ఝడుపు కథ – నాలుగో (చివరి) భాగం

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 3]

 

మర్నాడు పొద్దున్నే గుడి దగ్గరికి ఆసక్తితో చాలామంది వచ్చారు.

ఊళ్ళో పెద్దలు వచ్చారు. రామలక్ష్మి, లక్షమ్మ, గొల్లరాముడు, వరాలు కూడా వచ్చారు. కిందటి రాత్రి చేతబడి విషయము తెలియడముతో పోలీసులు కూడా పట్నం నుండీ వచ్చారు.

సుందరశాస్త్రీ , దీక్షితులూ గుడి బయట రచ్చబండలాంటి పెద్ద బండపై కూర్చున్నారు. వారికి ఇరువైపులా జనాలు కూర్చున్నారు. కొందరు నిలబడే ఉన్నారు.

సుందరశాస్త్రిని జమీందారు అడిగారు “అసలేమిటిదంతా శాస్త్రి గారూ? ఆ అమ్మాయి నిన్న బట్టలు చింపుకుని గుడిలో దిసమొలతో పరుగెత్తింది! పిచ్చిదానిలా ప్రవర్తించింది! ఎవరైనా చేతబడి చేశారా? సందేహించక చెప్పండి. నా భార్యకు ఈ మధ్య మూర్ఛలు వస్తున్నాయి. మొత్తం నాకు తెలియాలి.”

“అబ్బే అలాంటిదేమీ లేదు జమీందారుగారూ! ఇదొక వింతైన విషయము. ఎప్పుడూ ఎవ్వరూ ఎక్కడా , విని కానీ చూసికానీ ఉండరు. అసలు నిన్న వరాలు చెప్పినది నాకే అంతుపట్టలేదు. ఇలాగ కూడా అవుతుందా అని ఆశ్చర్యమైంది. కానీ వరాలు ఇంకా చిన్న పిల్ల. కల్పించి చెప్పేంత ఊహ ఇంకా రాలేదు. ఆ పాప చెప్పిందంతా నిజమే అని భావిస్తున్నాను. పైగా, నిన్న ఆమెలో ప్రేత లక్షణాలు పూర్తిగా గమనించాను. ఇది తప్పకుండా అశాంతితో ఉన్న ఏదో ప్రేతపు ఆక్రోశమే. మన పూర్వీకులు చనిపోయిన వారికి ప్రేతకర్మలు, శ్రాద్ధాలు విధించడములో ఎంతో వివేకము, అర్థమూ ఉన్నాయి.”

“ప్రేతమా? ఎవరి ప్రేతము?”

[amazon_link asins=’B00VRQ53SA,9381506108,B00HWWNU1K,B00HWWJ9R4′ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’fca0b1af-730e-4cca-adf8-9ee6ccd18e42′]

“అదే ఇప్పుడు తెలియాలి. నెలరోజులనుండీ ఒక ప్రేతము వరాలును పట్టి, విడుస్తోంది. ఇతరులను పట్టడానికి కూడా ప్రయత్నించింది. కానీ వాళ్ళు కొంత బలమైన చిత్తము కలవారు కావడముతో , అంతగా సఫలము కాలేదు. వరాలు మానసికంగా బలహీనమైన అమ్మాయి. అందుకే వరాలును పట్టింది.”

“అసలు ఈ దయ్యాలు, ప్రేతాలు ఆవహించడాలు నిజమేనా? అంతా వివరంగా చెప్పండి..!!”

