ఉప్పు కప్పురంబు…

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 5]

ఈ వాన ఇప్పట్లో తగ్గేట్టు లేదు.” తలను ఓ సారి బైట పెట్టి, జుత్తును విదిలించుకుంటూ అన్నాడు అతను.

“ఊ” అని మౌనం వహించింది ఆమె.

“ఎంతసేపలా నిలబడే ఉంటారు, ఇలా కూర్చోండి” అని బల్ల కేసి చూపాడు అతను.

“పర్లేదు” అనింది ఆమె.

రెండడుగులు వేసి తనే బల్ల మీద కూర్చున్నాడు అతను. ప్యాంట్ జేబులోకి చేయి పోనిచ్చి కర్చీఫ్ తీసి తలతుడుచుకోసాగాడు.

“చిన్నప్పుడు మీరు స్కూల్లో బాగా అల్లరి చేసే వారా?” అని హటాత్తుగా అడిగాడు. “ఏం ?” అంది ఆవిడ చిరాగ్గా. “ఆహా ఏమీ లేదు…ఎప్పుడూ క్లాసు బైట నిలబడి నిలబడీ, నిలబడ్డం అలవాటైందేమోనని” అన్నాడు నవ్వుతూ. “మీ చనువు నాకు నచ్చలేదు” అని చీదరించుకున్నట్టు పలికింది ఆమె. “సారీ ! ” అని తల వంచుకుని మళ్ళీ తుడుచుకోడం మొదలెట్టాడు అతను.

దూరంగా వెలుగు కనిపించడం తో ఆత్రంగా రోడ్ మీదకు వచ్చింది ఆమె. కారొకటి వేగంగా ఆమెను దాటుకుని వెళ్ళింది. ఆ వెళ్ళే రభసలో ఒకింత బురదను ఆమె వంటి మీద చిలకరించి వెళ్ళింది. “ఛా!” అని గొణిగింది ఆమె. “వడగండ్ల వర్షంలో అలా తడవకండి. మంచిది కాదు” అన్నాడు అతను గట్టిగా అరుస్తున్నట్టు. “స్ట్యుపిడ్” అని గొణుకుంటూ మళ్ళీ బస్ షెల్టర్లోకి వచ్చింది ఆమె.

“నా పేరు అజిత్ ” అన్నాడు అతను. “గుడ్” అంది ఆమె.

“చూడండి మిస్ గుడ్ ! ఈ వండగండ్ల వానలో తడవడం ఎంత డేంజరస్ అంటే…..” అని ఇంకా ఏదో చెప్పబోయాడు అజిత్. “లుక్ మై నేం ఈజ్ నాట్ గుడ్ అండ్ ఆల్సో విల్ యు స్టాప్ టాకింగ్ టు మీ !” అని కటువుగా అంది ఆమె. తెరచిన నోరును అలా తెరచి వుంచే భుజాలు కుదిపాడు అతను. “వీడు, వీడి పిల్లిగడ్డం … ఛా!” అని మళ్ళీ గొణుక్కుంది ఆమె.

ఆ మాటలు చెవినబడ్డట్టుగా అతను మొహం పెట్టి తన ఫ్రెంచ్ బియర్డ్ ను ఓసారి దువ్వుకున్నాడు. “వీడివి పాము చెవుల్లా వున్నాయి” అని గోణుక్కుంది ఆమె, ఈసారి నిశ్శబ్దంగా.

“యారమితా వనమాలినా, సఖీ, యారమితా వనమాలినా” అంటూ కూనిరాగం మొదలెట్టాడు అజిత్ . “ఆహా ! ఈ పిల్లిగడ్డానికి అష్టపదులు కూడా వచ్చా ! కె. విశ్వనాథ్ సినిమాల్లోని హీరో అనుకుంటున్నాడేమో వెర్రి నాన్న” అని మళ్ళీ మనసులోనే గొణుక్కుంది ఆమె.

