“చరిత్రనుండి పాఠాలు నేర్చుకోనివారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు.”
ఇది పాతికేళ్ళక్రితం నేను విద్యార్ధి దశలో ఉండగా ఒక వామపక్ష మిత్రుడు నాకు చెప్పిన మాట.
ఇది అక్షరాలా నిజం.
సరిగ్గా అప్పుడే చారిత్రక తప్పిదం అనేమాట న్యూస్ పేపర్లలో వచ్చింది. బహుశః అదే మొదటిసారి కావచ్చు. కానీ, తరువాత ఆ మాట ఎంత ప్రాచుర్యం పొందిందంటే గత ఇరవయ్యేళ్ళుగా రాజకీయ వ్యాఖ్యానాల్లో చాలామంది విశ్లేషకులు సీరియస్ గానూ హాస్యధోరణిలోనూ కూడా విరివిగా వాడుతున్నారు. అలాంటిదే ఐన వాక్యం “చట్టం తనపని తాను చేసుకుపోతుంది” కూడా అదేకాలంలో ప్రయోగించబడి, ఇప్పటికీ అంతే ప్రాచుర్యంలో ఉంది.
చారిత్రక తప్పిదం అనే మాటకి ఈ స్థాయి ప్రాచుర్యం కల్పించినది కమ్యూనిస్టు యోధుడు జ్యోతిబసు. ఆయన దృష్టిలో చారిత్రక తప్పిదం ఏమిటంటే, 1996 లో యునైటెడ్ ఫ్రంట్ కేబినెట్ లో తన పార్టీ సీపీఎం చేరకపోవటం. చేరి ఉంటే దేవెగౌడకి బదులు జ్యోతిబసు ప్రధాని అయి ఉండేవారు. సీపీఐ నాయకులకు అలాంటి పశ్చాత్తాపం అవసరం లేకుండా ఇంద్రజీత్ గుప్తా హోం మంత్రిగా, చతురానన్ మిశ్రా వ్యవసాయ శాఖా మంత్రిగా ఏడాదికి పైగా చేసారు. జ్యోతీబసు గారికి ప్రధానమంత్రి పదవి పోవటం వల్లే అలా అన్నారు అని కొంతమంది చెవులు కొరుక్కున్నారు. కొంతమంది మరో అడుగు ముందుకేసి జ్యోతిబసు అలా మాట్లాడడమే చారిత్రక తప్పిదం అన్నారు. అంటే ఒకసారి నాలిక కరుచుకొని, అయ్యో అనవసరంగా కరుచుకున్నానే అని మరోసారి కరుచుకుంటే నొప్పి రెట్టింఫు అవుతుంది గానీ, రెండోసారి కరుచుకోవటం వల్ల మొదటి కరుపు నొప్పి తగ్గదు. అలా కరుచుకోగా కరుచుకోగా నోట్లో నాలిక చిన్నదైపోయి స్వరం బలహీనపడుతుంది.
అసలు మామూలు తప్పిదానికీ చారిత్రిక తప్పిదానికీ తేడా ఏమిటి?
చరిత్ర గతిని తప్పుడు మార్గంలోకి (లేదా సామాజిక నష్టం వైపు) మళ్ళించిన నిర్ణయాన్ని చారిత్రక తప్పిదం అనవచ్చు.
వ్యక్తిగత స్థాయిలో ఉదాహరణ ఇవ్వాలంటే – పాతికేళ్ళ క్రితం రైల్వేలోనూ, టెలీకాం డిపార్ట్‌మెంటులోనూ ఒకేసారి ఉద్యోగాలు వచ్చిన వ్యక్తి రైల్వే కాకుండా టెలీకాంను ఎంచుకొని, దరిమిలా అది బి.ఎస్.ఎన్.ఎల్ కంపెనీగా మారి, ఇప్పుడు ఉద్యోగుల సంఖ్యని కుదిస్తూ ఉంటే ఆ ఉద్యోగి అప్పట్లో రైల్వేలో చేరకపోవటం చారిత్రక తప్పిదం అన్నమాట.
