శ్రీఆదిభట్ల నారాయణ దాసుగారు – ప్రముఖుల ప్రశంసలు

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఇరు హస్తములతోడ జెరియొక రాగంబు

చరణద్వయాన నేమరక రెండు

పచరించి, పల్లవిబాడుచు గోరిన

జాగాకు ముక్తాయి సరిగనిడుట

నయమొప్ప న్యస్తాక్షరియను వ్యస్తాక్షరి

ఆంగ్లంబులో నుపన్యాస, మవల

నల్వురకున్ దెల్గునన్ నల్వురకు సంస్కృ

తంబున వలయు వృత్తాలగైత


శంశయాంశమ్ము శేముషీశక్తితో బ

రిష్కరించుట, గంటల లెక్కగొంట

మరియు ఛందస్సుతోడి సంభాషణంబు

వెలయ నష్టావధానంబు సలిపెనతడు

 

దాసుగారు కేవలము హరికధకులు మాత్రమే అనే అపోహలోనున్నవారికి పై పద్యం చక్కని సమాధానము. అవధానములను అవలీలగా చేయుటయేకాక అందులో కూడా క్లిష్టమైన ప్రక్రియలు చేసి చూపించేవారట.

వారు చేసిన అష్టావధానములోని అంశములొక్కసారి చూడండి

1.గ్రీకు భాషలో ఏభై మాటల వ్యస్తాక్షరి చేయుట

2.కోరిన పురాణములలోని ఘట్టములను చదివి వాటికి అప్పటికప్పుడు రాగములు కట్టుట

3.పుస్తకము గిర గిర తిప్పుతుండగా అందులోని విషయమును సునాయాసముగా చదువుట

4.బీజగణితము(ఆల్జీబ్రా)నందు ఇచ్చిన చిక్కు లెక్కలను అక్కడికక్కడే విప్పుట

5.విసరు పుష్పములను లెక్కించుట

6.ఛందస్సంభాషణము

7.తెలుగు, సంస్కృతములలో ఆశుకవిత్వము

8.నిషిద్దాక్షరి.

వారికి గ్రీకు భాష ఎలా తెలిసిందో, ఆల్జీబ్రా ఎక్కడనెర్చుకున్నారో ఎవరికి తెలుసు?


కొందరు సంగీత విద్వాంశులు దాసుగారి ప్రతిభపై అసూయపడుతూ వీనికి సంగీతము తెలియదని, కృతులు పాడటం రాదని అనగా మరికొందరు ఇంతటి ప్రతిభావంతుడు ఇంతవరకు పుట్టలేదని వాదులాడుకున్నారట.

సరే అమీ తుమీ తేల్చుకోవడం కోసం ఒక పోటీ సభ ఏర్పాటయింది. తగాదాలు జరుగకుండ పోలీసులను మోహరించడం కూడా జరిగింది. దాసుగారి ప్రతిపక్షానికి నాయకుడైన ఒక వకీలు లేచి “ఇక్కడ ఇరువదిమంది ఉద్దండులైన సంగీత విద్వాంసులున్నారు, వీరు వేయు ప్రశ్నలకు దాసుగారు సమాధానము చెప్పినట్లైతే వారికి సంగీతము తెలుసును అని ఒప్పుకోవడం జరుగుతుంది లేనట్లైతే దాసుగారి వీరందరినీ క్షమాపణ కోరవలసి ఉంటుంది” అని వివరించేడట.

అప్పుడు దాసుగారు అన్నమాటలివి.

“సభికులారా, ఈ విద్వాంసులందరూ సంగీతములో నాకంటే తక్కువవారు అనునది నిజము. విద్వాంసులము అనుకునే వీరిలో సంగీత తత్వము తెలిసినవారు ఒక్కరు కూడా లేరు. వీరు సంగీత శాస్త్రము విషయములో నన్ను ప్రశ్నించుటకు అర్హులుకారు ఎందుకంటే సంగీత శాస్త్రము సంస్కృతమున వ్రాయబడినది. వీరిలో ఏ ఒక్కరికి సంస్కృతభాష లేశమాత్రంగానైనా తెలియదు అటువంటప్పుడు వీరు నన్నేమి ప్రశ్నించగలరు, నేను వీరికేమి సమాధానము చెప్పగలను. కనుక నాతో శాస్త్ర చర్చ చేయుటకు వీరు అర్హులుకారు. నేనొక సులువైన పోటీ ప్రతిపాదించెదను, వీరందరూ లేదా వీరిలో కొందరు ఒక గంట సేపు పాడిన పిదప నేనొక గంటసేపు పాడెదను. ఎవరి పాట మిక్కిలి రంజకముగా తోచునా వారే విజేతలు” అని పోటీ పద్దతి చెప్పేరు. దాసుగారికి విజయము లభించినదని వేరే చెప్పాలా???



