మేధావిభట్టు అనే కవి 15వ శతాబ్దికి చెందినవాడు. ఆయన ఓసారి పెద్ద తిమ్మ భూపాలుడి మీద పద్యం వ్రాయాలనుకునే సమయానికి చేతిలో తాటాకు లేదు. ఎదురుగా తాటిచెట్టు కనబడుతుంటే, ఆ తాటిచెట్టును మూడు ముక్కలై కూలిపొమ్మని ఈ కింది పద్యం చదువుతాడు ..
సాకువ పెద తిమ్మ మహీ
పాల వరుడు వీడె వచ్చె బద్యము వ్రాయన్
కేలను లేదాకొకటియు
దాళ్మ ముత్తునియలగుచు ధరపై బడుమా!
అనేసరికి ఆ చెట్టు విరిగి కూలిపోయిందట.
అలాగే కవిమల్లుడు కూడా 15వ శతాబ్దికి చెందిన కవి రుక్మాంగదచరిత్ర వ్రాసాడు. ఈయనకోసారి బ్రహ్మదండి ముల్లు గుచ్చుకునే సరికి, ఆ చెట్టు నుండి ముళ్ళు రాలిపోవాలని ఈ పద్యం చదివాడు…
గుడియన్న నృపతి బొదగన
నడవంగా గొండపల్లి గనరి పడమటం
గుడి యడుగు మడమగాడిన
చెడు ముండులు బ్రహ్మదండి చెట్టున డుల్లున్
ఈ పద్యం చెప్పేసరికి బ్రహ్మదండి ముళ్ళన్నీ జలజల నేల రాలిపోయాయట!
అలానే బడబాగ్నిభట్టు అనే మరో 15వ శతాబ్దికి చెందిన కవి ఉన్నారు. ఈయన ఓసారి త్రిపురాంతకం నుండి శ్రీశైలానికి వెళ్తూ, దారిలో రాయలవారు కట్టించిన చెరువులో స్నానానికి దిగాడు. అర్ఘ్యప్రదానం చేస్తుండగా ఆయన వేలి ఉంగరం జారి నీళ్ళల్లో పడిపోయింది. ఆ ఉంగరం కోసం, ఆ చెరువు నీళ్ళు నాలుగు ఘడియల్లో ఇంకిపోవాలని సంకల్పించి ..
బడబానల భట్టారకు
కుడి చేయుంగరము రవికి గొబ్బున నర్ఘ్యం
బిడు వేళ నూడి నీలో
బడియె దటాకంబ నీటి బాయుమ వేగన్
అనే సరికి, ఆ చెరువు నీళ్ళింకిపోయి, ఉంగరం బయటపడిందట.
అలాగే, 18వ శతాబ్దిలో తురగా రామకవి ఉండేఆరు. ఆయన దేశాటనం చేస్తూ సంవత్సరానికోసారి రాజుల్ని దర్శిస్తూ బహుమానాలందుకునేవారు. ఓసారి, పెద్దాపురం ప్రభువైన వత్సవాయ తిమ్మజగపతిని దర్శించి బహుమానమందుకొని, మళ్ళీ అచిరకాలంలోనే రెండోసారి వచ్చేసరికి రాజు బహుమానమే కాక, దర్శనం కూడా ఇవ్వలేదు. రామకవి కోపగించి కోటగోడ మీద బొగ్గుతో ‘పెద్దమ్మ నాట్యమాడును-దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని ఇంటన్ ‘ అని వ్రాయబోగా, రాజుకు తెలిసి పరుగెత్తుకుంటూ వచ్చి కాళ్ళమీద పడి శాంతింప జేసే సరికి …
అద్దిర శ్రీ భూనీలలు
ముద్దియ లా హరికి గలరు ముగురమ్మలలో
పెద్దమ్మ నాట్యమాడును
దిద్దిమ్మని వత్సవాయి తిమ్మన ఇంటన్
అని రాసి, ఈ శాపం నీ కాలంలో కాదు, నీ మనుమని కాలంలో జరుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడట. ఆయన వాక్కు ఫలితంగా, తిమ్మజగపతి మనుమని కాలంలో పెద్దాపురం సంస్థానం పతనమైపోయింది.