నిడుదవోలు వెంకటరావు గారు: జంగమ విజ్ఞాన సర్వస్వము

Spread the love
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

విద్యారత్న, కళాప్రపూర్ణ, పరిశోధనపరమేశ్వరులు, జంగమవిజ్ఞానసర్వస్వము వంటి అనేక బిరుదులు సార్థకనామధేయాలుగా రాజిల్లిన పండితులు నిడుదవోలు వెంకటరావు గారు.

వంశపారంపర్యంగా విద్వత్‌యశోభూషణులుగా చెలగిన వంశంలో సుందరంపంతులు, జోగమ్మగారి ఎనిమిమంది సంతానంలో నాల్గవసంతానం, మొదటి పుత్రుడుగా జనవరి 3వతేదీ, 1903లో విజయనగరంలో జన్మించారు. తొలిపుత్రుడయినందున గారాబంగా పెంచుకున్నారు తల్లిదండ్రులు.

ఇంటిపేరు గురించి ఒకమాట చెప్పాలి. వెంకటరావుగారు తమ ఇంటిపేరు నిడుదవోలు రెండవస్థానంలో ‘డు’- అనే రాసుకునేవారు. వారి తండ్రి సుందరంపంతులుగారు ‘నిడదవూలు’ అని రాసుకున్నట్టు తిరుపతి ఓరియంటల్ కాలేజీ లైబ్రరీలో వారు దానం చేసిన పుస్తకాలమీద ముద్రమూలంగా తెలుస్తోంది. ఈ వ్యాసంలో వెంకటరావుగారు వాడుకున్న పేరే నేను కూడా వాడుతున్నాను.

మరొక విషయం. నిడుదవోలు వెంకటరావుగారి సాహిత్యంమీద నిష్టల వెంకటరావుగారు పి.హెచ్.డి కోసం పరిశోధన చేసి తమ సిద్ధాంతగ్రంథాన్ని ప్రచురించారు, “నిడుదవోలు వెంకటరావుగారి రచనలు – పరిశీలన” అన్న శీర్షికతో. నా ఈవ్యాసంలో చాలా విషయాలు వారిగ్రంథంలోనుండి తీసుకున్నాను. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

వెంకటరావుగారితండ్రి సుందరంపంతులుగారు అనేక ప్రాచీనగ్రంథాలు, ముఖ్యంగా శైవసాహిత్యం, సేకరించి చెప్పుకోదగ్గ లైబ్రరీ సమకూర్చుకున్నారు. వారికి పండితారాధ్యచరిత్ర, బసవపురాణంవంటి గ్రంథాలు కంఠోపాఠాలుట.

వెంకటరావుగారు చిన్నతనంలోనే  ఆ పుస్తకాలు చదవడం ప్రారంభించి, ప్రాచీనసాహిత్యంలో సాధికారకమయిన జ్ఞానం సముపార్జించుకున్నారు. తండ్రివారసత్వంలో పుస్తకపఠన అలవడితే, తల్లినుండి వాగ్దాటి పుణికి పుచ్చుకున్నారు. తల్లి జోగమ్మగారు ఏవిషయం అడిగినా, కథలుకథలుగా గుక్కతిప్పుకోకుండా చెప్పేవారని వినికిడి.

వెంకటరావుగారు చిన్నప్పటినుండి కవితలల్లి కమ్మనికంఠంతో పాడుతుండేవారు. అంచేత అనేకులు వారిని పిలిచి, తమ సభలకి తీసుకువెళ్లి పాడించుకునేవారుట.

ఆయన హైస్కూలు, ఇంటరు చదువు విశాఖపట్నంలోనూ, బి.ఎ. విజయనగరంలోనూ పూర్తి చేసారు. 1925లో బి.ఎ. పట్టం అందుకుని ఆర్థికపరిస్థితులు కారణంగా పైచదువుకి వెళ్లలేక, ఇంపీరియల్ బాంక్ (ఈనాటి స్టేట్ బాంక్) లో గుమాస్తాగా చేరేరు 1926లో. ఒకసందర్భంలో తిరుమల రామచంద్రగారు “వెంకటరావుగారు కారణాంతరాలవల్ల యం.ఏ. చెయ్యలేదు” అంటే సమాధానంగా వెంకటరావుగారు, “కారణాంతరాలవల్ల యం.ఏ. చేసేను,” అన్నారుట.

