ఝడుపు కథ – మూడో భాగం

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 3]

 

రామలక్ష్మి జమీందారు గారింటికి వచ్చింది. శ్రావణ శుక్రవారం ముత్తైదువ వాయనం తీసుకొని వెళ్ళవలసిందిగా జమీందారు భార్య వర్తమానం పంపించింది.రామలక్ష్మికి ఎందుకో సంకోచం. అయినా పిలిచాక వెళ్ళకపోతే బాగుండదని వెళ్ళింది. ఇంకా ఇద్దరు ముత్తైదువ లున్నారక్కడ. అప్పుడే వెళ్ళబోతున్నారు. రామలక్ష్మిని చూసి పలకరించి వెళ్ళారు. జమీందారు గారి భార్య రామలక్ష్మిని ఆహ్వానించి కూర్చోపెట్టింది. ఇంట్లో ఎవ్వరూ లేనట్టుంది. నౌకర్లు, వంటమనిషీ పక్కఊర్లో సినిమాకు వెళ్ళారట.

వాయనం తీసుకొని “ఇక వెళ్ళొస్తానండీ…” అంది.

“వెళుదువులేమ్మా , కూర్చో, నాకూ ఒక్కదానికే తోచడములేదు.” అంటూనే పెద్దగా నోరు తెరచి, పళ్ళు వికృతంగా చూపిస్తూ నవ్వడము మొదలు పెట్టింది. రామలక్ష్మికి అది చూసి అదురు పుట్టింది. అంతలో ఆమె రామలక్ష్మి చేయిపట్టి లాగుతూ “చూపించు.. చూపించు.. నాకు దారి చూపించు..” అంటోంది. రామలక్ష్మి బెదిరిపోయి చేయి విడిపించుకుని కెవ్వుమని పెద్దగా అరిచింది.

సరిగ్గా అప్పుడే జమీందారు గారు పక్కగదిలోంచీ వచ్చారు. భార్యను చూసి ఆదుర్దాపడి, పట్టుకుని వెనక్కి లాగాడు. ఆమె స్పృహ తప్పిపోయింది.

జమీందారు అన్నాడు “తగ్గిపోతుందిలేమ్మా! నువ్వు వెళ్ళగలవా లేక నౌకరు వచ్చాక తోడు పంపనా?”

రామలక్ష్మి “లేదండీ ఇప్పుడే వెళ్ళిపోతాను. ఆయన వచ్చే సమయం.” అంటూ పరుగులాంటి నడకతో బయటికి వచ్చి, వెనక్కి చూస్తూ గబగబా ఇంటి దారి పట్టింది.

ఇంటికి చేరిందో లేదో…రామలక్ష్మి భర్త సుందరశాస్త్రి అప్పుడే కాళ్ళు కడుక్కుని , లోపలికి వెళ్ళబోతూ, లోపలితలుపు తాళం వేసుండడం చూసి ఆశ్చర్యపడి వెనక్కి చూశాడు. రామలక్ష్మి గేటు దగ్గర నిలుచొని ఉంది.

“ఎక్కడికెళ్ళావు?”

[amazon_link asins=’0486270696,9381506108,9385231391,9386327015′ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’ccda9f6f-3d13-446c-a27f-0339aef0c203′]

“నేనా? నీకు పిండం పెట్టడానికి వెళ్ళాను. రా… ఇద్దరం తిందాం!” అంటూ పెద్దగా నవ్వుతోంది. చేతులు నడుముపై పెట్టుకొని, రెండుమోకాళ్ళూ భరతనాట్యం భంగిమవలె ఎడం చేసి, ఉన్నచోటే నర్తించడం మొదలు పెట్టింది. సుందరశాస్త్రి దిగ్భ్రాంతి చెంది “ఏమిటే నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ నవ్వేమిటీ? ఆ డ్యాన్సేమిటి? ” అంటూ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకున్నాడు. వెంటనే రామలక్ష్మి నిద్రవచ్చిన దానిలా తూలుతూ అతని చేతుల్లో వాలిపోయింది. ఏమైందోనని గాభరాపడుతూ లోపలికి తీసుకెళ్ళి అరుగుపై పరుండబెట్టి, ముఖం పై నీళ్ళు చల్లాడు. కాసేపటికి కళ్ళు తెరిచి “ఎప్పుడొచ్చారు? నేను నిద్రపోయానా? ” అంటూ లేచింది.

“ఏమిటలా వికృత చేష్టలు చేశావు?” అని అడిగాడు. కానీ అతడి మాట ఇద్దరికీ వినపడలేదు. “శాస్త్రీ! ఏమయ్యా! ఇంట్లో ఉన్నావా? అర్జెంటుగా రావాలి!” అని అరుస్తూ గుడిపూజారి దీక్షితులు పరుగున వచ్చాడు. ఇద్దరూ దిగ్గున లేచి, ఇటు తిరిగారు. సుందరశాస్త్రి “ఏమైంది దీక్షితులవారూ? ఎక్కడికి రావాలి? ” అని  అన్నాడు.