ఇంతకీ జ్యోతీబసు ప్రధానమంత్రి అయి ఉంటే దేవెగౌడలా ఎనిమిది నెలల్లో పడిపోకుండా, ఐదేళ్ళూ కొనసాగి ఉంటే ఆ సమయంలో రాజకీయ అస్థిరత తగ్గి దేశానికి ఉపయోగం జరిగి ఉండొచ్చు. గుజ్రాల్ గారు ప్రధానమంత్రిగా కన్నా విదేశాంగ మంత్రిగానే బలమైన నాయకుడు కనుక ఆయన ప్రధానిగా చేసిన పదినెలలూ లెక్కలోకి రాదు. జ్యోతిబసు ప్రధాని ఐతే ప్రభుత్వం ఐదేళ్ళూ మనగలిగేది అనే ఊహని చాలామంది ఒప్పుకోరు. ఎందుకంటే అధికారంలో లేని కాంగ్రెస్ ఎవరికి బయటనిండి మద్దతు ఇచ్చినా అది మూణ్ణాళ్ళ ముచ్చటే అంటూ కొన్ని చారిత్రక ఉదాహరణలతో చెప్పేస్తారు. నమ్మటం నమ్మకపోవటం మన ఇష్టం. ఐనా నా వోటు మాత్రం జ్యోతీబసు గారికే. (నా వోటు వల్ల ఆయనకి ఏం లాభం? నాకు బెంగాల్లో వోటుహక్కు ఉండదు, ఆయన తెలుగురాష్ట్రాల్లో పోటీ చెయ్యలేదు).
నా దృష్టిలో చారిత్రక తప్పిదాలు చెయ్యటం కన్నా, చేసిన చారిత్రక తప్పిదాన్ని కనీసం మామూలు తప్పిదంగానైనా గుర్తించకపోవటం ఇంకా పెద్ద చారిత్రక తప్పిదం. ఎందుకంటే గుర్తిస్తే మళ్ళీ చెయ్యకూడదు అనే పాఠం నేర్చుకుంటారు. అసలు గుర్తించకపోతే? అప్పుడు చరిత్రనుంచి పాఠం నేర్చుకోవాలని తట్టదు. నేర్చుకోకపోతే ఏమౌతుందో స్వయంగా కమ్యూనిస్టులే ప్రవచించిన వాక్యంతోనే ఈ వ్యాసం ప్రారంభం అయింది.
ఇంతకీ కమ్యూనిస్టులు అలా గుర్తించని తప్పిదం ఏమిటి? మళ్ళీ అలాంటి తప్పిదం చేస్తున్నారా? ఇదివరకు చేసిన తప్పిదం వల్ల ఎక్కడైనా ఉనికిని కోల్పోయేరా? ఒక్కసారి డాక్టర్ మెహబూబ్ ఆలీఖాన్ గారి అనుభవం చూద్దాం. ఆయన ముస్లిం మతస్థుల హక్కులకోసం పోరాడే ఒక జాతీయ పార్టీకి ఒక జిల్లా అధ్యక్షుడు. కొన్నేళ్ళు అందులో పనిచేసాకా, ఆపార్టీ జాతీయ అధ్యక్షుడి వైఖరిని నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేసారు. అప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షుడి మద్దతుదారులు ఈయనని ద్రోహిగా భావించి ఈయన హాస్పిటల్ ని ధ్వంసం చేసారు. అప్పుడు ఆయన అభిప్రాయం ఆయన మాటల్లోనే ఇక్కడ రాస్తున్నాను.
“నా రాజీనామా, జాతీయ అధ్యక్షుడిపై నా ఆరోపణలు స్థానిక ముస్లిం యువకులకు కోపం తెప్పించటం సహజమే. మతపిచ్చి ఉన్నవాళ్ళు సత్యాన్నీ, హేతువునీ దర్శించలేరు. అటువంటి మూఢోన్మాదులు ప్రతీ మతంలోనూ ఉంటారు. అందుకు నేనేమీ చింతపడలేదు. భయపడలేదు. కానీ నా మీద వ్యతిరేక ప్రదర్శనలు చేసిన మూకలో ఎంతోమంది హిందూ యువకులు ఉండటం నన్ను చాలా ఆందోళన పరచింది. కమ్యూనిస్టులు భారత యువకులను ఎలా పెడదారులు పట్టిస్తున్నారో చూచి చాలా భయపడ్డాను, బాధపడ్డాను.”