పటీల్ మని మెరుపు, ధడేల్ మని పిడుగు పడ్డంతో పాటను ఆపేసాడు అజిత్. ఒక్కసారి కళ్ళు పెద్దవి చేసి చటక్కున కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచింది ఆమె. “నా పాటకంటే పిడుగు శబ్దమే మీకు శ్రావ్యంగా ఉందనుకుంటాను?” నవ్వుతూ అన్నాడు అజిత్. కళ్ళు చిన్నవి చేసి అతనికేసి కౄరంగా చూసింది ఆమె. “సారీ ! నోరు కట్టేసుకోడం నాకు చేతకాదు….యూ సీ నేను మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్నాను….వృత్తి జబ్బు” అన్నాడు పళ్ళు కనిపించేంత విశాలంగా నవ్వుతూ. “యూ సీ ! నేను లైబ్రేరియన్ గా పనిచేస్తున్నాను, నిశ్శబ్దం నా ఆరోప్రాణం ” అంది ఆమె. “ఓహ్ ! ” అని కనుబొమలెగరేసి మళ్ళీ తల వంచుకున్నాడు అజిత్. “భలే వందనా ! భలేగా కొట్టావు పిల్లి గడ్డాన్ని” అని తనను తానే పొగుడుకుంది ఆమె.

మళ్ళీ రోడ్ మీద వెలుగు. వందనలో మళ్ళీ ఆతౄత. పరుగెట్టుకెళ్ళి చేయి ఊపసాగింది. కీచుమంటూ ఆగింది లారీ. డోర్ బార్లా తెరచి “కిధర్ జానే కా హై మేం సాబ్ ” అన్నాడు ఓ సర్దార్జీ. ఎందుకో ధైర్యం చాల్లేదు వందనకు. “నై నై, మైనే సోచా కోయీ బస్ హై…ఆప్ జాయియే” అని గుటకలు మింగుతూ చెప్పింది. “చలో చలో” అని డ్రైవర్ ని చూస్తే కేకేసి ధడాలున డోర్ వేసుకున్నాడు సర్దార్జీ.

“ఈ రూట్లో వెళ్ళే ఆఖరి బస్ వెళ్ళి గంటసేపైంది” అన్నాడు అజిత్ బల్ల పై నుంచి లేస్తూ. అతని గొంతులో మునుపు వున్న మెత్తదనం లేదు. గుండె ఝల్లుమంది వందనకు. “మరి మీరెందుకు వెయిట్ చేస్తున్నారు?” గొంతు పెగుల్చుకుని అడిగింది. “మీ కోసం” అన్నాడు అజిత్, తడిచిపోయిన కర్చీఫ్ ను బల్ల పై ఆరబెడుతూ. “మీరు మొదటిసారి ఈ రూట్లో వచ్చినట్టున్నారు?”. చాలా చల్లగా ఉన్నాయి అతని మాటలు. “నో నో ! చాలాసార్లు వచ్చాను” తన గొంతు తనకే బలహీనంగా వినబడుతోందని తెలిసీ మాట్లాడింది వందన. మళ్ళీ పళ్ళు కనబడేట్టు నవ్వాడు అజిత్. “అబద్ధం” అన్నాడు చేతుల్ని పిరుదుల పై రాసుకుంటూ. వందన వేసిన గుటక ఆమె గుండెల్లోకి దిగి దాన్ని కంగారు పెట్టసాగింది. వందనకు దగ్గరగా వచ్చి “వెళ్ళి అక్కడ కూర్చోండి” అన్నాడు బల్ల కేసి చూపిస్తూ. అతని కళ్ళల్లో అక్కడక్కడా ఉన్న జీరల్ని చూడగానే వందనకు కళ్ళు తిరిగాయి. పెంకితనం చేయకుండా బల్ల మీద కూర్చుంది. అతను రోడ్ కేసి చూస్తూ చేతుల్ని ఇంకా పిర్రల మీద రాసుకుంటూనే ఉన్నాడు. బైట వర్షం తో బాటూ వందనకు భయం కూడా పెరగసాగింది.

“నా సామాజిక స్పౄహ తగలడినట్టే వుంది. నీలూ చెప్పినట్టు వచ్చే ఆదివారమే అందరితో కలిసి వచ్చి వుంటే బావుండేది. ఈరోజే వచ్చి చావకపోయి వుంటే ఆ పిల్లలకి లెక్కలు రాకుండా పోయేవా? ఛా!” అని మనసులో మళ్ళీ గొణుక్కుంది.