1926నించి 1939 వరకూ బాంకులో పనిచేస్తున్నరోజుల్లోనే పిఠాపురం రాజా సూర్యారావు మహీపతిగారు నన్నెచోడుని కుమారసంభవం చదువుతూ, అందులో ఉటంకించిన “శైవాగమ ఆచారాలను వివరించగలవారెవరైనా వున్నారా?” అని వాకబు చేస్తే, ఎవరో వెంకటరావుగారిపేరు సూచించారుట. పిఠాపురం రాజావారు వెంటనే వెంకటరావుగారికి కబురు చేసేరు. వెంకటరావుగారు వచ్చి రాజావారికి శైవ సంప్రదాయాలని వివరించినతరవాత, ఆయన పాండితీగరిమకి రాజావారు ముగ్ధులయి. తాము సంకలనం చేస్తున్న సూర్యారాయాంధ్రనిఘంటువులో పని చేయమని వెంకటరావుగారిని ఆహ్వానించేరుట. వెంకటరావుగారికి ఆ నిఘంటువుసంపాదకత్వం వారిభావి సాహిత్యకృషికి రాచబాట వేసింది.

వెంకటరావుగారు ఆర్థిక పరిస్థితుల మూలంగా గుమాస్తాగా చేరారు కానీ అది వారికి తృప్తినివ్వగల ఉద్యోగం కాదు. వారి తపన ఈ కింది పద్యంలో తెలుస్తుంది.

 

చనియెన్ ద్వాదశ హాయనంబుల పయిన్

షణ్మానకాలంబు బ్యాం

కునకే దేహపుటస్థి చర్మములు రెం

డున్ ధారగాబోసి జీ

వనమున్ బుచ్చుచు సేవ జేసితి మనో

వాక్కాయ కర్మంబులన్

వినియోగించితి నాదు ధీపటిమ

వన్నెందెచ్చు నెద్దానిలోన్

 

“పన్నెండేళ్ల, ఆరునెలలయింది, చర్మమూ ఎముకలూ బాంకుకి ధారబోసి, బతుకు వెళ్లబుచ్చుకుంటున్నాను. మనసు, వాక్కు, కర్మ కూడా బాంకుకే అర్పించేను, కానీ నిజానికి నా తెలివితేటలు ఏపనిలోనైనా రాణిస్తాయి” అంటారు వెంకటరావుగారు. (పైన మూడో పాదంలో “షణ్మాన” అన్నది “షణ్మాస” కావచ్చు. నేను పుస్తకంలో ఉన్నది యథాతథంగా ఇక్కడ ఇచ్చేను.)

పిఠాపురం రాజావారి సహకారంతో, వెంకటరావుగారు బాంకు ఉద్యోగానికి ఉద్వాసన చెప్పి, తమకి అత్యంత ప్రీతిపాత్రమయిన సాహిత్యరంగంలో ప్రవేశించారు. ఈసందర్భంలో వెంకటరావుగారు,

“ఈనాడు విశ్వవిద్యాలయములలో నున్నవారికి నాకు నొకటే బేధమున్నది. బ్యాంకు అంకెలమయము. సాహిత్యము అక్షరమయము. నేను అంకెలనుండి అక్షరములలోనికి రాగా, నేటి  విశ్వవిద్యాలయమున నున్నవారు అక్షరములనుండి అంకెలలోనికి వచ్చినారు,” అన్నారు ఈనాడు మనం డబ్బుకిస్తున్న విలువని హేళన చేస్తూ.

1944లో మద్రాసుకి మారినతరవాత, వెంకటరావుగారు త్రిపురాంతకోదహరణము, విపులపీఠికతో రాసి, స్వయంగా ప్రచురించుకున్నారు. ఆ గ్రంథం సాటి పండితులదృష్టి నాకర్షించి, వారి సాహిత్యప్రస్థానంలో తొలి మైలురాయి అయి విలసిల్లింది. రెండువందలసంవత్సరాలకి పూర్వమే కవులు ఉదాహరణసాహిత్యం సృష్టించి వున్నా. ఆధునికయుగంలో దాన్ని వెలుగులోకి తెచ్చింది వెంకటరావుగారే. ఆ తరవాత వేటూరి ప్రభాకరశాస్త్రిగారివంటి మిత్రుల ప్రోత్సాహంతో, శివలెంక శంభుప్రసాదుగారు తమ ఆంధ్రగ్రంథమాలద్వారా ప్రచురిస్తామని వాగ్దానం చెయ్యడంతో ఉదాహరణ వాఙ్మయం అన్న గ్రంథం రాసి పండితులు మన్ననలు విశేషంగా అందుకున్నారు వెంకటరావుగారు.

