గజపతుల నాటి గాధలు – మూడు మార్గాలు

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 3.5]

 

రచన: బులుసు వేంకటరమణయ్య

ప్రచురణ: బుక్‍మన్స్

గమనిక: కాపీరైట్ హక్కులు పుస్తక ప్రచురణకర్తలవి.

 

 

ఆనందగజపతి ప్రభువు విజయనగర సంస్థానాన్ని పాలిస్తున్న రోజులవి.

ఆ మహారాజు రాజ్య వ్యవహారా లన్నిటినీ సమర్థుడైన దివాను బాధ్యతకు అప్పగించి తాను విద్వాంసులతో చర్చిస్తూ విద్యాగోష్టిలోనే కాలం గడిపే వాడు. అభినవాంధ్రభోజుడని పేరుప్రతిష్ఠలు సంపాదించిన ఆ ప్రభువు దర్శనం కోరి వచ్చిన పండిత కవులకు గొప్ప పారితోషికాలు ముట్టుతూ వుండేవి. రాజులకూ, సామంతులకూ కూడా అలభ్యమైన ఆయన దర్శనం పండితులకు చాలా సులభంగానే లభించేది.

ఆనందగజపతి ప్రభువునకు అన్ని శాస్త్రాలలోనూ కొంత కొంత పరిచయం వుంది. చమత్కారంగా మాట లాడడంలోనూ, యుక్తిగా ప్రశ్న లడగడంలోనూ చాలా సమర్థుడు ఆ ప్రభువు!

ఒకనాడు ఆయన సభ తీర్చి, ఎదో విషయాన్ని గురించి ప్రసంగిస్తూ – పండితవర్గంలో ప్రథమస్థానాన్ని అలంకరించిన భగవత్కవి నరసింహాచార్య స్వామిగారిని చూసి “సత్పురుషులకీ, దుర్మార్గప్రవర్తకులకూ మార్గాలు ఎలా వుంటాయని మీ భావన?” అని ప్రశ్నించారు. వెంటనే ఆయన “ప్రభువులకు తెలియని దేముంది గనుక? సన్మార్గుడికి యిన్ని మార్గాలు ఎక్కడ? అతనిది ఒక్కటే మార్గం. కష్టసుఖాలనూ, కలిమి లేములనూ ఎంతమాత్రమూ లెక్కించకుండా న్యాయమైన ఒక్క మార్గాన్నే ప్రవర్తించడమ్ అతని పద్ధతి గదా! ఇక దుర్మార్గుడి సంగతి చూతామా అంటే – దన్ని యిదమిత్థమని నిర్వచించడానికి వీలులేదు. అతని మార్గాలు లెక్కలేనివి. ఎలా కావలిస్తే ఆవిధంగా ప్రవర్తించగలడు” అని సమాధానం యిచ్చాడు.

మహారాజులుంగారు అంతగా తృప్తిపడినట్లు కనబడ్డం లేదు. ’ఇది అందరికీ తెలిసిన విషయమే’ అనే భావాన్ని ముఖంలోనే వ్యక్తం చేస్తూ ప్రశ్నార్థకంగా తక్కిన పండితుల వైపు దృష్టిని ప్రసరింప జేసారు ఆయన. మహారాజులుంగారి భావాన్ని కొందరు గ్రహించలేక “ఆచార్య స్వాములవారు సెలవిచ్చినది దివ్యంగా వున్నదండి” అని చెప్పారు. ఏమంటే ’మీరు వారితో ఏకీభవిస్తారా?’ అని ప్రభువులు అడుగుతున్నారని భావించి ఇలా అన్నారు. భగవత్కవిగారి మీద ప్రభువులకు గొప్ప గౌరవం. అంచేత ఆయన అభిప్రాయాన్నే బలపరచడం భావ్యమని పండితుల అభిప్రాయం.

