గజపతుల నాటి గాథలు – కోరిక

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 4.5]

ఒకప్పుడు విజయనగర ప్రభువైన ఆనంద గజపతి మహారాజులుంగారు దివాను జగన్నాథరాజుగారితో యిష్టాగోష్టి జరుపుతూ వుండగా భక్తులను గురించిన ప్రశంస వచ్చింది. భక్తుల్లో నియమ నిష్ఠలు కలవాడు, మహా త్యాగి అయిన రుక్మాంగద చక్రవర్తిని యిద్దరూ మెచ్చుకున్నారు.

“చూశారా? నియమమూ, భక్తీ త్యాగమూ అంటే అలా వుండాలి. ఎలాంటి విషమ పరిస్థితులు వచ్చినా, ఆ మహానుభావుడు ఏకాదశీ వ్రతం మానాడా?” అన్నారు మహారాజులుంగారు.

“చిత్తం, చిత్తం. ఆ కాలంలో అలాంటి పట్టుదలా వుండేది. భగవంతుడికి అనుగ్రహమూ కలిగేది” అన్నాడు దివాను.

“చూడండీ! నేనీ ఏకాదశినాడు శుష్కోపవాసం ఉండదలచుకున్నాను. ఇది ఉత్థాన ఏకాదశి; విశేషం కూడాను. క్షీరాబ్ధి ద్వాదశినాడు తెల్లవారేసరికే పారణ చెయ్యవచ్చు. రెండువేల బ్రాహ్మణ్యానికి ఆ సమయానికే మన కందాలో సమారాధన ఏర్పాటు చెయ్యండి. అది దివ్యంగా జరగాలి.”

దివాను చేతులు నలుపుకుంటూ “చిత్తం, చిత్తం! ప్రభువులు అఙ్ఞాపించినట్లు సమారాధనకి తగిన ఏర్పాట్లు చేయిస్తాను. కాని ప్రభువుల కెప్పుడూ అలవాటు లేనందున ఉపవాసం చెయ్యట మనేది ఉచితం కాదేమో అని తోస్తుంది!” అన్నాడు.

“చేసుకుంటే సరి; ప్రతిదీ అలవాటు అవుతుంది. ఒకసారయినా వుపవాసం వుంటేనేగాని, దానిలోని కష్టసుఖాలు ఎలా తెలుస్తాయి? మరో సంగతి. ఆ మహాత్ముడు యావజ్జీవమూ తప్పకుండా ప్రతి ఏకాదశీ వుపవాసం వుంటూ వుండగా, నేనొక్క ఏకాదశి నాడయినా వుపవాసం వుండడం భావ్యం కాదా? ఏమయినా సరే! నేను వుపవాసం వుండాలనే నిశ్చయించుకున్నాను.” అన్నారు మహారాజులుంగారు.

దివాను “అయితే మంచిదే! రుక్మాంగదులవారితో పాటు ఊళ్ళో ప్రజలంతా ఉపవాసం ఉండేవారటా! ప్రభువులతో పాటు మావంటి భృత్యులం కూడా ఉండడానికి సిద్ధం!” అన్నాడు.

మహారాజులుంగా రది విని చిరునవ్వు నవ్వి వూరుకున్నారు.

దివాను సెలవు తీసుకుని వెళ్ళి సమారాధనకి తగిన యేర్పాట్లు చేయించసాగాడు.

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
 

*******

సమారాధన కోసం యేర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. మహారాజులుంగారు ఉపవాసం ఉండడం చూచి, ఆయన దయను కాంక్షించే ఉద్యోగస్తులందరూ ఉపవాసం వున్నారు,

క్షీరాబ్ధి ద్వాదశినాడు తెల్లవారే సరికల్లా పిండివంటలతో సహా పదార్థాలన్నీ సిద్ధం కావాలి. అందుకోసం తగిన పాచకులను పిలిపించి, తెల్లవారు ఝాము మూడుగంటలకే పొయ్యి రాజవెయ్యడానికి ఏర్పాట్లు జరిగాయి. మహారాజులుంగారు కూడా బ్రాహ్మణ భోజనానంతరం అక్కడే పారణ చెయ్యడానికి నిశ్చయించుకున్నందున అన్నీ మంచి పాకంలో పడేలాగు చూడాలి. అందుకోసం ఆ చుట్టుపట్ల పాక కళలో పేరు మోగిన బాపన్నావధానిగారినీ, ఆయన సహచరులనూ ఈ పనికి నియోగించారు. కాని బాపన్న గారికి యేదో అశౌచం రావడం వల్ల ఆయన రాలేనట్లుగా యేకాదశి ఉదయానికే దివానుగారికి వార్త వచ్చింది.