“రా మొదట! దారిలో అంతా చెబుతాను…” అంటూ సుందరశాస్త్రి చేయిపట్టుకుని లాక్కుని వెళ్ళినట్లుగా వెళ్ళాడు. ఇటు రామలక్ష్మి కేమైందో, ఎలా ఉందో అని తిరిగి చూస్తున్నాడు.

“మీరు వెళ్ళిరండి, ఫరవాలేదు!” అంది రామలక్ష్మి.

ఇద్దరూ వెళ్ళేసరికి, గుడి బయట గొల్ల రాముడు, అతడి భార్య లక్ష్మమ్మ లబొదిబోమని ఏడుస్తున్నారు. వారి కూతురు పదేళ్ళ వరాలును చెట్టుకు కట్టేశారు. ఒంటిపైన ఏదో బట్ట చుట్టినట్టుంది. పెడరెక్కలు విరిచి కట్టినా వరాలు అరుస్తోంది.

“బంగారం లాంటి నాకూతుర్ని పిచ్చిదాన్ని చేశారు. కొడుకుని చంపేశారు…మా ఆయన్ని…మాఆయన్ని…” అంటూ ఊగిపోతోంది. ఎవరో వేపమండలతో దిగదుడుస్తున్నారు. అయినా  అర్థంకానట్టి ఏవో అరుపులు అరుస్తోంది వరాలు.

లక్ష్మమ్మ పరుగునవచ్చి సుందరశాస్త్రి కాళ్లమీద పడింది. “సామీ మీరే రక్షించాల…నాకూతురికి ఎవరో చేతబడి సేసినారు…ముత్యమంటి పిల్ల సామీ…నెలనుండీ అదోమాదిరిగా చూసేది. ఏదేదో మాట్లాడేది. ఇయ్యాలేమైందో దయ్యం పట్టినదాని మల్లే ఊగిపోతాంది. ఎవరేమి సేసినారో? సామీ కాపాడాల…”

గొల్లరాముడు వచ్చి శాస్త్రి పాదాలు పట్టుకున్నాడు. మాట్లాడలేకపోతున్నాడు. నమస్కారం చేస్తాడు. తల భూమికేసి కొట్టుకుంటాడు. మళ్ళీ శాస్త్రి కాళ్ళు చుట్టుకుంటాడు. అతన్ని లేవదీసి, శాస్త్రి అందర్నీ దూరం వెళ్ళమన్నాడు.

ఎవరో లోపలినుండీ పంచపాత్ర లో నీళ్ళు తెచ్చిచ్చారు. శాస్త్రి రక్షోఘ్న మంత్రాలు చదువుతున్నాడు. రుద్రం లోని ఒక అనువాకాన్ని చదివాడు. ఇంకా కొన్ని మంత్రాలు చదివి ఆ పాపపైన  నీళ్ళు చల్లాడు. పాప ఊగడం ఆపేసింది. కానీ అరవడం ఆపలేదు. ఏమి చెబుతోందో ఎవ్వరికీ అర్థం కాలేదు. శాస్త్రి అందర్నీ  ఎవరిళ్ళకు వారిని వెళ్ళమన్నాడు. పాపను కట్లు విప్పి ఆవరణలోకి తీసుకెళ్ళాడు. పాప తలిదండ్రులు, శాస్త్రి, దీక్షితులు మాత్రమే ఉన్నారు. గుడి తలుపులు లోపలనుండీ వేసేశాడు దీక్షితులు.

శాస్త్రి పాపతో మాట్లాడుతున్నాడు. పాప కాస్త గొంతు తగ్గించి సమాధానాలు చెబుతోంది. వింటున్నవారు అవాక్కైపోతున్నారు.

అంతలో జమీందారుగారు, పంచాయితీ ప్రెశిడెంటు గారు వచ్చారని తెలిసింది. పాప అప్పటికి పూర్తిగా శాంతించి తలవేలాడేసింది. కట్లు విప్పి అక్కడే పడుకోబెట్టారు. అప్పటికే బాగా రాత్రి అయిపోయింది. పాపకేమీ ఫర్వాలేదని, ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాడు శాస్త్రి. మర్నాడు పొద్దున్నే కొందరిని గుడిదగ్గరకు రమ్మని చెప్పాడు. శాస్త్రికి నమస్కారాలు చేసి, పాపను తీసుకొని రాముడు, లక్ష్మమ్మ వెళ్లిపోయారు.

గుమిగూడినవారంతా ఎవరికి తోచినది వారు వ్యాఖ్యానాలు చేసుకుంటూ వెళుతున్నారు. 

(ఇంకా ఉంది)


Your views are valuable to us!