సాహిత్యానువాదము-ఒక పరిశీలనాత్మక విశ్లేషణ

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 3]

సాహిత్యానువాదము-ఒక పరిశీలనాత్మక విశ్లేషణ

ఉపోద్ఘాతం

ఇరవై ఒకటవ శతాబ్దం ప్రవేశించి ఒక దశాబ్దం పైగా గడిచిపోయింది.
ప్రపంచం వ్యాపారీకరణం వైపు, సాంకేతిక ప్రగతివైపు అతి త్వరగా అడుగులు వేస్తూ, పరుగందుకుంటూ మానవ ప్రగతి పట్ల మనకున్న, వుండాల్సిన దృక్పధాన్నే మార్చివేస్తున్నది. ఈ సందర్భంలో ఒక్క క్షణమాగి. ఏఏ రంగాలలో ఈ పురోగతి శీఘ్రగతిలో ముందుకెళ్తున్నది ఏఏ రంగాలలో ఇంకా మన ప్రయాస, ప్రయత్నాలు పెంపొందించుకోవాలి అని పునరావలోకించుకోవసిన అవసరమెంతైనా వుంది.
ప్రపంచీకరణ అని మనం దేన్నైతే అంటున్నామో అది మానవజీవితంలో ప్రతి అంశాన్నీ స్పృశిస్తున్నది. అయితే దీని ప్రభావం ఒక్క వాణిజ్య, వ్యాపార, సాంకేతిక రంగాలలో వుందని అని సాధారణంగా జనసమ్మతమైన అభిప్రాయం.
ఈ రంగాలలో అత్యధికంగా వున్నమాట వాస్తవమే అయినప్పటికీ సాధారణ జనజీవనాన్ని ప్రభావితం చేసే దిశలో ఎన్నో విధాలుగా ఈ ప్రపంచీకరణ మన ఆలోచనా విధానాన్ని, మన విశ్లేషణాత్మక పరిధిని అనేక దిశలలో విస్తరింపజేస్తున్నది. దీనిని వ్యతిరేకించినా, దీని ప్రభావాన్ని తప్పించుకుందామని ప్రయత్నించినా వెనకాల వున్నవాళ్ళు వెనకే వుండిపోతున్నారు.
దీని ప్రవాహంలో ప్రపంచం కొట్టుకుపోవడం తప్పనిసరి అయినప్పుడు, ఎంతోకొంత మంచిని మనమూ పొందాలనుకుంటే దీనిని స్వీకరించక తప్పదు. సాధ్యమైనంతమట్టుకు వ్యతిరేక ప్రభావాల్ని ప్రతిఘటిస్తూనే మంచిని మనకి వుపయోగించేలా మలచుకోవాల్సిన అవసరం ఈనాడెంతయినా వుంది. అంతేకాదు, సంచార, దూరభాష, అంతర్జాల సంభాషణలు విస్తరిస్తున్న ఈ యుగంలో ఒక భాషనుంచి మరొక భాషకి వుండవలసిన సంస్కృతీ వంతెనలు పటిష్టంగా వుండాలంటే నేడు మనకి ఈ ప్రపంచీకరణం పట్ల అవగాహనవుండటం అవసరం.

సాంకేతికంగా మన భారతీయ యువకులు దేశ విదేశాలలో విస్తరించి ప్రపంచీకరణంలో మరేదేశంలోనూ లేనంత విశిష్టంగా తమ పాత్రను నిర్వహిస్తున్నారు. అయితే ఈ పరుగుపందెంలో ముందుండాలనే తపన వీరిని కొన్ని ముఖ్యమైన అంశాల నుంచి దూరం చేసింది.

మాతృభాష పట్ల వుండవలసినంత అభిమానంలేకపోవడమనేది వీటిలో చాలా ప్రధానమైన అంశం. చిన్నప్పటినుంచే వైద్య, సాంకేతిక, ప్రాద్యోగిక, తదితర వృత్తి రంగాలలో నైపుణ్యాన్ని సంపాదించుకున్నంత వేగంగా భాషా, సృజనాత్మకమైన అంశాలలో పట్టుని కోల్పోతున్నారనేది నిర్వివాదాంశం. ఏ సాంకేతిక పురోగతి వీరిని వీటినుంచి వంచిస్తున్నదో ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని నిచ్చెనగా చేసుకుని భాషాసంస్కృతులకి వారధులు కట్టుకోవచ్చును అనే అంశాన్నిపరిశీలనాత్మక దృక్పధంతో విశ్లేషించటం ఈ నా రచన ముఖ్యోద్దేశ్యం.

sataka sahityam thumbnail

అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు

భాషాభివృద్ధి – అనువాదం

ప్రపంచీకరణలో భాగంగానే భాష అభివృద్ది, భాషపట్ల మమకారం యువతలో పెంచటానికి మార్గాల నన్వేషించటం ముఖ్యమైన అత్యవసరమైన అంశంగా మనం గుర్తించాలి. ఒకవైపు మన భాషలకి ప్రాచీన భాషగా గుర్తింపు కావాలని రాజకీయ పోరాటాలు చేస్తూనే మన కాలేజీలలో చదువుకునే యువత మన భాష మాట్లాడటం తప్ప రాయడం చదవడం తెలియని స్థితిలోకి వచ్చేలా విద్యావిధానాల్ని రూపొందిస్తున్నాము.

