కరుణశ్రీ అంజలి

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

దేవుణ్ణి నమ్మే ఆస్తికులూ, నమ్మని నాస్తికులూ, సందిగ్ధంలో ఉండే Agnostic లూ కూడా తమ జీవితాల్లో అత్యంత కష్ట సమయాల్లో ధైర్యం కోసం ఏదో కనిపించని శక్తిని (అది ఆత్మ విశ్వాసమనుకోండి, విశ్వాన్ని నడిపిస్తున్న శక్తి అనుకోండి) ప్రార్థించడం కద్దు. సైంటిఫిక్ గా ఎంతో పురోగమించిన మానవుడికి తెలియని ఎన్నో శక్తులున్నాయన్న విషయం తెలిసిందే. విద్యుత్తుని కనిపెట్టక ముందు అది లేకపోలేదు. అలాగే దేవుని ఉనికిని మానవుడు తెలుసుకోగలిగే వరకూ అదిలేదని ఇదమిత్థంగా చెప్పలేడు. ప్రకృతిలో మనకర్థం కాని ప్రక్రియలన్నింటినీ దేవునికి ఆపాదిస్తూ కరుణశ్రీ వ్రాసిన ఈ పద్యాల్ని పరికించండి.

పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి
కలికి వెన్నెల లూరు చలువ దోసిళ్ళతో లతలకు మారాకు లతికి యతికి
పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిధ్ధ పరచి పరచి
తెలవారకుండ మొగ్గల లోన జొరబడి వింత వింతల రంగు వేసి వేసి

తీరికేలేని విశ్వ సంసారమందు
అలసిపోయితివేమొ దేవాదిదేవ!
ఒక నిమేషమ్ము కన్ను మూయుదువు గాని
రమ్ము! తెరచితి మా కుటీరమ్ము తలుపు!!

బుజ్జాయిల కోసం పొదుగు గిన్నెలకు పాలు పోసి, లతలకు మారాకులతికి, తుమ్మెదలకు రేపటి భోజనము సిధ్ధపరచి, మొగ్గలకు వింత వింత రంగులు వేసి, దేవుడు అలసిపోయాడనిపించడం ఎంత అందంగా ఉందో చూడండి.

ఇక దేవునికి రాజూ-పేదా తేడాలుండవు. కుచేలుని అటుకులు స్వీకరించి ఐశ్వర్యాన్ని అందించిన కృష్ణుని గురించి మనందరికీ తెలుసు. ఈ పద్యంలో కవి వినయంగా దేవుని ఆహ్వానించడం చూడండి.

కూర్చుండ మాయింట కురిచీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధపరచనుంటి
పాద్యమ్మునిడ మాకు పన్నీరులేదు నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి
పూజకై మా వీట పుష్పాలు లేవు నా ప్రేమాంజలులె సమర్పించనుంటి
నైవేద్యమిడ మాకు నారికేళము లేదు నా హృదయమే చేతికందీయనుంటి

లోటు రానీయనున్నంత లోన నీకు
రమ్ము! దయ సేయు మాత్మ పీఠమ్ముపైకి
అమృతఝరి చిందు నీ పదాంకములయందు
కోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి!

కుర్చీలు లేకున్నా ప్రేమగా వడిలో కూర్చోమని, పన్నీరు లేకున్నా కన్నీటితో కాళ్ళు కడుగుతానని, ప్రేమాంజలులు సమర్పిస్తానని, హృదయాన్నే చేతికందిస్తానని కవి దేవునికి సర్వస్వాన్నీ అర్పించడం ఎంత మధురంగా ఉందో చూడండి.

ఇక ఈ ఖండికలో చివరి పద్యం పరమాద్భుతంగా ఉంటుంది.

లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక
జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు మామూలు మేరకు మడవలేక
పనిమాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె గడియారముల కీలు కదపలేక
అందాలు చింద నీలాకాశ వేదిపై చుక్కల మ్రుగ్గులు చెక్కలేక

ఎంత శ్రమనొందుచుంటివో ఏమొ సామి!
అడుగిడితి వెట్లొ నేడు మా గడపలోన!
గుండె కుదిలించి నీముందు కుప్పవోతు
అందుకోవయ్య! హృదయ పుష్పాంజలులను!

సూర్యుణ్ణీ, చంద్రుణ్ణీ ఆకాశంలో తిరిగే దీపాలుగానూ, వాటిని త్రిప్పే శక్తిగా దేవుని వర్ణించడం అనితర సాధ్యం. సముద్రపు కెరటాలు ఎక్కడ భూమిని ఆక్రమిస్తాయోనని వాటిని మడిచే శక్తి, ప్రాణి కోటి గుండె గడియారాలెన్ని ఉంటాయో మరి… వాటి కీలు కదపే శక్తి (ముఖ్యంగా ‘పనిమాలీ అనడం కవి నేర్పరి తనానికి నిదర్శనం. ఎందుకంటే అందరు మానవుల జీవితాలూ ఉపయోగకరమైనవి కాకపోవచ్చు కదా!), ఇంకా నీలాకాశంలో చుక్కల ముగ్గులు పెట్టే శక్తి అయిన విధాతకు అక్షర నీరాజనం ఇది! ఆయనకు ఇంతకన్నా శ్రేష్టమైన అంజలి నభూతో నభవిష్యతి!!


Your views are valuable to us!