బూమరాంగ్‍లు పదును పెట్టుకుంటున్న చైనా

Spread the love
Like-o-Meter
[Total: 5 Average: 4.4]

 

 

ఈ రోజు చైనా తనని తాను ఒక ప్రపంచ శక్తిగా భావించుకుంటూ అందుకు తగ్గ ఋజువులు చాలానే చూపెడుతోంది. వ్యాపారపరంగా అమెరికాని మించిపోవాలనీ, సైనికపరంగా భారత్ తనను చూసి భయపడుతూనే ఉండాలనీ, తద్వారా, భారత్ మిగతా ప్రపపంచంతో నిర్వహించే కార్యకలాపలలో చైనాని ఇబ్బంది పెట్టేవి చేసే సాహసం చేయకూడదనీ భావిస్తోంది.

ప్రస్తుత స్థితిని చూస్తే “చైనా కన్నా మేము శక్తివంతం” అనే స్థితిలో దాదాపు ఏదేశమూ లేదు. రెండు శతాబ్దాలక్రితం ఐతే, ఇరుగు పొరుగు శత్రు రాజ్యాలు ప్రతీ పదేళ్ళకీ ఒక యుద్ధం చేసుకొనే రోజుల్లో ఇలాంటి శక్తి వల్ల చాలా ప్రయోజనాలు ఉండేవి. కానీ ఈ ఇరవయ్యొకటో శతాబ్దంలో అన్ని దేశాలవారు అన్ని దేశాల్లోనూ కొన్ని వ్యాపారాలు నిర్వహించుకుంటున్నప్పుడు, పేరుకే శత్రుత్వం కానీ నేరుగా సైన్యాలు పూర్తిస్తాయిలో తలపడవు. అలాగే చాలా ఆయుధ సంపత్తి ప్రదర్శనకే కానీ వాడకానికి పనికిరాదు.

అంతెందుకు? ప్రపంచానికి అణుపరీక్షలు తెలీని రోజుల్లో తొలి అణుబాంబు ప్రయోగం జరిగింది. ఆ తరువాత వందల అణుపరీక్షలే జరిగాయి. కానీ ఒక్క అణుబాంబు ప్రయోగం కూడా జరగలేదు. గుట్టల కొద్దీ అణుబాంబులు వెనకేసుకున్న అమెరికా కూడా వియత్నాం యుద్ధంలో గానీ, ఇరాక్ యుద్ధంలో గానీ, ఆఫ్ఘన్ యుద్ధంలో అణు బాంబులు వాడలేదు. ఈ మూడు యుద్ధాలూ ఏళ్ళతరబడీ సాగాయి. అలాంటిది దాదాపు సమఉజ్జీలు అనబడే దేశాలమద్య అణు యుద్ధం రాదు. ఆ పరిస్థితి వస్తే ఆయుధాల లెక్కలు పనికి రావు.

చైనా క్షిపణి పరిధిలో ఢిల్లి ఉండటం ఎంత వాస్తవమో, భారత క్షిపణుల పరిధిలో బీజింగ్, షాంగైలు ఉండటం అంతే వాస్తవం. అణుబాంబులు పది ఉన్న వాడి కన్నా ఇరవై ఉన్నవాడు రెట్టింపు బలవంతుడు అనుకోవటం వెర్రిబాగులతనం. అంటే ఒక స్థాయికి మించిన సైనిక శక్తి, సరిహద్దులు దాటిన సైనిక స్థావరాలు పెద్దగా పనికి రావు.

నిజానికి చైనాకి స్వీయరక్షణకి ఏ ఢోకా లేదు. ప్రస్తుతం కేవలం విస్తరణ మీద మాత్రమే దృష్టి పెట్టింది. మైదానప్రాంతాల్లో జరిగే యుద్ధంలో స్వీయరక్షణ దళాల్లో ఒక సైనికుడు చనిపోతే ఆక్రమణదారుల్లో ఇద్దరు లేక ముగ్గురు వరకూ చనిపోతారు. ఇదే పర్వత ప్రాంతాల్లోకి జరిగే యుద్ధం దగ్గరకు వచ్చేసరికి, సరిహద్దులు కాపాడుతూ ఉన్నచోటునుండీ కదలని ఒక సైనికుడూ చనిపోయేలోపల ఆక్రమణ దారుల సైన్యంలో దాదాపు పదిమిందిని చంపవచ్చు. కార్గిల్ యుద్ధంలో ముందు పాకిస్తాన్ సైన్యం ఆక్రమించుకున్న ప్రాంతాలకి యుద్దసమయంలో వారు స్వీయ రక్షణ స్థితిలోకి భారతీయ సైనికులు దాడిచేసిన స్థానానికీ మారేరు. అందుకే భారత్ సైన్యానికి అంత ప్రాణ నష్టం జరిగింది.