మొబైల్ మోగిన శబ్దం. వందన తన హ్యాండ్ బ్యాగు తెరచేలోపు అజిత్ “ఏరా ! ఎక్కడున్నావ్ !” అని గట్టిగా అరిచాడు. అవతలి నుండీ ఏదో జవాబు. “గుట్టకింద పల్లి బస్టాపు తెలుసుగా….ఆ..ఆ….అక్కడే” అన్నాడు. మళ్ళీ అవతల నుండి ఏవో మాటలు. ” ఓ ష్యూర్ ! వచ్చేయ్ వచ్చేయ్ ” అన్నాడు. ఆ అనడం కూడా వందన వైపు చూస్తూ అన్నాడు.

గట్టిగా నుదురు కొట్టుకుంది వందన. కళ్ళెగరేసాడు అజిత్. “దోమ” అంది వందన మళ్ళీ నుదుటి మీద కొట్టుకుంటూ. వెంటనే అజిత్ కూడా తన పిరుదు మీద ఒక్క చరుపు చరిచి “అవును” అన్నాడు నవ్వుతూ. డై హార్డ్ సినిమాలో విలన్ నవ్వినట్టుగా అనిపించింది వందనకు. “వీడు నా కోసం ఉన్నట్టుగా చెప్పాడు? ఇప్పుడేమో ఇంకొకణ్ణి రమ్మంటున్నాడు! కొంపదీసి వీడు…..” ఇక ఆలోచిస్తే గుండె ఆగిపోయేట్టు అనిపించింది వందనకు. తనను వచ్చేసరికే ఈ బస్ షెల్టర్లో ఇతను ఉన్నాడు. రోడ్లో పోయే ఏ వాహనాన్ని ఆపడానికి ప్రయత్నం చేయకుండా అలా కూర్చునే ఉన్నాడు. మధ్యమధ్యలో తనతో మాటలు కలపడానికి చూసాడు. ఇప్పుడేమో ఇలా విలన్లా ప్రవర్తించడం మొదలెట్టాడు. వీడికి నిజంగా అలాంటి ఉద్దేశాలేమన్నా ఉన్నాయా?. రాయి పడ్డ చెరువులా ఉంది వందన మనసు. ఆ మనసును మరింత జడిపించేందుకేమో అన్నట్టు పిడుగు పడింది. గట్టిగా చెవులు మూసుకుని “అర్జున, ఫల్గుణా..” అనడం మొదలెట్టాడు అజిత్.

బయ్యిమంటూ హారన్ వేస్తూ వెళ్ళిపోయిందో జీప్. దాని వెనకే మరో కార్ కూడా. “ఛా!” అంది వందన.

ఈలోపు షెల్టర్ల్ వెనక నుండి లోనికి దూసుకొచ్చింది ఓ ఆకారం. ఉలిక్కిపడింది వందన. నెత్తి మీదున్న ప్లాస్టిక్ షీటు తొలగే సరికి ఆకారం అర్థమైంది. అతనో బట్టతల మనిషి. పెద్ద బొజ్జ కూడా. చేతిలోని లెదర్ బ్యాగ్ ను బల్ల మీద పెట్టి ప్లాస్టిక్ షీట్ ను గట్టిగా విదిలించాడు అతను. ఆ చప్పుడుకు వెనక్కు తిరిగాడు అజిత్. వందన అజిత్ కేసి చూసింది.

అతను నెమ్మదిగా బల్ల వైపు అడుగులేసాడు. షీట్ ను ఝాడించి ఝాడించి లెదర్ బ్యాగ్ పక్కన పెట్టి ఇద్దరికేసి చూసి నవ్వాడు అతను. ఆజానుబాహువైన ఓ పెద్ద మనిషి రావడం చూసి వందనకు ధైర్యం పెరిగింది. “చాలా వర్షం కదండీ” అంది ఆ పెద్ద మనిషితో

