వర్ధనమ్మకి ఇంకా గుండెలు అదురుతూనే ఉన్నాయి. అతడు నిజంగానే బ్రాహ్మడా ? నిజంగా అబ్బాయి పంపాడా ? బుర్ర తిరిగిపోతోంది!
అవధానులు వచ్చారు.. కాళ్ళుకడుక్కుని లోపలికి రాగానే “త్వరగా వడ్డించు. వెంటనే వెళ్ళాలి” అన్నాడు. జరిగింది ఏకరువు పెట్టింది.
అవధాని నమ్మలేదు.
ఊరికి ఎవరొచ్చినా మొదట రామాలయానికే వస్తారు. పూజారి ఇల్లు అక్కడే. అక్కడికి రాకుండా నేరుగా ఇంటికి ఎందుకు వస్తారు?
“నీదంతా భ్రమ! అబ్బాయి మీద బెంగతో ఇలా తయారయ్యావు!” అని భోంచేసి వెళ్ళిపోయాడు
వర్ధనమ్మ తాను కూడా భోంచేసి మళ్ళీ వంటింట్లో నడుం వాల్చింది. “ఈ రామలక్ష్మి ఎందుకింకా రాలేదు? రావడానికి వీలుకాకపోతే ఆయనతో చెప్పి పంపిఉండొచ్చుగదా?”
అప్పుడు చటుక్కున గుర్తొచ్చింది – జమీందారు గారింట్లో ఇవ్వాళ సత్యనారాయణ వ్రతమనీ, వచ్చి ప్రసాదం తీసుకెళ్ళమనీ రామలక్ష్మే నిన్న చెప్పింది. తాను పుర్తిగా మర్చిపోయింది. ఈపాటికి పూజ అంతా అయిపోయి, భోజనాలు కూడా అయుంటాయి. “రామలక్ష్మి ఇంటికే వెళతాను. ఆ జమీందారులు నాకు ఇంకా పరిచయమే లేదు….” అనుకుంటూ లేచి, తలుపుతాళం వేసి బయల్దేరింది.
ఇంట్లో నుండీ చూస్తే ఎండ ఎక్కువగానే కనపడుతున్నా బయటికొస్తే అంతగా అనిపించలేదు. మైదానం దాటి, ఇళ్ళ మధ్యకి వచ్చింది. జమీందారు గారి ఇల్లని చూస్తేనే తెలిసిపోయేలా ఒక ఇల్లు కనపడింది. అదే దారిలో ఇంకాస్త వెళితే రామలక్ష్మి ఇల్లు. జమీందారు ఇంటి ముందుకు వచ్చింది. గేటు దగ్గరకు రాగానే అప్రయత్నంగా లోపలికి చూసింది. లోపల ముఖద్వారం అప్పుడే తెరుచుకుంది. లోపలినుండీ అదే పిలక బ్రాహ్మడు, చేతిలో పళ్ళెంతో బయటికొచ్చాడు. వర్ధనమ్మ స్థాణువై నిలబడి చూస్తోంది. ఆ పిలక బ్రాహ్మడు గేటు దగ్గరికి వచ్చాడు. యజ్ఞోపవీతం ఇంకా అపసవ్యంగానే వేసుకున్నాడు. చేతిలోని పళ్ళెంలో శ్రాద్ధములో చేసే పిండాలున్నాయి. మామూలుగా అయితే మూడే పిండాలుండాలి. పళ్ళెంలో అయిదున్నాయి. వర్ధనమ్మని చూసి వెకిలిగా నవ్వుతూ “పిండాలు రెండు మిగులుతాయి.. కావాలా?” అన్నాడు.
వర్ధనమ్మకి వెన్నులో ఒణుకు పుట్టింది. భయంతో చెమట్లు పట్టాయి. ఒక్క పరుగున ఒగరుస్తూ రామలక్ష్మి ఇంటికి వచ్చింది. ఊపిరి పీల్చలేక గసపోసుకుంటున్న వర్ధనమ్మని చూసి రామలక్ష్మి ఆశ్చర్యపోయింది. “ఏమయిందండీ, అలా ఆయాస పడుతున్నారు? సాయంకాలంగా నేనే వద్దామనుకుంటున్నాను.. ఈ ఎండలో ఎందుకొచ్చారు ?” అంటూ వచ్చి లోపలికి తీసుకువెళ్లింది. లోపలికి వెళ్ళి వర్ధనమ్మ ఓ అయిదు నిమిషాలు ఏమీ మాట్లాడలేదు.