దివానుకు ఏమి చెయ్యడానికీ తోచలేదు. తన ప్రయత్నం అంతా చివరికి రసాభాసగా తయారవుతుందేమో అని ఆయనకి జంకు కలిగింది. ఆయన వెంటనే వాకబు చేయగా ఆ చుట్టుపట్ల సమర్థుడైన పాచకుడు లేడనీ, అనకాపల్లిలో మాత్రం బాపన్నగారికన్న కూడా సమర్థుడు భీమావధానులుగా రున్నారనీ తెలిసింది. వెంటనే దివానుగారు అక్కడికి ఒక మనిషిని పంపదలచారు.

అనకాపల్లి విజయనగరానికి చాలా దూరంగా వున్న పట్నం.

మామూలుగా నడిచి వెళ్ళాలంటే రెండు రోజులు పడుతుంది. మెయిలు మీద వెళితే మూడు గంటలకి గాని అనకాపల్లి చేరడం కష్టం! కాని ఆ కాలంలో మహారాజుల దగ్గర ఇరవై పాతిక మైళ్ళు అవలీలగా పరుగెత్తి పోగల మనుష్యులు వుండేవారు. అలాంటి మనిషిని పంపితే పన్నెండు, ఒంటి గంట కల్లా జవాబు తేగలడు. అందువల్ల అట్టి జంఘాలుడిని ఒకనిని దివానుగారు అనకాపల్లి పంపారు. ఎంత రాత్రికైనా సరే. భీమావధాన్లు గారిని తీసుకువచ్చి తీరాలని ఆఙ్ఞాపించారు! అప్పుడు ఆఖరు రైలుబండి రాత్రి పదకొండు గంటలకి వుండేదిలెండి!

మనిషి పన్నెండుగంటల లోపునే అనకాపల్లి చేరుకున్నాడు. అవధాన్లుగారి బసను సులభంగా కనుక్కో గలిగాడు. కాని, ఏం లాభం? ఆయన వూళ్ళో లేరు. గత దినమే ఆయన బంధువుల యింటికి భీమునిపట్నం వెళ్ళినారని ఆయన భార్య తెలియజేసింది.

జంఘాలుడి నడుం నటుక్కుమన్నది. ఇంతా శ్రమ పడి వస్తే భీమన్నగారు ఇంట్లో లేకపోయారు.

‘లే’రనే వార్త దివానుగారి చెవిని వెయ్యడం అతనికి ఇష్టం లేదు.

“ఎలాగన్నా సరే. భీమన్న గారిని విజయనగరం తీసుకువెళ్ళాలి; ఆయన ఎక్కడుంటే అక్కడికే వెళ్ళాలి; తప్పదు” అని నిశ్చయం చేసుకుని, ఎంత బాధ అనిపించినా లెక్క చెయ్యకుండా సరాసరి భీముని పట్నంకు పొద్దు గ్రుంకకుండానే చేరుకున్నాడు. అదృష్టావశాత్తూ భీమన్నగారు అక్కడి నుంచి మరి యే వూరూ వెళ్ళనందున బంధువుల యింటిలో దొరికారు.

దివానుగారి మనిషి విషయం అంతా పూసగ్రుచ్చి నట్లు మనవిచేసి, ఎంత రాత్రికైనా సరే విజయనగరం రాక తప్పదనీ, వస్తే మహారాజావారికీ, దివాన్‍జీ వారికీ గొప్ప అనుగ్రహం కలుగుతుందనీ, రాకపోతే వారి ఆగ్రహానికి పాత్రులు కాగలరనీ తెలియజేశాడు.

అప్పుడు జనం యింత తెలివిమీరి ఉండిపోలేదు. ప్రభువుల పోష్యవర్గంలో లేకపోయినా, అందరికీ మహారాజు గారంటే భక్తి శ్రద్ధలూ, భయమూ వుండేవి. సంస్థానం నుంచి ఏ తాబేదారు వచ్చినా, అణిగి మణిగి ఆఙ్ఞలు నెరవేర్చేవారు. ఇంతకూ యిది తప్పనిసరి అయింది; మరో నాడు చూచుకోవచ్చు ననేది కాదు.

భీమావధానులు గారు రెండు నిమిషాల సేపు అలోచైంచి “సరే! సమయానికి వస్తానని మనవిచెయ్యి” అని చెప్పి ఆ మనిషిని పంపివేశాడు.

ఆ మనిషి కూడా ఏడున్నరకాల్లా విజయనగరం చేరుకుని దివాన్‍జీ గారిని ఎలా ఎక్కడ కలుసుకున్నదీ, ఎలా ఒప్పించినదీ మనవిచేసి, పారితోషికం పుచ్చుకుని ఇంటికి వెళ్ళాడు.