సుందరశాస్త్రిని ఉండమని చెప్పి దీక్షితులు అన్నారు – “నిన్న వరాలు చాలా విషయాలు చెప్పింది. తనను పట్టిన ఆ ప్రేతముతోనే మాట్లాడాము. నిజానికి అవన్నీ చెప్పింది వరాలు కాదు. వరాలును ఆవహించిన ఆ ప్రేతమే తన వివరాలు అన్నీ చెప్పింది. తాను, భర్త, ఇద్దరు పిల్లలతో సుఖంగా ఉండేదట. తన భర్త అపర కర్మలు చేయించేవాడట. కానీ రెండేళ్ళ కిందట జరిగిన పాకిస్తాన్ యుద్ధ సమయంలో వారి ఇరవైయేళ్ళ కొడుకు బలి అయ్యాడు. దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోయారు. వీరి కూతురికైతే అన్న అంటే ప్రాణం. అన్నయ్య మరణవార్త ఆ అమ్మాయిని కలచివేసింది. పిచ్చిదానిలా ఎప్పుడూ చీకట్లో కూర్చొనేదట. ఎవరైనా దీపం వెలిగిస్తే భరించలేక వెక్కివెక్కి ఏడ్చేదట. క్రమంగా పిచ్చి ఎక్కువై, ఇక నయం కాదు అని తేలాక, ఆ అమ్మాయిని అదేదో పట్నపు పిచ్చాసుపత్రిలోనే వదిలేశారట. కొడుకూ, కూతురూ అలా కావడముతో తల్లి గుండెలవిసేలా ఏడ్చి ఒకసారి ఆత్మహత్య చేసుకోబోగా, భర్త కనిపెట్టి నివారించాడట. కానీ వారు ఉన్న ఊరిని వదిలేసి ఈ ఊరికి వచ్చారట. ఎప్పుడొచ్చారంటే ఇప్పుడే అంటుంది. కానీ వచ్చి రెండు నెలలైనా అయి ఉండాలి. ఎందుకంటే, వరాలుకు ఆ లక్షణాలు నెల కిందనుంచే వచ్చాయి కదా! ప్రేతాలకు కాలమంటే తెలియదు. వాళ్ళబ్బాయి చనిపోయి రెండేళ్లు అయిందని కూడా ఆ ప్రేతము చెప్పలేదు. కానీ పాకిస్తాన్ యుద్ధం లో అని చెప్పింది కాబట్టి, రమారమిగా రెండేళ్ళు అని ఊహించాము!”

సుందరశాస్త్రి అందుకున్నాడు “ఇంకో అతి విచిత్రమైన విషయము ఏమిటంటే, ఆ ప్రేతము తాను ఇంకా మనిషినే అనుకుంటోంది! తాను చచ్చిపోయిన జ్ఞానము ఇంకా కలగలేదు. బహుశః ఆ చనిపోయిన ఆమెకు ప్రేత కర్మలు, శ్రాద్ధము వంటివి జరగలేదేమో! పిచ్చిపట్టిన వాళ్ళు ఎలాగైతే ఏవేవో పిచ్చి కలలు, ఊహల్లో ఉంటారో, ఇటువంటి కర్మలు జరగని ప్రేతాలు కూడా అటువంటి ఊహలు, భావాల్లో ఉంటాయి. ఎందుకంటే, ఆ ప్రేతాల ఒకప్పటి శరీరాలు ఇంకా అలాగే కాల్చబడకుండా, పూడ్చబడకుండా ఉంటాయి. సగం కుళ్ళి ఉన్నా కూడా తమ శరీరం పై ఆ ప్రేతాలకు వ్యామోహం వీడదు. తాము బ్రతికి ఉన్నామనే అనుకుంటాయి. రకరకాల ఊహల్లో ఉంటాయి. ఏవేవో భ్రమలు చెందుతుంటాయి. వీటినే ఆంగ్లం లో హాల్యూషినేషన్స్ అంటారని మా డాక్టర్ అన్నయ్య చెప్పేవాడు.”

“ఇంతకీ ఆ మనిషి ఎలా చచ్చిపోయాడు?” అడిగాడు ప్రెసిడెంటు.

“అది కూడా చెప్పింది. వరాలును పట్టిన ప్రేతము ఒక ఆడ మనిషిది. తాను ఆత్మహత్య చేసుకోబోగా భర్త వారించాడనీ, అయితే ఆ భర్తే తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడనీ, తానే దగ్గరుండి కర్మలు చేయించిందనీ, ఇక తాను బ్రతకలేననుకొని నిద్రమాత్రలు మింగి ఒక రైలెక్కాననీ, ఆ రైల్లో ఈ ఊరికి వచ్చాననీ చెప్పింది. “

“ఈ ఊరికి ఎప్పుడొచ్చింది? మాకెవరికీ తెలీదే? వచ్చి ఎక్కడుంది? ” అడిగాడు జమీందారు.

