స్

గమనిక: కాపీరైట్ హక్కులు పుస్తక ప్రచురణకర్తలవి.

 

అవి జగన్నాథరాజుగారి హయాం నాటి రోజులు.

పెనుమెత్స జగన్నాధరాజు గారి పేరు వింటే పిట్టలు కూడా నీళ్ళు తాగేవి కావు. ఆయనది సుగ్రీవాజ్ఞ. విజయనగర సంస్థానం పొలిమేరలో ఆయనకి అణగివుండని జీవం లేదు.

ఆయన ధర్మమూర్తి. మాట కొంత దురుసుగా వున్నా పది కుటుంబాలను నిలబెట్టే మార్గం వెతకడమే ఆయన ఆలోచన.

ఆయన చెడి బతికిన వాడు! మొదట చాలా స్వల్ప నౌఖరీలో ప్రవేశించి తన బుద్ధి చాకచక్యం వల్ల పై పదవులకి పోతూ, రోజు రోజుకూ ప్రభువుల అనుగ్రహాన్ని పొందుతూ, నాయబ్ దివానుగిరీ చెలాయించి చివరకు హెడ్డు దివానై విజయనగర సంస్థానాన్ని ఆయన ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. ఇతని హయాములో ప్రభువులకు రాజ్య కార్యాలను గురించిన ఆలోచనే అక్కరలేకపోయేది.

చదివినది ప్రయిమరీ అయినా ప్రతిభాశాలి కావడం చేత అతడు రాజ్యతంత్రప్రవీణు డయ్యాడు. విద్యాధికులకున్నూ దుర్లభమైన గొప్ప మర్యాదా, పలుకుబడీ సంపాదించాడు.

ఆంగ్లభాషా వాసన ఆయనకు అణుమాత్రమూ లేదు. ఒకప్పుడు మద్రాసులో వుండే గవర్నరు విజయనగరం వస్తున్నాడని తెలిసి, ఆయనకు ఘనంగా స్వాగతం యివ్వడానికి అత్యద్భుతంగా ఏర్పాట్లన్నీ చేశాడు. గవర్నరు గారితో మాట్లాడ్డానికి ఇంగ్లీషు రావాలి కాబట్టి, దాన్ని కొన్ని దినాల పాటు అభ్యాసం చేశాడు. తన ఏర్పాట్లను చూచి మిక్కిలి సంతోషించి, అభినందించిన ఆ పాశ్చాత్య ప్రభువుతో “What make is my make? Your honourable make is a make” అని, ఆయనకు నవ్వు కలిగించాడట. “మాలాంటి వాళ్ళం ఏమి చెయ్యగలమండి! మీవంటి ప్రభువులు చేసేదే చేత” అని దీని అభిప్రాయమట! ఆ మాట ఇప్పటికీ జనుల్లో మాసిపోలేదు. ఆయన ఆంగ్లభాషా పరిజ్ఞానం అంతమాత్రం.

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
చదువుకీ, తెలివితేటలకీ అట్టే సంబంధం లేదని అతని అభిప్రాయం. అంతేకాదు, చదువురాని వాళ్ళనీ, తెలివి తేటలు లేనివాళ్ళనీ కూడా ఆయన నిరసించి యెరగడు. ఏ విషయంలోనైనా, తమకు శక్తి వున్నదని గర్వించినవాళ్ళకు తగిన ప్రాయశ్చిత్తం చేసేవాడు కూడాను. బుద్ధి చాతుర్యం, విద్యల సంగతీ యెలా వున్నా మనుష్యుడై పుట్టిన ప్రతివాడున్నూ సుఖంగా జీవించి తీరాలనే అతని సిద్ధాంతం! అందుకనే – సంస్థానంలో పనిచేతకాని వుద్యోగులు వున్నా, వాళ్ళ పొట్ట మీద ఎన్నడూ కొట్టేవాడు కాడు.

ఒకసారి కొందరు గుమాస్తాలు ప్రభువువారికి ఒక మహజరు వ్రాసి పంపుకున్నారట. అది చాలా అవక తవకగానూ, అసభ్యంగానూ ఉండినాయట. తక్కిన కాగితాల మధ్యవున్న అది యెలాగో మహారాజులుంగారి కంటపడింది. ప్రభువులు దాన్ని ఈయనకు చూపిస్తూ – “మన సంస్థానంలో యిలాంటి ఉద్యోగస్థులే కదూ వున్నారు?” అని అడిగారట. ఈయన చేతులు జోడించుకొని “ప్రభూ! అందరూ ఒక్కలాంటి వాళ్ళే వుండరు. ఎవరెలాగున్నా మన సంస్థాన వ్యవహారాలు సక్రమంగానే జరిగిపోతూ ఉన్నాయి. జమాబందీ నిలిచిపోలేదు” అని సమాధానం చెప్పాడట. తిరిగి మహారాజులుంగారున్నూ ఏమీ అనలేకపోయారట!

