నాయవి నాల్గు మోములవునా యెటు ముద్దిడె? దంచు నల్వ యా
ప్యాయముగా హసింపగ, అనంతముఖన్ ననునెట్లు ముద్దిడం
బోయెదొ? యంచు వాణి నగ, ముద్దిడెదన్ గను మంచునల్వ నా
రాయణ దాసుడై హరికధాకృతిగా నొనరించె భారతిన్.
ముక్కోటి ఆంధ్రులూ ముగ్ధులై ఏ మహితాత్ముణ్ణి తిలకించి పులకించి స్పందించి అభినందించారో ఆ శృంగార సర్వజ్ఞుడు-ఆ సంగీత సాహిత్య సార్వభౌముడు- ఆ హరికధా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు.
నేను వ్రాస్తున్న ఈ వ్యాసములోని విషయములు కొన్ని నా పూర్వీకుల నోటినుంచి విన్నవీ మరి కొన్ని డాక్టర్ గుండవరపు లక్ష్మీ నారాయణగారి పరిశోధనాత్మకమైన గ్రంధమునుండి గ్రహించినవీనూ.
1864 లో శ్రీ దాసుగారూ, 1960 లో నేనూ ఒకే ఇంట పుట్టినవారము. ఇంతకు మించిన మహద్భాగ్యములేవి కావాలి నాకు?
శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారు హరికధా పితామహులు. ఆట పాట మాట మీటలు ఏకగ్రీవముగాగొన్న చతురాస్యులు.
ఒరిస్సా రాష్ట్రమునందున్న జయపురం సంస్థానాధీశుడైన కృష్ణచంద్ర దేవునకు సంతానములేదు. మా వంశపు మూలవిరాట్టుయైన ఆదిభట్టు ఒక సంవత్సర కాలము తపమొనర్చి ఆ తపః ఫలముచే శ్రీ కృష్ణచంద్రదేవుని సంతానవంతుని గావింపగా అతడు కృతజ్ఞతా పూర్వకముగా అర్ధ రాజ్యమునీయ రాజ్యము చేసిన భ్రాహ్మణ ప్రభువులు ఆదిభట్లవారు.
అట్టి వంశమున బుట్టిన వేంకట చయనులు అనువానికి కల్గిన సంతానములో నొకరు శ్రీ దాసుగారు. శ్రీ వేంకట చయనులు కుండలమండిత గండవికాసుడు, పండిత మండల మోదనివాసుడు.అప్రతిగృహీత, మహా పౌరాణికుడు.సంస్కృతమున ధనుంజయ విజయమను ప్రబంధము వ్రాసిన మహా కవి.
ఏహ్యేహి గంగే తవదర్శనం హఠాత్ అను మకుట శ్లోకాష్టస్తుతిచే గంగా భవాని అనుగ్రహముపొంది నీరు పడని నూతిని నుతజల పూరితముగా చేసిన మహా భక్తుడు. దాసుగారి తల్లి నరసమ్మ, బహుపురాణజ్ఞ. పురాణాల నరసమ్మ అనీ, చదువులవ్వ అనీ అజ్జాడప్రాంతమున ప్రక్యాతి గాంచిన విద్యావతి.
వీరికి ఐదుగురు కొడుకులూ, నలుగురు కూతుళ్ళూ.
మొదటి కుమారుడు జగ్గావధాని మహా బలాఢ్యుడు.రెండవకుమారుడు సీతా రామయ్య న్యాయవాది. ఐదవ కుమారుడు సూర్యనారాయణ. ఆ సూర్యనారాయణయే నారాయణదాసు. 31.8.1864 న అజ్జాడ అగ్రహారమున వీరి జననం . వీరిని సూరన్న అని ముద్దుగా పిల్చుకునేవారు.
సూరన్నకు అక్షర జ్ఞాన భిక్ష పెట్టినది తల్లిదండ్రులే, ఆ పిదప ఆతను నేర్చిన విద్యలకు గురువెవ్వరు అన్నది భూలోకమున నెవ్వరూ ఎరుగని విషయము.