నవ్వుతూ. “అవునవును…..గుట్టకింద పల్లి నుండీ ఇదే వర్షంలో తడుస్తూ వచ్చాను” అన్నాడు ఆ పెద్దమనిషి గట్టిగా నవ్వుతూ. “గుట్టకింద పల్లా…ఎంత దూరమండీ” అంది వందన. “ఇక్కడికో మూడు కిలోమీటర్లుంటుంది”. “అబ్బా చాలా దూరమేనండీ…అంత దూరం నుండీ తడుస్తూ వచ్చారా?” అంది వందన. “అవునవును” అన్నాడతను. “మీరూ అక్కడి నుంచే వచ్చారు కదా మేడం ?” అన్నాడు అజిత్. ఉలిక్కిపడింది వందన. “వీడికెలా తెలుసూ?” అనుకుంది. ఏదో పెద్దాయనతో మాటలు కలపాలన్న ఉత్సాహంతో ఆ పల్లె ఎంతదూరం అని అడిగింది. ఇప్పుడు ఈ పిల్లిగడ్డం కు జవాబిస్తే పెద్దాయన ఏమనుకుంటాడో అని తికమక పడింది వందన. అజిత్ ప్రశ్నను అలా వదిలేయడమే మేలని ఊరకే ఉండిపోయింది. అజిత్ కూడా మళ్ళీ అడక్కుండా మౌనంగా ఉండిపోయాడు.

పెద్దాయన తన లెదర్ బ్యాగ్ చేతిలోకి తీసుకొని నీళ్ళ చినుకుల్ని తుడవసాగాడు. ఆ నిశ్శబ్దం వందనను గాభరా పెట్టింది. “నా పేరు వందన అండి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ని.” అంది. “అవునా? నా పేరు నరసింహం .” అన్నాడు తలెత్తకుండానే. “ఆహా” అంది వందన. “మీరు గుట్టకింద పల్లెలో ఉంటారా?” అంది వందన. “లేదులేదు…సిటీలోనే….ఇక్కడో ఇంపార్టెంట్ పని మీద వచ్చాను” అన్నాడు నరసింహం .

యాభై ఇళ్ళు ఉండే ఆ పల్లెలో ఈ లెదర్ బ్యాగుకు అంత ఇంపార్టెంట్ పనేంటో అనుకొంది వందన. “చూస్తుంటే మీరు రియల్ ఎస్టేటల్లే వుంది?” అన్నాడు అజిత్ . చటక్కున తలెత్తి “ఎలా కనిపెట్టావ్?” అన్నాడు నరసింహం . “ఊహించా!” అన్నాడు అజిత్. పిల్లి గడ్డాలకు కర్ణ పిశాచులుంటాయేమో అనుకుంది వందన.

“సిటీ వెళ్ళేందుకు ఇప్పుడు బస్సులున్నాయాండీ?” అంది వందన. “అవునవును” అన్నాడు నరసింహం బ్యాగును బల్ల మీద పెడుతూ. “ఈ అవునవునుకు ఏం అర్థం ?వస్తాయనా, రావనా” గింజుకోసాగింది వందన మనసు. అజిత్ నుదుటి మీద గట్టిగా

కొట్టుకున్నాడు. అతనికేసి చూసింది వందన. “దోమ” అన్నాడు నవ్వుతూ. వందనకు నవ్వు రాలేదు సరికదా చిరాకేసింది. కళ్ళతోనే అజిత్ ను “వెధవా” అని తిట్టింది. “సిటీకి ఇప్పుడు బస్సులు లేవాండీ” అని మళ్ళీ అడిగింది. “అవునవును…లేవు” అన్నాడు

నరసింహం షెల్టర్ గోడ పై అంటించిన సినిమా పోస్టర్ని చూస్తూ.

“చచ్చాను” అనుకుంది వందన. “మీరు సిటీ వైపేనా సార్ ” అంది వందన. “అవునవును” అన్నాడు పోస్టర్ని చూస్తూనే. “ఇప్పుడు టైమెంత సార్?” అంది వందన. “పది ముక్కాలు” అన్నాడు నరసింహం, ఈసారి వందనకేసి చూస్తూ. “అంటే ఈ రాత్రంతా ఇక్కడే ఉండాలా?” అంది వందన. “అవునవును” అని అంటూ “నువ్వెక్కడికెళ్ళాలి మిష్టర్ ” అన్నాడు అతను. “నా పేరు అజిత్” అని చెప్పి రోడ్ కేసి తిరిగాడు. “సిటీకేనా” అన్నాడు నరసింహం. “ఆ” అన్నాడు అజిత్. “తెల్లారిజామున మూడు గంటలకి రామాపురం డిపో బస్సు వస్తుంది…ఆపుతాడు…” అన్నాడు నరసింహం. వందన, అజిత్ ఎవ్వరూ పలకలేదు.

