ఇద్దరు బిడ్డల తెలుగుతల్లి 2

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]


మొన్నటిదాకా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చిందనుకుంటే, ఇప్పుడు సమైక్యాంధ్ర పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదు. అక్కడా విగ్రహాలు పగలగొట్టారు, ఇక్కడా అదే తీరు. ఉద్యమకాలంలో అక్కడ మరణించిన ప్రతిఒక్కరినీ తెలంగాణా కోసం లెక్క కడితే, ఇప్పుడు ఇక్కడా అదే తీరు. ఇక క్షీరాభిషేకాలకు, రోడ్ల మీద వంటలకు, దిష్టిబొమ్మల దహనాలకు సమైక్యాంధ్ర ఉద్యమమూ ఎవరికీ తీసిపోకుండానే కొనసాగుతున్నది. రాజీనామాలు చేస్తామని, చేయమని అక్కడి నేతలు ఎలా దాగుడుమూతలు ఆడారో, ఇప్పుడు ఇక్కడి నేతలు అవే ఆటలు ఆడుతున్నారు. అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు సరే సరి.

తెలంగాణా విషయంలో కాంగ్రెస్ మరోమారు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నది వాస్తవమనే అనిపిస్తున్నది. అయినా, పార్లమెంటులో తీర్మానించేదాకా ఏ విషయమూ చెప్పలేని పరిస్థితి. దానికి ప్రముఖ కారణం ఏమిటంటే, విడిపోయే విధివిధానాలపై స్పష్టతను యు.పి.ఎ. ప్రభుత్వం ఇంతవరకూ ఇవ్వలేదు. ప్రకటన ఎలాగూ అయ్యింది కాబట్టి, విధివిధానాలతో బండిని 2014 దాకా లాగగలమని కాంగ్రెస్ అనుకుంటే అంతకుమించిన దుస్సాహసం మరేది ఉండబోదు. అదే కనుక నిజమైతే, కాంగ్రెస్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారౌతుందనే విషయంలో ఎటువంటి అనుమానమూ లేదు. యువరాజుకు పట్టం కట్టుకోవాలనుకునే కాంగ్రెస్ బహుశా ఇటువంటి సాహసం చేయబోదనే అనుకోవచ్చు.

ముందుగా చెప్పుకున్నట్లు, సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న తీరుతెన్నులు చూస్తుంటే, సీమాంధ్ర పరిస్థితి మరో తెలంగాణాలా తయారయ్యేట్లు ఉంది. దాదాపు గత పదేళ్ళలో తెలంగాణా ఉద్యమం వల్ల, రాష్ట్రంలో పరిశ్రమలు ఎలా దెబ్బతిన్నాయో అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. సమైక్యాంధ్ర ఉద్యమం ఇలానే కొనసాగితే, రేపటి కొత్త ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు తీసుకురావటం కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు, ప్రజానేతలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా, ప్రజల ఆవేశకావేషాలు రెచ్చగొట్టటమే ధ్యేయంగా పెట్టుకున్న కె.సి.ఆర్. లాంటి నేతలను ముందస్తు చర్యగా హౌస్ అరెస్టు చేయాలి. చప్పుడు చేయాల్సిన సమయంలో చడీచప్పుడూ లేకుండా ఫాం హౌసుల్లో పొర్లాడే నేతలు, నిగ్రహం చూపాల్సిన సమయంలో నీచరాజకీయాలకు తెర లేపటం తెలంగాణాకే నష్టం. ఇలాంటి నోరుజారుడు వల్ల, చేతుల్లోకొచ్చిన తెలంగాణా జారిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంటుందని గ్రహించాలి. అందుకే, ఇలాంటి నాయకుల నోళ్ళు మూయించాల్సిన బాధ్యత ఆయా ప్రాంతాల ప్రజలే తీసుకోవాలి.

ప్రజలు కూడా విజ్ఞత ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణా ఏర్పాటు విషయంపై వెనక్కిరాలేని విధంగా కేంద్రప్రభుత్వం కమిట్ అయ్యింది. బలవంతంగానైనా సరే, ఆ నిర్ణయాన్ని మార్చాలని ప్రయత్నించటం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు. ఒకవేళ అటువంటి ప్రయత్నంలో సఫలమైనా, రాష్ట్రం మరో వందేళ్ళదాకా కోలుకోలేనివిధంగా దెబ్బతింటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరితోమరొకరు పోటీపడైనా సరే, విడివిడిగా అభివృద్ధి చెందటం మీదే రెండు ప్రాంతాల ప్రజలు తమ దృష్టి కేంద్రీకరించాలి. 

(వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు రచయితవే. వీటికి ఆవకాయ.కామ్ కు ఎటువంటి సంబంధమూ లేదు)

 

Your views are valuable to us!