ఈ సందర్భంలో విశ్వనాథ సత్యనారాయణగారు వెంకటరావుగారకి రాసిన ఉత్తరం చూడండి, ఆయన వెంకటరావుగారికిచ్చిన కితాబుతోపాటు ఉదాహరణ సాహిత్యలక్షణాలు కూడా తెలుస్తాయిః

 

జగత్తంతయుఁ గ్రియారూపము.

సర్వక్రియయుఁ బరమేశ్వరునందుఁ బర్యవసించును.

ధాతువు సర్వదా విభక్తాశ్రయము.

ఏ విభక్తికో సంబంధము లేక క్రియ లేదు.

అందుచేత నన్ని విభక్తులతోఁ బరమేశ్వరుని

జెప్పినప్పుడు భగవంతుడు సర్వక్రియాస్థాన

భూతుడని వ్యంగ్యము.

ఇది ఉదాహరణ కావ్య రహస్యము.

తాదృశకావ్య చరిత్ర వ్రాసిన మీ పరిశ్రమ

భవగత్సేవ యందు పర్యవసించుచున్నది.

మీరు పరిశోధన పరమేశ్వరులు.

– ప్రేమతో

విశ్వనాథ సత్యనారాయణ.

 

 వెంకటరావుగారు శైవసాహిత్యానికి చేసిన సేవ అపూర్వం. భావి సాహిత్యచరిత్రకారులకి అనుసరణీయం. కారణం ఆయన శైవసాహిత్యం ఆనాటి సాంఘికజీవనానికి అద్దం పట్టిందని గ్రహించి దాన్ని త్రికరణశుద్ధిగా నమ్మడం. హైందవసాహిత్యం పండితులకి మాత్రమే పరిమతమయి, కేవలం వారి ఆచార, వ్యవహారాలని మాత్రమే గ్రంథస్థం చేసింది కానీ ‘బసవపురాణం’ వంటి శైవమత గ్రంథాలు వైదికధర్మాలని విడిచి ప్రజలజీవనానికి ప్రతీక అయి నిలిచాయి, అవి సరళభాషలో సామాన్యజనానికి వేదాంతరహస్యాలు విడమరిచి చెప్పేయి అంటూ వెంకటరావుగారు దాదాపు ప్రతి పీఠికలోనూ, పరిష్కరణలలోనూ నిరూపించారు. ఆ విధంగా చూస్తే, వెంకటరావుగారు ప్రజల పండితుడు. ఈసందర్భంలో ఒక ఉదంతం చెప్పుకోవాలి.

వెంకటరావుగారు సమకాలీన పండితులని, ముఖ్యంగా ఆనాటి యువతరం రచయితలని దురుసుగానే విమర్శించేవారుట. దానికి ఉదాహరణగా నిష్టలవారు తమ సిద్ధాంతగ్రంథంలో కొన్ని ఉదాహరణలిచ్చేరు. అందులో నా దృష్టిని ఆకట్టుకున్నది ఆరుద్ర సమగ్రాంధ్రసాహిత్యం మీద వెంకటరావుగారి విమర్శ.

నిష్టలవారు “వెంకటరావుగారు సమగ్రాంధ్రసాహిత్యాన్ని విమర్శించారు. … అప్పటికి ఇంకా కుంఫిణీయుగం, ఆధునికయుగం సంపుటాలు వెలువడలేదు. ఈ విషయంలో నిష్టల వెంకటరావుగారు “సమగ్రాంధ్ర సాహిత్యం సాధారణ పరిజ్ఞానం ఉన్నవారు కూడా చదువుకునే సులభ శైలిలో వ్రాయబడింది. … గ్రంథకర్త స్వతహాగా కవిగా పేరు పొంది తరవాత పరిశోధన ప్రారంభించారు. అందువల్ల లోపాలు రావడం సహజం. వెంకటరావుగారు పరిశోధకాగ్రేసరులుగా పేరుపొందినవారు. కవులచరిత్ర పూర్తిగా ప్రామాణికంగా వ్రాయ సమర్థులు. అటువంటివారు సమగ్రాంధ్ర సాహిత్యకర్తను ప్రోత్సహిస్తూ విమర్శ రాస్తే రచయితలమధ్య సదవగాహన ఏర్పడేది” అన్నారు. (పరిశీలన. వచనవాఙ్మయము. 46.)

అయితే ఆ తరవాత ఆరుద్ర వెంకటరావుగారింటికి వెళ్లినట్టు, అప్పుడు వెంకటరావుగారు, “నాయనా, మాదేదో చాదస్తం. ఏదో రాస్తూ వుంటాం. మీలాంటివారు సాహిత్యకృషి చేయాలి” అని ఆరుద్రతో అన్నారని కూడా నిష్టలవారే రాసేరు, ( పరిశీలన. పుట 125).

