ఎన్నిక(ల)లు – 05 (చివరి భాగం)

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

ప్రత్యామ్నాయం

 

స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకూ, ప్రతిరోజూ పరమ దుర్మార్గులుగా దూషింపబడుతూ, దాదాపు అన్ని రాజకీయ పక్షాలచే అంటరానివాళ్ళుగా పరిగణింపబడిన వ్యక్తులు ఇద్దరే; నాథూరాం వినాయక్ గాడ్సే, నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ! జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసినందుకు గాడ్సేని, 2002 గుజరాత్ అల్లర్ల కారణంగా మోడీని రాక్షసులుగా ప్రతి రాజకీయ పార్టీ చిత్రీకరిస్తూనే ఉంది. గాడ్సేనైతే పూర్తి చరిత్రహీనుడుగా చిత్రీకరించిన పాఠాలు కూడా మనం చదువుకున్నాం! గాడ్సే ప్రస్తుతానికి అప్రస్తుతం. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలలో, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్ధిగా మోడీ నియామకపు నేపథ్యంలో ఆయన్ని మరింత వివాదాస్పదుడుగా చూపించాలనే ప్రయత్నాలు మాత్రం రోజువారీ రాజకీయ తంతులో చూస్తూనే ఉన్నాం.

గుజరాత్ అల్లర్లలో మోడీ నిజంగానే ముస్లీములను చంపించాడా? తనే పకడ్బందీ వ్యూహం అమలుచేసి వందలాది హత్యలకు కారకుడయ్యాడా? లేక, నీరో లాగా రాష్ట్రం తగలబడుతుంటే చర్యలేవీ తీసుకోకుండా చూస్తూ కూర్చున్నాడా? అసలు మోడీ దుర్మార్గుడా, మంచివాడా? ఒకవేళ రేపు మోడీ ప్రధాని అయితే మరో మత మారణహోమానికి ఈయన కారకుడౌతాడా? దేశ ప్రధానమంత్రి కాగల అభ్యర్ధిగా ఉన్న మోడీ నిష్కళంకుడుగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నదనిపించే ప్రశ్నలు ఇవి. మోడీ వ్యతిరేకులకు అందివచ్చిన ఆయుధాలు కూడా ఈ ప్రశ్నలే అనటంలో ఆశ్చర్యం లేదు. గుజరాత్ అల్లర్ల దరిమిలా, అప్పటి ప్రధాని వాజ్‌పేయి నుంచి లాలూ యాదవ్, ములాయమ్‌సింగ్ యాదవ్ దాకా అందరూ మోడీకి రాజధర్మాన్ని ప్రభోధించినవాళ్ళే! అలా రాజధర్మాన్ని బోధించినవారి పరిపాలన ఎంత ఘోరంగా ఏడ్చిందో కూడా మనకు తెలుసు.

ఫిబ్రవరి 5, 2014 ఇండియన్ఎక్స్‌ప్రెస్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం 2012 (668 సంఘటనలు) తో పోలిస్తే, 2013లో (823 సంఘటనలు) మతఘర్షణలు దాదాపు 30 శాతం పెరిగాయి. ఈ వివరాలు కేంద్ర ప్రభుత్వపు హోమ్‌మంత్రిత్వ శాఖ అందించినవే. ఒక్క యు.పి.లోనే, 247 సంఘటనలు నమోదు కాగా, బీహారులో 63, గుజరాత్‌లో 68, రాజస్థాన్‌లో 52, తమిళనాడులో 36 కేసులు నమోదు అయ్యాయి. ఇవి కాక, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో అక్కడక్కడా మతఘర్షణలు చెలరేగాయి. లౌకికవాదులమని రోజుకో పదిసార్లు గర్జించే ములాయమ్‌సింగ్‌లు, నితీష్‌కుమార్‌లు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో! ఇక, కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాలు కర్ణాటక, రాజస్థాన్ (2013 డిసెంబరులో భా.జ.పా. ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చదువరులు గమనించగలరు) ల పరిస్థితి కూడా యు.పి., బీహారులకు ఏమాత్రమూ తీసిపోలేదు! వీళ్ళా, మతసామరస్యం గురించి మరొకరికి ఉపన్యాసాలు దంచే లౌకిక నేతలు!