ప్రభువులు తమ అభిప్రాయాన్ని కొంత వ్యక్తం చేస్తే తగిన సమాధానం రావచ్చునని అనుకున్నారు. ఆయన అందర్నీ ఒకసారి చూచి “చూడండీ! నేను మిమ్మల్ని అడిగి తెలుసుకోదలచిన మార్గాలు సన్మార్గం, దుర్మార్గంలాంటి ప్రవర్తనకు సంబంధించినవి కావనుకోండి. అవి యదార్థంగా మార్గాలే! వాటిని గురించి మీ అభిప్రాయం సెలవిస్తారా?” అని ప్రశ్నించారు మళ్ళా.

అప్పుడు మహారాజావారు స్థాపించిన సంస్కృత నాటక సమాజంలో విదూషకపాత్రను ధరిస్తూవున్న కర్రా వెంకటశాస్త్రిగారు నిలబడి చేతులు జోడించి “మహాప్రభూ! నేను మనవి చేస్తాను. సెలవా?” అని అనుజ్ఞ వేడాడు.

వెంకటశాస్త్రి సహజంగా విదూషకుడి గుణాలు అలవడినవాడు. తన మాటలు, చేష్టల మూలాన నలుగురినీ నవ్వించే స్వభావం అతనిది. తెలిసినవాళ్ళు చెప్పవలెనంటూ ప్రభువు లిదివరకే తెలియజేయడం చేత ఆ గోష్టిలో వున్న తానూ తనకు తోచినది చెప్పవచ్చు. మళ్ళీ అనుజ్ఞ వేడడం హాస్యగాడి స్వభావం. మరో విశేషం ఏమిటంటే – ఈయన పెద్ద పండితుడు కాడు. మహావిద్వాంసులున్న సభలో “తగుదునమ్మా!” అని తాను సమాధానం చెప్పడానికి పూనుకోవడం కొంత సాహసమని తనకూ తెలుసు. ఇలాంటి సభలో తాను మాట్లాడడం ప్రభువులకి ఇష్టమో, కాదో! కోపం వస్తుందో, ఏమో! అనే దిగులు కొద్దీ ప్రభువుల అనుమతి వేడవలసి వచ్చింది.

“చెప్పవచ్చు” నంటూ ప్రభువులు సైగ చేసారు.

“చిత్తం! మనవి చేస్తున్నా” అని ఒక్క నిమిషం ఆలోచనను నటించి, “ఇదంత గడ్డు ప్రశ్న అని నాకు తోచలేదు. అందరికీ బాగా తెలిసిన విషయమే!” అని ఉపోద్ఘాతం ప్రారంభించాడాయన. అది విని కొమ్ములు తిరిగిన పండితులు అతని వైపే చూడసాగారు, ఏ విశేషం బయలు పెడతాడో అని.

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
 
“చిత్తగించండి. దుర్మార్గులయిన వాళ్ళకి మార్గం ఒక్కటే. అంతకి ఎక్కువ మార్గాలు లేవు. సన్మార్గుడుకీ, దుర్మార్గుడికీ కలిసి రెండు మార్గాలు. ఇక సన్మార్గుడికీ, సన్మార్గుడికీ – వారి కలయికలో మూడు మార్గాలు వుంటాయి.” అన్నాడు వెంకటశాస్త్రి.

ఇలా చెప్పి, ఇతను వివరించడానికి క్కాబోలు నిలిచే వున్నాడు. ఆనంద గజపతి ప్రభువు చిరునవ్వు నవ్వాడు.

“ఏమిటిది? వెంకటశాస్త్రుల్లు తల్లకిందులా చెప్తూ వున్నాడే? దుర్మార్గుడిది ఒక్కటే మార్గమట. సన్మార్గుడికి అనేక మార్గాలట! ఇదంతా అయోమయంగా వుంది” అని అక్కడి సభ్యులు అంతా అనుకుంటూ, ఏమీ అర్థంకాక నిర్ఘాంతపడి వున్నారు. ఈ విషయాన్ని ప్రభువు గ్రహించకపోలేదు. ఆయన చిరునవ్వు నవ్వుతూ “చాలా బాగుంది. విదూషకుడు గారు హాస్యధోరణిలో అన్నా, చక్కని సమాధానమే చెప్పారు” అని ప్రశంసించారు.