ప్లాస్టిక్ షీటును తీసి బ్యాగ్ పై పెట్టి బల్ల మీద కూర్చున్నాడు నరసింహం. వందన కూడా కూర్చుంది. అజిత్ మాత్రం షెల్టర్ అంచున నిలబడి రోడ్ పైకి నిక్కి చూస్తున్నాడు. ఇంకా నాలుగు గంటలు ఈ ఇద్దరి మగాళ్ళతో, ఈ మారుమూల బస్ షెల్టర్లో ఎలా నెట్టుకు రావాలన్నది సమస్యగా మారింది వందనకు.

ఉన్నంతలో ఈ నరసింహమే నమ్మకంగా కనిపిస్తున్నాడు. అతను రాగానే అజిత్ లో అలజడి మొదలైందని గమనించింది వందన. మాటలు కూడా బాగా తగ్గిపోయాయి. నరసింహం ఏమడిగినా “ఊ”, “ఆ” అనే జవాబిస్తున్నాడు. ఈ పెద్దాయన్ని దేవుడే పంపాడని ఆ దేవుడికి కృతజ్ఞతగా చెంపల్ని నెమ్మదిగా వాయించుకుంది వందన.

“నువ్వేం పని మీదొచ్చావ్ ?” అన్నాడు నరసింహం వందనకేసి చూస్తూ. “నేనాండీ!మాదొక సోషియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది. వీకెండ్స్ లో విలేజెస్ లో సోషియల్ సర్వీస్ చేస్తాము. అందుకని వచ్చా”. “అవునా….గుట్టకింద పల్లెకేనా వచ్చింది?” అన్నాడు నరసింహం . “అ…ఆ…అవును” అంది వందన. “అవునా” అని నరసింహం ఊరకే ఐపోవడంతో “హమ్మయా” అనుకుంది వందన.

మళ్ళీ అజిత్ సెల్ మోగింది. “ఆ చెప్పురా !….ఆ…ఆ…ఆ…నువ్వు రావొద్దులే….నో నో….వద్దు రావొద్దు” అన్నాడు కంగారుగా. వెంటనే కాల్ కట్టైపోయింది.

గట్టిగా ఊపిరి పీల్చుకొంది వందన. “నా ఊహ నిజమే ! సమయానికి ఈ పెద్దాయన రాకుండా ఉంటే..” ఒక్కసారి తల విదిల్చింది వందన.

“కొంచెం ఆ చివరికి జరుక్కో, నే పడుకొంటా” అన్నాడు నరసింహం వందనతో. “ఓ ష్యూర్ !” అని బల్ల చివరకు జరిగింది వందన. వందన వైపుకు తల చేసి పడుకొన్నాడు నరసింహం. అజిత్ కూడా షెల్టర్లోకి వచ్చి బల్ల వెనుక ఉన్న ఓ బండరాయి మీద కూర్చుని గోడకు ఆనుకున్నాడు. వందన హ్యాండ్ బ్యాగ్ లోని పుస్తకాన్ని తీసి గుడ్డి వెలుతురులో చదువుకోసాగింది.

గడియారం వైపు చూసింది వందన. 12:30. ఇంకా రెండున్నర గంటలు గడవాలి. నిట్టూర్చి చదివేసిన పుస్తకాన్నే మళ్ళీ చదవడానికి పేజీలు తిప్పసాగింది. పెద్దగా ఉరమడం, ఉన్న ఆ గుడ్డి బల్బు టపా కట్టడం రెప్పపాటులో జరిగిపోయాయి. ఒక్కసారి వళ్ళు జలదరించింది వందనకు. లేచి నిలబడాలనుకొంది కానీ అలా కూర్చొని ఉండడమే మేలని కూర్చుండిపోయింది.

“ఎంతసేపు గడిచిందో? బహుశా ఓ అరగంట గడిచి ఉంటుంది” అని అనుకుంది. తను భయపడ్డట్టు ఏమీ జరగలేదు. ఎవ్వరూ కదిలిన అలజడి లేదు. కరెంట్ ఎప్పుడొస్తుందో?వస్తుందో రాదో? వర్షం కదా బాగా పొద్దెక్కితే గానీ వెలుతురు రాదు. అప్పటి దాకా ఇలా చీకట్లో….ఇద్దరు అపరిచిత మగాళ్ళతో…..భగవాన్ ఏమిటీ పరీక్ష!”

