నిండు పున్నమి వెలుగు రేఖ ఒకటి పడి కన్యాకుమారి గర్భాలయంలో అమ్మవారి ముక్కుపుడక తళుక్కున మెరిసింది.
కైలాసంలో పార్వతీదేవి పెదవులపై చిరునవ్వుల దివ్వెలు తళతళమన్నాయి. కానీ ధ్యానమగ్నుడైన శివయ్యలో కదలిక లేదు.
మరోమారు మరో వెన్నెల రేఖ పడడం, కన్యాకుమారి ముక్కుపుడక వెలగడం, పార్వతీదేవి నవ్వడం జరిగింది. కనీసం మూడోకంటితోనైనా ఓరచూపు చూడలేదా భోలా శంకరుడు.
అమ్మవారికేమో అయ్యవారు చూచి ఉబలాటపడలన్న ఉబలాటం. కానీ ఎలా?
“బుద్ధికి అభిమానిగా ఘోషిస్తున్నాయి శాస్త్రాలు. ఈ మనోభిమానిని కదిలించే ఉపాయమేమిటబ్బా?” అని ఆలోచించగా కొద్దిసేపటి తర్వాత కన్యాకుమారి ముక్కు పుడక మెరుపులాంటి ఆలోచన వచ్చింది.
“ఆహా! అదీ బుద్ధి పదునంటే…..”అని అనుకొన్న పార్వతమ్మ ఒక్కసారిగా ఎలుగెత్తి “వస్తున్నావా కాలుడా! సంరక్షింపు వీరభద్రాత్మకా!” అని గొంతు మార్చి మార్కండేయునిలా అరిచింది.
ఆ ఆర్తనాదంలోని ఆర్ద్రతకు అంతటి పరమశివుడే కదిలిపోయాడు. హిమశీతల ప్రభావం వల్ల కరిగిపోకుండా ఘనీభూత దేహుడై కనులు తెరిచాడు.
తెరిస్తే ఎదురుగా…….ఏముంది?
‘పులితోలు వలు’వైన నిటలాక్షుని పట్టమహిషి….వెలిబూది సిరియైన శశిశేఖరుని మనోహరి…హిమశైల సంచారి మనోశైల విహారిణి….విరహిణి….అహరహం శంకరనామ స్మరణాసక్త ఉమామహేశ్వరి…శాంకరి!
“ఏమిటిది దేవీ? ఈ చిలిపిదనం!” అన్నాడు నంది వాయించే మృదంగధ్వానం లాంటి గళన్నినాదంతో. ఆతని పెదవుల మీది మందహాసం మంద మందాకినీ ప్రవాహంలా చల్లగా అంబికా మదిని సోకింది.
తాను చేసిన అల్లరి పనికి కాస్తంత సిగ్గుతో సిగ్గిల్లి, చూపుల్ని నేలకు గురిచేసి, సుతిమెత్తని స్వరంతో “స్వామీ! ఇప్పటికిప్పుడు చిత్రమైన కథనొక్కటి వినాలనిపించింది!” అని అన్నది హిమవన్నగ తనయ.
మూడో కన్ను విస్తుబోతుంటే, మిగిలిన ఆ రెండు కళ్ళూ అస్తమిస్తున్న అరుణార్క బింబాలవుతుండగా – “దానికి నారదుడున్నాడుగా! నన్నెందుకు భంగపరచడం!!” అన్నాడు మహాదేవుడు.
“మనసుకు-బుద్ధికి సంబంధం గానీ బుద్ధికి – తిరుగుడుకు ఎక్కడి సాపత్యం స్వామీ? నాకు మీరే చెప్పాలి!” అని గోముగా పలికింది గిరిజ.
భేరీ భాంకృత ఢమరుక ధ్వనన్నినాదావృత నటనాసక్తుడైన సదాశివుడు లలిత లలిత కోమల సింజన్నూపుర నినాదసమమైన ఆ కలకంఠి కంఠోత్పన్న కలధ్వనికి కదలిపోయాడు. ఆయన పెదవులపై మరోమారు మందాకినీ ప్రవాహం ప్రఫుల్లమైంది.
ప్రసన్న వదనంతో “ఏ కథ కావాలి దేవీ?” అన్నాడు.