మన భాషలోని మంచి సాహిత్యాన్ని మన పిల్లలికి తెలియ చెప్పాలంటే వాటిని వారికి అర్థమయ్యే భాషలోకి అనువదించి చెప్పవల్సి వస్తోంది. ఇది కేవలం ప్రవాసాంధ్రుల సమస్య అనుకుంటే పొరపడుతున్నామనే అనుకోవాలి. ఈనాడు భారతదేశంలో ఏ నగరంలోనైనా సరే మాతృభాషని  మాట్లాడగలిగేవాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో వుంటారు. ఒకవేళ ఎవరైనా వున్నా వారి భాషలో వున్న రచయితలెవరో చెప్పలేరు.

హింది వాళ్ళకి ప్రేమ్ చంద్ తెలుసు అతను రాసిన ఒక కథని గురించి గూడా చెప్పలేరు. అల్లాగే బెంగాలీ వాళ్ళు మళయాళీ వాళ్ళు, వాళ్ళ రచయితల/యిత్రుల గురించిన ఎలాంటి అవగాహన లేకుండానే పెరిగి పెద్దవుతున్నారు. తెలియకపోవడము వలన వారికి ఏ విధమైన నష్టమూ లేదు వారి దృష్టిలో.

జీవితంలో అంచెలంచెలుగా ఎదగటానికి నిజానికి మాతృభాష అవసరంలేదు ఎవరికీ. అందుకే విద్యావిధానాలుగానీ, తల్లిదండ్రులుగానీ, స్వయంగా పిల్లలుగానీ సాహిత్యపరంగా భాష నభ్యసించటానికి నేర్చుకోవల్సిన వయస్సులో ప్రయత్నించటం లేదు. అయితే చదువులయ్యి ఏ వుద్యోగోల్లోనో స్థిరపడి ఒక పదేళ్ళు గడిచాకా తమ భాష తమ పిల్లలికి రాదేమోనన్న తపన మొదలవటం చూస్తున్నాము.

విదేశాలలో స్థిరపడిన వాళ్ళకీ రాష్ట్రాంతర వాసులకీ ఈ తపన ఇంకా ఎక్కువ. అప్పుడు తాము కోల్పోయినదేమిటో అది ధన కనక వస్తు వాహనాదులకి సంబంధించనిదని, అది పూర్తిగా హృదయానికి, మానసిక సుస్థిరతకి చెందినదని అర్థమవుతుంది.

తెలుగు రాని వాళ్ళ కోసం కాకపోయినా తెలుగు రాని తెలుగు పిల్లలకోసం ఈనాడు సాహిత్యానువాదాల అవసరం ఎక్కువ వుంది. ఇక ముందు పెరుగుతుంది కూడా! ఇంకో విషయం. ఈనాడు మనం చూస్తే ప్రతి కాలేజీలోనూ అందులో మరీ ముఖ్యంగా ప్రొఫెషనల్ కాలేజీలలో యజమాన్యాలు పిల్లలు కమ్మ్యూనికేషన్ స్కిల్స్ లాంటి కోర్సులు వుండాలని కోరుకుంటున్నారు.

కొంచెం పరిశీలించి చూస్తే ఎవరికన్నా అర్థమయ్యే విషయమేమిటంటే మాతృభాష మీద పట్టు వున్న విద్యార్థులకి ఆంగ్లంలో కూడా బాగా భావప్రకటనా సామర్థ్యం కొద్దో గొప్పో వుంటుంది. మాతృభాష రాని వాళ్ళకి ఏ భాషా త్వరగా పట్టుపడదు.

ఇప్పుడు పదవ తరగతి తర్వాతగానీ, అప్పుడప్పుడు ఎనిమిదో తరగతి తర్వాత తెలుగు గాని మరే ఇతర మాతృభాష ఎవరూ చదవడంలేదు. ఇంజనీరింగులు, మెడిసన్ పూర్తిచెయ్యట్టానికి ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు పడుతుందనుకున్నా ఇంతకాలం వారి భాషని చదవడంగాని రాయడంగాని చెయ్యరు ఎవ్వరూ! సహజంగానే ప్రావీణ్యం తగ్గిపోతుంది.