వందన ఆలోచనల్ని తుంచేస్తున్నట్టుగా వచ్చి తాకిందో స్పర్శ. కెవ్వుమని అరచింది వందన. మళ్ళీ తాకిన స్పర్శ. మొదటిసారికంటే బలంగా. ఆగకుండా కేకలు పెట్టసాగింది వందన. ఉన్నట్టుండి అడుగుల చప్పుళ్ళు. గింజుకుంటున్న అలజడులు. ఏ చప్పుడు ఎక్కడి నుండి వస్తుందో అర్థం కావడం లేదు వందనకు. కానీ ఒక్కటి మత్రం స్పష్టంగా తెలిసింది. ఆ చెయ్యి స్పర్శ తన వెనక నుండే తగిలింది. ఆ స్పర్శ అజిత్ దే. ఎంత ధైర్యం

వీడికి. “సార్ ! సార్ ! వాడే సార్….ఆ పిల్లిగడ్డమోడే సార్ ..నన్నుపట్టుకోవాలని చూస్తున్నాడు సార్ ….సేవ్ మీ సార్ ” అంటూ గట్టిగా అరవసాగింది. వందన. అడుగుల చప్పుళ్ళు హెచ్చాయి. ఎవరు ఎవరితో కలబడుతున్నారో అర్థం కావడం లేదు.

ఏదో వస్తువుతో గట్టిగా మోదుతున్న చప్పుడు. వందన షెల్టర్ బైటకు పారిపోయి అరవసాగింది. కొంతసేపు తర్వాత చటక్కుమని అగ్గిపుల్ల వెలిగింది. ఆ గుడ్డి వెలుగులో గుచ్చి చూసింది వందన. అజిత్ నేల మీద పడి వగరుస్తున్నాడు. నరసింహం చేతిలో అగ్గిపుల్ల. సర్రున లోనికి దూసుకు వచ్చి అజిత్ చెంప ఛళ్ళుమనిపించింది వందన.

“యూ బాష్టర్డ్ … రోగ్ … డర్టీ ఫెలో…ఛీ” అని తిడుతూ మళ్ళీ ఓ చెంప దెబ్బ కొట్టింది. అజిత్ నుండి ఎలాంటి ప్రతిఘటనా రాలేదు. “సార్ ! ఆస్క్ దిస్ డర్టీ ఫెలో టు లీవ్ ” అని వెక్కిళ్ళు పెట్టసాగింది. నరసింహం అజిత్ భుజం పట్టుకుని షెల్టర్ బైటకు ఈడ్చుకెళ్ళాడు. ఓ నిముషం తర్వాత ఒక్కడే లోని కొచ్చాడు. చేతిలో ఇంకో అగ్గిపుల్ల వెలుగుతోంది. వందనకు ఇంకా వణుకు తగ్గలేదు.

“కూర్చో” అన్నాడు నరసింహం . అజిత్ తో పడిన ఘర్షణ వల్లనేమో అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వందన బల్ల మీద కూర్చుంది. చప్పున ఆరిపోయింది అగ్గిపుల్ల. ఇంకొదాన్ని వెలిగించే ప్రయత్నం చేయలేదు నరసింహం . “ఓసారి బైట చూసి వస్తాను” అని చెప్పి వెళ్ళాడు .

“ఎంత షేం లెస్ ఫెలో వాడు. ఛా…ఐ కాంట్ బిలీవ్ దిస్” అని తనలో తనే మాట్లాడుకో సాగింది వందన. బైటకు వెళ్ళిన నరసింహం ఐదు నిముషాల తరువాత వచ్చాడు. “చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు వాడు” అన్నాడు. మనిషి ఎక్కడ నిలబడి ఉన్నాడో అర్థం కాలేదు. శబ్దాన్ని బట్టి తన ఎడం పక్క ఉన్నట్టు ఊహించింది వందన. “థాంక్సండి…థాంక్స్ ఎ లాట్ ” అంది వణుకుతున్న గొంతుతో. నరసింహం నుండి ఎలాంటి బదులూ రాలేదు.