ఖాన్ గారి దృష్టిలో ముస్లిం మతోన్మాదులకు కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వటం చాలా ప్రమాదకరం.
ఇంతకీ ఎవరీ ఖాన్?
విజయవాడ లో స్వంత నర్సింగ్ హోం ఉన్న ప్రముఖ వైద్యుడు, ముస్లిం లీగు నాయకుడు. అప్పటికి కృష్ణాజిల్లా ముస్లిం లీగు అధ్యక్షుడు. జిన్నా వైఖరి వల్ల మత విద్వేషాలు పెరుగుతాయని, భారత ముస్లిములకు మేలు జరగదని పత్రికాముఖంగా ప్రకటించి మరీ 1945 జూలై 31 న ముస్లీలీగు కి రాజీనామా చేసిన సాహసి. ఖాన్ గారి అంచనా ఏమిటంటే జిన్నాకి స్వంతబలం కన్నా కమ్యూనిస్టూల మద్దతు వల్లే తన లక్ష్యం సాధించగలిగాడు.
(1945 నాటి విజయవాడ సంఘటనకి ఆధారం బోయి భీమన్న గారు రాసిన పుస్తకం, ప్రచురణ తేదీ 1968)
దేశవిభజనకి మద్దతు ఇచ్చిన కమ్యూనిస్టులకు రాజకీయంగా, సైద్ధాంతికంగా, లేదా భావజాల వ్యాప్తిపరంగా కలిగిన లాభాలు ఏమిటి? కమ్యూనిస్టు నాయకులకు కార్మిక సంఘాలు నర్సరీలు వంటివి. ఎందుకంటే “కార్మికరాజ్యం” అనే నినాదంతోనే పురుడు పోసుకున్న పార్టీ కనుక. దేశ విభజనకు ముందు బెంగాల్లో అతిపెద్ద నగరాలైన ఢాకాలోనూ, కలకత్తాలోనూ కూడా ట్రేడ్ యూనియనులు చాలా చురుగ్గా ఉండేవి. అవిభక్త బెంగాల్ వస్త్రపరిశ్రమ, జనపనార మిల్లులు, ఇతర పరిశ్రమలూ, పోర్టులూ ఉన్న ప్రతీచోటా కార్మికాంఘాలూ పుష్కలంగా ఉండేవి. తొలిదశలో కార్మిక నాయకులే, తరువాతి దశలో ఫేక్టరీల బయట కూడా వారి ప్రాబల్యం పెంచుకొని ఎమ్మెల్యేలూ మంత్రులూ అవుతారు.
దేశ విభజన తర్వాత మనదేశంలోకి వచ్చిన పశ్చిమబెంగాల్లో కమ్యూనిస్టులు అధికారం చేపట్టారు. డా. ఖాన్ గారిమీద దాడి జరిగిన విజయవాడలో కూడా మునిసిపాలిటీలో అధికారం చేపట్టారు. మరి 1947 నాటికి కమ్యూనిస్టులు రాజకీయంగా అంతే బలంగా ఉన్న ఢాకా (1947-71 మధ్య తూర్పు పాకిస్తాన్, ఆ తరువాత బంగ్లాదేశ్) లో వారి ప్రస్తుత రాజకీయ ప్రాబల్యం ఎంత? దాదాపు శూన్యం. ఎందుకంటే బంగ్లాదేశ్ తొలి నేత షేక్ ముజిబూర్ రెహ్మన్ దేశం ఏర్పడి ఐదేళ్ళు తిరక్కుండానే హత్యకు గురై దేశం మిలిటరీ పాలనలోకి వెళ్ళింది. 1986 లో జరిగిన ఎన్నికల్లో దేశంలో 300 స్థానాలకు, కమ్యూనిస్టులు ఐదు స్థానాలు గెలుచుకున్నారు (1.7శాతం). ఈ రాజకీయ పలుకుబడిని పశ్చిమబెంగాల్ తో పోల్చలేం. ఎందుకంటే, అప్పటికే తొమ్మిదేళ్ళుగా జ్యోతిబసు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.
డా. ఖాన్ గారిమీద 1945 లో దాడి జరిగినది విజయవాడ కనుక ఆంధ్రప్రదేశ్ లో 1983 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో పోల్చినా 294 అసెంబ్లీ స్థానాలకు గాను 9 సీట్లను గెలుచుకున్నారు (3.1 శాతం).
