కవిత్వం – కొన్ని సంగతులు

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 4]

 

భాషకు అపరిమితమైన శక్తి వుంది. జోకొట్టి, దులపరించి, నిలువు నిలువునా కోసి వెయ్యగల సత్తువ పదాలకుంది. కొత్త ఊహల్ని, లోకాల్ని మంత్రించి తీసుకురాగల మహత్తు అక్షరాలకున్నాయి. ఈ శక్తి, సత్తువ, మహత్తు ఆవిషృతమయ్యేది ఒక్క కవిత్వంలో మాత్రమే. కవిత్వం సూటిగా, క్లుప్తంగా, సారాంశపూరితంగా రాసినప్పుడు పాఠకుల అంతరంగాలు దారితప్పిపోయే అవకాశాలు శూన్యం. నవ్యనవ్యంగా, పదచిత్రాల ఆధారంగా చెప్పినప్పుడు చదువరుల మనసులు హేతురాహిత్య సీమల్లో తచ్చాడగలుగుతాయి. కవితలోని నిశ్శబ్దం కవికి, పాఠకులకి మధ్యన వంతెన కట్టి దగ్గిరకు చేరుస్తుంది. తద్వార కవిత స్థిరత్వం సంపాదించుకుంటుంది.

వొక కవిత, కవి నుండి పాఠకునికి చేరాలంటే రచయితలో రచనా శక్తి, పాఠకుల్లో భావస్పందన వుండాలి. రచయిత-పాఠకుల మధ్య భావసామ్యం , భావసారూప్యం , భావసామీప్యం వుండాలి. ఈ మూడింటి వల్ల మాత్రమే కవికి, పాఠకునికి మధ్య కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. ఈ మూడు ఏకకాలంలో ఒకే విషయం వైపుకు కేంద్రీకరించబడితేనే కవిలో సాహిత్య సృష్టి, పాఠకునిలో రసాస్వాదన జరుగుతాయి. లేదంటే రచన విఫలమై పాఠకుడు అసంతృప్తి పాలౌతాడు. ఇది వొక కోణం.

సాహిత్యాభిరుచి అన్నది వో మానసికచర్య. కల్పనకు సంబంధించినది. ఎవరైతే ఈ కల్పనా జగత్తు నుండి విడిపోయివుంటారో వారు కవిత్వాన్ని సృష్టించలేరు. చావుపుట్టుకలు, పూర్వజన్మ సంస్కారాలకు అర్థాలను వెదుక్కొనే తాత్వికులు, లాబోరేటరీల్లోనే మగ్గిపోయే సైంటిస్టులు కల్పనాజగత్తునుండి దూరంగా బతికేవాళ్ళు. వీళ్ళని కవిత్వం రాయమంటే కుదిరేపని గాదు. వొహవేళ రాసినా అది తర్కంతో కూడి వుంటుంది. తర్కం యే కళకైనా శత్రువే.

Buy this book on Amazon
వ్యక్తికి అభిరుచన్నది రెండు రకాలుగా తీర్చబడుతుంది. మొదటిది బాహ్యాభిరుచి. రెండోది అంతరంగపు అభిరుచి. బాహ్యాభిరుచి చుట్టూ వుండే వాతావరణంతో ముడిపడి వుంటుంది. సినిమాలు, సిద్ధాంతాలు, సంస్థలు మొదలైనవన్నీ బాహ్యాభిరుచిని పెంచుతాయి. ఇవన్నీ నలుగురితో బాటూ నారాయణా అనే బుద్ధి బులపాటాలు. అంతరంగ అభిరుచన్నది పరిణితి పెరిగే కొద్దీ వన్నెకెక్కేది. సాయంకాలపు నీడలా నెమ్మనెమ్మదిగా పెరిగి విస్తరించి, నీడనిచ్చేది. ఈ స్థాయిలోనే మనిషి తనలోకి తాను ప్రయాణిస్తాడు. తనలోని లోతుల్ని అందాజు వేస్తాడు. ఎప్పుడైతే మనిషి తన మనసులోకి ప్రవేశించడం మొదలెడతాడో అప్పుడే బైటి ప్రపంచాన్ని, లోని ప్రపంచాన్ని అనుసంధానించే సామర్ధ్యమొస్తుంది. అంటే సామాజిక, సాంస్కృతిక, మానవీయ విలువల్ని సూక్ష్మంగా అనుసంధానించే శక్తి వస్తుంది. అప్పుడే రససిద్ధి పొందడం మొదలౌతుంది. ఆ తాదాత్మ్యం నుండి నిజాయితీతో కూడిన సాహిత్య సృష్టి జరుగుతుంది. ఆ సాహిత్యంలో బాహ్యప్రకోపాలు, “కొరగానివి పెమ్మయ సింగధీమణీ” అనబడే అరుపులు, కేకలు, నినాదాలు వుండవు. అనాలసిస్సులు, చదివిన పుస్తకాల లిస్టులు, తిండియావకు అవకాశముండదు.

