పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విమోచనం – ఇద్దరు యూదు యోధులు

Spread the love
Like-o-Meter
[Total: 2 Average: 5]

ఆవకాయ వ్యాసాలు : పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విమోచనం – ఇద్దరు యూదు యోధులు


ఉపోద్ఘాతం:

A. A. K. Niazi - Wikipedia

మనకు బంగ్లాదేశ్ విమోచన యుద్ధం 1971 అనగానే భారతదేశం తరపునుండి విజయ కారకులుగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, మరికాస్త చరిత్ర తెలిసినవారికి ఫీల్డ్ మార్షల్ మానెక్ షా పేర్లు తెలుస్తాయి. అలాగే, పాకిస్తాన్ కి భరోసా ఇచ్చిన దేశంగా అమెరికా గుర్తుంటుంది.

ఐతే ఇందిరా, మానెక్ షా ఈ ఇద్దరూ కలిసి రచించిన పథకం అత్యంత సమయస్ఫూర్తితో అమలుచేసి, ఆ పథకం ఆ క్షణంలో అమలు కాకపోతే మరునాటి ఉదయం బంగ్లాదేశ్ లోని పరిస్థితులు తారుమారు అయి, భారత సైన్యం లక్ష్యం నెరవేరకుండా ఢాకా నుండి వెనుదిరగవలిసి వచ్చేది. పాకిస్తాన్ వికటాట్టహాసం చేసేది.

ఎందుకంటే, లక్షమంది పాకిస్తానీ సైనికులు ఉన్న భూభాగంలో కేవలం పదివేలమంది సైనికులు మాత్రమే ఉన్న భారత్ తరపున ’యుద్ధ విరమణ చర్చలు’ అన్న నెపంతో వెళ్ళిన సైనికాధికారి, తీరా అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ సైనికాధికారిని కాసేపు బెదరగొట్టి, కాసేపు నచ్చజెప్పి, మరి కాసేపు బలాబలాలు వివరించి, ఆ సైనికాధికారి మనోస్థైర్యం దెబ్బతీసి, చర్చలు మొదలైన గంట లోపలే లొంగిపోయేలా చేయకపోతే, మరునాటికల్లా ఐక్యరాజ్యసమితి ముసుగులో అమెరికా భారత ప్రభుత్వం చేతే సైన్యాన్ని వెనక్కి పిలిపించి, తూర్పుపాకిస్తాన్ ను (నేటి బంగ్లాదేశ్) మళ్ళీ పాకిస్తాన్ చేతిలోనే పెట్టేది.

అది జరిగే లోపలే, ప్రజల సమక్షంలో బహిరంగ లొంగుబాటు వేడుక నిర్వహించటం వల్ల అది సాధ్యపడలేదు. ఆ లొంగుబాటు పత్రాలపై ఢాకా లో అత్యున్నత సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ ఏ.ఏ.కే. నియాజీ సంతకాలు చేస్తున్న ఫోటో ఈ రోజుకీ భారత సైన్యం సగర్వంగా ప్రదర్శించే సన్నివేశం.

జనరల్ నియాజీతో అలాంటీ చర్చలు జరిపిన భారత సైనికాధికారి పేరు మేజర్ జెనరల్ జే.ఎఫ్.ఆర్. జాకబ్.

*****

ఇద్దరు యూదులు

తూర్పు పాకిస్తాన్ లోకి (నేటి బంగ్లాదేశ్) భారత సైన్యాలు ప్రవేశించకముందు, అక్కడి బెంగాలీలపై పాకిస్తాన్ సైన్యం జరుపుతున్న అత్యాచారలను, ఢాకా లో అమెరికా కాన్సులేట్ వారు కళ్ళకు కట్టినట్టు వివరిస్తూ పంపిన టెలిగ్రాములను చెత్తబుట్టలో వేసి, అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా కాసేపు కళ్ళుమూసుకొని పాకిస్తాన్ ను సమర్ధించాలని నిర్ణయించుకున్న అమెరికా నిఘా నిపుణుడు పేరు – హెన్రీ కిస్సింజెర్.