“అదే చెప్పబోతున్నా.. గొంతు సవరించుకుంటూ అన్నాడు సుందరశాస్త్రి. “ఆమె సుమారు రెండు నెలలకింద వచ్చింది. మాయింటికే వచ్చింది. మా రామలక్ష్మి అదే రైల్లో ఒకతే పుట్టింటినుండీ వస్తోంది. అప్పుడు ఒకామె స్పృహలేకుండా రైల్లో పడిఉందట. చూస్తే బ్రాహ్మణ స్త్రీ లాగా అనిపిస్తే, వదలిరావడానికి మనసొప్పక, రైల్వే డాక్టరుకు చూపించి ఆమెకు స్పృహరాగానే తన వెంట తీసుకుని మాయింటికి ఒక రాత్రివేళ వచ్చింది. అలా ముక్కూమొహం తెలియనిదాన్ని ఎందుకు తీసుకొచ్చావు? పోలీసులకు చెప్పిఉంటే వారే చూసుకొనేవారు కదా అని, పొద్దున్నే ఎక్కడికైనా పంపించేయమనీ నేను రామలక్ష్మిని కోప్పడ్డాను కూడా. నేనలా కోప్పడ్డం ఆమె విని ’నీ భర్తకు ఇష్టం లేకపోతే నేనిప్పుడే వెళ్ళిపోతానులేమ్మా!’ అందట. రామలక్ష్మే ఏదో సర్ది చెప్పింది. జమీందారుగారూ, ఆమెను ఆ మరునాడే మీరుకూడా చూశారు. రెణ్ణెళ్ళ కిందట మీ తండ్రిగారి శ్రాద్ధము జరగలేదూ? అప్పుడు మీ ఇంట్లో భోజనము కూడా చేసింది. అదేరోజు చెప్పాపెట్టకుండా ఎటో వెళ్ళిపోయింది!”

జమీందారు ఆశ్చర్యంతో వింటున్నాడు –  “ఎవరామె? పేరేమిటి?”

“అదే, రామలక్ష్మి నిన్నటినుండీ ఆలోచిస్తున్నది…గుర్తురావట్లేదట… “

అందరూ ఆశ్చర్యపోయారు.”అయితే, ఆమె అప్పుడే వెళ్ళిపోయిందన్నారుగా! ఇంకా ఈ వూరితో ఆమెకు సంబంధమేమిటి? ఇక్కడే ఆమె ప్రేతము ఎందుకు తిరుగుతోంది? ” అని అడిగారెవరో.

“అదే నాకు అర్థము కావడములేదు. బహుశా ఆమె ఈ ఊరు వదలి వెళ్ళలేదా? అదే నిజము కావచ్చు!”

గొల్ల రాముడు అడిగాడు – “సామీ, ఇదంతా నాకు అర్థము కాలేదు గానీ మా వరాలును ఎందుకు పట్టుకుంది? ఊళ్ళో ఇంకెవరూ దొరకలేదా ఆ దయ్యపు ముండకు?”

“ఆమెకు మీ వరాలు పరిచయం అయి ఉండాలి. నిన్న జమీందారు గారి భార్యను కూడా పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఎందుకంటే ఆవిడ ఈ ప్రేతపు మనిషికి శ్రాద్ధ భోజనములో పరిచయము అయింది కాబట్టి. అలాగే, రామలక్ష్మిని కూడా నిన్ననే పట్టుకొని క్షణాల్లో వదిలేసింది. దీన్ని బట్టి చూస్తే తనకు పరిచయం ఉన్న వారిని మాత్రమే పట్టుకుంది.”