“నాక్కావల్సిందిల్లా ఓ చిత్రాతిచిత్రమైన కథ వినాలనే! ఎక్కడి కథో, ఏ కథో, ఎలాంటి కథో ఏమో! నాకేం తెలుసు?” అని నర్మగర్భంగా అంది మేనాదేవి గర్భసంజాత.
“ఓహో! మనోభిమానికే పరీక్షయా?అస్తు….తథాస్తు….నీ మనోరంజనానికై ఓ విచిత్ర కథను చెబుతాను విను!” అన్నాడు.
శివుడి ఆజ్ఞ అయింది కాబోలు – నంది మెడలోని గంట గప్‍చుప్ అయ్యింది. జూలు విదిస్తున్న సింహం బొమ్మల్లే మారిపోయింది. దాగుడు మూతలాడుకొంటున్న ఎలుక-పాము ఎక్కడివక్కడ నిలచిపోయాయి. పురి విప్పాలని అనుకొన్న నెమలి కనులు మూసి ధ్యానాసక్తమై పోయింది.
రాలి పడుతున్న మంచు తునకలు ఆగిపోయాయి. పరుగెడుతున్న సూర్య రథపు చక్రాలు మబ్బుల్ని శబ్దనిరోధకాలుగా చుట్టుకొన్నాయి. అదేపనిగా ధ్వనులు చేస్తున్న సమస్త విశ్వం సుప్తమై, నిర్లిప్తమైపోయింది.
అంతా శబ్దరహితం!
జటాజూటంలోని బాల చంద్రుని సన్నని కిరణాలు నిశ్శబ్దంగా పడుతూవుంటే అంబికా దేవి అర్థించిన విచిత్ర కథను చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు కపర్ధి!
“దేవీ! ఈ కథ పేరు ఒంటిస్థంభం మేడ అనబడే దీపస్థంభం కథ….” అని ఆగి పార్వతీదేవి ప్రతిస్పందనకై చూసాడు శంకరుడు.
నిగమవందితుడైన మగని నగుమోమును అలా చూస్తూనేవున్న నగజను చూసి, సగము మిగిలినవాడు నవ్వి కథను కొనసాగించాడు.
@@@@@
[amazon_link asins=’B079M83R8L,B07CSVVSP1′ template=’ProductGrid’ store=’aavaakin-21′ marketplace=’IN’ link_id=’b7c72fce-f6bb-4b95-b9ec-8d72b6cd8b4c’]కలికాలం చెలరేగుతున్న ఇలపై పుణ్యాద్రి అనే పుణ్య స్థలంలో ఓ దేవస్థానం. అందులోని దేవుని పేరు త్రినామధారి. వాడు చక్రధారి కూడా. అంతే కాదు శంఖధారి కూడా. దానితో బాటు ఖడ్గధారి కూడా. ఇన్నింటిని ధరించాడు కాబట్టి వాడికి ’భరించేవాడన్న’ బిరుదు వచ్చింది. వేరే ఏ దారీ పట్టిపోకుండా నిలబడేవున్న వాడిని చూసి “నువ్వే మాకు దారి” అంటూ కీర్తించేవారు ప్రజలు.
ఆ త్రినామధారి అక్కడ ఎన్నాళ్ల నుండి ఉంటున్నాడో ఎవ్వరికీ తెలీదు. తలా పుస్తకం తలకొక రకంగా చెబుతుంది. కొందరు భక్తులు తమ కోసమే వచ్చాడంటారు. కొందరేమో వాడి కోసమే మేమొస్తామంటారు. చాలామంది మాత్రం అక్కడికి ఎందుకొస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారో తెలిసేది కాదు.