మరి వారిమధ్య సద్భావం ఏర్పడిందో లేదో నాకు తెలీదు కానీ ఈ వ్యాసం రాయడంకోసం నేను సమగ్రాంధ్రసాహిత్యం వెతికాను. వెంకటరావుగారిపేరు నామమాత్రంగానైనా ఎక్కడా కనిపించలేదు.

వెంకటరావుగారు పండితారాధ్యచరిత్రకి విస్తృతమయిన పీఠికతోపాటు ఆ గ్రంథాన్ని పరిష్కరించడంలో అసమానమయిన పాటవాన్ని ప్రదర్శించేరని పండితులు శ్లాఘించేరు. నిజానికి ఆయన ఏ పుస్తకానికి పీఠిక రాసినా, కేవలం పుస్తకంలో వస్తువుకే పరిమితం చేయక, దానికి సంబంధించిన అనేక ఇతర విషయాలు కూడా చర్చిస్తారు. నిజానికి ఆయన రాసిన పీఠికలమూలంగా పుస్తకం ప్రాచుర్యంలోనికి వచ్చిన సందర్భాలు కూడా వున్నాయిట.

సకలనీతిసారము కావ్యానికి సుదీర్ఘమయిన పీఠిక రాస్తూ, కవికాలమూ, రచనారీతులూ చర్చిస్తూ, ఇలా అంటారు. (ఈ పద్యం సరైన పాఠం, అర్థం అందించిన భైరవభట్ల కామేశ్వరరావు ఈకింది విధంగా ఇచ్చేరు.)

 

సింగన గ్రంథం సకలనీతి సమ్మతము. ఆ పద్యం:

వెనుకకుఁ బోక హాయనక వేసటనొందక బంతి బంతిలో

వెనఁవక కానమిం బ్రమసి దెగ్గిల కెంతయు మున్ను చూచుచున్

గమకవి అక్షరాక్షరము కందువు దప్పక యేకచిత్తుఁడై

యనుపమభక్తితోఁ జదువునాతని వాదకుఁడండ్రు సజ్జనుల్. (సకలనీతిసారము. 306)

 

ఇక్కడ ఉన్నది సింగన శ్రద్ధాసక్తుల గురించి కాదనుకుంటాను. ఈ పద్యం శివదేవయ్య రచించిన పురుషార్థసారము అనే గ్రంథం లోనిది. దాన్ని సింగన తన సకలనీతి సమ్మతములో సంకలించాడు.

పూర్వం కవులకి వ్రాయసకారులు (తాటాకులపై వ్రాసేవాళ్ళు) ఉన్నట్టుగానే, కవుల గ్రంథాలని చదివి వినిపించే వ్యక్తులు ప్రత్యేకంగా ఉండేవారు. వాళ్ళని వాచకుడు అంటారనుకుంటాను. వీళ్ళు రాజసభలలో రసోచితంగా పద్యాలు చదివి వినిపించేవారు. పురాణాలు చెప్పేటప్పుడు వాచకుడు చదువుతూ ఉంటే పౌరాణికుడు దానికి వివరణ ఇచ్చే ఆచారం కూడా ఉండేదని విన్నాను. ఇక్కడ యీ పద్యం మంచి వాచకునికి (ఇప్పటి భాషలో “చదువరి” అనవచ్చేమో) ఉండవలసిన లక్షణాలు వివరిస్తోంది.

పెనపక – కలపక (కలగాపులగం చెయ్యక), బెగ్గిలక – బెదరక, కనుకని – జాగురూకతతో, కందువ – జాడ చదువుతూ చదువుతూ మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా, అలిసిపోకుండా, ఒక వాక్యాన్ని/పాదాన్ని మరో వాక్యంతో/పాదంతో కలగాపులగం చేసెయ్యకుండా, సరిగా కనిపించకపోవడం వలన భ్రాంతి చెంది బెదిరిపోకుండా, ముందు వచ్చేదాన్ని సరిగ్గా చూస్తూ, జాగ్రత్తగా అక్షరాక్షరాన్ని జాడ తప్పిపోకుండా ఏకాగ్రతతో, అనుపమ భక్తితో చదివేవాడినే సిసలైన వాచకుడని సజ్జనులు అంటారు.

ఇది నాకు తోచిన అర్థం. ఇప్పుడైన మంచి చదువరికి కావలసిన లక్షణాలు ఇవే కదా!

 

@@@@@

Your views are valuable to us!