అమెరికాలో కిస్సింజెర్ లేకపోతే పాకిస్తాన్ కి ఆ భరోసా వచ్చేది కాదు. ఇండియాలో జెనరల్ జాకబ్ లేకపోతే ఆ రోజు ఆ అద్భుతం సాధ్యమయ్యేది కాదు.

ఇక్కడ విశేషం ఏమిటంటే, ఈ ఇద్దరు యోధులూ. ఆ ఇద్దరూ యూదులే!

యూదులగురించి అంత ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలి? ఈ సంఘటనను మతాలకు అతీతంగా ఎందుకు చూడకూడదు? అని కొందరు ప్రశ్నించవచ్చు. కానీ ఈ ఘటనను మతాలకు అతీతంగా చూడకపోవడం కంటే చూడడం వల్లనే సత్యం బోధపడుతుందని నా అభిప్రాయం.

ఎందుకంటే, ప్రపంచ జనాభాలో కేవలం 0.2 శాతం ఉన్న యూదులు, నోబెల్ బహుమతి విజేతల్లో 20 శాతం (అంటే తమ జనాభాకు 100 రెట్లు) అధికంగా ఉన్నారు. ప్రపంచ యూదు జనాభాలో సగం మంది ఇజ్రయిల్ లో ఉండగా, మిగిల సగం మంది డజనుల కొద్దీ దేశాల్లో చెదిరిపోయి స్థిరపడ్డారు (ప్రస్తుత ఉక్రైన్ అద్యక్షుడు జెలెస్కీ కూడా యూదుడే, కానీ ఉక్రైన్ జనాభాలో యూదులు 0.5 శాతం కూడా లేరు).

 

జనరల్ జాకబ్:

ముందుగా భారత సైనికాధికారి జాకబ్ గురించి.

ఇతడు కలకత్తా లో స్థిరపడ్డ యూదు కుటుంబంలో పుట్టిన వ్యక్తి. బెంగాలీ అభిమానం అదనం.

బంగ్లాదేశ్ విమోచన లో భాగంగా అతడు ఢాకాలో దిగేవరకూ పాకిస్తానీ అధికారులూ, మనదేశంలో కీలక స్థానాల్లో ఉన్న మిగతా అందరూ, ఆఖరికి జాకబ్ తో పాటు చర్చలను రికార్డు చేయటానికి వెళ్ళిన జూనియర్ అధికారి కూడా అనుకున్నది ఏమిటంటే – “కాల్పుల విరమణ, ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో సైనిక బలగాల ఉపసంహారం” అనే ఎజెండాతో చర్చలు జరగబోతున్నాయి అని.

కానీ నియాజీతో ఏకాంత చర్చల్లో “మరో అరగంటలో లొంగుబాటు పత్రాలపై సంతకాలు చేసి, మీ లక్షమంది సైనికులూ భారత సైన్యనికి యుద్ధఖైదీలుగా మారకపోతే మరో 10-11 రోజుల్లో మీ మందుగుండు ఐపోతుంది. అప్పుడు బంగ్లాదేశ్ విమోచన కోసం పోరాడుతున్న ముక్తివాహిని గెరిల్లా సైన్యం ఒకసారి బయటకు వస్తే, సైనికులే కాదు వారి కుటుంబ స్త్రీలూ పిల్లలూ కూడా బ్రతకరు. ఎందుకంటే, మీ సైనికులు ఇక్కడ బెంగాలీల స్త్రీలనూ పిల్లలనూ వదల్లేదు కదా!” అంటూ హారర్ పిక్చర్ చూపించాడు జనరల్ జాకబ్.

అప్పటికీ మేకపోతు గంభీర్యం చూపించబోయిన నియాజీతో – “కరాచీ నేవల్ బేస్ ప్రస్తుతం భారత నావిక దళంతో చుట్టుముట్టబడింది, మీ విమానాలు రావలసిన గగనతలం మా వైమానిక దళం నియంత్రణలో ఉంది” అని చెప్పి ఎక్కువ ఆలోచించే వ్యవధి లేకుండా చేసి చతురత ప్రదర్శించిన యోధుడు జెనరల్ జే.ఎఫ్.ఆర్. జాకబ్.