ఒకడేమో వాళ్ళ తాతగారొచ్చారని వస్తుంటాడు. మరొకడేమో ఒక్క నలుసు పుట్టినా చాలనుకొంటే కవలలు పుట్టారని వస్తుంటాడు. ఇంకొకడేమో పది రూపాయాలు కావాలని అడిగితే వంద రూపాయలొచ్చాని వస్తాడు. ఒక్క రూపాయి ముడుపునిచ్చి వెళ్తాడు. పెళ్ళి కాలేదన్న బెంగతో ఓ పిల్ల వస్తుంది. ఆ పిల్లే తల్లి ఐనానని మళ్ళీ వస్తుంది. ఆ తల్లే మునిమనవడు పుట్టాడని నడిచి కొండెక్కుతుంది. ఇలా వస్తూనే ఉంటారక్కడకు జనాలు. ఎవరి గోల వాడిది. ఎవడి త్రోవ వాడిది. ఎవరి మొక్కు వారిది. ఎవరి తృప్తి వారిది.
ఓ అయ్య వచ్చాడు ఏవో పాటలు వ్రాసాడు. ప్రజలు మైమరచిపోయారు. ఆ అయ్య అటు పోగానే అన్నీ మర్చిపోయారు. ఈలోగా ఓ దాసు వచ్చాడు. ఆయనా పాటలు వ్రాసి, పాడి, నర్తించాడు. ప్రజలు ఆడి, పాడి, సుఖించారు. ఆ దాసుడూ పోయాడు. ఆ తర్వాత ప్రజలు సుఖమంటే ఏమిటో మర్చిపోయారు.
పక్కవాడి ఇల్లు పచ్చగా ఉంటే మంటపెట్టేవారు పుట్టుకొచ్చారు. ఎదుటివాడి ఎదుగుదలకు అడ్డుకొట్టేవాళ్ళు వచ్చారు. శాంతి కోసం కత్తులు నూరేవాళ్ళొచ్చారు. హింసకు వేయి చేతులు, పదివేల కాళ్ళు, లక్ష నాలుకలు పెరిగాయి. రక్తబీజాసురుల్లా జనాలు మారిపోయారు. కాళిక నాలుక మాత్రం ఎక్కడుందో, ఎప్పుడొస్తుందో తెలీడం లేదు. ఇవేవీ పట్టని త్రినామధారి అలా నిలబడే ఉన్నాడు. భక్తి తోలు కప్పుకొన్న ప్రజలు వస్తూనే ఉన్నారు.
ఇలానే మరొ కొన్ని రోజులు గడిచాయి.
“పాపీ చిరాయుః – సుజనా గతాయుః” అన్నట్టు ఇలలోకి వచ్చే జనాలు ఎక్కువై, పోయే జనాలు తక్కువయ్యే కాలమొచ్చింది. ఏది వచ్చి వెళ్ళినా త్రినామధారి మొహంపై నామాలు చెరగలేదు. శంఖచక్రాలు స్థానాలు మార్చుకోలేదు. కనీసం వాడు ఒక్క అడుగైనా కదల్లేదు. ముక్కుపై దురద పుట్టినా గోక్కోలేదు. “ఎందుకో?” అని అడిగితే ఓ దాసానుదాసుడన్నాడు – “వాడు చేయి కదిలిస్తే విలయమే”నని. “కాబోలు…కాబోలు”నన్నారు భృత్యస్య భృత్య పరిచారక భృత్య భృత్యులు.
కాలం పాకిపోయే కొద్దీ పాపాలు చేయడం ఎక్కువైపోయింది ప్రజలకి. ఇంతలో త్రినామధారికి డబ్బులిచ్చేస్తే పాపాల పీపాలు నామరూపాలు లేకుండా పోతాయనే పుకారు పుట్టింది. పెళ్ళి చేయడం కంటే చెడగొట్టడం సులువన్నట్టు పుణ్యాన్ని సంపాయించడం కంటే పాపాన్ని చేసి వదిలించుకోవడం సులభమనిపించింది పాపి ప్రజలకు.
నిచ్చెన చేయడం కష్టం – ఎక్కెక్కి దిగడం అతి సులభం!
సులభ పాపానికి అలవాటుపడిన ప్రజలకన్నీ సులభమైనవే కావాల్సివస్తోంది.