*******

ఆనంద గజపతి ప్రభువు ఏకాదశి కటిక ఉపవాసం ఉన్నట్లు, తెల్లవారేసరికల్లా రెండువేల బ్రాహ్మణ్యానికి సమారాధన జరిపిస్తూ వున్నట్లు అది తన చేతిమీదుగా జరగవలసినట్లూ విని భీమావధానులు పొంగిపొయ్యాడు.

పాకక్రియలో తనకు అడ్డులేదు. ఎడమ చేతితో ఆయా సంభార ద్రవ్యాలని విసిరి పారవేసినా, పదార్థాలు అమృత సమానంగా తయారు కాగలవని అతని ధైర్యం! రాత్రి భోజనం చేశాక ఒక అంగవస్త్రంతోనూ, పైబట్ట తోనూ, చేతిలో ఒక దుడ్డుకర్ర ధరించి కాలినడకను విజయనగరం ప్రయాణమయ్యాడు. రాత్రి ప్రయాణం చెయ్యడం ఆయన కలవాటే! గొప్ప ధైర్యశాలి కావడంచేత దొంగలన్నా, జంతువులన్నా అణుమాత్రమూ భయం లేదు.

ప్రయాణం సాగిస్తూ అలోచించాడు “మహారాజులుంగారు కోరినట్లు సూర్యోదయానికల్లా అన్నీ తయారు కావడమూ, ఆయనకు సంతోషం కూర్చడమూ నిశ్చయం. ఆయన ఆనందించి “ఏం కావాలి?” అని అడుగుతారు. ఏమిటి కోరడం? ఎంతో గౌరవంగా పిలిపించిన ప్రభువులను డబ్బు కోరడం భావ్యం కాదు కదా? మరి ఏమిటి అడగడం?” అని మనస్సులో అనుకోసాగాడు.

చివరికి ఒక ఆలోచన తట్టింది!

భీమావధానులుగారికి ఒకే ఒక స్త్రీ సంతానం. సనాతన ధర్మం ప్రకారం ఆ అమ్మాయికి బాల్యంలోనే వివాహం జరిగింది. మరి కొద్దికాలంలోనే వైధవ్యం సంభవించిందా అమ్మాయికి. ఆ అమ్మాయి ‘రామా, కృష్ణా,’ అని భగవంతుణ్ణి ధ్యానించుకుంటూ పనిపాట్లల్లో తల్లికి సాయం చేస్తూ పుట్టింటిలోనే వుండిపోయింది. ఆ అమ్మాయి అంటే తండ్రికి ఎక్కువ అభిమానం.

“నాన్నగారూ! మీరు విజయనగరం వెళ్ళినప్పుడు వీలుంటే నాకు బరంపురం నారపొత్తి పంచ ఒకటి తెండి; మడిగా కట్టుకుని కొంతసేపు దైవ ప్రార్థన చేసుకోవడానికి వీలుగా వుంటుంది” అని ఒకప్పుడు అన్నదామె.

భీమన్న తర్వాత కొన్నిసార్లు విజయనగరం వెళ్ళినా అది కొనడం సాధ్యపడలేదు. ప్రశస్తమైన ఆడకట్టు పొత్తిపంచ కొనడానికి కనీసం పదిహేను రూపాయిలు కావాలి. అంత డబ్బు ఒక్కసారిగా అతని దగ్గర వుండడమూ దుర్లభమైనది. ఇప్పుడు ప్రభువులు “ఏం కావాలి?” అని కోరితే ఈ పంచె కావాలని కోరాలి. ఆ మాత్రం కోరిక మహారాజులుంగారు నెరవేర్చకపోరు.

భీమావధానులుగారు వేగంగానే అడుగులు వేస్తూ ప్రయాణం సాగించారు.

చింతవలస మెరకల దగ్గరికి వచ్చేసరికి అర్ధరాత్రి అయింది. ఆయన పెద్దరోడ్డు నుంచి, అడ్డు రోడ్డు మలుపు తిరిగేసరికి తన వెనుక ఇరవై గజాల దూరంలో ఇద్దరు మనుష్యులు వస్తున్నట్లూ, వాళ్ళు చెట్ల చాటు నుంచి వస్తున్నట్లూ కనిపెట్టాడు. ఆ యిద్దరూ దొంగలై వుంటారని నిశ్చయించి- యింకా తన్ను వెంబడిస్తే తగిన ప్రాయశ్చిత్తం చేద్దామని నిశ్చయించుకుని మెల్లిగా నడవసాగాడు. ఇంతలో వాళ్ళూ మలుపు తిరిగి వేగంగా యితని వద్దకు వచ్చారు. ఈ రోడ్డుమీద జనసంచారం వుండదని వాళ్ళకు తెలుసు. వాళ్ళిద్దరూ భీమన్నగారిని నిలువమని చెప్పి, అతని దగ్గిర వున్నదేదో అక్కడపెట్టి మరీ అడుగు వెయ్యమన్నారు.