బెంగుళూరులో గొప్ప గాయక సభ జరిగింది. భారతావనిలోనున్న ప్రఖ్యాత గాయకులందరూ ఆ సభకు వచ్చిరి.రోజుకొక మహా గాయకుని కచ్చేరి. దాసుగారి వంతు వచ్చినది.దక్షిణభారతములో లబ్ద ప్రతిష్టుడైన దక్షిణామూర్తి పిళ్ళై దాసుగారి పాటకు మార్దంగికుడు(మృదంగం).

అంతటి విద్వాంసునకు కూడా జాగా దొరకనీయక దాసుగారు తమ లయ ప్రతిభను ప్రదర్శించగా దక్షిణామూర్తి దాసుగారికి రెండు చేతులూ ఎత్తి నమస్క్రించగా నాటి మహా సభ దాసుగారిని “లయ బ్రహ్మ” బిరుదుతో సత్కరించింది.


 

అలహాబాదులో ప్రసిద్ధ గాయనీ మణి జానకీ బాయి అనునామె ఉండేది. ఆమె సంగీతాన మహా విద్వాంసురాలు. ఆమెయెదుట పాడి ఆమె ప్రశంసలు పొందినారు శ్రీ దాసుగారు.

 

కలకత్తాలో శ్రీకృష్ణ జననము అను సంస్కృత హరికధను హిందీలో వ్యాక్యానిస్తూ చెప్పేరట. ఆ సభకు ముఖ్య అతిధి రవీంద్రనాథ్ ఠాగోర్. విశ్వకవి దాసుగారి పాటవానికీ పాటకీ ఎంతో పరవసించిపోయారట.

 

చల్లపల్లి జమీందారు ఏర్పాటు చేసిన పండిత సభలో శ్రీ దాసుగారు కుడియెడమచేతులతో సమ విషమ జాతుల వీణను వాయించగా ఆ అసాధారణ ప్రతిభకు పండితమండలి పరవశము చెందగా ఆ జమీందారు ఇరువది నాలుగు నవరసుల బంగారముతో గూడిన గండపెండెరమును దాసుగారి కాలికి స్వయముగా తొడిగెనట.

 


సుబ్రహ్మణ్యయ్యరు అను దాక్షిణాత్యుడు ఒకసారి విజయనగరము వచ్చేడట. అతడు సువర్ణఘంటాకంకణధారి. దాసుగారు స్వయముగా వానికి గొప్ప సభను ఏర్పాటుచేసి సభానంతరము వానిని గౌరవించి అయ్యా తమరు మూడుగాని నాలుగుగాని తాళములతో పాడగలరా అని అడిగేరట.

దాని ఆ అయ్యరు నాలాగ రెండు తాళములతో పాడగలవారిని ఇప్పటివరకు మన దేశాన చూడలేదు అన్నాడట కించిత్ గర్వంగా.

అప్పుడు దాసుగారు ఐదు తాళములతో పల్లవి పాడి వినిపించగా అయ్యరు తన కంకణమును విప్పదీసి దాసుగారికి నమస్కరించగా నాటి సభ దాసుగారికి”పంచముఖీ పరమేశ్వరుడు” అను బిరుదునిచ్చి సత్కరించెనట.

 


దాసుగారి గానామృతము గొని పరవశించి ప్రసంసించిన ప్రముఖులలో శ్రీమతి సరోజినీ నాయుడు ఒకరు.

 

దాసుగారి బహుభాషావేతృత్వమును డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణపండితుడు బహుధా ప్రశంసించెనట.


Your views are valuable to us!