తాగడానికి మజ్జిగ ఇచ్చి అంది రామలక్ష్మి”ఇల్లు సర్దుకోవాలి కదా! మీకు ఇంకా సమయం పడుతుందని అరిసెల పిండి ఇంకా చేయలేదు. ఇప్పుడిచ్చినా మీరేమీ చేయరుగా! అది ఎక్కువ రోజులు నిలవ వుండదు…వడియాలైతే తీసుకు వెళ్ళండి.. సాయంత్రం నన్నే తెమ్మన్నా సరే…”
అరిసెల పిండి ఇవ్వడం కన్నా వర్ధనమ్మ ఆదుర్దాకు కారణమేమో తెలుసుకోవాలన్న ఆతృతే ఎక్కువగా కనబడుతోంది రామలక్ష్మిలో.
మజ్జిగ తాగి, కొంత కుదుటపడి ఉదయం నించీ జరిగిందంతా చెప్పింది వర్ధనమ్మ. రామలక్ష్మి ఆశ్చర్యపోయింది. ఆమెకు కూడా వర్ధనమ్మ మాటలపై అంతగా నమ్మకం కలగలేదు కానీ ఆ పిలక బ్రాహ్మడిని జమీందారు గారింట్లో చూసిందని విన్నాక ఆలోచనలో పడింది. జమీందారు గారింట్లో ఏదో రహస్యం ఉందని అందరూ అంటుంటారు.. ఆయనకి ఇద్దరు భార్యలట. కానీ రెండో భార్యను ఎవరూ చూడలేదు. ఆమెకు అనారోగ్యమనీ, బయట కనపడదనీ..ఇంకా ఏవో పుకార్లు. జమీందారు గారింట్లో పనివాళ్ళు కూడా నోరు విప్పరు. అలా ఎవరైనా నోరు విప్పితే వారం తర్వాత వారు ఊళ్ళో మరి కనపడరు అని అంతా అనుకుంటారు.
రామలక్ష్మికి ఒక అనుమానం వచ్చింది.
[amazon_link asins=’8182940761,B00JE45ECC,935165172X,B00WWPHO6Y’ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’b158600b-da2b-4f9c-8c58-3f52c76ed967′]“ఒకవేళ ఆ రెండో భార్య చనిపోయిందేమో? ఆమెకు తిథి చేయడానికి వేరే ఊరినిండీ ఎవరో పిలక బ్రాహ్మడిని పిలుచుకు వచ్చారేమో?”
ఇది తేలేదెలా? ఇతరుల విషయాలు తెలుసుకోవాలని రామలక్ష్మికి కుతూహలమని వర్ధనమ్మ అభిప్రాయం. రామలక్ష్మి అంది “అయితే ఇంకా శంకలు ఎందుకూ? నేరుగా వాళ్ళింటికే వెళ్ళి చూద్దాం! మిమ్మల్ని పరిచయం చేసినట్టూ ఉంటుంది.”
వర్ధనమ్మ సంకోచంగా అంది “ఏమోనమ్మా, నేను ఉదయం పూజకు వెళ్లకుండా ఇప్పుడు ఈ వంకతో వెళ్ళడం బాగుంటుందా?”
“పూజా? ఏ పూజ?”
“అదేనమ్మా, ఇవ్వాళ వారింట్లో సత్యనారాయణ పూజ కదా?”
“ఎవరన్నారు?”
“అదేమిటమ్మా , నువ్వేకదా నిన్న చెప్పావు?”
“నేనెప్పుడు చెప్పానండి? వచ్చే కార్తీకమాసంలో పూజ అని చెప్పాను!”