మహారాజులుంగారు ఏదైనా పని సంకల్పిస్తే దివాను గారి అభిప్రాయం సాధారణంగా దానికి విరుద్ధంగానే వుండేది. అది మొదట్లో ప్రభువులకు చాలా కష్టంగా వుండేది. కాని దివాను నిదానంగా – తన అభిప్రాయమే సరియైనదంటూ క్రియారూపంలో చూపేవాడట! అప్పుడు ప్రభువులు దివాను అభిప్రాయమే సరియైనదని మెచ్చుకునే వారట. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినవి. ఈ విషయంలో ఎప్పుడూ గెలుపు దివానుదే కావడం, ప్రభువులు అభిప్రాయం మార్చుకోవడం జరుగుతూ వుండేది.

*****

రామావధానులుగారంటే శ్రౌత, స్మార్తాల్లోనూ, అధ్యయనంలోనూ అఖండుడన్న మాట! ఆ రోజుల్లో ఆ విషయాల్లో గంజాం, విశాఖపట్నం జిల్లాలలో ఆయనకు పై చేయి లేదు. అందువల్లనే ఆ వంశానికే చెందిన ఈయన సుప్రసిద్ధులైన బులుసు పాపయ్య శాస్త్రులు గారికి సరిసమానమనే పేరు కూడా వచ్చి – క్రమంగా స్వంతపేరు మరుగు పడి – పాపయ్యావధానులు గారనే పేరే వాడుకకు వచ్చినది.

రామావధానులుగారు జీవిక కోసం స్వగ్రామమైన గరికిపలస అగ్రహారం విడిచి – దానికి పదిమైళ్ళ దూరంలో వున్న పట్నం – అంటే విజయనగరం చేరుకున్నారు. వచ్చిన కొద్దికాలంలోనే రాజాశ్రయం లభించినది. తత్ఫలితంగా ఉద్యోగ సంపాదన జరిగి, మహారాజులుంగారి పురోహిత వర్గంలో ఒక స్థానం సంపాదించుకున్నారు.

రోజూ నడవ వలసిన ఔఓసనాగ్ని హోత్రాన్నీ, తదితర స్మర్త కర్మలనీ నడపడానికి యాజమాన్యం వహించారాయన.

సుస్వరంగానూ, చెవులకు ఇంపుగానూ వుండే అవధానులు గారి వేదపారాయణాన్ని అనేకసార్లు విని, మహారాజులుంగారు చాలా సంతోషించేవారు. అగ్నిహోత్రాలు సక్రమంగా జరిపించడంలో వీరి శ్రద్ధాభక్తులను మెచ్చుకునేవారు. క్రమక్రమంగా అవధానులుగారి మీద మహారాజులుంగారికి అభిమానం వృద్ధి కాసాగినది.

లక్ష్మీ కటాక్షం ఎక్కువ లేకపోయినా ఆ అభిమానమే పదివేలంటూ మురిసిపోయారు రామావధానులు గారు.

అయినా, ఆయన దరిద్రం అనుభవించలేదు. అద్దె కొంప బాధ లేకుండా, అయ్యకోనేటి తూర్పు గట్టున ఆంజనేయస్వామి దేవాలయానికి సమీపంలో విశాలమైన స్వంత యిల్లు వున్నది. చుట్టపక్కాల రాకపోకలతోను, అతిధ్యభ్యాగతుల మర్యాదలతోనూ యెప్పుడూ ఇల్లు కళకళ లాడుతూ వుండేది. ఇలా వుండడమే ఆయనకు ఎక్కువ ఆనందం.

మహారాజులుంగారికి మత విషయాలలో పట్టుదల యెక్కువ. నిత్యకర్మలు సక్రమంగా జరిగితేనే గాని ఆయనకు తృప్తి వుండదు. తాము ఎక్కడికయినా మకాముకు వెళ్ళితే అవధానులు గారిని కూడా తమతో తీసుకొని వెళ్ళేవారు.

*****

మహారాజులుంగారు భీమునిపట్నం మకాముకు వెళ్ళి వారం రోజులకు పైగా అయినది. వారు ఇన్నాళ్ళు అక్కడ వుంటారని ఎవ్వరికీ తెలియదు. అన్ని విషయాలూ తెలిసిన దివాంజీవారి కయినా ఈ సంగతి తెలియదు.

ఫలానా రోజున వస్తారని ఊహించడానికిన్నీ వీలు లేదు.

బుధవారానికి బుధవారం ఎనిమిదీ, గురువారం తొమ్మిదీ, శుక్రవారం పదీ. ఆ శుక్రవారం ఉదయం ఒక సిపాయి గబగబా దివాన్‍జీ వారి ఇంటికి పరుగెత్తి వెళ్ళి, ఆయనతో “ప్రభూ! మహారాజులుంగారు వస్తున్నారు” అని మనవి చేసాడు.

పది రోజుల దాకా మహారాజులుంగారి సమాచారం తెలియక విచారంతో వున్న దివానుగారి ముఖం సంతోషం చేత చేటంత అయినది. “నిజమేనా? ప్రభువువారు వస్తున్నారా?” అని ఆయన ఆదుర్దాగా అడిగాడు.