చదువులు పోటీలు వారంతట వారు చదవడానికి అవకాశాన్నివ్వవు అనే విషయం మనందరికీ తెలుసు. మళ్ళీ చదువులయ్యి వుద్యోగాల్లో స్థిరపడ్డాకానే కొందరికి భాష మీద ద్యాస మళ్ళుతుంది. అప్పుడు అందరూ అనువాదాల ద్వారానే తమతమ భాషా సాహిత్యాల మీద అవగాహన పెంపొందించుకున్నా తమ తర్వాత తరాల వారికి అందిచ్చినా, ఈ విధంగా అనువాద సాహిత్యం యొక్క ప్రాముఖ్యత నేటి ప్రపంచీకరణయుగంలో పెరుగుతున్నదని అర్థమవుతున్నది.

భాషమీద అభిమానం పెంచుకోవటానికి ఈ తరం మళ్ళీ ప్రయత్నిస్తున్న దనటానికి అమెరికాలోనూ, బెంగుళూరు, హైదరాబాదులాంటి మహానగరాలలో ఎంతోమంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు తెలుగు వెబ్ సైట్లని ప్రారంభించి సాహిత్యాన్ని డిజిటైజ్ చేసి చర్చలు నిర్వహించి మంచి కృషి చేస్తున్నారు.

బెంగుళూరునుంచి రఘోత్తమరావుగారి ఆవకాయ.ఇన్ , అమెరికానుంచి కౌముది, తెలుగుజ్యోతి లాంటి సాహిత్య పత్రికలు, అక్షర అనే అఫ్సర్ గారి వెబ్సైట్, నిడదవోలు మాలతిగారి తులిక వీటిలో చెప్పుకోదగ్గవి. వీరందరికీ తెలుగు సాహిత్యం మీద మంచి పట్టు వుండటం ఒక ఆసక్తికరమైన విషయం. ఒక పఠనాసక్తి వుంటే గానీ ఈ అభిలాషని పోషించుకోవటం కష్టం. ఇలాంటి కృషి మన తర్వాత తరాలవాళ్ళు చేస్తారా, చెయ్యగలరా అనేది సందేహాస్పదమైన విషయమే!

సాహిత్యానువాదం

ఇక సాహిత్యానువాదానికివస్తే దానికి వున్న సాధక బాధకాలు ఏమిటో పరిశీలించాలి. భారతదేశంలాంటి బహుళ సంస్కృతీ  వికాసాలు ప్రధానభూమిక వహించే సమాజంలో అనువాద ప్రక్రియకి ఒక విశిష్టమైన ప్రత్యేకమైన స్థానంవుంది.

ఒక భారతీయ భాష నుంచి వేరొక భారతీయ భాషలోకి అనువదించటానికి వున్న సాధకబాధకాల కన్నా ఒక భారతీయ భాష నుంచి ఆంగ్లభాషలోనికి అనువదించటానికి వున్న సాధకబాధకా లెక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఆంగ్లభాష యూరోపియన్ భాష. సముద్రాలు, ఖండాలు, ఎడారులు – ఇన్నిటిని దాటితేనేగానీ ఈ దేశాలెల్లా చేరుకోలేమో ఈ సంస్కృతిని అల్లా మన సంస్కృతితో మిళితమయ్యేలా చెయ్యలేము.

మనదేశంలోనే సంస్కృతీ వైరుధ్యాలు ఉత్తర-దక్షిణ భారతాలమధ్య వున్నప్పటికీ  చాలామట్టుకు సంస్కృతం మూలభాష కనక భాషపరంగా సంస్కృతీపరంగా అనువాదాలు చెయ్యటం అంత కష్టంకాదు. గమనించవలసిందేమిటంటే ఒక భాషలో చెప్పగలిగిన దేన్నైనా మరో భాషలో చెప్పగలము.

సమస్య ఎక్కడ వస్తుందటే మనభాషలో చెప్పినట్టే చెప్పాలి అనుకుంటే అందంగా మూలభాషలో చెప్పినట్టు అనువదింపబడిన భాషలో చెప్పలేము. అప్పుడు అనువాదం సహజంగా చదివించే శక్తితో వుండదు. మనం రాస్తున్నది మూలభాష తెలియని వాళ్ళకి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకి రెండు భాషలలో ప్రావీణ్యముండటము చాలా అవసరం. అయితే చదువరినే దృష్టిలో పెట్టుకోవాలి.

దీనికి ఉదాహరణగా తెలుగులోకి ఎన్నో శరత్ నవలలు, రవీంద్ర సాహిత్యం అనువాదమై వచ్చాయి. అవి బెంగాలీలో ఇంకా ఎంత అందంగా వుంటాయో మనకి తెలియదు. తెలిసే మార్గంలేదు (ఆ భాషలు నేర్చుకుంటే తప్ప).