నాలుగేండ్ల వయసులోనే సూరన్న ప్రతిభ అవగతమైనది. భాగవతమునందలి పద్యములు శ్రవణానందముగా చదువుట, పదుల కొలది పద్యములు కంఠస్తములగుట ఈవయసులోనే. ఐదవయేట సూరన్నకు ఉపనయనము జరిగినది.
పార్వతీ పుర ప్రాంతమందు ‘గుంఫ’ అనే పుణ్యక్షేత్రము ఒకటున్నాది. నాగావళీ జంఝావతీ నదుల నడుమ ఉన్న క్షేత్రమిది. అక్కడ మహా శివరాత్రినాడు పెద్ద ఉత్సవం జరుగుతుంది. సూరన్నను తీసుకుని వారి తల్లి ఆ ఉత్సవమునకు వెళ్ళింది. స్వామి దర్శనము చేసికొని ఆ మరునాడు పార్వతీ పురము చేరుకొన్నది. అక్కడ రామానుజుల రంగయ్య అను పుస్తక విక్రేత ఉండెడి వాడు. ఆమె అతనివద్దకు వెళ్ళి భాగవతము ఉంటే ఇవ్వండి అని అడిగింది. దానికి రంగయ్య ఆశ్చర్యపడి “అమ్మా! ఆడువారికి భాగవతము చదివే అర్హత లేదుకదా, అది మీకెందుకు?” అని అడుగగా, “నేను చదువను నాయనా, నా కొడుకు ఈ సూరన్న చదువుతాడు, నేను కేవలం తాత్పర్యము మాత్రమే చెపుతాను” అంటూ ఐదేళ్ళ సూరన్నను చూపించింది.
“ఈ బుడతడా భాగవతము చదువువాడు, అదే నిజమైతే ఈ పుస్తకమును ఉత్తినే ఇస్తాను సుమా, ఏదీ చదవమనూ!” అంటూ భాగవతమును సూరన్న చేతిలో పెట్టేడు రంగయ్య. సూరన్న వెంఠనే పుస్తకము తెరిచి దశమస్కంధమునందున్న వర్షర్తు వర్ణనములను శరవేగముతో చదివెను. ఆతని తల్లి మంచినీళ్ళ ప్రాయముగా వ్యాఖ్యానించెను.ఈ విచిత్రమునకు ఆ బజారు వీధంతా సదస్యముగా మారెను. రంగయ్య ఆనంద పరవశుడై ఆ పుస్తకమునకు తోలు అట్టవేయించి సూరన్నకు బహుమతిగానిచ్చెను.
ఇది దాసుగారు సంపాదించిన తొలి బహుమతి.
దాసుగారు మహా అల్లరివారట, చెట్లెక్కుట, నదిలో ఈతలు కొట్టుట, గేదెలపైనెక్కి తిరిగుట వారి సరదాలు, ఆటలు. చీకటి యెరుగని సూర్యునివలె కపటమెరుగని హృదయముతో వర్తించుట వారి శైశవ లక్షణము.
ఆ రోజుల్లో వాసా సాంబయ్య గారు అను సంగీత విద్వాంసుడుండేవారు. వారు గొప్ప వైణికులు. వారు వీణను ఎంత గౌరవించేవారంటే, వారు ఏ ఊరు వెళ్ళినా తన వీణను కావిడ గట్టి స్వయంగా మోసుకెళ్ళేవారట.
వారు దాసుగారు పాడు రాగయుక్తమైన పద్యములను విని “ఈ అబ్బాయిలో అసాధారణ ప్రతిభ దాగియున్నది, నాతో పంపండి ఇతని ప్రతిభకు శాస్త్రజ్ఞానము కలిగించెదను” అని అంటే దాసుగారి తల్లి సంతోషముగా పంపినదట. ఇంతా చేస్తే దాసుగారు ఆతని వద్దనున్నది కేవలం ఒక నెలరోజులుమాత్రమే. ఇదే దాసుగారి సంగీత శిక్షణ. ఆ పిదప వారు సాధించనది అంతా సరస్వతీ కటాక్షమే.
శ్రీ దాసుగారికి విద్యనేర్పిన గురువులంటూ ఎవరూ లేరు. వారికి సంగీతమూ, సాహిత్యమూ, ఇంగ్లీషూ, అరబి, పార్సీ భాషలు ఎలా పట్టుబడ్డాయో ఆ పెరుమాళ్ళకే ఎరుక.
