ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ముందు పెను సవాళ్లు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకూ ప్రజల, ప్రభుత్వ దృష్టి అంతా రాజధాని ఎక్కడ, లోటు బడ్జెట్ తో ప్రస్థానం మొదలెడుతున్న ఈ కొత్త రాష్ట్రానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అన్న సమస్యల మీదే ఉంది. 2-3 నెలల్లో ఈ విషయాలపై కొంత స్పష్టత ఎలాగూ వస్తుంది. అయితే ఇదంతా జరిగి పరిస్థితులు కొంత సద్దు మణిగిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ప్రజలనీ, ప్రభుత్వాన్నీ వేధించబోయే ప్రధాన సమస్య – కొత్త రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగాల కల్పన. స్వరాష్ట్రం లోనే పని చేసుకుంటూ, జీవనం సాగించటమనేది ఎవరైనా కోరుకొనే విషయం. తమ రాష్ట్రం లోనే తమ ప్రతిభకి తగ్గ అవకాశాలు లభిస్తే వేరే రాష్ట్రానికి వెళ్లి ఉద్యోగం చేసుకోవలసిన అవసరం ఎవరికీ ఉండదు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా జరిగిన అభివృద్ధి వలన ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లో పెద్దగా ఉద్యోగావకావశాలు లేవు. నేటి వరకూ విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాలు ఉన్నత విద్యావంతులకి ఎటువంటి సరైన ఉపాధీ కల్పించే విధంగా ఎదగలేదు.
కొత్త రాష్ట్రం ఉద్భవించింది కాబట్టి కొన్ని ఉద్యోగాలు వాటంతట అవే వస్తాయని కొందరంటారు. అది కొంత వరకూ నిజమే. అలాంటి వాటిలో ముందుగా ఆర్ధిక సేవల గురించి ప్రస్తావించ వచ్చు. అమ్మకం పన్ను, వినోదం పన్ను, లక్జరీ టాక్సుల వంటివి ఏ రాష్ట్రంవి అక్కడే కట్టాలి కాబట్టి వీటి కన్సల్టెంట్స్, ఆడిటర్స్ వంటి వారికి అవకాశాలూ బాగా పెరుగుతాయి. ఎన్నో వినియోగ ఉత్పత్తుల తయారీ కంపెనీలు ఆంధ్ర ప్రదేశ్లో కూడా కొత్త బ్రాంచీలు లేదా సి అండ్ ఎఫ్ ఏజెన్సీలు తెరవాల్సి ఉంటుంది. ఇటువంటివి పెద్దా, చిన్నా కంపెనీలు చాలానే ఉంటాయి. ఇవి కూడా ఇక్కడ కొత్త ఉద్యోగాలని సృష్టిస్తాయి. అయితే ఇలా వాటంతట అవే వచ్చే ఉద్యోగాల సంఖ్య పరిమితంగానే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ రెండు మూడేళ్లలో ఇటు వైపు మారినా ఇప్పటికే ఉన్న ఉద్యోగులకి స్థాన చలనం జరగుతుంది తప్ప కొత్త ఉద్యోగాలు పెద్దగా పుడతాయనుకోలేం. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగాల కల్పనకి ఒక సరైన ప్రణాళికని రూపొందించడం తప్పని సరి.
గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు యువత అంతా సాఫ్ట్ వేర్ వేపే చూస్తోంది. అధిక శాతం ఉద్యోగాలు ఈ రంగంలోనే రావడమే అందుకు కారణం. అయితే సీమాంధ్ర యువత ఈ రంగంలో తమ రాష్ట్రంలోనే తమకు అవకాశాలు వస్తాయనుకుంటే పొరపాటవుతుంది. ప్రస్తుతం సీమాంధ్ర లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ఆకర్షించే సదుపాయాలూ లేవు. ఉన్నత విద్యాలయాలతో పాటూ పారిశ్రామిక ప్రగతి ఉండి, యువతరం మెచ్చే వినోద విలాస జీవన విధానాలకి అద్దం పట్టే పెద్ద నగరం ఒక్కటీ లేకపోవడం ఒక గొప్ప లోటు. దేశ విదేశాల రాకపోకలకి అనువైన అంతర్జాతీయ విమానాశ్రయ మేదీ సీమంధ్రలో ప్రస్తుతం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో సాఫ్ట్ వేర్ రంగమంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమయ్యింది. విశాఖ, విజయవాడలలో కొన్ని సాఫ్ట్ వేర్ పార్కులు నిర్మించినా అవి పెద్దగా అభివృద్ది చెందలేదు. అదీ కాక, విశ్వవ్యాప్తంగా ఈ రంగం కొంత ఒడిదుడుకులని కూడా ఎదుర్కుంటోంది. ఈ మధ్యన, ఈ రంగ వ్యాపారావకాశాల మీద పరిశోధనలు జరిపే గార్ట్నర్ సంస్థ 2014-15 వృద్ధి రేటుని ముందనుకున్న 3.2శాతం నుంచి 2.1శాతానికి కుదించింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇన్ఫోసిస్, టిసిఎస్ వంటి పేరు గాంచిన దేశీ సంస్థలు కూడా కొత్త రిక్రూట్మెంట్ లని బాగా తగ్గించేయి. 2013-14 ఆర్ధిక సంవత్సరంలో టిసిఎస్ 24,200 కొత్త ఉద్యోగాలకి మాత్రమే తెర తీస్తే, ఇన్ఫోసిస్ సృష్టించిన కొత్త ఉద్యోగాలు కేవలం మూడు వేలే. అదనపు ఉద్యోగులు పెద్దగా అవసరంలేని ఈ రోజుల్లో, ఏ సదుపాయాలూ లేని సీమాంధ్రకి సాఫ్ట్ వేర్ కంపెనీలు తరలి వస్తాయనుకోవడం తప్పిదమే అవుతుంది. మరో మాధాపూర్ మధురవాడలో రావడం ఇప్పట్లో కష్టమే.
అందుకని ప్రభుత్వం సాఫ్ట్ వేర్ రంగం మీద పెద్దగా ఆశలు పెంచుకోకపోవడమే ఉత్తమం. దీర్ఘకాలిక ప్రణాళికగా ఈ రంగానికి కావలసిన సదుపాయాలు సృష్టించటం తప్పని సరి కానీ, స్వల్ప కాలంలోనే అంది వచ్చే విధంగా వేరే ఉపాధి కల్పనా మార్గాలు వెతకడం ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం. ఈ ప్రయత్నం మన ఆంద్ర ప్రదేశ్ కి ఉన్న 900 కి.మీ.ల తీర ప్రాంతాన్నీ, సముద్ర, రోడ్డు, రైల్వే రవాణా సౌకర్యాలనీ, మన మానవ వనరుల్నీ ఉపయోగించుకొనేలా ఉండాలి. ఈ కోణంలో ఆలోచిస్తే మౌలిక సదుపాయాల కల్పన (కొత్త రోడ్ లూ, రైలు మార్గాలు, పోర్ట్ లూ, విమానాశ్రయాల నిర్మాణం వంటి ఇంఫ్రాస్ట్రక్చర్ రంగం), వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెస్సింగ్ వంటి రంగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టటం అవసరం. ఇంఫ్రాస్ట్రక్చర్ రంగం మీద దృష్టి పెడితే ఆర్కిటెక్ట్స్, సివిల్ ఇంజినీర్స్ తో పాటూ ఎంతో మంది నిర్మాణ కార్మికులకి ఉపాధి లభిస్తుంది. ఫైనాన్స్ రంగంలో కూడా ఇది ఎన్నో కొత్త అవకాశాలనీ, ఉద్యోగాలనీ సృష్టిస్తుంది. అయితే దీనికి అనుగుణంగా ఈ రంగంలో ప్రొఫెషనల్స్ ని తయారు చేసే ఉన్నత విద్యా సంస్థలని త్వరితగతిన స్థాపించాలి. ఆంధ్ర ప్రదేశ్లో ఎంతో ఎదగ గలిగే రంగాల్లో జల రవాణా ఒకటి. 700 కిమీ.ల పొడువున్న బకింగ్ హాం కాలువని వెంటనే పునరిద్ధరించటం ఎంతో అవసరం. జల రవాణా రంగానికి ఉన్న ఉత్తమ లక్షణం ఏంటంటే దీని వల్ల అభివృద్ధి పట్టణాలకీ, నగరాలకీ మాత్రమే పరిమితం కాకుండా దారి పొడుగునా ఉన్న ప్రతీ పల్లెనీ స్పృశిస్తుంది.