“అదే నాకూ అర్థం కాలేదు. నువ్వు పూజ అని చెప్పావని అనుకున్నా! అక్కడేమో శ్రాద్ధం జరిగినట్టుంది..ఏమీ అర్థం కాలేదు!”
వర్ధనమ్మకు అయోమయంగా అనిపించింది. తనని చాలా చురుకైనది అని అంతా అంటారు. ఇలాగ లేనివి ఉన్నట్టుగా ఊహించుకోవడము తాను ఎన్నడూ చేయలేదు. తాను రామలక్ష్మి దృష్టిలో నవ్వులపాలు అవుతానేమో అని బెరుకు కలిగింది. సరే, ఇదే అవకాశము…రామలక్ష్మితో పాటూ వెళ్ళి ఆ పిలక బ్రాహ్మడిని చూపిస్తాను అనుకుని “సరే పదమ్మా, ఇప్పుడే జమీందారు గారింటికి వెళ్ళి మాట్లాడదాము.” అంది.
“ఇప్పుడేనా? ఎలాగూ వచ్చారు కదా, సాయంత్రం వరకూ ఉండండి. అంత లోపల కావాలంటే అరిసెల పిండి కూడా చేద్దాము.”
“లేదమ్మా, పిండి అయినప్పుడు నువ్వే తెచ్చివ్వు. రేపు శనివారము కదా , అబ్బాయొస్తున్నాడు. చాలా యేర్పాట్లు చూడాలి. ఇప్పుడే వెళ్దాం. నేను అట్నుంచీ అటే ఇంటికి వెళతాను.”
“రేపు శనివారమేమిటీ? ఇవ్వాళే కదా శనివారము! రేపు ఆదివారము!!”
వర్ధనమ్మకు మళ్ళీ అయోమయమైంది. “అరెరే.. అవును కదా ? పొద్దున్నే కదా రేడియోలో సుప్రభాతము వింది ? శనివారానికి సరిగ్గా ఏరియల్ కట్టారు అని కూడా అనుకుంది పొద్దున! మరి ఆ బ్రాహ్మడు అలాగన్నాడేమిటి? అబ్బాయి వచ్చేదే నిజమయితే ఈపాటికి వచ్చుండాలి కదా ? అసలు విషయాలన్నీ ఆ బ్రాహ్మడిని అడిగితేనే సరిగ్గా తెలుస్తాయి. రామలక్ష్మి ఉందిగా! నాకు భయం లేదు.”అని మనసులో అనుకొని, పైకి “సరే పదమ్మా, ఆ బ్రాహ్మడిని నిలదీద్దాం ఆలస్యం చేస్తే వెళ్ళిపోతాడేమో” అంది.
ఇద్దరూ వారి వారి కారణాలచేత సిద్ధమై బయలుదేరారు.
తలుపు తట్టగానే జమీందారు గారి భార్యే వచ్చి తలుపుతీసింది. ఇద్దర్నీ చూసి , “రండమ్మా, రండి… మంచి ఎండలో వచ్చారే!” అని సాదరంగా ఆహ్వానించింది. ఇద్దరూ లోపలికెళ్ళి కూర్చున్నారు. వంటమనిషి నిమ్మకాయ షర్బత్ తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. రామలక్ష్మి జమీందారు భార్యకు వర్ధనమ్మను పరిచయం చేసింది.
“ఊహించానమ్మా!” అంటూ కుశల ప్రశ్నలు వేసింది ఆమె.
రామలక్ష్మి అంది “ఈ రోజు మీ ఇంటికి ఎవరో బ్రాహ్మలు వచ్చారట?”
“యే బ్రాహ్మలు?…..ఓహ్ అదా! ఇప్పుడు కాదమ్మా, రేపు ఆదివారం రమ్మన్నాము. కార్తీకమాసంలో పూజ కదా…ఆ విషయాలు మాట్లాడాలని. ఇప్పట్నుంచీ అనుకోకపోతే తర్వాత ఎన్ని అడంకులొస్తాయో? మీవారు అప్పటికి కాశీకి వెళుతున్నారు కదా.. అయినా , ఇది మాలో మేము అనుకోవడమే గాని ఎవరితోనూ అనలేదే! మీకెలా తెలిసింది?”