ఎవరో ఒక నిజభక్తిపరుడు “భక్త సులభా!” అని గొంతెత్తి కేకేసాడు. అంతే, బొందితో వైకుంఠానికి వెళ్ళిపోయాడు. పాపాలు చెయ్యడంతో చెవులు చెడిపోయిన వారికి కేవలం “సులభా!” అని వినబడింది. ఆ నిజభక్తుడు వైకుంఠానికి నిఠారుగా వెళ్ళిపోవడం మాత్రం కనబడింది. అంతే…సులభ సాధనా వ్యసనులైన ప్రజలు వీడే కలియుగ దైవమంటూ పొలోమని రావడం మొదలేసారు. అంతే…..త్రినామధారి ఆదాయం నక్షత్రరాశిలా అనంతంగా పెరుగుతూనే వచ్చింది.
వాడి గుడి పక్కన ఉండే కోనేరులో నీళ్ళు ఉన్నా లేకపోయినా హుండీలో మాత్రం డబ్బు నిండే ఉండేది. సులభ ప్రియులైన భక్తుల గుండెల్లో భక్తి ఉన్నా లేకున్నా జేబుల్లో మాత్రం డబ్బులుండేవి. గంటకోమారు హుండీ నిండుతోంది గనుక, వచ్చే జనాలు కూడా హెచ్చారు కనుక హుండీని, తనని చూసుకొనేందుకు సిబ్బందిని పెట్టుకొన్నాడు త్రినామధారి.
ఆసరా దొరికితే చాలునని యాచిస్తూ తిరుగుతున్న వారిని ఒక్కక్కరినే ఏరికోరి ఎన్నుకొన్నాడు. ఎంతైనా ఏరి ఏరి ఎంగిలి చేసిన శబరికి లొంగినవాడు కదా! అవతారం మారినా ఆ లొంగిపోయే బానిస బుద్ధి మారుతుందా?
ఈ త్రినామధారికి ఒకప్పుడు రామరాజ్యమన్న ఓ బ్రహ్మపదార్థాన్ని నిభాయించిన అనుభవం ఉంది. ఆ రాజ్యంలో అందరూ “యథా రాజా – తథా ప్రజ”లే నట! ఆ పిచ్చి త్రినామధారికి ఈ శాలివాహన శకపు కలికాలంలో కూడా అదే నమ్మకం. కానీ ఇక్కడ మాత్రం ఆ పప్పుడకలేదు. చివరకు “ఎక్కడ సిబ్బందో – అక్కడ ఇబ్బంది” అన్న నానుడిని పుట్టించుకొన్నాడు వాడు. కాస్త మనశ్శాంతి కలిగింది. అలా శంఖచక్రాల్ని మోస్తూ కొండపై నిలబడే ఉన్నాడు. ఏం మార్పు లేదు. కానీ నామాల్లో కొంచెం మార్పు చేసుకొన్నాడు.
డబ్బాకలి, జబ్బాకలి, కోర్కెల ఆకలి ప్రబలిపోయి నేరాలు, ఘోరాలు పెచ్చరిల్లుతున్న కలికాలంలో గాంధారీదేవిని ఆదర్శంగా చేసుకొని నామాల దిట్టాన్ని పెంచేసుకొని, కళ్ళను కప్పేసుకొన్నాడు. కళ్ళపై దట్టంగా నామాలు పెట్టేసుకొన్నాక కాస్తంత హాయిగా ఉందనిపించింది వాడికి. ఒకప్పుడు మొహాన్ని చూసి వరాలిచ్చేవాడు. ఇప్పుడు మొరలాలకించి వరాలివ్వాల్సి వస్తోంది. “ఇది కష్టమే సుమీ!” అని అనుకొన్నాడు. కానీ కళ్ళు తెరిస్తే తనకు కలిగే కష్టం కంటేనా అని సర్దుకుపోసాగాడు.
త్రినామధారికి ఉన్న సమస్యలకు తోడుగా మరొకటి వచ్చిపడింది. కలికాలం కొండెక్కే కొద్దీ వీధికొక్క పరమాత్ముడు వెలసి పోసాగాడు. ఈ నయా పరమాత్మలందరూ తామే అంతరాత్మయైనట్టుగా ప్రజల్ని వెర్రూతలూగించసాగారు. యుగయుగాల నుండీ కదలకుండా నిలబడి జగతికి సుగతిని కల్పిస్తున్న త్రినామధారికి ఇదో సంకటంగా మారిపోసాగింది. కదిలే దేవుళ్ళు, ఎగిరే దేవతలకు – కదల్లేని, కదలకూడని త్రినామధారికి మధ్య అసమంజసమైన పోటీ వచ్చి పడింది.