తెలుగులో చదివినంతమట్టుకు అవి ఒక స్వతంత్ర ప్రతిపత్తిగల సాహిత్యంగా మనకి స్ఫురిస్తాయి కనుకే వాటికంత సాహిత్య ప్రయోజనం, విలువ నేటికీ వున్నాయి. అల్లాగే రష్యన్ భాషనుంచి ఆంగ్లంలోకి గానీ మరే భాషల్లోకి గాని వచ్చిన అనువాదాలు సహజంగానే అనిపిస్తాయి కానీ అనువాదాలనిపించవు.

తెలుగులో అనువాద సాహిత్యం

తెలుగు సాహిత్యంలోకొస్తే ప్రత్యేకంగా వేరే భాషలనుంచి తెలుగులోకి అనువాదాలు విస్తృతంగా వచ్చినా సాహిత్యపరంగా తెలుగు నుంచి వేరే భాషలలోకి వెళ్ళిన గ్రంధాలు గానీ కవిత్వాలుగానీ మంచి నవలలుగానీ తక్కువనే చెప్పాలి.

అయితే దీన్ని బట్టి మనకి  అనువాదం తెలియదనుకుంటే పొరపాటు పడినట్టే.

మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది – తెలుగులో ఆదికావ్యంగా గుర్తింపబడిన పదిహేను పర్వాలు గల ఆంధ్ర మహాభారతము  మూలభాష సంస్కృతమని, అయితే మన భారతం మూలానికి మక్కీమక్కీ అనువాదం కాదని, అది మూల గ్రంధం ఆధారంగా రాయబడిన స్వతంత్ర ప్రతిపత్తి గల కావ్యమని చెప్పచ్చును.

దీనిని అనువాదమనరాదని అనుసృజన అనాలనీ కూడా పలువురి అభిప్రాయం.

ఆ మాటకొస్తే మనభారతీయ భాషల్లో చాలా మట్టుకు ఆది గ్రంధాలు సంస్కృతభాషనుంచి అనుసృజింపబడినవే. ఆరకంగా మనకి ఏదీ మూలగ్రంధమంటూలేదని కొందరి అభిప్రాయం. మన మనస్సుకి వచ్చిన భావాల్ని భాషాంతరీకరించటమే మొదటి అనువాదప్రక్రియ అని అనుకోవచ్చును.

మహాభారతానికి మరొక గొప్పతనంవుంది. ఇంత సమగ్రంగా అనువదింపబడిన భారతం భారతీయభాషలలో మరొకటి లేదు. మూడుప్రాంతాలనుంచి వచ్చిన ముగ్గురు కవులు కవిత్రయమై ఒక సమగ్రకావ్యాన్ని జాతికి అందించారు. ఇలాంటి మరొక ప్రయత్నం నేటికాలంలో సాధ్యమని వూహించను కూడా లేము.

సాహిత్యానువాదాలు ఈనాడు ప్రాముఖ్యతని సంతరించుకోవటానికి ముఖ్య కారణం ఆంగ్లభాష ప్రభావం పెరగటం. అయితే, భారతీయ భాషలపట్ల భారతీయులకి మమకారం క్షీణిస్తున్న నేటికాలంలో ఒక భారతీయ భాషనుంచి మరొక భారతీయభాషలోకి సాహిత్యానువాదాలు జరగటం సమంజసమైన విషయం. అయితే ఆంగ్లభాష ప్రభావం పెరగటమే కాక దానిని వుపయోగించేవారి సంఖ్య దేశ విదేశాలలో పెరుగుతుండటంతో ఆంగ్లానువాదాలకి ప్రాచుర్యం పెరిగింది.

తెలుగుని గానీ మరే ఇతర భారతీయ భాషని గానీ చదవలేని వారు తప్పనిసరిగా వృత్తి వ్యాపకాలలో వృద్దికోసం ఆంగ్లభాషని అభ్యసించటం ఒక తప్పని ఉప్పెన కనుక ఈనాడు తెలుగు చదవలేని వాళ్ళెందరో ఆంగ్లభాషని కొద్దొగొప్పో చదవగలుగుతున్నారు కనుక ఆంగ్లానువాదాల అవసరం వాటి పట్ల మమకారం పెరిగింది.

అయితే ఒక విషయం, ఈ విశ్లేషణంతా పట్నవాసాల్లో వుంటూ మాతృభాష మరుగున పడిపోయిన వాళ్ళకే!

పల్లెలలో ప్రాంతీయ భాషా మాధ్యమంలో చదివేవాళ్ళకి ఈ సమస్యలు లేవు.  విదేశాంధ్రులే కాక నగరాల మయాజాలంలో పెరిగే స్వదేశాలలోనే వున్న ప్రవాసాంధ్రులు కూడా ఆంగ్లానెక్కువ చదువుతున్నారు. అంతేకాదు. అంతర్జాతీయ భాషగా ఆంగ్లానికి గుర్తింపు వుండటం మరొక కారణం. సంస్కృతీపరంగా ఔన్నత్య శిఖరాల నధిరోహించిన మన సంస్కతి, భాషాపరంగా ఉచ్ఛస్థాయిలో వున్న ఆంగ్లంలోకి అనువాదాల రూపంలో మమైకమవటానికి చారిత్రకంగా ఆంగ్లపాలన క్రింద భారతదేశం రెండు వందల సంవత్సరాలు గడపవలసిన రావటం అన్నిటి కంటే ముఖ్యమైన కారణం.

అలెక్సాండర్ కాలంనుంచి మొగలాయీ పార్సీ, సింధీ, యూరోపియన్స్ దాకా అన్ని సంస్కృతులనీ తనలో కలుపుకుంటూ వచ్చిన భారతీయ సముద్రం, ఆంగ్లో సాక్సన్ తో మొదలై జెర్మానిక్, ట్యుటానిక్, స్కాండినేవియన్ల తో మొదలై, ఆసియాలో సంస్కృతం ఇంకా ఎన్నో భారతీయ భాషలతో సహా ఎన్నో పదాలని తనలో కలుపుకుని విస్తృతమైపోయిన ఆంగ్లభాషా సముద్రంలో కలవటం ఒక అద్భుతమైన నాగరికతల కలయికగా చిత్రించవచ్చును.

సాంకేతికంగా చూస్తే సాప్ట్ వేర్ లో అత్యంత ప్రావీణ్యత సంపాదించుకున్న ఇంజనీర్లు  భారతీయులలో ఎక్కువమంది వున్నారు. భారతీయ భాషలని ప్రపంచవేదిక మీద ఆవిష్కరింపదలుచుకుంటే ఇంతకు మించిన అవకాశం మనకి లేదనుకోడం అత్యాశ కాదు. అయితే, అందరు ఇంజనీర్లూ ఈ దృష్టితో ఆలోచించగలరా అనేది ముఖ్యం. మళ్ళీ చదవవలసిన వయస్సులో/సమయంలో తెలుగుని చదవలేకపోవడం ఈ భాషారాహిత్యతకి కారణం మళ్ళీ. ఇదొక విష చంక్రమణం.

ఇంగ్లీషువాళ్ళకి వారి సాహిత్యాన్ని ప్రపంచమంతా వ్యాపింపచేయటానికి ఏ అనువాదాల అవసరంలేదు. ఇతర ప్రపంచ భాషల నుంచి సాహిత్యం మనం చదవగలుగుతున్నామంటే ఆంగ్లభాష సౌలభ్యం వలననే లభిస్తున్నది.

అనువాద సమస్యలు

ఇక అనువాద సమస్యల దగ్గరికి వస్తే ఇదివరకే చెప్పినట్టు సాంస్కృతిక సామీప్యం (కల్చరల్ ప్రోక్సిమిటీ) అని మనం దేన్నయితే అంటామో అది రెండు దగ్గర భాషల మధ్య సులభంగా సాధ్యమవుతుంది. అల్లాగే చారిత్రకంగా ఒకే సమయానికి చెందిన రెండు భాషలమధ్య సయోధ్య త్వరగా కుదురుతుంది.

ఒక పదిహేనవ శతాబ్దానికి చెందిన రచనని ఇరవై ఒకటవ శతాబ్దంలో అనువదించడం కంటే ఇరవైయవ శతాబ్దంలో రచించిన రచనలు ఇప్పుడు అనువదించడంలో  సమస్యలు రావు. అందుకే మధ్యయుగాల్లో మనభాషలో ఆవిర్భవించిన ప్రౌఢ, ప్రబంధ సాహిత్యాన్ని ఈ యుగంలో ఆంగ్లంలోకి అనువదించడంలో చాలా సాధక బాధకాలుంటాయి. చారిత్రకంగా సాంస్కృతికంగా దూరం పెరగటమే దీనికి కారణం.

ఆంగ్లంలో అనువాదాలు

మనదేశంలో స్వాతంత్రానంతరం ఆంగ్లానువాదాలపట్ల ఆసక్తి పెరగటం చూస్తున్నాము. ఇప్పుడు వస్తున్న రచనలని ఈనాడు ఆంగ్లంలో అనువదించటంలో ఒక సౌలభ్యం వుంది. మన భాషలలో కూడా ఆధునికత పట్ల ఆసక్తి పెరగటంతో ఆంగ్లసాహిత్యం మనకి అనుకోకుండా వచ్చిన చారిత్రక వారసత్వంలా సంక్రమించింది. భారతీయాంగ్ల రచయితలు సల్మాన్ రష్డీ లాంటి వాళ్ళు దేశ విదేశాలలో తిరిగి సంపాదించిన దృక్పధాలు క్రొత్త కిటికీలు తెరిచినట్టయింది.

అంతకుముందు దాదాపు నూట ఏభయిఏళ్ళ క్రితంనుంచి ఆంగ్లభాష మన కాలేజీలలో బోధనా మాధ్యమంగా మారినప్పటినుంచి దేశమంతటా ఆంగ్లంలో సృజనాత్మకంగా రాయాలన్న తపన పెరిగింది. దానితో పాటు ఇరవై శతాబ్దంలో నోబెల్ పురస్కారం స్వాతంత్రానంతరం మన రచయితలు పొందిన బుకర్, పులిత్జెర్ అవార్డుల వల్ల దాని వలన రచయితలు పొందిన పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ధనరాసులు ఆంగ్లం పట్ల ఆకర్షణ పెరగటానికి కారణమయింది.

ఇప్పుడు ఆంగ్లం పట్ల మమకారంతో పాటు మన భాషలు రచయితలని దేశ విదేశాలలో నివసిస్తూ కూడా నిలబెట్టుకోవడానికి భారతీయులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక్కడ ఒక వివాదాస్పదమైన అంశం వుంది.

ఒకప్రక్క దేశం ప్రపంచీకరణ వైపు వెళ్తూ ముందంజవేస్తోంది. మరోవైపు దేశంలోని ప్రతి ప్రాంతంలో భాషలో తమ ప్రత్యేకతని, గుర్తింపుని నిలబెట్టుకోవాలనే తాపత్రయం కూడా పెరిగింది. ఆర్థిక, వ్యాపారిక దూరాలు, సంచార మాధ్యమాలు తగ్గుతున్న కొద్దీ మానసిక సాంస్కృతిక భాషాపరమైన దూరాలు పెరుగుతున్నాయి. వీటిమధ్య సంఘర్షణలు ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో జరగటం చూస్తున్నాము. దేశాల మధ్య సహకారం ఒక రంగంలో పెరుగుతున్నా భిన్ననాగరికతల మధ్య సంక్లిష్టతలు దేశం బయటా లోపలా కూడా పెరుగుతున్నాయి. భాషలు ఏ రకంగా వీటిని వ్యక్తీకరిస్తున్నారో చూస్తే ఈ పరిస్థితి క్లిష్టత మనకర్థమవుతుంది, తెలుస్తుంది.

ఫ్రతి భాషకీ తనదైన ఒక ప్రత్యేక నాదం, అస్తిత్వం వుంటాయి. భారతీయ సామాజిక దృక్పధంతో చూస్తే ప్రతి  భాషకి ప్రాంతానికి కొన్ని ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, అలవాట్లు, ఆ ప్రాంతపు సంస్కృతిని బట్టి నిర్దేశింపబడి వుంటాయి. ఇవి వేరే భాషకి అనువాదించాలంటే వాటిగురించిన అవగాహన వుండటం అవసరం.

భారతదేశానికి సంబంధించినంతమట్టుకు స్త్రీల పట్ల, దళితుల పట్ల మన సమాజం వ్యవహరించిన తీరు, దానికి వారు స్పందించిన విధానం, రకరకాలైన సామాజిక దృక్పధాలకి మనం ఇచ్చిన సాహిత్య స్పందన ఇవన్నీ మనజాతికే చెందిన కొన్ని అంశాలు. అల్లాగే మన హాస్యం, మన ఆరంభశూరత్వం, మన తిట్లు మన భాషకే చెందిన నిధులు. వీటిని వేరే భాషలలో పెట్టాల్సి వస్తే ఇతర భారతీయ భాషల్లో వున్న సౌలభ్యం ఆంగ్లంలో వుండదు.

కొన్ని ఉదాహరణలు:

మన భావనలో నదుల కొక విశిష్ట స్థానం వుంది. నీళ్ళు అనడం కంటే మనకి గంగాజలం అనడం పరిపాటు. ఈ అనడంలో ఒక పవిత్రతను ఆ నదికి ఆపాదిస్తాం. ఉత్తారాదిన గంగ ఎలాగో దక్షిణాది వారికి గోదావరి అంత ప్రాశస్త్యం వున్న నది.

ఆంగ్ల సంస్కృతికీ పవిత్రత అనే భావన లేదు. వారి నీరు ఒక భౌతిక వస్తువు మాత్రమే! అల్లాంటప్పుడు అడవి బాపిరాజుగారు “నరమానవుని పనులు శిరమొగ్గి వణికాయి కరమెత్తి దీవించి కడలికే నడచింది” అని వరద గోదావరిని వర్ణించినా, అద్దేపల్లి రామమోహనరావుగారు “గోదావరి నా ప్రతిబింబం” అంటూ “నీళ్ళు దోసిట్లోకి తీసుకుంటే తెలుగు సంస్కృతి దోసిట్లో నిలబడుతుంది” అన్నా, ఎండ్లూరి సుధాకర్ “నీ ఒడ్డు ఒడిలో తలపెట్టుకున్నప్పుడు అమ్మ దగ్గిరే వున్నట్టుంటుంది; నీ ఇసుక మేనిపై పొర్లాడుతున్నప్పుడు నాన్న గుండెల మీద ఆడుకున్నట్టుంటుంది” అంటూ నేటి గోదావరీ భూమిపుత్రులదని చెప్పినా ఆయా కవుల సామాజిక నేపధ్యం కవితలలో దాగివుంటుంది. ఈ నేపధ్యాన్ని అనువదించగలగాలి.

“All life and men stood still

With heads bowed, shivering,

She towards the ocean flowed

Her hand raised and blessing!”

– Varada Godavari- Adivi  Bapiraju

“Godavari is my mirror image…

When you hold the water in hands

It is like Telugu culture in your joined hands”

Godavari Naa Pratibimbam

When I rest my head on your lap banks

I feel I am with my mother

When I roll in the sand dunes of your body

I feel I am playing on my father’s chest…

Godavari is not of the landlords,

Godavari is of the sons of the soil”

– Godavari, Endluri Sudhakar

కాలం మారుతున్నకొద్దీ నదిని కవి చూసే దృక్పధంలో వచ్చిన మార్పులు అనువాదంలో అర్థమయ్యాయని ఆశించవచ్చునా? అనే సందేహం పాఠకులే తీర్చగలరు.

ఇక సామాజిక దృక్పధానికి వస్తే,  అడుగుజాడ గురజాడది అని మనమంతా అనుకునే గురజాడతో మొదలై నేటిదాకా తెలుగు కవులు తమచుట్టూ వున్న సమాజ పరిస్థితులకి స్పందించి కవితలల్లారు

“ఆవులు పెయ్యలు మందల జేరెను పిట్టలు చెట్లను గుమిగూడెన్, మింటను చుక్కలు మెరయుచు పొడమెను ఇంటికి పూర్ణమ రాదాయె” అని గురజాడవారు గుండెలు కరిగేలా కవితలల్లినా, ఇప్పటికైనా కాళ్ళను కళ్ళకద్దుకుని పూజించాలి. గాయపడ్డవాటికి మందురాసి వూరడించాలి అని కేతవరపు రమణమూర్తి అన్నా, ఆత్మల కాలుష్యమే ఆధునిక సమస్య, మట్టిమీద బ్రతుకంతా ఆవరించిన పచ్చదనంమీదా మమకారం చచ్చి పోయినప్పుడు చేతులు విద్వంస పరికరాలుగా మారినప్పుడు మనిషి కంటే వ్యర్థ పదార్థం లేదు అని పాపినేని శివశంకర్ అన్నా వీటివెనకాల ఒక సామాజిక సత్యానికి సంబంధించిన ఒక సందర్భం వుంది.

Homeward reached cows and calves

To the nests the birds of the forest

Glittering they appeared on the sky

She did not come home, Our Purnamma!

Putadibomma Purnamma- Gurazada Apparao

At least now learn to worship your legs,

Touching them to your eyes*

Treat them with balm, the hurt and ailing feet of yours

To touch an object to the eyes is a gesture of reverence and worship

Mattikaallu- Ketavarapu Venkata Ramana Murthy

When we lose our link with

Our earth and green pastures

That we had once

When our hands turn into

Instruments of Destruction

There is no waste material

Worse than man

Aakupacchani lokamlo- Papineni Siva Sankar

అల్లాగే మన ప్రయోగాలలో మొగుడనే వాడు ఓ అధికారం చూపించి దాసోహ మనిపించాలని చూసే ఘటికుడిలా కనిపిస్తాడని చెప్పటానికెన్ని మార్గాలున్నాయో చూడండి.

పాఠం అప్పచెప్పకపోతే పెళ్ళి చేస్తానని పంతులుగారన్నప్పుడే భయమెసింది, ఆఫీసులో నా మొగుడున్నాడు అవసరమొచ్చినా సెలవివ్వడని అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసింది, పెళ్ళంటే పెద్దశిక్షని, మొగుడంటే స్వేచ్చాభక్షకుడని” అని సావిత్రి ’బందిపోట్లు’ అనే కవితలో అంటుంది.

అల్లాగే జయప్రభ “కుంతి కడుపు నిండా కర్ణ గర్భభారాన్ని కడదాకా మోసింది” అని కుంతీదుఃఖాన్ని వర్ణించింది.

పరిక్ష పేపర్ కే కాదు, జీవితానికీ ఇవ్వాలి మార్జిన్, మనసిచ్చిన వాడినుంచికూదా బ్రతుకును భద్రంగా దాచుకోవాలి” అని ఎస్. జయ చెప్పుతారు. సమాజంలో స్త్రీ స్థానంమీద పురాతన కాలంనుంచి నేటిదాకా స్త్రీ స్పందించిన విధానాన్నినేటి ఈ కవయిత్రులు అద్దం పట్టారు.

 

“I was scared when teacher said

He would get me married

If I don’t recite the lesson for the day!