“అది కాదమ్మా, ఈ రోజు మీ ఇంట్లో పిండప్రదానము చేయించిన బ్రాహ్మడు……”
“పిండ ప్రదానమా?” జమీందారు భార్యకు అర్థం కాలేదు. వెంటనే అర్థమై, కనుబొమలు ముడుచుకున్నాయి. “అంటే? మాయింట్లో ఎవరి తద్దినమైనా జరిగిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆరోగ్యం సరిగా ఉంటున్నదా? ” కాస్త తీవ్రంగానే అంది.
తెల్లబోవడము వీరిద్దరి వంతైంది. “అంటే ఏ బ్రాహ్మలూ రాలేదా?”
“మళ్ళీ అదే మాటా? అసలు మీమనసులో ఏముందో చెప్పండి…” ఇద్దర్నీ అనుమానంగా చూస్తూ అందామె.
ఇద్దరికీ నోట్లో మాట పెగల్లేదు. నీళ్ళు నమిలి, “క్షమించండమ్మా! ఏదేదో వాగేశాము. మళ్ళీ తీరిగ్గా వచ్చి కలుస్తాము” అని చెప్పి బయట పడ్డారు. ఇద్దరికీ ముఖంలో నెత్తురు చుక్కలేనట్టు పాలిపోయి ఉన్నారు. రామలక్ష్మి అంది “పదండి, మీ ఇంటికి వచ్చి దిగబెడతాను.”
“అక్కర్లేదులేమ్మా..నేను వెళ్ళగలను. నా వల్ల నీకు భంగపాటు అయినట్టుంది. ఏమనుకోకు. మళ్ళీ కలుద్దాం” అంటూ వర్ధనమ్మ విసవిసా వెళ్ళిపోయింది.
ఇంటికెళ్ళినా అవే ఆలోచనలు. ఏమీ అంతు పట్టటము లేదు. సాయంత్రంగా అవధానులు వచ్చారు. ఆయనకి అంతా చెబుదామనుకుంది… మధ్యాహ్నం తనని ఆట పట్టించడం గుర్తొచ్చి “అయినా ఏమి చెప్పేది ? జరిగింది చెబితే తలవంపులు నాకే.. అసలు నాకే ఏమీ అర్థం కావడం లేదు! ఆయనకి చెప్పి నవ్వులపాలు కావడం దేనికి? ఇదేదో తేలేదాకా చూస్తాను. ఏది చెప్పడమైనా ఆ తర్వాతే..” అని నిశ్చయించుకుంది.
ఆరాత్రి బయట లైట్లు వేయాలని ఇద్దరికీ అనిపించలేదు.. అవధానులు ఆ విషయమే గుర్తు లేనట్టున్నారు. వర్ధనమ్మ గుర్తున్నా “ఇప్పుడున్న పరిస్థితిలో ఇంకా అయోమయాలు తెచ్చుకోవడం ఎందుకు?” అని ఊరకుంది.
అర్ధరాత్రి వర్ధనమ్మకి ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. ఎవరో ఏడుస్తున్నారు. మళ్ళీ అదే కంఠం. కానీ ఈసారి ఏడుపు చాలా గట్టిగా వినిపిస్తోంది.. విని భరించలేనట్టు ఉందా ఏడుపు. అవధాని మంచం వైపుకు చూసింది. మంచం పైన ఆయన లేరు. లేచి కూర్చుంది.అంతలో అవధానులు బయటనుండీ లోపలికి వచ్చారు. బయటి లైట్లు ఆర్పేశారు. ఏడుపు ఆగిపోయింది. ఆయన వచ్చి మంచంపై కూర్చొని ఏదో ఆలోచిస్తున్నారు.
“మీరు లైటు వేశారా? ఏమిటబ్బా,ఆ ఏడుపు అనుకున్నా!” అంది.
“నువ్వు లేచే ఉన్నావా? ఎందుకు లేపడమని లైట్లు వెంటనే ఆర్పేశా. లేకపోతే పొద్దున వరకూ లైట్లు అలాగే ఉంచుదామనుకున్నా..” అన్నాడు.