పూర్వంలో కవి, శ్రోత ఒకే జాతికో, వర్గానికో చెందినవారైవుండేవారు. రాజభక్తి, దైవభక్తి వంటివే సాహిత్య విషయాలుగా చెలామణయ్యేవి. వాళ్ళ అభిరుచులు గూడా దాదాపు వొకే విధంగా వుండడంవల్ల సాహితీ యుద్ధాలు అంతగా జరిగేవి గావు. ఈరోజు అందరూ చదువుకొంటున్నారు. రాజు, దేవుడు అంటరానివాళ్ళు, ఔట్ డేటెడ్ ఐపోయారు గనక సాహిత్య రచన కోసం అనేక విషయాలు పుట్టుకొచ్చాయి.

కుల మత వర్గాలకతీతంగా అందరూ తమతమ సామాజిక, సాంస్కృతిక అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా చెప్పగల్గుతున్నారు. అంచాత ఈరోజుల్లో సాహిత్య రచన పూర్వమంత సులభం గాదు. వొక వర్గం మెచ్చుకొన్న సాహిత్యాన్ని మరో వర్గం తోసిపారేస్తుంది. ఈరోజున్న ఫలానా వాదపు కవితకు రేప్పొద్దున ఇంకో వాదపు కవొచ్చి సమాధి కడతాడు. చాలాసార్లు రచైతలే ఎవరికోసం రాస్తున్నారో తెలీని అయోమయంలో పడుతుంటారు. దీనికి కారణం ముందర చెప్పినట్లు బాహ్యాభిరుచికే ప్రాధాన్యమివ్వడం .

తమతమ లౌకిక సంస్కారాల్ని మీరి కావ్య రసాస్వాదన చెయ్యాలని మన అలంకారికులు చెప్పిన మాటలు ఈ కాలంలో నిలబడ్డంలేదు. వొక నాస్తికుడు పోతన భాగవతాన్నో, త్యాగరాజు కీర్తననో ఆస్తికుని స్థాయిలో
అస్వాదించగలడా? అభ్యుదయ వ్యతిరేకి శ్రీశ్రీ ఆవేశాన్ని అందుకోగలడా? రచైతల వస్తువులు పాఠకుల బాహ్యాభిరుచి వల్ల సంకుచితాలైపోలేదా? ఐతే ఇదిలానే వుంటుందా, అందరినీ సమానంగా కదిలించే విధానమే లేదా? అని ప్రశ్నించుకొంటే ఇల్లా సమాధాన పడొచ్చు. యే రచనైతే మత, సాంస్కృతిక, సామాజిక కట్టుబాట్లకు లోబడక మనిషి అంతరంగ వేదనని ఆవిష్కరిస్తుందో ఆ సాహిత్యం ‘టర్గెట్ ఆడియెన్స్ ‘ అన్న చట్రం నుండి బైటపడ్తుంది. విశ్వజనీన భావంతో అందర్నీ కదిలిస్తుంది. అంచాతే ఫలనా వాళ్ళ కోసం రాస్తున్నానన్న ప్రజ్ఞ కవిలో వుండరాదు. లేకుంటే కల్పవృక్షాలతో బాటు విషవృక్షాలని గూడా చూడాల్సి వస్తుంది.

Buy this book on Amazon

Your views are valuable to us!