ఇవన్నీ చాలవన్నట్టు రద్దీ పెరిగి, సులభ భక్తుల జీవితాలు మరింత సులభతరం కావడానికి పుణ్యాద్రి పై అద్దె కొంపలు అవతరించాయి. పాచికూళ్ళ పూటకూళ్ళ వసతులు పెరిగాయి. నోటికి పని ఇచ్చాక చెంబుకూ పని తప్పదు కదా! దానికోసమని ఆ వసతులూ ఊడిపడ్డాయి. పుణ్యాద్రిలో ఇప్పుడు మొదటి, నాలుగో పురుషార్థాల కంటే రెండవది, మూడవది వెంటనే తీరుతున్నాయి.
కలికాలం మరింత ముందుకు కదిలి కోలాహలాహలంగా మారిపోయింది.
కాలానుగుణంగా ఒకానొక నవీన యంత్ర-తంత్ర జ్ఞానం పుట్టుకొచ్చింది. కూర్చున్న చోటే కదిలే బొమ్మల్ని చూపించే ప్రియదర్శినీ పెట్టె వచ్చింది. కోడిపెట్టె ఒకమారు ఒక గుడ్డునే పెడుతుందేమో ఈ పెట్టె మాత్రం ఒకేసారి వందా యాభై గుడ్లని పెడుతుంది. ఎవడిక్కావలసిన గుడ్డును వాడు ఎన్నుకోవచ్చు. ఎంచుకొని ఆ గుడ్డుపై ఈకలు మొలిచేవరకూ చూస్తూనే కూర్చోవచ్చు. అలా కూర్చునే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. బంతులాట, పూబంతులాట, చిందులాట, కన్నె ఇంతులాట – ఇలా ఆటాటోప, పటాటోపాలతో ఆ ప్రియదర్శినీ పెట్టె పెరిగి పెరిగి, ఇంతై ఇంతింతై అంతంతై ఎంతెంతో ఐపోయి త్రినామధారి రూపలావణ్యాలను జనాల మెదళ్ళలోని పాతాళ భాగానికి తొక్కేయసాగింది.
భక్తుల సౌలభ్యం కోసం పుణ్యాద్రిపై కట్టిన యాత్రిక సదనాల్లోకి పై చెప్పుకొన్న యాంత్రిక పెట్టె చొచ్చుకొచ్చింది. ఏమరుగా ఆవుకు మేత వేసినట్టో, అలవాటుగా పాలు పితికినట్టో ప్రజలు త్రినామధారిని చూసేసి వచ్చి ఆ పెట్టె ముందు కూర్చోసాగారు. మైమర్చిపోసాగారు. ముఖ్యంగా బంతాట, కుర్ర ఇంతాటల జోరు అంతా ఇంతా కాదు. పూర్వం హిరణ్యకశిపుని తపఃప్రభావం ఇంద్రలోకం వరకూ ఎగిరిపడ్డట్టు ఆ పెట్టె ప్రభావం త్రినామధారి వరకూ పాకిపోయింది.
త్రినామధారి కళ్ళు మూసేసుకొన్నా చెవుల్ని మూసేసుకోలేదు కాబట్టి బొమ్మ అగుపడకపోయినా ఆ బొమ్మ చేసే అల్లరిని వినసాగాడు. ఆ పెట్టె సంగతేంటో తెలుసుకోవాలనుకొన్నాడు. త్రినామధారిది అసాధారణమైన దృష్టి గనుక మొత్తం విషయం దృగ్గోచరమైపోయింది.
అది శాలివాహన శకం 1931 వ సంవత్సరంలో ఒకానొక రోజు.
త్రినామధారి మదిలో మెదలుతున్న ప్రియదర్శినీ పేటికకు ప్రాణమొచ్చిన రోజు.