ఒకవేళ కార్గిల్ కొండల్లో భారత సైనికులు పహారాలో ఉండగా ఆక్రమణదారులు వచ్చి ఉంటే మన సైన్యానికి పదోవంతు ప్రాణనష్టం కూడా జరిగేది కాదేమో. స్వీయరక్షణ వ్యయం కన్నా ఆక్రమణ వ్యయం అనేక రెట్లు ఎక్కువ. అంచేత క్షిపణులూ, అణుబాంబులూ వాడకుండా గనుక చైనా భారత్ మీద పూర్తి యుద్ధం చేయవలసి వస్తే, ప్రతీ ఒక్క భారతీయ సైనికుడూ పదిమంది చైనా సైనికులను నిలువరించగలడు.

ఇక్కడ అసలు విషయం ఎవరి కంటే ఎవరు గొప్ప అనేది కాదు. పర్వతప్రాంతాల్లో దాడి చేసే సైనికుడికన్నా పహారా సైనికుడికి ఉన్న స్థానబలం అది. అందుకని చూడటానికి మౌలిక వసతుల్లా, ఆర్ధిక వాణిజ్య కార్యకలాపాల కోసం అన్నట్టు కనపడూతూ మిలిటరీ ప్రయోజనాలు కాపాడే ప్రోజెక్టులు చేపట్టీంది చైనా. ఇంతకీ ఆ మౌలిక సదుపాయాలు ఏమిటి?

Luminous Zolt 1100 Inverter Sine Wave Home UPS (Blue)

  • టిబెటన్ రైల్వే.
  • శ్రీలంక హంబన్‌తోట ఓడరేవు.
  • చైనా – పాకిస్తాన్ ఆర్థిక నడవా (China Pakistan Economic Carridor – సీపెక్).

ఈ మూడింటీనీ ఏకకాలంలో సైనిక ప్రయోజనాల కోసం వాడుకొంటే భారత్ ను చైనా తేలిగ్గా దిగ్బంధం చేయగలదు అనిపిస్తుంది. కాకపోతే పూర్తిస్థాయి యుద్ధం అసాధ్యం అనుకున్నాం కనుక శాంతి సమయంలో ఈ ప్రోజెక్టుల వల్ల సాధించే ప్రయోజనాలు చాలా ముఖ్యం.

టిబెటన్ రైల్వే:

మూడువేల కిలోమీటర్ల అతి కష్టమైన రైలు మార్గం ఇది. పర్వతశ్రేణుల్లోంచి అతయధిక సంఖ్యలో బ్రిడ్జిలూ, సొరంగాలూ, అతి ఎత్తైన ప్రాంతాల్లో రైల్వేస్టేషనులూ దీని ప్రత్యేకత. వచ్చే ఏడాది చివరికి ఈ మార్గం అరుణాచల్ ప్రదేశ్ కి కూతవేటు దూరంలోకి వచ్చేస్తుంది. మిలటరీ ప్రయోజనాలు పక్కనపెడితే శాంతి సమయంలో ఈ రైల్వే వల్ల ప్రయోజనాలు ఏమిటి? టిబెట్ జనాభా 60 లక్షలు. టిబెట్ రైల్వే కి కాస్త దగ్గరపోలికలు ఉన్న ప్రోజెక్టు కాశ్మీరు రైల్వే లైను. ఇది మూడు వందల కిలోమీటర్లతో కోటీ పాతిక లక్షల జానాభా గల ప్రాంతాలను కలుపుతుంది. సైనిక అవసరాలు పక్కనపెట్టి కేవలం ఆర్ధిక అంశాలే పరిగణిస్తే కాశ్మీరు రైల్వే కూడా లాభదాయకం కాదు. అలాంటిది, అందులో సగం జనాభా కూడా లేని ప్రాంతానికి అంతకు పదిరెట్లు పొడవైన, ఇంకా ఎంతో కష్టమైన రైలు మార్గం ఆర్ధికంగా ఎలాంటిదో చెప్పాలంటే తెల్ల ఏనుగు అనే పదం సరిపోదు. టిబెట్ రైల్వేకి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఆ మార్గంలో ప్రయాణించే రైళ్ళలో ఆక్సిజన్ సిలెండర్లు కూడా కనీస అవసరాలు. ఏరకంగా చూసినా శాంతిసమయంలో ఇది గుదిబండ. యుద్ధ సమయంలో ఒకవేళ ఈ రైల్వే వాడుకొని సైనికుల్ని తరలిస్తే ప్రత్యర్ధిదేశం వైమానిక దళం, ఈ మార్గంలో ఏ బ్రిడ్జిని గాని, సొరంగాన్ని గాని లక్ష్యం చేసుకున్నా ఈ తెల్ల ఏనుగు కాస్తా పక్షవాతం వచ్చిన ఏనుగుగా మారి, మళ్ళీ నడిపించటానికి ఏళ్ళు పడుతుంది.