లక్ష్మమ్మ అంది “సామీ, మా పాప ఆయమ్మను ఎప్పుడూ చూసి ఉండదు. అది అసలు బయటికే వెళ్ళదు. వెళ్ళినా నాతో పాటే వస్తుంది కానీ ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళదు. ఆయమ్మ ఎవరై ఉంటాది?…ఆ( ఔను సామీ…అదే నిజమైఉండాల! ఒకసారి ఇదీ, నేనూ కలిసి ఉత్తరాన ఉన్న పల్లెకి వెళ్ళాము. తిరిగి వచ్చేటప్పుడు ఇది దారిలో ’అమ్మా , అర్జెంటుగా రెంటాలుకి పోవాలే’ అంది. నాకు ఏమిచెయ్యటానికీ పాలుపోక, ఉత్తరాన ఆ పాడుపడిన ఇల్లు ఉందిగదా అక్కడికి వెళ్ళమని చెప్పి వెంట ఉన్న నీటి పాత్ర ఇచ్చి నేను బయటే ఉన్నా. ఇదేమో నిమిషం లోనే బయటికొచ్చి ’అమ్మా, లేదులేవే, ఇంటికి వెళ్ళాకే బయటికి వెళతాను’ అంది. సరేనని ఇంటికొచ్చి చూస్తే నేను దానికిచ్చిన పాత్ర, పక్కూరినుండీ తెచ్చుకున్న జున్ను పాల పాత్ర. అట్టాంటిదే ఇంకో పాత్రలో నీళ్ళు నాదగ్గరే ఉండింది. అయితే, దానికిచ్చిన పాత్రలో జున్ను లేదు. ఖాళీగా ఉంది. జున్నేం చేశావే అంటే, ’ఆయింట్లో ఆయమ్మ కిచ్చేశానుగ..’ అంది. ఎవరే ఆయమ్మా? అనడిగితే, ’ఏమో, అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆకలైందేమో అని ఆయమ్మ ముందరున్న మూకుడులో పాలు పోసి ’అమ్మయ్యగోరు… పాలుతాగండ’ని చెప్పి వచ్చినా అంది. పిచ్చిపిల్ల! పాలు ఒలకపోసుకుని కథలు చెప్పుతోంది అనుకున్నా…”

ఈసారి అందరూ మళ్ళీ ఆశ్చర్య పోయారు.. అసలు ఊరికి ఉత్తరాన ఉన్న ఆ ఇంటివైపు ఎవరూ వెళ్ళరు. చాలామందికి భయము. కొందరైతే అందులో ఏవో శబ్దాలు వస్తాయి అంటారు. లక్షమ్మ అదే ఇంటిలోకి పిల్లను పంపించడము ఆశ్చర్యమే.

“ఆ ఇంటి గురించి నాకేమీ తెలీదు సామీ..” అంది లక్ష్మమ్మ.

“ఇదెప్పుడు జరిగింది? ” అన్నాడు సుందరశాస్త్రి.

“మొన్న ఆషాఢ మాసానికి కొంచం ముందర సామీ…”

“అంటే, రెండు నెలలు కావస్తోంది! సందేహం లేదు, ఆ యింట్లో ఆమె శవం ఉండే అవకాశం ఉంది!” అన్నాడు దీక్షితులు.

ఉన్నట్టుండి రామలక్ష్మి అంది “ఔను, ఇప్పుడు గుర్తొచ్చింది. ఆమె పేరు వర్ధనమ్మ. ఆమె భర్త పేరు అవధానులట. ఆ ఇంట్లో తాను తెచ్చుకున్న నిద్రమాత్రలే మింగిందో…లేక పక్కనే గన్నేరు చెట్లున్నాయటగా! వాటి కాయలే మింగిందో?”

జమీందారు పోలీసులతో అన్నాడు “కానిస్టేబుల్ గారూ! వెళ్ళి అక్కడ వెదకండి…శవం ఉందేమో!!”

* * * * *

దాదాపు కుళ్ళిపోయిన ఒక శవం పోలీసులకు దొరికింది. ఆమె కట్టుకున్న చీరను రామలక్ష్మి, జమీందారు భార్యా గుర్తించారు.

* * * * *

~~ooఅయిపోయిందిoo~~

Your views are valuable to us!