“వాటే సొసైటీ ఈజ్ దిస్ ? ఇలాంటి వెధవలను పుట్టించిన తల్లి ఎంత పాపిష్టిదై వుంటుందో? ఆ తండ్రి ఎంతమంది ఆడవాళ్ళను దొంగచూపులు చూసి వుంటాడో? ఇలాంటి లక్షణాలు వాళ్ళ జీన్స్ లో ఉంటేనే కదా వచ్చేది…” అర్థం పర్థం లేకుండా సాగిపోతున్నాయ్ వందన మాటలు. నరసింహం నుండి ఎలాంటి ప్రతిస్పందనా లేదు. అతను వింటున్నాడో లేదో కూడా పట్టించుకోకుండా మాట్లాడింది వందన. మాట్లాడి మాట్లాడి, అలసిపోయినట్టుగా ఆగిపోయింది వందన. కొద్దిసేపు మౌనంగా, నిశ్శబ్దంగా గడిచిపోయాయి.

నరాలు తెగిపోయేట్టుగా పడిన ఉద్వేగం వల్లనో, అలసిపోయేట్టు అరవడం వల్లనో వందన కళ్ళు మూతలు పడ్డాయి. ఐతే రాడార్లా మారిపోయిన దేహం ఆమెను లేచి కూర్చునేట్టు చేసింది. తనకు చాలా దగ్గరగా నరసింహం కూర్చున్నట్టు అనిపించింది. “సార్” అంది. జవాబు రాలేదు. పక్కన లెదర్ బ్యాగ్ ఉందో లేదో చూద్దామని చేయి వేసింది. బ్యాగుకు బదులు నరసింహం దేహం తగలడంతో విసురుగా లేవబోయింది వందన. అంతకంటే విసురుగా నరసింహం చేతులు వందన నడుమును ఒడిసి పట్టుకున్నాయి.

తోకముడుచుకు పోయిందనుకున్న భయం పడగ విప్పి మీద పడ్డంతో దిక్కు తోచలేదు వందనకు. ఇంతకు ముందటి స్పర్శ ఎవరిదో ఇప్పుడు తెలిసిపోయింది. కేక వేయడం కూడా మర్చిపోయిన ఆమె నరసింహం చేతుల్ని గట్టి గిల్లసాగింది. కానీ అతని బలం ముందు వందన శక్తి చాలడం లేదు. ఓడిపోతున్నట్టు అనిపించడంతో బలం కూడదీసుకుని ఓ కేక పెట్టింది ఆమె. ఆ నిశ్శబ్దపు షెల్టర్లో అడుగుల అలజళ్ళు సముద్రపు అలల్లా మళ్ళీ హోరెత్తాయి. వందనకు తల తిరుగుతోంది. శరీరం పైన తనకు అదుపు తప్పుతున్నట్టు అనిపిస్తోంది. ఏం జరుగుతోంది ఏం చెయ్యాలన్న విచక్షణ పోతున్నట్టుగా ఉంది. ఇంకొక నిముషం గడిస్తే ఆమె ఆ చప్పుడును వినేది కాదేమో. ఆమె చెవికి దగ్గరలో చిల్లులు పడే స్థాయిలో నరసింహం వేసిన కేక పట్టు తప్పుతున్న వందన శరీరాన్నిజాగృతం చేసింది.

ఆ అరుపును అనుసరిస్తూ ఓ చిన్న వెలుగు షెల్టరంతా పరుచుకుంది. కళ్ళను పెద్దవి చేసి చూసింది వందన.

ఒక చేత్తో దుడ్డు కర్రని, మరో చేత్తో సెల్ ఫోన్ పట్టుకుని ఉన్నాడు అజిత్. ఆ చిన్న వెలుగు అతని సెల్ ఫోన్ దే. వందన కోసమేమో అన్నట్టు సెల్ టార్చ్ ను నరసింహం వైపు వేసాడు అజిత్ . తల పైన పెద్ద దెబ్బే పడింది, నుదుటి పై నుండి రక్తం కారుతోంది. నరసింహం జోరుగా ఊపిరి పీలుస్తున్నాడు కానీ కదలడం లేదు. వందన చప్పున కళ్ళు తిప్పేసుకుని అజిత్ వైపు చూసింది.

షెల్టర్ బైట నుండి బోయ్ మని హారన్ మోగింది. “ఇంతకు ముందే రావాల్సిన మా కంపెనీ కార్ ఇప్పుడు వచ్చింది…..నమ్మకముంటే రండి” అన్నాడు. హారన్ ఇంకోసారి మోగింది.

నమ్మకం అంటే అర్థం ఏమిటో తెలుసుకోవాలన్నట్టుగా లేచింది వందన.

Your views are valuable to us!