ఇక పాకిస్తాన్ కమ్యూనిస్టులగురించి చెప్పాల్నటే, 1945 లో జిన్నాకి మద్దతు ఇచ్చిన లాహోర్ కమ్యూనిస్టులలో హిందూ, సిఖ్ఖు నాయకులు 1947 నాటి దేశ విభజన హింస సందర్భంగా కట్టుబట్టలతో భారతదేశం వచ్చేసారు. “మతం మత్తుమందు” అనే నినాదానికి కట్టుబడక, మతప్రాతిపదికన జరిగిన దేశవిభజనకి మద్దతు ఇచ్చి, తమ మద్దతుతో దేశం సాధించిన వారి చేతే తరమబడ్డారు. చరిత్ర ఇంతకన్నా స్పష్టమైన పాఠం ఎలా చెప్పగలదు?
1947కి ముందు విజయవాడలో ఖాన్ గారి నర్సింగ్ హోం మీద దాడిచేసినట్టే, ఒకవేళ ఢాకాలో, లాహోర్‌లో ఇలాంటి విభజన వ్యతిరేక నాయకుల మీద జరిగిన దాడులకు మద్దతు ఇచ్చిన కమ్యూనిస్టులు తమ మరణ శాసనం మీద తామే సంతకం చేసుకున్నట్టు కాదా?
విభజనని సమర్ధించిన కమ్యూనిస్టులు అలా విభజన వల్ల పుట్టిన కొత్త దేశంలో రాజకీయంగా అంతరించిపోయారు. ఒక్క కమ్యూనిస్టులేనా? జిన్నా ఇచ్చిన ప్రత్యక్షచర్య పిలుపుకి అందరికన్నా ఎక్కువ స్పందించిన బెంగాలీ ముస్లిములు పాతికేళ్ళు తిరక్కుండా లక్షల్లో ఊచకోత కోయబడి, పోరాడి, పాకిస్తాన్ నుండి బయటపడ్డారు. ఆ తర్వాత కూడా బంగ్లాదేశ్ లో కమ్యూనిస్టులు మరి పుంజుకోలేకపోయారు.
తనకు మద్దతు ఇచ్చిన ముస్లిమేతర రాజకీయ నాయకులను జిన్నా ఎలా గౌరవించినదీ తెలియాలంటే జోగేంద్రనాథ్ మండల్ గారి ఆత్మని అడగాలి. ఎందుకంటే దళిత నాయకుడైన జోగేంద్రనాథ్ మండల్ ముస్లింలీగ్ నాయకుడు. జిన్నా అనుచరుడు. తన పలుకుబడితో దళితులు అధికంగా ఉన్న ఒక బెంగాలీ జిల్లాని పాకిస్తాన్ తో కలిపి, పాకిస్తాన్ తొలి న్యాయా శాఖామంత్రిగా చేసి కూడా మూడేళ్ళు తిరక్కుండా భారతదేశానికి శరణార్ధిగా వచ్చి, వోటుహక్కు కూడా లేకుండా పదిహేడేళ్ళు అనామక జీవితం గడిపారు. ఆయనంటే రాగలిగారు కానీ, తాను పాకిస్తాన్ లో కలిపిన జిల్లా, అందులో ప్రజలూ తిరిగి రాలేరు కదా? ఒకవేళ జోగేంద్రనాథ్ మండల్ కనుక భారతదేశంలో కొనసాగి ఉండి ఉంటే, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగానో, లేదా నెహ్రూ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగానో చేసి మరణానతరం కూడా బాబూ జగజ్జీవన్ రాం స్థాయిలో గౌరవం పొంది ఉండే అవకాశం ఉండేది. ఇప్పుడాయన పేరు భారతీయులకూ పెద్దగా తెలీదు. ఆయన బెంగాలీ కనుక పాకిస్తాన్ కీ అనవసరం. జోగేంద్రనాథ్ చనిపోయేసరికి బంగ్లాదేశ్ ఏర్పడలేదు కనుక అక్కడా ఆయనొక అనాకమ, అప్రస్తుత నాయకుడు. తూర్పు పాకిస్తాన్ లో కలిపిన జిల్లాకు చారిత్రక అన్యాయం జరిగినట్టుగానే ఆ జిల్లా తలరాతను మార్చిన మండల్ కూడా అన్యాయమైపోయాడు.