భీమన్నకు కోపం వచ్చింది. వాళ్ళూ తనలాగే బలిష్ఠులైనా, లక్ష్యం చెయ్యక దుడ్డుకర్ర చూపుతూ “నా దగ్గర వున్నది యిది మాత్రమే! దీన్ని కిందపెట్టడమెందుకూ? మీ మీదే వేస్తాను” అని దాన్ని ఎత్తి పట్టుకున్నాడు.

ఇంతలో ఒకడు తన చేతికర్రతో కొట్టరాగా భీమన్న తన దుడ్డుకర్రతో దాన్ని అడ్డుకుని దెబ్బ తప్పించుకున్నాడు. ఆ కర్ర ఆ దొంగముఖానికే తగిలింది. ఇంతలో రెండవవాడు కర్ర ఎత్తబోగా భీమన్న వాని నడుంమీద గట్టిగా ఒక దెబ్బవేశాడు. దానితో వాడు నేలమీద కూలబడ్డాడు. ఇది చూచి మొదటివాడు పలాయనం చిత్తగించాడు.

దొంగలకు భయపడే స్వభావం కాదు భీమన్నది. ఒక వేళ పెద్ద దెబ్బ తనకి తగిలితే రసాభాస అయి, కార్యం చెడిపోతుందని, మరి వాళ్ళ జోలికి పోక, చరాచరా నడిచి ఒంటిగంటన్నర అయేసరికి కోట చేరుకుని సింహద్వారం ముందు వున్న ఒక మండపంలో ఒక గంట విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత మెల్లిగా లేచి, అయ్యకోనేటి వైపు వెళ్ళి స్నానం చేసి, మూడు అయేసరికల్లా కోటలోని కందా- వంటశాలలో ప్రవేశించాడు. అక్కడ సిద్ధంగా వున్న సహాయ పాచకులకు ఆయా పనులు పురమాయిస్తూ సూర్యోదయానికి సమస్త పదార్థాలూ సిద్ధం చేసి రెండు వేల విస్తళ్ళు వేయించాడు భీమన్న.

******

బ్రాహ్మణ సమారాధన అయాక, మహారాజులుంగారూ ద్వాదశి పారణ చేశారు.

భీమన్న పాకం నలపాక, భీమపాకాలను మించి వుందని చాలా ప్రశంసించారు.

భోజనం అయాక భీమావధాన్లను పిలిపించి “చాలా సంతోషించాం! మీకేం కావాలో చెప్పండి” అని మహారాజావా రడిగారు.

భీమన్న ముకుళిత హస్తాలతో నిలిచి “ప్రభువుల దయే చాలు. అయినా మా అమ్మాయి విజయనగరం వెళ్ళితే నారిపొత్తిపంచ ఒకటి తెమ్మని ఎప్పుడో చెప్పింది. నేటి దాకా ఆ కోరికను నెరవేర్చలేకపోయాను. ప్రభువులు అది దయచేయిస్తే చాలు. మరేమీ అక్కర్లేదు” అని మనవి చేశాడు.

మహారాజులుంగారు నవ్వుతూ దివాను మొగంవైపు చూశారు.

దివాను భీమన్నతో “సరేలెండి! అవధాన్లుగారూ! మీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఈ దక్షిణ కూడా గ్రహించాలని ప్రభువులు కోరుతున్నారు” అంటూ నూటపదార్లూ, తాంబూలమూ వెండి పళ్ళెంలో పెట్టి, భీమన్నకు సమర్పించి నమస్కరించాడు.

భీమావధాన్లు ఆనందంతో ఆకాశం అందుకున్నాడు.

భీమన్న తెలుపకపోయినా చింతవలస దగ్గర దొంగలు ఎదిరించగా, వాళ్ళకు బుద్ధి చెప్పిన సంగతి దివానుకు తెలిసింది. భీమన్న సాహసానికి ఆయన మెచ్చుకున్నాడు.

తర్వాత భీమన్నగారికి నారపొత్తిపంచ మాత్రమే కాకుండా ఒక అడుకట్టు పట్టుచీర, ఒక పట్టు పంచలచాపు కూడా బహూకరింపబడ్డాయి.

భీమన్న కోరిక యిన్నాళ్ళకు నెరవేరింది.

******

Your views are valuable to us!