దేశంలో మతఘర్షణలు 2002లో మొదలు కాలేదు, అక్కడితో అప్పటికి ఆగిపోనూలేదు. స్వాతంత్ర్యం ముందు, ఆ తర్వాత కూడా లక్షలాది ప్రజలు వీటికి ఆహుతయ్యారు, అవుతూనే ఉన్నారు. వీటికి ప్రధాన కారణం చర్చించటం ప్రస్తుత వ్యాసపరిధిలో లేకపోయినా, లౌకికత్వం పేరుతో ఆయా ప్రభుత్వాలు చేసిన, చేస్తున్న ఘనకార్యాలు మెజారిటీ, మైనారిటీ ప్రజల మధ్య విద్వేషాగ్నులు రగిలించటానికే కారణమౌతున్నాయనేది నిర్వివాదాంశం. ఓటు బ్యాంక్ రాజకీయాలతో పాచికలాడుతూ, ఒక పార్టీ మరోపార్టీని బూచిగా చూపించి ఆయా మతాల ప్రజలను బెదిరిస్తున్నాయనేది అందరూ గమనిస్తున్న విషయమే. ప్రస్తుత ఎన్నికల వాతావరణాన్ని గమనిస్తే, ఎన్.డి.ఎ.కు వ్యతిరేకమైన దాదాపు అన్ని పార్టీలూ మోడీని అలా ఓ రాక్షసుడుగా చూపిస్తున్నాయి. ఎన్నికల తర్వాత, మోడీ ప్రధాని అయితే ముస్లీములకు ఈ దేశంలో రక్షణ ఉండదనే భయాలను ముస్లీములలో పెంచాలనే ప్రయత్నిస్తున్నాయి. కొందరు ముస్లీం పెద్దలు కూడా తెలిసీ తెలిసీ అటువంటి పార్టీల వలలో చిక్కుకుపోతున్నారు. అటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం భా.జ.పా చేస్తూనే ఉన్నా, ఒక్క మోడీ మాత్రం ఆ విషయాలను చూచాయగా కూడా ప్రస్తావించకుండా, అవినీతి, అభివృద్ధి గురించి, వాటి కోసం చేయాల్సిన పనుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. విభజించి గెలవాలనుకునే ములాయమ్‌సింగ్‌లు, నితీష్‌కుమార్‌లు, రాహుల్‌గాంధీలు ఇంతవరకూ ఒక్కసారి కూడా కేవలం అభివృద్ధి, అవినీతి ప్రాతిపదికగా చర్చించటానికి ఇష్టపడటంలేదు!

ఇక్కడ రేకెత్తే మరో ప్రశ్న ఏమిటంటే, మోడీ తరచుగా ప్రస్తావిస్తున్న గుజరాత్ మోడల్ నిజంగానే ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తున్నదా, లేక అవి మోడీ చేస్తున్న ఊకదంపుడు ఉపన్యాసాలేనా? లభ్యమయ్యే రకరకాల గణాంకాల ఆధారంగా ఒక రాష్ట్ర ప్రగతిని అంచనా వేసే అవకాశం చాలా తక్కువ. కానీ, మోడీ ఉపన్యాసాల ఆధారంగా చూస్తే, దేశం ప్రగతిపథంలో నడవటానికి అవసరమైన మౌలికాంశాలపై, మోడీకి ఉన్న అవగాహన స్పష్టంగా తెలుస్తున్నది. ఆ స్పష్టతే, వైరి పార్టీలలో కనిపించటంలేదు. నిజానికి, అసలు ఆ విషయాలేవీ ఇతర పార్టీలు ప్రస్తావించటంలేదు.