“లైట్ల కన్నా మించిన సమస్య నాది!” అనుకుంటూ “సర్లెండి పడుకోండి. అబ్బాయొచ్చాక ఇవన్నీఆలోచిద్దాం!” అంది.
“అబ్బాయొస్తాడని నమ్మకంగా చెబుతున్నావే? కలగన్నావా ఏమిటి?”
మళ్ళీ ఆ పిలక బ్రాహ్మడు గుర్తు రాగా మనసంతా అశాంతి గా అనిపించి “సర్లెండి, అర్ధరాత్రి అంకమ్మ శివాలు అన్నట్లు ఈ చర్చ ఇపుడెందుకు?పడుకోండి ” అంది.
ఉదయం వర్ధనమ్మ లేచే వేళకు అవధానులు సిద్ధమై బయలుదేరుతున్నారు. “నిన్ను నిద్ర లేపడమెందుకని ఊరకున్నాను. ఈవాళ నా ఫలహారం గుళ్ళోనే” అని చెప్పి వెళ్ళారు. గబగబా లేచి బచ్చలింటికి వెళ్ళింది. ఇంకా బయటికి రాకుండానే నూతిలో ఏదో పడినట్లు ’ధబిల్లు’మని వినిపించింది. ముఖం తుడుచుకుంటూ బయటికి పరుగెత్తి వచ్చింది. బయట గేటు దగ్గర పాలపిల్ల. చేతిలో గిన్నెలు.
“ఏమిటే ఆ చప్పుడూ?”
“అమ్మా, మీరు జున్ను కావాలన్నారు కదా! అందుకని ఈరోజు దూడని పాలు తాగనివ్వలేదు. అది పాలకోసం వాళ్ళమ్మని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది. పొరపాటున అదిగో మీ భావిలో పడింది!”
అది చెబుతున్నదేమిటో మొదట వర్ధనమ్మకు అర్థం కాలేదు. అర్థం అయాక నమ్మలేదు. కానీ అప్రయత్నంగా వెళ్ళి భావిలోకి చూసింది. లోపల ఆవుదూడ, శవమై తేలుతోంది. నిర్ఘాంతపోయింది. ఇటు తిరిగి చూస్తే పాలగిన్నెలు అక్కడ పెట్టి, ఆ అమ్మాయి పరుగెత్తి వెళ్ళిపోతోంది.
ఉన్నచోటే కూలబడింది వర్ధనమ్మ. ఏమిటిదంతా? ఏం జరుగుతోంది? చాలాసేపు అలాగే కూర్చుండి పోయింది. అంతలో ఎవరో ఇద్దరు వచ్చారు. “అమ్మా , దూడ చచ్చిపోయిందట? పైకి తీసి తీసుకు వెళతాము.” వచ్చిందెవరో సరిగ్గా చూడను కూడా లేదు. ఏదోలోకంలో ఉన్నట్టు తలాడించింది.
వాళ్ళు దూడని తీసి, మోసుకుని వెళుతున్నారు. ఒకడు వెనక్కి తిరిగి “అమ్మా , వెళ్ళొస్తాం” అన్నాడు . అప్పుడు చూసింది వాడి ముఖం. ఎక్కడో చూసింది….ఎక్కడ ? గుర్తు రాలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు.
కాసేపటికి గుర్తొచ్చింది – “అవును… వాడే! నిన్న ఆ జట్కా తోలుకొని వచ్చిన బండబ్బాయి.” వర్ధనమ్మకు మెదడు పనిచేయడం మానేసింది. పిలక బ్రాహ్మడు లేడని ఆయనా రాలేదని జమీందారు భార్యా అన్నారు. వీడు నిన్న ఆ బ్రాహ్మడిని తీసుకు రాలేదూ? సత్తువ లేనట్టు ఇంకో గంట అలాగే కూర్చుండి పోయింది. ఏ పనీ చేయడానికీ బుద్ధి పుట్టడము లేదు. ఆయన ఉంటే ఎంత బాగుండేది! ఏదో ముంచుకొచ్చినట్టు అంత ఉదయానే ఇవాళే వెళ్ళాలా? కడుపులో నకనక మొదలైంది. ఏ పాటు తప్పినా ఇది తప్పదు కదా అనుకుని బియ్యము, పప్పు నానేసి స్నానానికి వెళ్ళింది.