హంబన్‌తోట ఓడరేవు:

ఇది ఖచ్చితంగా హిందూ మహాసముద్రంలో చైనా ఆదిపత్యాన్ని పెంచుతుంది. శ్రీలంక, ఎల్టీటియీ ని శాశ్వితంగా నిర్మూలించటంలో చైనా సహకారం తీసుకుంది. ఆ ప్రక్రియలో శ్రీలంకకి అవసరమైన దానికన్నా పెద్ద పోర్టు నిర్మాణానికి చైనా అప్పు ఇచ్చి, తీరా ఆ పోర్టు శ్రీలంక ఆర్ధిక వ్యవస్థకి గుదిబండ ఐనప్పుడు దానిని చైనా 99 ఏళ్ళకి లీజుకి తోసుకుంది. ఒప్పందం ప్రకారం ఈ పోర్టు ని మిలిటరీ అవసరాలకు వాడకూడదు కానీ, చైనా నావికాదళం నౌకలు ఈ పోర్టులోకి వస్తే కాదనే ధైర్యం శ్రీలంకకి లేదు. అంటే భారతదేశానికి దిగువన చైనాకి నావికాదళ స్థావరం ఉన్నట్టే. కానీ, శాంతి సమయంలో శ్రీలంక పోర్టు చైనాకి ఎంత లాభదాయకంగా ఉండగలదు? శ్రీలంక స్వంత ఎగుమతులకు, దిగుమతులకు తన స్వంత పోర్టులు చాలు. ఇంక హంబోటా పోర్టు నుంచి చైనా చేయగలిగే వ్యాపారం ఏమిటి? వ్యాపారం లేని పోర్టుని అప్పు కింద జమ చేసుకున్నా నిర్వహణ వ్యయమో?

ఈరోజుల్లో పొరుగూళ్ళో స్థిరాస్తులు వ్యక్తిగత స్థాయిలోనే గుదిబండలు. అలాంటిది చైనాకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్టుని, ఏదో పరువుకోసం బీజింగ్ నుండి డబ్బులు కుమ్మరించి ఆ పోర్టుని చైనా నిర్వహిస్తుందేమో కానీ, దానివల్ల చైనాకి లాభం లేదు. అప్పుల ఉచ్చు (Debt Trap) ఒక దశ వరకే ఇచ్చినవారికి లాభం. మరో పదేళ్ళ తర్వాత చైనా దగ్గర అప్పు తీసుకొని నష్టపోతున్న దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి, అసలు ఈ అప్పు షరతులే అన్యాయం అనో లేదా ఇదే స్థాయి ప్రోజెక్టులు ఇతరదేశాల్లో ఇంతకన్నా చవగ్గా  అయ్యాయి అనే వాదనో  తెరపైకి తెచ్చి, ఐక్యరాజ్యసమితిని ఆశ్రయిస్తే, చైనా ఎన్ని దేశాల మీద సైనిక చర్య తీసుకోగలదు? అంతర్జాతీయ సంస్థలను ధిక్కరిస్తూ కూడా భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశ హోదాలో ఎన్నాళ్ళు ఉండగలదు? పోనీ, సర్వశక్తులూ ఒడ్డి అలాంటి పరిస్థితిని ఆపినా, ఆయా బాధిత దేశాల్లో తిరుగుబాటు ముఠాలు, గెరిల్లా దళాలూ తయారైతే, స్థానిక ప్రజల సానుభుతి ఉన్నంత వరకూ ఆ గెరిల్లా దళ్ళలమీద స్థానిక ప్రభుత్వాలు కేవలం కంటితుడుపు చర్యలే తీసుకుంటాయి. అప్పుడు, ఇచ్చిన అప్పుల ఉచ్చులో చైనా స్వయంగా చిక్కుకుంటుంది.  మిగతా ప్రపంచం ఎవరిని సమర్థిస్తుందో తెలియాలంటే “గొడ్డు గోతిలో పడితే తలో బెడ్డా వేస్తారు” అనే సామెత తెలియాలి.