ఆరోజులలో కుప్పుస్వామి నాయుడు అను భాగవతారు మద్రాసునుండి వచ్చి హరికధలు చెప్పేవాడట. దాసుగారు ఎప్పుడు ఆతని హరికధ విన్నారో తెలియదు. ఒకసారి దాసుగారి హరికధ విని నాయుడు అడిగారట బాబూ నీకు హరికధ ఎవరు నేర్పేరయ్యా, నీ గురువు ఎవరు? అని. అందుకు దాసుగారు నవ్వుతూ, “మహాత్మా నా గురువు మీరే మీ కధవిని నేనూ నేర్చుకున్నాను” అన్నారట. ఈ సమాధానం విని అంతటి మహానుభావుడైన కుప్పుస్వామి నాయుడు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ “ధన్యజీవివి నాయనా నీ వల్ల నాకు పేరువస్తుంది” అని సంతోషపడిపోయేడట.
రాత్రికి రాత్రి ఒక వ్యక్తి కోరికమేర ‘అంబరీషోపాఖ్యానము’ అను హరికదను రంచించి, స్వరపరచిన మహనీయుడు శ్రీ దాసుగారు.
రాజమండ్రిలో దాసుగారి ప్రతిభ గని వీరేశలింగం పంతులుగరు నోటమాటరాక నిల్చుండిపోయారట.
బందరు పట్టణములో కొందరు సంగీత విద్వాంసులు దాసుగారిని పరీక్షింపనెంచి, పరాభూతులై పాదాక్రాంతులయ్యేరట.
మైసూరు మహారాజు శ్రీ కృష్ణరాజ ఒడయరుకు దాసుగారన్న అమిత అభిమానము. దాసుగారి పాటలను గ్రామఫోను రికార్డులపై ధ్వని ముద్రితము గావించినది వీరే. గవర్నమెంటు డిజైనులోనున్న బంగారు మురుగులూ, ఒక వీణ, ఒక తుంబుర, వేయినూటపదహార్ల రొక్కము ఇచ్చి దాసుగారిని సత్కరించి “అయ్యా నాకొలువున ఉండిపొండి” అని కోరిన కళా పోషకుడు మైసూరు మహారాజు.
ఒకనాడు వారు శ్రీ దాసుగారిని కారులో తీసుకెళుతూ, “దాసుగారూ మీకేది కావాలన్నా ఇస్తాను నిస్సంకోచంగా అడగండి” అనగా దాసుగారు “అయ్యా మీరివ్వగలిగినవన్నీ నాకు మా విజయనగరం రాజుగారు కూడా ఇస్తారు, కానీ మీ ప్రాంతాన దొరికే బెంగుళూరు వంకాయలు మాకు దొరకవు కనుక అవి ఒక బుట్టెడు ఇప్పించండి చాలు” అని అంటే మైసూరు మహరాజు దాసుగారి అల్ప సంతోషానికి అబ్బురపడి వెలలేని కానుకలిచ్చి పంపారట.
“సతతము సంతసమొసంగు సత్యవ్రతికిన్”
ఈ సమస్యను విజయనగరం మహారాజు దాసుగారికిచ్చి పూరింపమనగా ఆ సమస్యను మకుటముగా చేసుకుని అప్పటికప్పుడు నూరు పద్యములు చెప్పిన దిట్ట శ్రీ దాసుగారు.
అందులో నూరవ పద్యము ఇది.
చతుర కళా విద్యా సం
గతికిన్ స్థిర ధృతికి ప్రకట కరుణామతి కీ
కృతి యానంద గజపతికి
సతతము సంతసమొసంగు సత్యవ్రతికిన్
ఆ తరువాత వారిద్దరూ రాజూ-సేవకులుగా కాక స్నేహితులుగా మెలిగేవారట.
దాసుగారు హాస్యప్రియులు, సమయస్ఫూర్తి వారికి వెన్నతోపెట్టిన విద్య.