మహారాజులుంగారు వేసిన ప్రశ్నను బాగా అర్థం చేసుకున్నవాడు వెంకటశాస్త్రేననీ, అతను చెప్పిన సమాధానాన్ని గ్రహించగలిగినవారు ఒక్క మహారాజులుంగారే అనిన్నీ తేలిపోయింది. మిగిలిన సభ్యులందరూ తలలు వంచుకున్నారు. అప్పుడు మహారాజులుంగారు “శాస్త్రులు గారూ! మీ సమాధానాన్ని వివరించి తెలియజేస్తారా?” అని ప్రశ్నించారు.

వెంకటశాస్త్రి “ప్రభువుల ప్రశ్నకి ప్రభువులే తప్ప మరొకరు సమాధానం ఇయ్యలేరు. అందుచేతనే నాకు మొదట ఈమీ తోచక ఊరుకున్నాను. ఇక లాభం లేదంటూ ప్రభువులే తమ సమాధానాన్ని ప్రశ్నరూపంగానే ప్రకటించారు కదా! తాము సెలవిచ్చిన మార్గాలు ప్రవర్తనలకి సంబంధించినవి కావనీ, యధార్థంగా మార్గాలే అనిన్నీ సెలవిచ్చారు గదా! దాన్ని అనుసరించే నేనున్నూ, యుక్తి మీద ఆధారపడి ’ఇది కాకపోతుందా’ అనే ధీమాతో మనవి చేసాను. మిడతంభట్ల జోస్యంలాగ అది యదార్థమైనది. ఇందులో నా తెలివితేటల్ ఏమిన్నీ లేవు. ప్రశంసకి నేనెంత మాత్రమూ అర్హుడను కాను.

ఇక మనవి చేస్తాను – మార్గాలు బాటలే కాని మరొకటి కావని ప్రభువులు చెప్పారు. అలాంటప్పుడు దుర్మార్గుడికి ఒకటే మార్గం. అతనికి ఎదురుగా మరో దుర్మార్గుడు వస్తే – వాడూ తప్పుకోడు. వీడూ దారి ఇవ్వడు. ఇద్దరూ ఒక్క బాట మీదే ఎదురెదురుగా నిటారున నిలువబడతారు. లేదా కొట్టుకుంటారు. బలంగలవాడు – బలహీనుడ్ని పడదోసి, వాడి మీద నుంచి వెళ్ళిపోతాడు.

ఇక రెండోది – మంచివాడికి దుర్మార్గుడు ఎదురౌతాడనుకోండి. దుర్మార్గుడెన్నడూ దారి విడిచి నడవడు. సన్మార్గుడే దారి తప్పుకుంటాడు. అప్పుడు దుర్మార్గుడి కొక దారీ, సన్మార్గుడిది ప్రక్కదారీ – రెండు దారులు ఏర్పడతాయి.

ఇద్దరు సన్మార్గులు ఒకరి కొకరు ఎదురయితే ఇద్దరూ మంచివాళ్ళు కాబట్టి తనకు ఎదురుగా వచ్చినవానికి దారి ఇవ్వాలంటూ ప్రక్కకు ఇద్దరూ తప్పుకొంటారు. అప్పుడు అసలు దారి ఖాళీగా వుండి దానికి – కుడి, ఎడమవైపులు – రెండు ప్రక్కలా దారులు ఏర్పడతాయి. అందువల్ల మూడు మార్గాలు ఏర్పడుతాయి. కాబట్టే ఇద్దరు మంచివాళ్ళు కలిసికొన్నప్పుడు మూడు మార్గాలంటూ మనవి చేసాను” అని వివరించాడు.

“వడ్లగింజలో బియ్యపుగింజ! ఈమాత్రం మనకప్పుడు తోచలేదే! ఎవరికి తెలియదిది?” అంటూ అందరూ ఆశ్చర్యపోయారు.

Your views are valuable to us!