ఈ విషయంలో నా వ్యక్తిగత అనుభవం. 1999 లో కార్గిల్ యుద్ధం అప్పుడు భారత సైనికులకు మద్దతుగా మా యూనివర్సిటీ విద్యార్థులం రోడ్డు మీద ర్యాలీ చేస్తూ ఉంటే రాజేంద్రనగర్ స్థానిక బీజేపీ నాయకుడు మా విద్యార్ధుల మధ్యలోకి వచ్చి “జైభవానీ, జై శివాజీ” అంటూ నినాదాలిస్తూ ఉంటే మేము వ్యతిరేకించాం. నిజానికి మేమంతా వ్యక్తిగత స్థాయిలో శివాజీని అభిమానిస్తూ, మా ఇళ్ళలో భవానీని పూజించినవాళ్ళమే. కానీ జైభవానీ, జై శివాజీ అనేవి ఇలాంటి ఉద్యమాల్లో నినాదాలుగా చెయ్యకూడదు అని గాఢంగా నమ్మాం కనుక మేము ఆపటమే కాక ఆ నినాదాన్ని అందుకున్న కొంతమంది తోటి విద్యార్ధులచేత కూడా ఆపించాం.
ప్రస్తుత విషయంలో భారత కమ్యూనిస్టులంతా ఒకే త్రాటిపై ఉన్నారా? కేరళా ముఖ్యమంత్రి కమ్యూనిస్టు. నిత్యం ముస్లీంలీగుని రాజకీయంగా ఎదుర్కోవాలి. ఆ నాయకుల మతోన్మాద ప్రసంగాలను, అందువల్ల జరిగే హింసనీ ఖండించాలి. ఒక ముఖ్యమంత్రిగా కేరళాలో జరిగే మత సంబంధ హింసలో ఎవరి పాత్ర ఉన్నా అదుపుకు తగిన చర్యలు తీసుకోవాలి. అందుకు ఆయనేం మొహమాటపడట్లేదు కూడా. ఎందుకంటే ప్రభుత్వాధినేత అనే బాధ్యత కూడా ఉంటుంది కదా. బాధ్యత భుజం మీద వేసుకున్నవారు నిర్మొహమాటంగానే ఉంటారు. ఈ వ్యాసం రాసే సమయానికి ఆవి ధంగా పి.ఎఫ్.ఐ నీ ఎస్.డీ.పీ.ఐ నీ ఖండిస్తున్నందుకు హత్యా బెదిరింపులు వచ్చాయి అనే వార్త ఉంది. ఎటొచ్చీ బాధ్యత తగ్గితే మొహమాటాలు పెరుగుతాయి. డిల్లీ కమ్యూనిస్టులు, ఈ విషయంలో కేరళా కమ్యూనిస్టుల అభిప్రాయానికి విలువ ఇస్తున్నారా? డిల్లీ కమ్యూనిస్టుల అంటే డిల్లీలో కూర్చొని జాతీయ రాజకీయాలలో కమ్యూనిస్టుల పాత్రకి దిశానిర్దేశం చేస్తున్నవారు అని నా ఉద్దేశ్యం.
1945 నాటి విజయవాడ డాక్టర్ ఖాన్ గారు ఇప్పుడు నాకు ఎందుకు గుర్తొచ్చేరంటే, ఈమధ్య జరిగిన ఒక కార్యక్రమంలో వేదిక మీద ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ (కేరళా గవర్నర్) కూర్చున్నారు. ఒకానొక వక్త CAA వల్ల జరిగే అనర్ధాలు చెప్పటంతో, తరువాత ప్రసంగించిన గవర్నరు గారు, అందులో కొన్నింటికి సమాధానాలు చెప్పబోతే ఒక లెఫ్ట్‌లిబరల్ ప్రొఫెసర్ గారు తన కుర్చీలోంచి లేచి గవర్నరు గారి వద్దకు దూసుకెళ్ళి మరీ “మీరు ఇవన్నీ మాట్లాడొద్దు” అని అడ్డుకున్నారు. గవర్నరు గారు చెప్పిన సమాధానంలో తప్పులుంటే ఆ ప్రొఫెసర్ గారికి తర్వాత ఆ విషయం చెప్పే హక్కు ఉంది. కానీ, తాము చేసిన ఆరోపణలకు, ఎవరినీ సమాధానమే చెప్పనివ్వకపోవటం అంటే, అది సిసలైన కమ్యూనిస్టు స్ఫూర్తి కాదేమో? ఆ ప్రొఫెసర్ గారు గవర్నరు గారిని భౌతికంగా నెట్టలేదు కానీ, ఆ ప్రొఫెసర్ స్థానంలో సాధారణ కార్యకర్త, గవర్నరు స్థానంలో చిన్నసైజు వక్త ఉంటే ఆ సత్కారం జరిగేదే!