అద్భుతంగా ఆరంభమైన ఆ వాహినికి “త్రిధామ వాహిని” అని పేరు పెట్టారు. అంటే త్రినామధారి లోని త్రిని, ధాని, మను తీసుకొని పెట్టిందన్న మాట. అక్షరాలు వ్యత్యస్తమైనా తన వాహిని అస్తవ్యస్తం కాకుంటే చాలునని అనుకొన్నాడు త్రినామధారి. అతని వరసే అంత! పాపం చాలా మర్యాదా పురుషోత్తముడు. “ఎంతటి మర్యాదయ్యా?” అని ఓ అబ్బాయి అడిగితే వాడి నాస్తిక బాబాయి ఇలా చెప్పుకొచ్చాడు –
“అమరలోక విజేత లంకాధినేత శాసనమ్మును నిరాకరించు విష్ణుదాసుల కేల్ విరచి కట్టి, చెరను నెట్టిన” తర్వాత కూడా కదలని వాడు. చివరాఖరికి తన భార్యే ఆ లంకాధినేతకు బంధీ కావడంతో “ఆహా…కథ అడ్డం తిరిగింద”నుకొన్నవాడు. పినతల్లి చేసిన మోసంతో మానవుల్ని నమ్మలేక కోతి మూకల్ని వెంటేసుకొని, ఎదురు తిరిగిన సముద్రుణ్ణి లొంగదీసుకొని, వంతెనను కట్టి, ఇంతిని తెచ్చుకొని, కట్టిన వంతెను తానే విరగ్గొట్టేసుకొన్నోడు. ఇంతా చేసి తెచ్చుకొన్న భార్యని వెనువెంటనే అడవుల్లోకి నెట్టేసినవాడు.”
ఈ మాటలు విన్న కల్పవృక్షంలాంటి ఆ కుర్రోడు విషవృక్షమైపోయాడు. ఇప్పటికీ ఆ వృక్షం వికసిస్తూనే ఉంది. ఐనా ఈ స్వామి కదలడు, మెదలడు, శిక్షించడు! ఏమిటో ఈ లీల! అర్థం కానివ్వని గోల!
సరే! ఏదైతేనేం….వ్యత్యస్తాక్షరాలతో వెలుగొందుతోన్న తన ప్రియదర్శినీ పెట్టెను చూసుకొని అల్పానందాన్ని పొందసాగాడు. కానీ కాలము కడు కఠినము….విధి బహు బలీయము….
@@@@@
ముగ్ధయై, పతివాక్యానుబద్ధయై, నిశ్శబ్దయై వింటున్న పార్వతి తన పతి వాగ్గంగాప్రవాహం ఆగడంతో ఉలిక్కిపడింది.
“ఆగారేం స్వామీ?” అని అడిగింది.
నంది మెడలోని గంట….కదలకుండా కూర్చొన్న పాము, ఎలుకా ఆసక్తిగా చూసాయి.
“ఇప్పుడు కూసింత అత్యల్ప స్వల్ప విరామం!” అన్నాడు శూలపాణి చిరునవ్వు నవ్వుతూ!
ఘణ్ మన్న చప్పుడొకటి, బుస్ మన్న శబ్దమొకటి ఒకదాన్ని ఒకటి తరుముకొచ్చాయి. వీటన్నింటినీ మింగేస్తూ ఢమ్ ఢమా ఢమ్…ఢుమ్ ఢుమా ఢుమ్ అంటూ ఢమరుకం మ్రోగింది.
గజముఖుడు, షణ్ముఖుడు ప్రాణాయామం చేయసాగారు.
“అదేమిటి నాయనలారా! సంధ్య వార్చడానికి ఇంకా సమయముందిగా?” అని అంది అంబిక.
“అది కాదమ్మా! నాన్నారు చెప్పే కథను వింటూ ఊపిరి తీయడం మర్చిపోయాం. మళ్ళీ కథ మొదలయ్యేలోగా కూసింత గాలి పీల్చాలని….” జంటగా అని ప్రాణాయామంలో ముగినిపోయారు తనయులు.
బహు సంతోషించింది తల్లి.
అయ్యవారి ఢమరుక ధ్వనిలో అమ్మగారి మెటికల విరుపులు కమ్మగా కలిసిపోయాయి.
@@@@@
మళ్ళీ కథ మొదలైంది.