“చిత్తం చిత్తం. నేను పొద్దు పొడవకముందే వంతు ప్రకారం కోట ఆగ్నేయ మూల బురుజు మీద గస్తీకి వెళ్ళినాను. గస్తీ తిరుగుతూ వుండగా అరగడియ ముందే నాకు చింతలవలస మెరకల మీద రెండు జోడుగుర్రాల బగ్గీ తురుఫు సవార్లతో కాన వచ్చిందండి! ఈ సంగతి ఏలినవారికి తెలియపరచగలందులకు పరుగెత్తుకొని వచ్చానండి!” అని ఆ సిపాయి అన్నాడు.

దివానుగారి ఇల్లు కోటకు దగ్గరగా ఉండడం చేత – వాడు తిన్నగా వెళ్ళి ఆయనకు మనవి చేసాడు.

దివానుగారు తొందరగా కోటు తొడుగుకొని, తలపాగా పెట్టుకొని, కనబడిన నౌకర్లను హెచ్చరిస్తూ కోటలోకి వచ్చేరు. వచ్చి తామూ బురుజు యెక్కి చూచి, సందేహం తీర్చుకున్నారు. అప్పటికి మహారాజులుంగారి బగ్గీ కోసుదూరంలో వున్న ధర్మపురికి వచ్చింది, తురుఫు సవార్లతో కూడా. వెంటనే ఆయన హడావుడిగా అక్కడి నుంచి దిగి, అందరినీ తగిన సరంజాములో వుండాలని హుకుం చేసాడు.

కోట దేవిడీకి ముందున్న మండపాల వద్ద మామిడి తోరణం కట్టబడింది. రోడ్డుకు రెండు వైపులా అరటిచెట్లూ, పూర్ణ కలశాలూ నిలుపబడ్డవి. సింహద్వారం గోపురం మీద భజంత్రీవాళ్ళు ఢంకా నౌబత్తులూ అవీ సరిచేసుకుని, బగ్గీ కోటకు సమీపించగానే మంగళవాద్యాలు మోగించడానికి సిద్ధంగా వున్నారు. మోతీమహలు బయట ఉద్యోగస్థు లందరూ ప్రభువువారికి ఎదుర్కోలు ఇవ్వడానికి బారులు తీరి నిలిచివున్నారు.

ప్రభువులు పై చోట్లకు వెళ్ళి, తిరిగి వచ్చేటప్పుడు ఇలాగు మర్యాదా చూపడం పరిపాటి.

మహారాజులుంగారు మకాము వెళ్ళినందున – వారం అది దినముల నుంచీ వెలవెలపోతూ వున్న కోటకు ఇప్పుడు కళాకాంతులు వచ్చాయి.

తురుఫు సవార్లతో బగ్గీ కోటను సమీపించే సరికి గోపురం మీద ఢంకా నౌబత్తులు మ్రోగడం ప్రారంభమైనది. దేవీపూజ ముగించి పూజారి తీర్థ ప్రసాదాలు పట్టుకొని ఉద్యోగుల వరసకి ముందుగా నించున్నాడు. వేదపండితులు విభూతి ధరించి, శాలువలు కప్పుకొని, వేద పారాయణం ప్రారంభించారు.

బగ్గీ మోతీ మహలు చేరింది. ఉద్యోగస్తులు తమ దుస్తుల్నీ, పెదవులనీ సవరించుకుంటున్నారు. జగన్నాథరాజు గారు – అంటే – దివాను గబగబా దగ్గిరకు వచ్చి బగ్గీ తలుపు తెరచి, చేతులు జోడించుకొని నిలుచున్నారు.

బగ్గీలోచి దిగిన వారెవరూ?

మహారాజులుంగారు కారు! వారి పురోహితుడు రామావధానులు గారు.

నుదుట విభూతు పెండికట్లతో, బిళ్ళగోచి నీర్కావి ధోవతితో, మెడలో రుద్రాక్ష తావళంతో, చంకను అంగవస్త్రంతో – ఆ విగ్రహం బగ్గీలో నుంచి దిగి, ఈ ఆర్భాటం అంతా అర్థంకాక నిశ్చేష్టతతో నిలిచిపోయింది.

దివానూ కొయ్యబారి నిలిచిపోయాడు.

భోగం అంటే ఏమిటో యెరగని ఆ చాదస్తపు బ్రాహ్మడికి పదిహేను నిముషాల పాటు రాజభోగం జరిగింది.

అతడు దివాను వైపు చూచి, తడబడిన మాటలతో “మహారాజులుంగారు వెనుకనుంచి వస్తారట! ముందు నన్ను పంపించారు” అని మనవి చేశాడు.

*****

దివాను చిన్నబోయిన మనస్సుతో తనలో అనుకున్నాడు – “ఈసారి మహారాజులుంగారిదే గెలుపు! నన్ను గెలవడానికే ప్రభువులు ఈ పంగిడీ అంతా పన్నినారు” అని.

*****

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY
 

Your views are valuable to us!