1945 నాటి డాక్టర్ ఖాన్ గారు జిన్నాతో విబేధించి రాజకీయంగా నష్టపోయారు. లాయర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ 1986-87 లో కేంద్ర మంత్రి హోదాలో రాజీవ్ గాంధీని వ్యతిరేకించి రాజకీయంగా నష్టపోయారు. షాబానో అనే 70 ఏళ్ళ ముస్లిం మహిళకి సుప్రీంకోర్టు నెలకి 180 రూపాయల భరణం ఇవ్వాలని ఆమె మాజీ భర్తని ఆదేశిస్తే, రాజీవ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా పార్లమెంటు చట్టం చేసి, ఆ డెబ్బై ఏళ్ళ మహిళకి నూట ఎనభై రూపాయల భరణాన్నీ అడ్డుకుంది. స్వయంగా ప్రభుత్వమే మహిళా హక్కులను మతపెద్దల దయాదాక్షిణ్యాలకు వదిలేసే వైఖరికి నిరశనగానే ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ రాజీనామా చేసారు. ఒకవేళ అప్పుడు రాజీనామా చెయ్యకపోతే ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారే హమీద్ అన్సారీకి బదులు ఉపరాష్ట్రపతిగా గాని, న్యాయకోవిదుడు కనుక కపిల్ సిబాల్ స్థాయి ప్రాధాన్యతలో గాని ఉండే అవకాశం పుష్కలంగా ఉండివుండేది.
సైద్ధాంతిక నిబద్ధత వల్ల రెండు తరాల ఖాన్ లు నష్టపోయారు. ఆనాటి ఖాన్ గారిమీద రాళ్ళేసిన కమ్యూనిస్టులు ఏం సాధించారో తెలియాలంటే బంగ్లాదేశ్ కమ్యూనిస్టులను భూతద్దంలో వెతికి, దొరికితే అడగాలి. ఈనాటి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారిమీద నిందలు వేస్తున్న కమ్యూనిస్టులను భవిష్యత్ తరాలు ఎలా అర్ధం చేసుకుంటాయో కాలమే చెప్పాలి. వర్తమానంలో జరిగే తప్పొప్పులు, భవిష్యత్తులో ఈ తప్పొప్పుల పాత్ర నిర్ణయించే సాహసం చెయ్యను కానీ, మార్క్సిస్టులు 1996లో జ్యోతిబసుని ప్రధాని అవనివ్వకపోవటంతో పోలిస్తే, 1947 కి ముందు కమ్యూనిస్టులు చేసిన జిన్నా భజన వల్లే దేశం ఎక్కువగా నష్టపోయిన మాట వాస్తవం.
జరిగిన తప్పిదం కన్నా, దానిని ఒక తప్పిదంగా గుర్తించకపోవటమే అసలు విషాదం.
మంచి విశ్లేషణ చేసారు రవి గారు. ఎలాంటి తిట్లు, శాపనార్థాలు లేకుండా చాలా క్లుప్తంగా, సూటిగా, నిష్పక్షపాతంగా విమర్శించారు.
మీ వ్యాసం చదివాక బెర్ట్రాండ్ రస్సెల్ మాటలు గుర్తుకొచ్చాయి.
Bertrand Russel wrote “Bolshevism [Communism] is to be reckoned with Mohammedanism.” He also said that “Both are practical, social, unspiritual, concerned to win the empire of this world.” [B. Russel, Theory & Practice of Bolshevism, 1921].
What Russel wrote in 1921 has become true in India. From 60’s which saw the rise of Communism to 90’s when Islamic terror began to spread to present times where Communism & Islamic terror have almost got merged.