గత దశాబ్దకాలంగా కేంద్రంలో కొలువుతీరిన ప్రభుత్వం అవినీతికి మరో అడ్రసుగా మారింది. బొగ్గు కుంభకోణం పత్రాలు సాక్షాత్తూ ప్రధాని కార్యాలయం నుంచే మాయం కావటం ఆ అవినీతికి పరాకాష్ట. ఆ అవినీతిలో వ్యక్తిగా మన్‌మోహన్‌సింగ్ పాత్ర లేకపోవచ్చు. కానీ, బొగ్గుశాఖకు బాధ్యత వహిస్తున్న మంత్రిగాను, ప్రభుత్వాధినేతగా ప్రధాని పదవిలో ఉన్న మన్‌మోహన్‌సింగ్ ఆ బాధ్యతను కాదనలేడు! అంతే కాకుండా, మిత్ర పక్షాల అవినీతిని వెనకేసుకొచ్చే విధంగా, సంకీర్ణ ప్రభుత్వపు సంక్లిష్టతలే తమ మిత్రపక్షాల అవినీతికి ఈయన కారణమని చెప్పుకోవటం ఆక్షేపణీయం. పోనీ, స్వపక్షీయుల కుంభకోణాలను అడ్డుకున్నారా అంటే, అదీ లేదని కామన్‌వెల్త్ గేమ్‌స్, ఆదర్శ్ లాంటి కుంభకోణాలు ప్రభుత్వాన్ని నగ్నంగా నిలబెడుతున్నాయి. ఉత్తమ ప్రభుత్వాధికారిగా, మేధావిగా మన్ననలందుకున్న మన్‌మోహన్‌సింగ్, మిన్ను విరిగి మీద పడినా చలించని మేరునగధీరుడుగా పేరొందిన వ్యక్తిత్వం ఉలుకూ పలుకూ లేకుండా అధినేత్రికి అడుగులకు మడుగులొత్తటం, దేశ ప్రయోజనాలను పార్టీకి తాకట్టు పెట్టటం విస్మయం కలిగిస్తుంది.  ఒక్క అవినీతే కాక, దేశ సార్వభౌమత్వానికి, సాధికారతకు కూడా యు.పి.ఎ. ప్రభుత్వం ఎటువంటి బాధ్యత వహించలేదని, అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా అక్రమ చొరబాట్లులాంటి విదేశీవ్యవహారాలు కూడా నిరూపించాయి. ఆర్ధికరంగంలోనూ, పారిశ్రామిక రంగంలోనూ చెప్పుకోదగ్గ ప్రగతి కూడా కనిపించదు.

ఇటువంటి పరిస్థితుల్లో సహజంగా ప్రజలు చూసేది వెంటనే లభించే ప్రత్యామ్నాయం వైపే. ఒంటి పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పరచే స్థాయి ఇప్పటి కాంగ్రెస్‌కు లేదని మూడు రాష్ట్రాలకు జరిగిన డిసెంబరు ఎన్నికలలో తెలిసిపోయింది. దానికితోడు, ఒంటరిపార్టీగా అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ ఊడబీకిందేదీ లేదన్నది కూడా నిరూపితమయ్యింది. జాతీయ పార్టీలుగా గతంలో చలామణి అయిన కమ్యూనిస్టులు తదితర పార్టీలు కూడా దాదాపు కాలం చేసాయనే చెప్పొచ్చు. ఇక మిగిలిందల్లా భా.జ.పా. కాకపోతే, పది రకాల పార్టీలతో ఏర్పడే ప్రభుత్వాలు అవినీతికి ఎలా ఆలవాలమౌతాయో చూసాం కాబట్టి, ఒక్క పార్టీగా భా.జ.పా.కు సంపూర్ణమైన మద్దతు ప్రకటించి, ఒక్కసారైనా దేశాన్ని పరిపాలించే అవకాశం కలిగించాలి. దాదాపు డెబ్భై ఏళ్ళ దరిద్రపు పాలనలో బతికిన మనం ఓ అరవై నెలలు మరో పార్టీకి అవకాశం ఇస్తే ఇప్పటికన్నా నాశనమయ్యేది ఏదీ లేదు.

ఇప్పుడు దేశంలో నాయకత్వ లేమి మనలను పీడిస్తున్నది. దేశానికి కొత్త ఆలోచనా సరళి, సరికొత్త విధానాలతో పరిపాలన అత్యవసరం. ఆ ఖాళీని మోడీ పూరించగలడనే నమ్మకమూ కలుగుతున్నది. మోడీ నేతృత్వంలోని భా.జ.పా.కు ఓ అయిదేళ్ళు అవకాశం ఇస్తే ప్రత్యేకంగా పోయేదేమీ లేదని నా అభిప్రాయం.

@@@@@

Your views are valuable to us!