బంగ్లాదేశ్ విమోచన లో ఈయన అందించిన సేవలకు గాను బంగ్లాదేశ్ ప్రభుత్వం 2012 లో “ఫ్రెండ్స్ ఆఫ్ లిబరేషన్ వార్ ఆనర్” అవార్డుతో సత్కరించింది. ఇతడు 2016 లో తన 95 వ ఏట మరణించాడు. వాయపేయి ప్రధాని గా ఉన్న కాలంలో ప్రభుత్వం ఈయనని పంజాబ్ గవర్నర్ గా కూడా నియమించింది.

 

జనరల్ నియాజి

A. A. K. Niazi - Wikipedia

యుద్ధ విరమణ, బంగ్లాదేశ్ అవతరణ జరిగాకా, ఇందిరాగాంధీ-జుల్ఫీకర్ ఆలీ భుట్టో మధ్య జరిగిన శాంతిచర్చల తరువాత ఒప్పందంలో భాగంగా విడుదల ఐన 90 వేల మంది పాకిస్తాన్ సైనికుల్లో ఆఖరున విడుదల ఐన యుద్ధ ఖైదీ – జనరల్ నియాజీ.

సైనిక పాలకుడిగా ఢాకా వెళ్ళిన నియాజీ తిరిగి విడుదల ఐన యుద్ధ ఖైదీగా తన దేశంలో అడుగుపెట్టగానే పాకిస్తాన్ ప్రభుత్వం అతడి రేంకుని తగ్గించి, దోషిగా నిలబెట్టి విచారణ చేసినప్పుడు ఒక ప్రశ్న అడిగింది.

అంత తొందరగా ఎందుకు లొంగిపోయావు. కనీసం 24 గంటలు సమయం తీసుకొని ఉంటే, ఆ తరువాత భారత సైన్యమే వెనుదిరిగేది కదా. ఇక్కడ మా ప్రయత్నాలు విజయవంతం అవుతూ ఉండగానే అక్కడ నువ్వు లొంగిపోయావు?” అని నిందిస్తే దానికి సంజాయిషీగా నియాజీ “జాకబ్ నన్ను ఆలోచించుకొనే టైము ఇవ్వకుండా బెదరగొట్టేసాడు.” అని సమాధానం చెప్పాడుట.

అలాగే, ఢాకాను చుట్టూముట్టిన భారత సైనికులూ పదివేలమంది మాత్రమే అన్న సమాచారం నియాజీకి తెలియదు.

మొన్నటికి మొన్న, పాకిస్తాన్ సైనిక ప్రతినిధి 1971 లో లొంగిపోయినది రాజకీయ లొంగుబాటే కానీ, సైనిక లొంగుబాటు అంటూ కొత్తపాట ఆందుకున్నాడు. ఒకరకంగా అదీ నిజమే. ఎందుకంటే పాకిస్తాన్ సైనికాధికారులే అసలైన రాజకీయాధికారం చెలాయిస్తారు కనుక సైనికుల లొంగుబాటు కూడా ఒకరకంగా రాజకీయ లొంగుబాటే.

*****

హెన్రీ కిస్సింజెర్

Henry Kissinger - Wikipediaబంగ్లాదేశ్ విమోచన లో ప్రముఖ పాత్ర పోషించిన రెండో యూదు యోధుడు – హెన్రీ కిస్సింజెర్.

భౌగోళిక రాజకీయ క్రీడలో భాగంగా అమెరికా ఆధిపత్యం కోసం అడ్డగోలు నిర్ణయాలతో అనేక దేశాల ప్రభుత్వాలను కూలదోసి, అమెరికా రాజకీయ ప్రయోజనాల కోసం అనేక కౄర నియంతలతో చేతులు కలిపి, ఆ నియంతలు మిలియన్ల కొద్దీ ప్రజలను ఊచకోత కోసినా కళ్ళు మూసుకొని, అమెరికాకి తలవంచని పాలకుల ని ఏదో సాకుతో ఇరుకున పెట్టిన “దౌత్య, రాజకీయ, నిఘా రంగాల నిపుణుడు” ఈ హెన్రీ కిస్సింజర్.