చైనా పాకిస్తాన్ ఆర్ధిక నడువా CPEC:

ఆర్ధిక, వాణిజ్య కోణంలో ఆలోచిస్తే టిబెట్ రైల్వే, హంబన్‍తోట పోర్టు కన్నా ఇది చాలా నయం. కానీ, ఇందులో 870 కిలోమీటర్లు గిల్గిత్ బాల్టిస్తాన్ మీదుగా వెళుతోంది. అది భారత భూభాగం. చైనా, పాకిస్తాన్ ల దృష్టిలో పాకిస్తాన్ భూభాగం. ఈ వివాదం పూర్తిగా పరిష్కారం కాకుండా ఈ రోడ్డులో పూర్తి స్తాయి ఆర్ధిక కార్యకలాపాలు/ సరుకు రవాణా మొదలు కావు. లేదంటే, భారత్-పాకిస్తాన్ వివాదాల్లో, బాలకోట్ మాదిరి దాడులు జరిగే ప్రాంతంలో ఉన్న CPEC రోడ్డు ద్వారా ఎగుమతి దిగుమతులు అసాధ్యం.

సీపెక్ రోడ్డుని మన సైన్యం నేరుగా ధ్వంసం చేసే సాహసం చెయ్యకపోయినా ఆ చుట్టుప్రక్కల జరిగే అలజడి వల్ల ఖచ్చితంగా ఆ రోడ్డు ఉద్దేశ్యం నెరవేరదు. ఒకవేళ చైనా బలవంతం (మధ్యవర్తిత్వం) వల్ల భారత్ పాకిస్తాన్ లు సీపెక్ రోడ్డు వెళ్ళే ప్రాంతాన్ని కాల్పుల విరమణ ప్రాంతంగా ప్రకటించినా, అందుకు చైనా భారత్‍ల మధ్య ఇతర సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం ఉండాలి. చైనా దానినీ సాధించింది అనుకుందాం. గిల్గిత్ బాల్టిస్తాన్ లో ఉన్న ప్రజలు వేలఏళ్ళుగా హింసకి అలవాటు పడ్డవారు. పాకిస్తాన్ వారిని మత యుద్ధ యోధులుగా తీర్చిదిద్దింది. ఇప్పుడు వారు భారత్ వ్యతిరేక కార్యకలాపాలు ఆపకపోతే వారి స్థావరాల మీద భారత్ జరిపే దాడుల్లో సీపెక్ రోడ్డు భద్రత ప్రశ్నార్ధకం. ఒకవేళ వారిని భారత్ జోలికెళ్ళకుండా పాకిస్తాన్ ఆపగలిగితే (దాదాపు అసాధ్యం ఐనా కాసేపు ఆపగలిగింది అనుకుందాం), వారి చేతులు దురదపెట్టి నేరుగా సీపెక్ రోడ్డుమీదే దాడులు మొదలుబెట్టవచ్చు. వారి మీద పాకిస్తాన్ సైన్యానికి పూర్తి అదుపులేదు.

ఇంతకీ, గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలకి చైనా రహదారి మీద దాడి చేసే అవసరం ఎందుకుంటుంది అంటారా? ఆ రోడ్ కి వ్యతిరేకంగా ఇప్పటికే వారు నిరసన తెలియజేసి ఉన్నారు. మత కారణాలు ఉండనే ఉన్నాయి. జింజియాంగ్ ముస్లిములమీద చైనా ప్రభుత్వ అణచివేత వారి చెవిని పడకుండా ఉంటుందా? 1980ల్లో అమెరికా సహాయం పొందిన తాలిబాన్‍లు, అవే ఆయుధాలను పదేళ్ళలోనే అమెరికా మీద ఎక్కుపెట్టలేదూ? జిహాదీ గ్రూపుల ఆయుధాలు చైనా మీద ఎక్కుపెట్టే రోజు రాదు అని ఎందుకనుకోవాలి? ఇన్ని విపత్కర పరిస్థితుల్లో ఒకవేళ సీపెక్ రోడ్ల రక్షణ బాధ్యత కూడా చైనా సైన్యం చూసుకోవలసి వస్తే, సీపెక్ ఆదాయం అంతా దాని రక్షణకే సరిపోతుంది. పెట్టుబడి రాబట్టడానికి శతాబ్దం కూడా చాలదు.

నిజానికి ఇవన్నీ 20 నుండీ నలభై ఏళ్ళలో పెట్టుబడి మొత్తం వడ్డితో సహా రాబట్టవలసిన ప్రోజెక్టులు.అందుకే, రోడ్లూ, రైల్వేలూ, పోర్టులూ అంటూ మౌలికసదుపాయాల నెపంతో చైనా నిర్మిస్తున్న సైనిక స్థావరాలన్నీ చైనా ఆర్ధికవ్యవస్తని భవిష్యత్తులో గాయపరచే బూమరాంగ్ లు.

@@@@@

Subscribe to Anveshi Channel & watch well curated historical documentaries

2 thoughts on “బూమరాంగ్‍లు పదును పెట్టుకుంటున్న చైనా

Your views are valuable to us!

%d bloggers like this: