ముఠాల కూటములు!
స్థూలంగా చూస్తే, 1970-1980ల నాటికి కూడా దేశంలోని కొన్ని పార్టీలు వేరువేరు సిద్ధాంతాలని తలకెత్తుకునే ఉన్నాయి. అయినప్పటికీ, దేశాన్ని ఇందిరాగాంధీ కబంధ హస్తాల నుండి ముక్తం చేయటానికి ఆయా సిద్ధాంతాలతో రాజీపడ్డ విషయం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత, ఆయా నేతల రాద్ధాంతాలే జనతా ప్రయోగాన్ని నిర్వీర్యం చేసిన దాఖలాలు కూడా కనిపిస్తాయి.
1951 లో ఆరెస్సెస్‌కు అనుబంధంగా మొదలైన ఓ రాజకీయ సంస్థ భారతీయ జన్‌సంఘ్ అయితే, ఇందిరకు వ్యతిరేకంగా మొదలైన కాంగ్రెస్ వర్గం కాంగ్రెస్ (ఓ). దీని గురించి మరోసారి విపులంగా చర్చించుకోవచ్చు. ఇక మిగిలింది భారతీయ లోక్‌దళ్. ఇందులో భారతీయ క్రాంతిదళ్, స్వతంత్ర, ఉత్కళ్ కాంగ్రెస్, సోషలిస్టులు భాగస్తులు. 1974లో ఇందిరకు వ్యతిరేకంగా ఏర్పడ్డ ప్రతిపక్ష కూటమి ఇది. ఆ తర్వాత, జె.పి. ఇచ్చిన పిలుపుకు స్పందించి అయిదు పార్టీలతో ఏర్పడిన భారతీయ లోక్‌దళ్, కాంగ్రెస్ చీలిక వర్గం, భా.జ.సం. ఓ పార్టీగా అవతరించారు. అంటే ఇక్కడికే దాదాపు ఏడు పార్టీల సిద్ధాంత వైరుధ్యాలతో జనతా పార్టీ అవతరించింది. దానికితోడుగా మరికొన్ని పార్టీల బయటి మద్దతు!
ప్రతి పార్టీ చరిత్రను విశ్లేషించుకోవటం కన్నా, ఉదాహరణకు సోషలిస్టు పార్టీ గురించి తెలుసుకుంటే, అప్పటి రాజకీయాల సంక్లిష్టత కొద్దిగా అర్ధమౌతుంది. భారత జాతీయ కాంగ్రెస్‌లోని సోషలిస్టులతో 1948లో ఏర్పడింది కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ (బొల్షెవిక్ లెనినిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిలోన్, బర్మా). ఆచార్య నరేంద్రదేవ్, జయప్రకాష్‌నారాయణ్‌లు వీరిని బయటకు తెచ్చి భారత సోషలిస్టు పార్టీగా చేసారు. 1951 సార్వత్రిక ఎన్నికలలో జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలోని సోషలిస్టు పార్టీ 12 సీట్లు గెలిచుకుంది. కాంగ్రెస్ నుంచి విడిపోయి కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ స్థాపించిన జె.బి.కృపలాని పార్టీలో ఈ సోషలిస్టులు కలిసిపోయి ప్రజా సోషలిస్టులుగా అవతరించారు. అప్పుడు రామ్‌మనోహర్‌లోహియా నేతృత్వంలో విడిపోయిన కొందరు మళ్ళీ సోషలిస్టు పార్టీ ఏర్పాటు చేసారు. ప్రజా సోషలిస్టుల నుంచి జార్జ్ ఫెర్నాండెజ్ నాయకత్వంలో మరో వర్గం సంయుక్త సోషలిస్టులుగా విడిపోయారు. 1972లో ప్రజా సోషలిస్టు పార్టీ సంయుక్త సోషలిస్టులతో కలిసిపోయి మళ్ళీ సోషలిస్టు పార్టీ అయ్యింది. ఒక్క సోషలిస్టులలోనే ఇన్నేసి అంతర్గత విబేధాలు కలిగి, మళ్ళీ మళ్ళీ కలుస్తూ విడిపోతూ ఉన్నారన్న మాట. వీరికి మరో మూడు పార్టీలు చేర్చి చరణ్‌సింగ్ భారతీయ లోక్‌దళ్ ఏర్పాటు చేసాడు. దీనికి మరో రెండు పార్టీలు భారతీయ జనసంఘ్, కాంగ్రెస్ (ఒ) కలిసి జనతాపార్టీ ఏర్పడింది!
