సాహిత్య విమర్శ

Spread the love
Like-o-Meter
[Total: 1 Average: 4]

“When you give your opinion or judgment about the good or bad qualities of something or someone, especially books, films, etc:” – Cambridge Dictionary meaning for “Criticism”

ఐతే విమర్శ అంటే తిట్టు అన్న గొప్ప భావం మనలో వుంది. 19శతాబ్దం చివరిభాగానికి చెందిన లొరెంజో సియర్స్ అనే బ్రిటీషు ప్రొఫెసర్ తన “Literary Criticism” అన్న పుస్తకంలో Criticism అన్న పదం గురించి చెపుతూ ఇల్లా అంటాడు
 
“The word Criticism itself is apt to convey an unpleasant impression. The judgment of one person by another the commonest signification of the term is not agreeable to the one who is judged, and sometimes not to the one who judges. For this reason, it may be, the word has come to present its offensive side first, implying censure.”

యెందుకిల్లా దురర్థాలు వొస్తున్నాయి? యెవరిదీ లోపం?

కవి అని అనిపించుకొన్న ప్రతి వ్యక్తీ అన్ని వేళల్లోనూ కవిగాదు.యిది అందరూ అంగీకరించాల్సిన విషయం.గానీ చాలామందికి యీ భావం తట్టదు.వో నాలుగైదు రచనల్ని చేసెయ్యగానే తమకుతాము కవి బిరుదాన్ని తగిలించేసుకోడం, ఆపై అనవసరమైన భేషజాలతో, ఈ ప్రపంచంను మీరిన అతీతులమన్న గుడ్డితనంతో, అహమికతో తతిమ్మా రచనల్ని వెలగబెడ్తారు.ఇదో అంటురోగం.సర్వసాధారణం.

యెప్పుడైతే “కవి” తన “స్థాయి”ని మర్చిపోవడం జరుగుతుందో, “బాధ్యత”ని గుర్తించలేకపోవడం సంభవిస్తుందో అప్పటినుండి తన రచనలపై అంతులేని మోహాన్ని పెంచేసుకోవడం జరుగుతుంది. ఋషిత్వం కోల్పోయిననాడు మిగిలేది గుడ్డి మోహం మాత్రమే.

ఈ దశలోనే సదరు “కవి” తనలోని లోపాల్ని యెత్తిజూపే ప్రతి ప్రయత్నాన్ని యెదురుదాడితో తుంచాలని చూడ్డం జరుగుతుంది.గుంపులుగట్టి
“ఇంతమంది మెచ్చుకొంటుంటే యెవిటా విమర్శలు” అని గెంతడం జరుగుతుంది.ఇది మాస్ హిస్టీరియాకు మచ్చు తునక. అక్కిరాజు ఉమాకాంతం భావకవిత్వాన్ని తూర్పారబట్టినప్పడు జవాబివ్వలేని భావకవులు చేయదల్చింది దీన్నే.ఇప్పుడు కూడా ఇదే తంతే!
 
 
“We judge a work of art by its effect on our sincere and vital emotion, and nothing else.” అన్నాడు డి.హెచ్.లారెన్స్

అదే లారెన్స్ ఇల్లా కూడా అన్నాడు

“Never trust the artist. Trust the tale. The proper function of a critic is to save the tale from the artist who created it. “

అంటే అతను కవుల/రచయితల శక్తిని తక్కువజేస్తున్నట్టు గాదు. ఎన్నెన్నో భావాలు, అర్ధమైనవి-కానివి, పట్టి కుదిపేస్తుంటే, ఆ గందరగోళంనుండి బైటపడో, పడకో రచన చేసేస్తుంటారు భావుకులు.ఇక్కడే అక్కిరాజు ఉమాకాంతం ఇల్లా చెప్తారు

“సర్వభావాలకు మొదట తాను వశుడై సర్వ భావాలను పిమ్మట తన వశం చేసుకొని భావోద్వేగానికి తాను మొదట వశుడై పిమ్మట భావోద్వేగాన్ని తన వశం చేసుకొని సర్గానికి ఉన్ముఖుడయ్యే జగన్నిర్మాతవలె అమోఘవివేకంతో కావ్యసృష్టికి ప్రవృత్తుడవుతున్నాడు కవి”సర్వభావాలకు వశమవ్వడంతోనే ఆగిపోతారు చాలామంది.అక్కడినుంచి ముందడుగువేసి భావాల్ని తమ వశం జేసుకోడంలో విఫలమౌతారు.యీ వైఫల్యమే రచనని పేలవంగా జేస్తుంది. యీ లోపాన్ని గుర్తించగలిగేవాళ్ళు దిద్దుబాటులు జేసుకొంటారు. అల్లా గుర్తించలేనివాళ్ళకి విమర్శలు అవసరం. ఐతే మిడిమిడి కవులు, మడమదిప్పని వీరబాహులు నూతిలో కప్పల్లా బెకబెకలాడుతుంటారు.

ప్రతి పదానికీ వో అర్ధముంది.ఆ పదాన్ని ఆ అర్ధంలోనే యధాతధంగా వాడితే వాక్యమౌతుందేగానీ కవిత్వంగాదు. పదాలకున్న లౌకికార్ధాల్ని మాయంజేసి వాటికో కొత్త అర్థాన్ని, రూపాన్నివ్వడమే కవిత్వం. “a bad poem is one that vanishes into meaning” అన్నాడు ప్రముఖ ఫ్రెంచ్ కవి, విమర్శకుడు వాలెరీ.

“In criticism I will be bold, and as sternly, absolutely just with friend and foe. From this purpose nothing shall turn me.” – Edgar Allan Poe

నువు నన్ను పొగుడు, నేను నిన్ను పొగిడేస్తా అని కాంట్రాక్టు కుదుర్చుకొని జేసేది విమర్శ గాదు. మానసిక వ్యభిచారంల్లాంటి సాహిత్య వ్యభిచారం. పత్రికల్లో వొచ్చే పుస్తక విమర్శల్లోగానీ, రివ్యూల్లోగానీ నూటికి తొంభైశాతం కాంట్రాక్టు విమర్శలే.

సహృదయంతో గూడిన చదువరులకే సాహిత్యమర్ధమౌతుందని ఆనందవర్ధనుడు జెప్పాడు. నిజమైన విమర్శకులు గూడా మొదట చదువరులే. అటుపైనే రచనలోని గుణ దోషాల నిరూపణకి దిగేది. అదిగూడా సాహిత్యం పై వున్న తపనేగాని కొత్త బిచ్చగాడు టైపు భావుకులకుండేటటువంటి గుర్తింపుజబ్బు గాదు.

వొకానొక రాజకీయ సిద్ధాంతానికో, సాహిత్యంలో వచ్చిపోయే వొకానొక రకపు వాదానికో కట్టుబడి చేసేది విమర్శ గాదని అందరూ గ్రహించాలి. వ్యక్తిగత ద్వేషాలతో జేసేది ఆరోపణౌతుందే గానీ విమర్శకాలేదు.ఇల్లాంటి అరుపులతో “ఉత్తమ సాహిత్య సృష్టి” సాధ్యం గాదు.

“The great critic must be a philosopher, for from philosophy he will learn serenity, impartiality, and the transitoriness of human things. ” అన్న మాటల్ని అందరూ గుర్తుంచుకోవాలి.

 

Your views are valuable to us!