త్రిధామ వాహిని ఒక భవంతి నుండి పని చేస్తుంది. దానికి “అల పరా భవనం” అనే పేరు పెట్టేట్టుగా ప్రేరేపించాడు త్రినామధారి. అవును అతను సర్వ ప్రేరకుడు. ఇలా ఏ పేరునైనా పుట్టించగలడు. పెట్టించగలడు.
ఆ నామకరణపు ఏకాంత రాత్రిలో, త్రినామధారి గుండె స్థలం ఉండే భార్యామణి – “అల పరా భవనమా? దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడో అన్నట్టుగా ఇదేం పేరు స్వామీ?” అని పరాచకాలాడింది.
త్రినామధారికి నవ్వొచ్చింది. ఆ వెంటనే అలుక కూడా వచ్చింది. ముచ్చటైన అయ్య మూతి బుంగమూతి అయింది.
వక్షస్థల వాసినికి ఆ మూతి భలేగా ముద్దొచ్చింది. కానీ ఆ బుంగమూతి ఉన్నంతసేపు తనకు సమాధానం దొరకదని గ్రహించి – “క్షమించండి స్వామీ! అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరేః” అని దేవగాంధారంలో రాగయుక్తంగా పాడింది.
అల్పసంతోషియైన స్వామి బుంగమూతి అవతారాన్ని వర్జించి – “దేవీ! విను!’అల వైకుంఠ పురంబులో” అన్న పద్యం నుండి అల శబ్దాన్ని తీసుకొని, దానికి పురంబు బదులు పరా ను చేర్చాను.” అన్నాడు.
ఈసారి బుంగమూతి పెట్టడం అమ్మవారి వంతైంది.
తను పెట్టిన దానికంటే కూడా తెగ ముద్దొచ్చేస్తున్నా భార్యామణి బుంగమూతిని చూసి కంగారుపడిన త్రినామధారి “ఏమిటిది దేవీ? అర్థం కాలేదా!” అన్నాడు. బుంగమూతిని ఏమాత్రం సడలించకుండా కర్ణకుండలాలు, కరకంకణాలను సవరించి “అవున”నిపించింది ఆమె.
“ఐతే వివరిస్తాను విను దేవీ! అల అంటే అక్కడ అని అర్థం. ఇది అచ్చ తెనుగు. పరా అంటే అప్రాకృతమైనది అని అర్థం. ఇచ్చి శుద్ధ సంస్కృతం. నా ముంగిటికొచ్చే వారిలో పండితులు, పామరులు ఇద్దరూ ఉన్నారు కదా! అందుకనే యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అని చెప్పినట్టు నా వైకుంఠం అక్కడ….ఆ పైన ఉంది అని చెప్పడానికి గాను ఈ భవంతికి అలపరా భవనమని పేరు పెట్టాను.” అని అన్నాడు స్వామి.
స్వామివారి ఉదాత్త హృదయాన్ని, భక్తప్రియత్వాన్ని, సరళ, సౌశీల్య, సురుచిర భరితమైన గుణసౌందర్యాన్ని చూసిన భామామణి ఆనందబాష్పాలను కార్చింది. చిరునవ్వుల రేడైన త్రినామధారి “కాటుక కంటి నీరు చనుకట్టుపయింబడ…ఊ((” అంటూ అర్ధోక్తిలో ఆగి అర్థోక్తిగా కన్ను గీటాడు. అమ్మ సిగ్గుపడింది.
ఆ ఏకాంత రాత్రిలో ఆ గర్భాలయం అలపరా భవనమై అలరారింది.
కానీ రోజులన్నీ ఇలా హాయిగా ఉండవు కదా!
అలపరా భవనంలో పొంగుతున్న త్రిధామ వాహినిని ఉప్పొంగించాలన్న ఆవేశంలో త్రినామధారి మరింత మంది ఆర్తుల్ని ఉద్యోగస్తులుగా చేర్చుకొన్నాడు.
అనేక చిన్న తలకాయలను నడపడానికి కొన్ని పెద్ద తలకాయల్ని తీసుకొన్నాడు. ఈ అన్ని తలకాయలపైనా పెత్తనం చేయడానికి ఓ అతిపెద్ద తలకాయను తయారుజేసుకొన్నాడు. ఈ అతిపెద్దతలకాయ ఒక్క త్రిధామ వాహినినే కాదు మొత్తం పుణ్యాద్రినే నిర్వహించే కార్యనిర్వహణా దురంధర తలన్న మాట!