ఇన్నేసి వైరుధ్యాలు, వైమనస్యాలు ఉన్న పార్టీకి ఎవరు నాయకుడవ్వాలి? ఆదిలోనే హంసపాదు ఇది. అలానే అయ్యింది. స్వతంత్రపార్టీ వంటి రైట్ వింగ్ ఆలోచనాపరులకు భా.జ.సం.తో విబేధాలు లేవు. అలానే మొరార్జీ దేశాయ్ వంటి రాజనీతిజ్ఞుడికీ లేవు. ఇప్పటి లౌకికవాదులకు మల్లే, అప్పటి సామ్యవాదులకు ఆరెస్సెస్ పొడ గిట్టలేదు. దానికితోడు, భా.జ.సం. పట్ల ఉదారంగా ప్రవర్తించే మొరార్జీ దేశాయిని పార్లమెంటరీ నేతగా ఎన్నుకోటానికి చరణ్‌సింగ్, ఫెర్నాండెజ్, జగ్‌జీవన్‌రామ్‌లాంటి నాయకులు ఒప్పుకోలేదు. అలా కొనసాగిన విబేధాలు, ఇందిరాగాంధీని అరెస్టు చేయనందుకు నిరసన తెలుపుతూ, తమ ప్రభుత్వాన్ని నపుంసక ప్రభుత్వంగా పరిగణిస్తూ చరణ్‌సింగ్ రాజీనామా చేయటం, ఆ వెంటనే ఆయన్ని ఉపప్రధానిగా చేయటంతో అప్పటికి ఆ విబేధాలు సమసిపోవటం… చూస్తుంటే,. పదవులకు ఎర వేయటానికే సిద్ధాంతాల ముసుగులు ధరించటం అప్పటికే మొదలయ్యిందన్న మాట! అయినా, జె.పి.లాంటి నాయకుల మాట మీద కొద్దో గొప్పో గౌరవం ఆయా పార్టీలను ఒక త్రాటి మీదకు మాత్రం రప్పించగలిగింది. కానీ ఆయా నాయకుల పదవీ లాలసత్వం, అవకాశవాద రాజకీయాలు కూడా ఆనాటి నుంచి ఈనాటికీ ప్రజలు నమ్మి ఓటెసినా వారిని వంచిస్తూనే ఉన్నాయి. అనాటి అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట రాజ్‌నారాయణ్ ఉదంతం. ఇలా చెప్పుకుంటూ పోతే, స్వాతంత్ర సమరయోధులుగాను, ప్రజాక్షేమమే పరమార్ధంగా భావించిన అప్పటి నేతలే చివరికి అధికారం కోసం వాళ్ళల్లో వాళ్ళే తగువులు పడి, చివరికి జనతాపార్టీలో ముసలం పుట్టటానికి కారకులయ్యారనేది ఇప్పుడో చరిత్ర.
దాదాపుగా ఇదే చరిత్ర నేషనల్‌ఫ్రంట్ హయాంలోనూ, యునైటెడ్‌ఫ్రంట్ హయాంలోనూ పునరావృతమయ్యింది. ప్రతి పార్టీ నాయకుడు తానే ప్రధాని కావాలని కోరుకునేవాడే! ఇద్దరు ముగ్గురు ఎం.పీ.ల మద్దతే అయినా, ఇద్దరికీ మంత్రివర్గాలు కావాలనుకునేవాళ్ళే! ఈ జనతా-లోక్‌దళ్ పరివార్ నుంచి ఆవిర్భవించిన కప్పలే రాష్ట్రీయ లోక్‌దళ్, భారత జాతీయ లోక్‌దళ్, సమాజ్‌వాదీలు, జనతాదళ్ సెక్యులర్లు, జనతాదళ్ యునైటెడ్లు, లోక్‌జనశక్తులు, రాష్ట్రీయ జనతాదళ్, బిజు జనతా దళ్ ఇత్యాదులు. ఇందులో కొందరు ముందుతరం స్వామ్యవాద నేతల వారసులైతే, మరికొందరు ఆ నేతల ఆశయాలు వల్లిస్తూ వారసత్వ రాజకీయాలు చేసే సామ్యవాద లౌకికవాదులు! వీరి ఉద్దేశ్యంలో దేశసేవ అంటే, ఏదో విధంగా మూడోదో, ముప్ఫైయ్యోదో ఫ్రంటు ఏర్పాటు చేయటం. ఎన్నికల ముందు ఓ కూటమి, ఎన్నికలైన తర్వాత మరో కూటమి – దేనికి అధికారం అందివస్తుందనుకుంటే అందులో దూరటం, పదవులు పొందటం, తమ మీది కేసులు మాఫీ చేయించుకోవటం. తమ భవిష్యత్తు కోసం దేశాన్ని కులాలవారీగా విభజించే కొత్త కొత్త ఉపాయాలు చరణ్‌సింగ్, వి.పి.సింగ్‌ల అడుగుజాడల్లో వెతుక్కోవటం. తీరా, ఏ పార్టీలకు వ్యతిరేకంగా తమకు ఓట్లు వేయమని అడుక్కున్నారో ఆ పార్టీల మద్దతుతోనే తమ పదవులు నిలుపుకోవటం, అవి ఉపసంహరించుకుంటే ఆయా పార్టీలు ప్రజాస్వామ్య ద్రోహులని మళ్ళీ ఎన్నికల్లోకి దూకటం.
కొన్ని దశాబ్దాల దేశాభివృద్ధి ఈ ముఠాల వల్ల ఒక అడుగు ముందుకేస్తే, రెండు అడుగులు వెనక్కు వేస్తున్న చందంగా నడుస్తున్నది. ఈ పరిస్థితుల్లో మరోసారి ఇటువంటి ఆయారాం గయారాం ముఠాలకు అవకాశం కల్పిస్తే, మన కళ్ళు మనం పొడుచుకున్నట్లే ఔతుంది. కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఈ కూటముల ముఠాలు అనవసరమే కాదు, అనర్ధం కూడా.
@@@@@