అలాగే ఒకటి రెండు సంవత్సరాలలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇక్కడే వెలిస్తే, న్యాయవాదులకి, వారి అనుబంధ ఉద్యోగులకీ కూడా అవకాశాలూ మెరుగవుతాయి. ఈ దిశలో కేంద్ర న్యాయ శాఖ తో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి.
కొంతలో కొంతైనా సినిమా, టీవీ రంగాలని సీమంధ్రకి ఆకర్షించే కార్యక్రమం కూడా చెయ్యాలి. తెలుగు వినోద రంగంలో అత్యధిక శాతం వ్యక్తుల మూలాలు కోస్తాలోనే ఉండటం ఓ విధంగా లాభం. బంజారా హిల్ల్సే కాదు, బెంజ్ సర్కిల్ కూడా ఉంది, జూబ్లి హిల్సే కాదు, జగదాంబా జంక్షన్ కూడా ఉంది, కొండాపూరే కాదు, కొండా రెడ్డి బురుజు కూడా ఉందని ఈ రంగానికి తెలియ చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టవలసిన మరొక రంగం ఫార్మా రంగం. భారత ఫార్మా రంగం బల్క్ డ్రగ్స్ కి పేరు గాంచింది. ఖర్చుల్ని సాధ్య మైనంత అదుపులో ఉంచుకొని తక్కువ లాభాలతో వ్యాపారం సాగించే ఈ రంగానికి ఆంధ్ర ప్రదేశ్ కి రానున్న ప్రత్యేక హోదా ఎంతో ప్రోత్సాహకం గా ఉంటుంది. కేవలం ప్రోత్సాహకాల కారణంగా ఏ మౌలిక సదుపాయాలూ లేని హిమాచల్ ప్రదేశ్ కి కూడా తరలిన చరిత్ర ఈ రంగానికి ఉంది. ఈ రంగంపై దృష్టి సారించి, ఈ రంగానికి కావలసిన సదుపాయాలు సమకూర్చగలిగితే, ఆంధ్ర ప్రదేశ్లో 2-3 ఏళ్లలోనే ఎన్నో ఫార్మా తయారీ ఉద్యోగాలు సృష్టించవచ్చు. ఆటోమొబైల్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్ రంగాలకి కూడా ఇక్కడ ఎదగ గలిగే అవకాశం ఎంతో ఉంది.
చంద్రబాబు నాయుడు గారి మొదటి విడత పాలన కంప్యుటర్ యుగం. ఆ రోజులు అలాంటివి. ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్ వేర్ జోరందుకుంటున్న రోజులవి. ఆ రంగం ఇప్పుడు స్థిరపడి దాని వృద్ధి రేట్లు మందగించేయి. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో, ఇప్పుడు మనమున్న అధ్యాయంలో, మళ్లీ బ్రిక్ అండ్ మోర్టార్ రోజులోచ్చేయి. అంటే పలుగు, పార పట్టుకొని పునర్నిర్మించవలసిన సమయమన్న మాట. రోజుల బట్టే మోజులు. ఇది అర్థం చేసుకొని ప్రభుత్వం, ప్రజలు తమ జీవితాలు మలుచుకుంటే అవకాశాలూ వాటంతట అవే వస్తాయి..
—–
జె. విష్ణు శంకర్
బెంగళూరు, 98450-77374
vishnu@crorepatihomes.net