I had a doubt when annayya said

There was a husband in his office

Who would not grant him leave

Even when you needed it desperately…

Then I understood that marriage is nothing

But a punishment!

Husband is one who swallows your freedom! “

Banndipotu – Savitri

“Full term, till the last minute of her life Kunti

Carried Karna in her womb…”

Kunti – Jayaprabha

Margins should be given

Not just to the answer scripts in

Examinations, but to life too!

Life should be preserved

Even from the man you loved!

Half the World – S.Jaya

 

ముగింపు వాక్యాలు

చివరిగా తెలుగు కవితలలో దళిత  స్పృహ తెలుగు సాహిత్యానికొక మానవీయతని, నవీనతని ఆపాదించి పెట్టింది.

ఎండ్లూరి సుధాకర్ నేడు రాస్తున్న కవి అయితే, కులతత్వాలు భారతీయ సాహిత్యంలో ఇరవైవ శతాబ్దంలో గుర్రం జాషువా గారి గబ్బిలం తో ప్రస్ఫుటంగా కనిపిస్తుందనిచెప్పవచ్చును.

కులవివక్షత ఈ సమాజానికి అనాదినుంచి వస్తున్న దురాచారం అయితే అస్పృశ్యతని అవకాశం వచ్చిన ప్రతి చోటా గాంధీజీ దానిని విస్తారంగా ఖండించటం ద్వారా వ్యతిరేకించటానికి అనేకులకి స్ఫూర్తినిచ్చారు.

ఎనభైల దశకం తర్వాత ఈ దళిత గొంతుకలు శక్తిని, బలాన్నీపుంజుకున్నాయి. వీరి ఆవేదనలలోని ఆర్తి భాషకొక క్రొత్త పదునుని సంతరించి పెట్టింది. ప్రాపంచికంగా అణిచివేతలు అంతటా వున్నాయి. కులవివక్షత మాత్రం మనకే చెందిన ఒక ప్రత్యేకత అని చెప్పవచ్చును. ఈ సందర్భాలని అనువదించటానికి తగిన భాష రూపొందించుకోవటం అనువాద ప్రక్రియలో ఒక భాగం. దీనివల్ల మనకి మన భాష పట్ల అవగాహన పెరగటమే కాదు ఏ భాషలోకి అనువదిస్తున్నామో అందులో ప్రావీణ్యత పెరుగుతుంది.

వీటన్నిటిలో మనకి ముఖ్యంగా వుండాల్సిన అంశం చదువుపట్ల ఆసక్తి వుండాలి. కంప్యూటర్ యుగంలో మనం కోల్పోయిన మరో కళ – మంచిపుస్తకాలను గుర్తించటం. అవి ఏ భాషలో వున్నా సరే చదవటం,  అవగాహన పెంపొందించుకోవటం ముఖ్యం. అనువాదాల పాత్ర ఇక్కడ ఎంతో వుంది. ముందు ముందు ఇందులో వృత్తి అవకాశాలున్నాయి ప్రవృత్తిని పెంపొందించుకోవాలంతే!

 

ఆత్మబంధువు – కల్లూరి శ్యామల

 

నువ్వు నీ ఇంటిబయట తోటలో కూర్చుంటే

నీ వొళ్ళో ఒద్దికగా అమరి కూర్చుంటుంది.

నువ్వు పనులతో అలసి సొలసి పడకగదిలో

నడుమువాల్చి కళ్ళు మూసుకుంటే నీ గుండెలమీద నిశ్చింతగా

విశ్రాంతిగా  అదీ వాలిపోతుంది.

నీ చదువుల గదిలో నిట్టనిలువుగా కూర్చుని

ధ్యానముద్రలో నువ్వు చదువుతుంటే

నీ జ్ఞాన సముపార్జనలో భాగస్వామి తానే!

నీ నిరంతర పరిశ్రమలో సదా వెన్నంటి వుండే నెచ్చెలి, సఖి!

నిన్ను కవ్విస్తుంది, నీ మనస్సుని మెలిపెడుతుంది,

నీ తెలివిని సవాలు చేస్తుంది

నిత్యమై సత్యమై నీ మేధాసముద్రపు

గాఢతని, నీ ఆలోచనా విహంగాల ఎత్తులని

కొలిచేందుకు, నీకు కొలమానాల్ని ప్రసాదిస్తుంది!

నీలాకాశమంత విశాలమై

బంగాళాఖాతమంత గాఢమై

ఈరెంటినీకలిపుతూ నీ మేధస్సరిహద్దులని

విస్తారింపజేసే ఈ నెచ్చెలిఎవరు?

ఎవరీమె?

నేటి కంప్యూటర్ల సినిమాల టీవీలతెరలకీ సరితూగని

సాటి రాని అచ్చమైన సత్యమైన నేస్తం

పురాణకాలమంత పురాతనమై నిత్యనూతనమైన నీ అచ్చుపుస్తకం!

*****

Your views are valuable to us!