ఫలహారం కాకుండా ఏకంగా వంట చేసింది. ఆయన ఏ ఒంటి గంటకో వస్తారు.. అంతవరకూ ఏమీ తినకుండా ఉండలేదు. కాసిని అటుకులు తీసుకొని, పాలపిల్ల వదలి వెళ్ళిన గిన్నెల్లోంచి పాలు తీసుకొని కలిపి కాస్త చెక్కెర వేసుకుని తినింది. జున్ను పాలు కాచింది. వంట కూడా పూర్తవ వచ్చింది. జున్ను తింటూ కాసేపు రేడియోలో వచ్చినదేదో వింది. ఏమి వచ్చిందో, ఏమి విందో, ఏమీ గుర్తు లేదు.
బడలికగా అనిపించి, చాపపై కాసేపు నడుం వాల్చింది. మగత నిద్రలోకి జారుకుంది. ఉన్నట్టుంది ఏదో శబ్దం విని మేలుకుంది. గేటు తెరుస్తున్నట్టు “కిర్రు”మని శబ్దం. పైకి లేవకుండా అలాగే చెవులు రిక్కించి వింటూంది. కాస్త నిశ్శబ్దం. తర్వాత మళ్ళీ కిర్రుమని శబ్దం. గేటు గాలికి ఊగుతోందా లేక ఎవరైనా వచ్చారా ?
లేచి కూర్చుంది. మళ్ళీ శబ్దం. పైకి లేచి బయటికి వచ్చింది. ఎవరూ లేరు. “గాలికే అయిఉండాలి, గేటు ఊగుతున్నది!” అనుకుంటూ లోపలికి వచ్చింది. కిటికీలోంచీ బయటికి చూస్తోంది. మళ్ళీ నిన్నటి మేకలు వచ్చి గడ్డి కొరుకుతున్నాయి. అంతలో మళ్ళీ దూరంగా ఏదో నిన్నటి లాగే కనిపించింది. మొదట్లో అస్పష్టం… తర్వాత కొంచంకొంచంగా స్పష్టమవుతోంది. ఈసారి అదేదోగానీ వేగంగా తానున్న దిశలో వస్తోంది. అలాగే చూస్తోంది. అదేదో వాహనము. పెద్ద వ్యాను లాగా ఉంది. పక్క పల్లెకు ఎవరో వెళ్తున్నారులా ఉంది. కానీ..కానీ..అది ఇటే వస్తోంది. తెల్లటి వ్యాను. వర్ధనమ్మ బయటికొచ్చింది. ఇంటి ముందర ఒక ఆంబులెన్స్ వ్యాన్ వచ్చి ఆగింది. డ్రైవర్ దిగాడు. ఇంకో ఆయన కూడా దిగాడు.
“అవధానుల వారిల్లు ఇదే కదమ్మా?”
తాను చూస్తున్నదంతా తర్వాత అబద్ధమని తేలుతుందో ఏమో అనుకుంటూ తలాడించింది. ఇద్దరూ వ్యాన్ వెనక్కు వెళ్ళి తలుపు తీసి లోపలికి ఎక్కారు. ఇంకో నిమిషంలో ఒక స్ట్రెచర్ ని మోసుకుని కిందకు దిగారు. స్ట్రెచర్ పై పూర్తిగా బట్ట కప్పి ఉన్న శవము ఉంది.
“అమ్మా, క్షమించాలి! అవధానుల గారి అబ్బాయి రైలుకింద పడి మరణించాడు. మీరు వారికేమవుతారు? ఇంట్లో ఇంకా ఎవరున్నారు? శవాన్ని అప్పజెప్పడానికి వచ్చాము.” లోపలికి చూస్తూ అడిగాడు ఆ వ్యక్తి.
(ఇంకా ఉంది)