ఒకసారి రవీంద్రనాధ్ ఠాగోర్ ఆహ్వానించగా గురజాడ అప్పరావుగారూ, శ్రీ దాసుగారూ, రాజా విజయరామగజపతులు కలకత్తా వెళ్ళేరట. తిరుగు ప్రయాణములో రాజుగారికి చిన్న చిలిపి బుద్ధి పుట్టి అప్పారావుగారినీ, దాసుగారినీ కాస్త ఆటపట్టిద్దామనుకుని, వారినుండి దూరముగాపోయి అక్కడున్న ఒక ఇంగ్లీషు టికెట్ కలక్టరుతో “అదిగో ఆ ఇద్దరిదగ్గరా టికెట్ లేదు వెళ్ళి పట్టుకో” అని చెప్పి వారు ఒక మూల దాంకొన్నారుట.
ఆ టికెట్ కలక్టరును చూసి గురజాడవారు కాస్త గాబరా పడగా, మరేమీ భయంలేదు ఉండండి అంటూ దాసుగారు అప్పటికప్పుదు ఒక రాగం ఆలపిస్తూ పాట అందుకున్నారట. ఆపాటకు ముగ్ధులైన బెంగాలీ ప్రజలు బోలెడంత డబ్బులు తీసుకొచ్చి దాసుగారికివ్వగా, ఆ డబ్బును టికెట్ కలెక్టరు చేతిలోపెడుతూ, “బాబూ ఇతను షేక్స్పియర్ ఆఫ్ ఆంధ్రప్రదేష్ శ్రీ గురజాడ, నేను హరికధా పితామహ ఆదిభట్ల మా ఇద్దరికీ చెరొక ఫష్ట్ క్లాస్ టికెట్ ఇప్పించండి. మా ముందు మొహం చెల్లక, టికెట్ కి డబ్బు లేక ఇక్కడెక్కోడో మా రాజుగారు దాగున్నారు, వారికి కూడా ఒక టికెట్ ఇప్పించండి!” అన్నారుట. దానితో రాజుగారి మొహాన కత్తివేటుకు నెత్తురులేదు. ఐనా వారు దాసుగారిపై అలుగలేదు సుమా.
చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి అనగా తిరుపతి వేంకట కవులలో ఒకరు. వారికి దాసుగారన్న అత్యంత అభిమానం.
రవీంద్రనాధ ఠాగోరు దాసుగారిని అడిగి బేహాగ్ రాగం పాడించుకుని కన్నీరు కారుస్తూ వినేవారట.
ఇలా ఒకటా రెండా దాసుగారి గురించి ఎన్నని చెప్పను. వారిగురించి తలపు కలిగితే చాలు నా కళ్ళు నాకు తెలియకుండానే వర్షిస్తాయి.
ఈ మధ్యనే శ్రీ దాసుగారు రచించిన తరంగములు శ్రీ మాధవపెద్ది సురేష్ గారు స్వరపరచగా శ్రీ బాలసుబ్రహ్మణ్యముగారు పాడుటకుగానూ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నేను చెప్పినది లేశమాత్రమే, వారిగురించి చెప్పగలిగే అర్హత నాకేదీ??
వారి మహస్సు స్వర్గమునందు ఎట్లు తిరుగుచున్నదో ఊహించి వ్రాసిన జంధ్యాల పాపయ్య శాస్త్రి(కరుణశ్రీ)గారి ఈ పద్యం చూడండి.
ఎవర్డురా యచట తెండింకొక్కగ్లా సంచు
అమృత రక్షకులకు నాజ్ఞయొసగి
సుధకంటె మా హరికధ లెస్స యని బృహ
స్పతితోడ నర్మభాషణము నెరపి
ఏమమ్మ వాణి యేదీ వీణ సరిక్రొత్త
తీవలా యని గిరాందేవి నడిగి
ఆగవే రంభ ఆ హస్తమట్టులగాదు
త్రిప్పి పట్టుమటంచు తప్పు దిద్ది
ఏమయా క్రొత్త సంగతులే మటంచు
బ్రహ్మ మానస పుత్త్రుని పలుకరించి
ఆదిభట్ల నారాయణాఖ్యము మహస్సు
తిరుగు నిందందు స్వర్గమందిరములందు.
శ్రీ దాసుగారి సాహితీ సంపద, వారి సంగీత నాట్య కౌశలములను ప్రస్తావిస్తూ మరో వ్యాసములో మరోసారి కలుస్తాను.