తన 100 వ ఏట కూడా ఇంకా చురుకుగానే ఉంటూ, ఈ మధ్యే (అవును వందేళ్ళ వయసులో కూడా) చైనా పర్యటించి, జిన్‌పింగ్ ని కలిసాడు. బహుశా “మా దేశంలో మీ దేశంపట్ల వస్తున్న వ్యతిరేకత చూసి నొచ్చుకోకు, అంతా సర్దుకుంటుంది” అని బుజ్జగించి ఉండొచ్చు.

గడచిన 50 ఏళ్ళుగా అమెరికా తరపున అంతర్జాతీయ వ్యవహారాలో ప్రముఖ పాత్ర వహిస్తున్న కిస్సింజెర్ 1973 లో నోబెల్ శాంతిబహుమతికి ఎన్నిక కావటం అత్యంత వివాదాస్పదమైంది. ఎంత వివాదాస్పదం అంటే, ఆ బహుమతి వెనక్కి ఇవ్వటానికి కిస్సింజెర్ స్వయంగా ముందుకు వచ్చాడు.

యూదులను విపరీతంగా ద్వేషించే పాకిస్తాన్ కోసం శ్రమించిన కిస్సింజర్ యూదుడే. ముస్లిం దేశమైన బంగ్లాదేశ్, తాము ద్వేషించే మతానికే చెందినా తమ దేశాన్ని విముక్తం చేయటంలో ప్రముఖపాత్ర వహించిన యూదు యోధుడు జాకబ్ ని అవార్డుతో సత్కరించింది.

ప్రపంచ రాజకీయ చదరంగంలోని వింతలు:

ఇప్పుడు క్రైస్తవ దేశమైన అర్మేనియా, ముస్లిం దేశమైన అజర్‌బైజాన్ కు మధ్య జరిగే యుద్ధంలో యూదు దేశమైన ఇజ్రయిల్ అజర్‌బైజాన్ కి మద్దతు ఇస్తోంది!

మతం రాజకీయాలను ఎంతవరకూ శాసించగలదు?

రాజకీయ నాయకులు ప్రజలకు మాత్రమే మతం నూరిపోసి, తాము మాత్రం రాజకీయ ప్రయోజనాలకోసం మతాన్ని పక్కకిపెట్టి, అవసరమైతే మత సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటారు.

ఈ వ్యాసం ఉద్దేశ్యం ఏమిటంటే, రాజకీయ ప్రయోజనాల ముందు మతం బలాదూర్ అని చెప్పటమే.

*****

 

పి.ఎస్: లెఫ్టినెంట్ జెనరల్ జే.ఎఫ్.ఆర్ జాకబ్ మరణించిన తరువాత (2016 లో) ఆయనకు నివాళిగా బంగ్లాదేశ్ విమోచనలో ఆయన పోషించిన పాత్ర ని ఆధారం చేసుకొని, తీసిన 17 నిమిషాల లఘుచిత్రం “ముక్తి” లింకు ఇస్తున్నాను.

ఇందులో జాకబ్ పాత్ర ని మిలింద్ సోమన్ పోషించి, ఆత్మస్థైర్యం, స్థితప్రజ్ఞత, దౌత్యం అన్నింటినీ కనపరచగా, పాకిస్తాన్ తరపున చర్చించి లొంగిపోయిన లెఫ్టినెంట్ జెనరల్ నియాజీ పాత్ర పోషించిన నటుడు ఇంకా ప్రతిభావంతుడు. ఎందుకంటే, ఆ పాత్రలో అధికారదాహం, భారత ద్వేషం, ఉడుకుమోతుతనం వీటిని అద్భుతంగా పండించాడు.

వీలు చూసుకుని తప్పక చూడండి.

*****

Your views are valuable to us!