అప్పటికే “ఎక్కడ సిబ్బందో – అక్కడ ఇబ్బందే”నన్న నానుడిని తయారుజేసుకొన్న త్రినామధారి త్రిధామ వాహినిలో మాత్రం “యథా రాజా – తథా ప్రజా” వంటి రామరాజ్యం ఉత్పత్తి అవుతుందని భావించి కొన్ని ఉత్పలమాలల్ని వ్రాసుకొని ఆనందించాడు. కానీ విధి బలీయము కావున ఆ ఉత్పల మాలలు కాస్త ఉత్పాతాలుగా మారసాగాయి.
“కాయలు కాని కాయలు తలకాయలు” కావున అటువంటి వెర్రిపుచ్చతలకాయలు త్రిధామ వాహినిలోకి చేరడంతో లుకలుకలు పకపకమన సాగాయి. “లంబోదర లకుమికరా” అని అనమని త్రినామధారి ప్రేరేపించినా “కుంభోదర చెకుముకిరా” అని సొంత పైత్యాన్ని వెలయించే స్థాయికి చేరుకొన్నారు త్రిధామ వాసులు.
ఎవరినెలా ప్రేరేపించాలో త్రినామధారి ఆలోచించేలోగా – త్రిధామ వాహినిలోని జలచర, భూచర, ఖేచరాలు “పనిరాని”, “పని చెయ్యని”, “పనికిరాని” అన్న మూడు వర్గాలుగా చీలిపోయాయి. ఒక్కొక్క వర్గానికీ ఒక్కో నాయకుడు. ఆ ఒక్కో నాయకుడి క్రింద అనేకానేక భటాచోర్ జీనియస్ సలహాదారులు, సంప్రదింపుదారులు, వేగులు, వేగుచుక్కలు, రేచుక్కలు, పగటి చుక్కలు, తోకలు, తోకరాయుళ్ళు – అబ్బో పజ్జెనిమిది అక్షోహిణీయుక్త మహాభారత సేనావాహిని కూడా సిగ్గుపడాలి సుమండీ!
అంతట, సుక్షేత్రమనుకొన్న అలపరా భవంతి కురుక్షేత్రమై ప్రతిపక్షాల ప్రత్యక్ష, పరోక్ష, కక్ష్యా, తారతమ్య కక్షలకు సాక్షీభూతమై, నిలువెత్తు బ్రహ్మభూతమై, నభూతో నభవిష్యతిగా సాగిపోతున్న వేళ ఒకానొక పాత్ర ఆ భవంతిలోకి పరకాయ ప్రవేశం చేసింది.
@@@@@
“ఎవరా పాత్ర?” అన్నది పార్వతి.
“ఎవరిదా పాత్ర?” అన్నాడు గజముఖుడు.
“ఎందులకా పాత్ర?” అన్నాడు షణ్ముఖుడు.
“అసలా పాత్ర ఏమిటి?” అన్నారు సమస్త ప్రమధులున్నూ.
’కెంగేల దమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబని సర్వంకషమున్, మహా విషము నాహారించే’ నీలకంఠుడు నవ్వాడు .
చేతులెత్తి శరణాగతి నర్థించారు కైలాసవాసులు.
“ఆ పాత్ర పేరు……. ”
#####
(సశేషాన్ అవిహితాన్ మరిన్ 🙂
అమ్మమ్మా……రాను రాను.. చాటుగా నైనా……ఆవకాయ ఘాటుగా….అతి ఘాటుగా నషాళానికి చేరుతోంది సుమా!!!! విజయోస్తు!!!!
హాహాహా…రాను రాను అంటూనే వచ్చారు. అలా వస్తూనే ఉండండి.
విజయోస్తు అని దీవించారు అందులకు ధన్యవాదాలు అక్కయ్య గారు. త్వరలో మీరు కూడా ఆవకాయ రుచిని పెంచుతారని ఆశిస్తున్నాను.
నమస్సులతో
మీ కడప సోదరుడు