కరుణశ్రీ కవిత్వం

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 4]

అద్భుతమైన భావాల్ని అందంగా వ్యక్తీకరించడానికి తెలుగు భాషకున్న ఒక మాధ్యమం – పద్య కవిత్వం. కాకపోతే, కాలక్రమేణా సగటు ప్రజల పాండిత్యం సన్నగిల్లడంతో పద్య కవిత్వానికి ఆదరణ కరువైంది. అయినా, క్రిందటి శతాబ్దంలో కూడా మధురమైన కవిత్వాన్ని వెలువర్చిన కవులుండే వారు. వారిలో కరుణశ్రీ ఒకరు. ఆయన వ్రాసిన ‘పోతన’ అనే ఖండికలో కొన్ని పద్యాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం!

ఈ పద్యాల్ని ఇక్కడ ఉదహరించడానికి ముఖ్య కారణం… అవి ప్రస్తుతం లభించకపోవడం మాత్రమే!

పోతన వృత్తిరీత్యా హాలికుడు. వ్యవసాయంతోనే సంపాదన. కవితా వ్యవసాయంలో ఎలా బంగారం పండించాడో మనందరికీ తెలుసు. అది ఈ పద్యంలో ఎంత రమ్యంగా వర్ణించబడిందో చూడండి.

          గంటమొ చేతిలోది ములుగర్రయొ? నిల్కడ ఇంటిలోననో
          పంటపొలానొ? చేయునది పద్యమొ సేద్యమొ? మంచమందు గూ
          ర్చుంటివొ మంచెయందొ? కవివో గడిదేరిన కర్షకుండవో?
          రెంటికి చాలియుంటివి సరే కలమా హలమా ప్రియంబగున్?

వ్యవసాయాన్నీ, కవితా వ్యాసంగాన్నీ అద్భుతంగా ముడివేస్తూ అల్లిన ఈ పద్యాన్ని గమనించండి. ఒక కవి లేదా రచయిత రచనల్లో అతని వ్యక్తిత్వం ప్రతిబింబిస్తూ ఉంటుంది. పోతన కవిత్వం చదివిన వారికి ఆయనెంత దయార్ద్ర హృదయుడో అవగతమవుతుంది. అటువంటి వాడు పొలం దున్నుతూ గిత్తలను, ఫలంపై వ్రాలే పిట్టలను ఎలా అదిలించాడోనని కవి ఆశ్చర్యపోవడం ఎవరినైనా మురిపించక మానదు.

          మెత్తని చేయి నీది, సుతిమెత్తని చిత్తము వాడవంచు నీ
          పొత్తమె సాక్ష్యమిచ్చు; పొలమున్ హలమున్ గొని దున్నుచోనెటుల్
          గిత్తల ముల్లుగోల నదలించితివో! వరి చేల పైనను
          వ్వెత్తుగ వ్రాలుచో పరిగ పిట్టల నెట్టుల తోలినాడవో!

పదాల పొందిక, భావ వ్యక్తీకరణ ఇంత అందంగా చేయగలిగిన కవులు అతి కొద్ది మంది. తెలుగు భాషకే ప్రత్యేకమైన పద్య కవిత్వాన్ని (ఇన్ని హొయలొలికే ఛందస్సు మరో భాషలో దుస్సాధ్యం!) రమణీయంగా చూపించిన పోతనామాత్యుణ్ణి కరుణశ్రీ ఎలా స్తుతించాడో చూడండి!


          కమ్మని తేట తెల్గు నుడికారము లేరిచి కూర్చి చాక చ
          క్యమ్ముగ కైతలల్లు మొనగాండ్రు కవీశ్వరులెంతమంది లో
          కమ్మున లేరు – నీవలె నొకండును భక్తి రసామృత ప్రవా
          హమ్ములకేతమెత్తిన మహాకవి ఏడి తెలుంగు గడ్డపై?

          ముద్దులు గార భాగవతమున్ రచియించుచు, పంచదారలో
          నద్దితివేమొ గంటము మహాకవిశేఖర! మధ్య మధ్య … అ
          ట్లద్దక వట్టి గంటమున నట్టిటు గీచిన తాటియాకులో
          పద్దెములందు ఈ మధుర భావము లెచ్చట నుండి వచ్చురా!

కలాన్ని (ఆ కాలం కాబట్టి గంటాన్ని) మధ్యమధ్యలో పంచదారలో అద్దడం ఎంత మధురమైన కల్పన! భాగవతాన్ని చదివి చూడండి… తెలుస్తుంది! ఇది అతిశయోక్తి కాదు. అంత తీయని పద్యాలవి.


భాగవతం మొత్తాన్ని ఒక సీస పద్యంలో ఇమిడ్చి, అటుపైని తేటగీతిలో పోతన ప్రతిభను వెలికి తేవడం కేవలం కరుణశ్రీ కే చెల్లింది. అదీ చదవండి.

          భీష్ముని పైకి కుప్పించి లంఘించు

   గోపాల కృష్ణుని కుండలాల కాంతి
          కరిరాజు మొరవెట్ట పరువెత్తు కరివేల్పు
   ముడివీడి మూపుపై పడిన జుట్టు
          సమరమ్ముగావించు సత్య కన్నులనుండి
   వెడలుప్రేమక్రోధ వీక్షణములు
          కొసరి చల్దులు మెక్క గొల్లపిల్లలవ్రేళ్ళ్
    సందు మాగాయపచ్చడిపసందు

   ఎటుల కనుగొంటివయ్య! నీకెవరు చెప్పి
   రయ్య! ఏ రాత్రి కలగంటివయ్య! రంగు
   కుంచెతో దిద్దితీర్చి చిత్రించినావు!!
   సహజ పాండితికిది నిదర్శనమటయ్య!!


కలం పేరే తన గుణమై, కవితలలోని ప్రధాన రసమై,పఠితల గుండె లోతుల్లో నిండిన సుధాలహరియై దశాబ్దాల పాటు నిలిపివుంచడం కరుణశ్రీకి మాత్రమే సాధ్యమైంది.

Your views are valuable to us!