సంక్రాంతి అంటే కేవలం వినోదమేనా?

Spread the love
Like-o-Meter
[Total: 3 Average: 4.7]

 

సంక్రాంతి ఒక పండుగ అని అందరికీ తెలుసు.

అయితే ఇది కేవలము క్షణికము, అశాశ్వతమూ అయిన విందులు, వినోదములకు మాత్రమే పరిమితమయిన సమయమా లేక నిత్యమూ, శాశ్వతమూ అయిన జ్ఞాన సంపాదనకు సైతం అనుకూలమయిన సందర్భమా? అను ప్రశ్నను వేసికొనుట అత్యావశ్యకము.

ఈ చిన్న వ్యాసము పై ప్రశ్నకు సమాధానమును కనుగొను ఒకానొక ప్రయత్నమని పాఠకులకు విజ్ఞప్తి.

*****

సంక్రాంతి అనే పదం సమ్+క్రము+క్తిన్ అనే మూడు పదముల సంయోగమని భాషా శాస్త్రములు వివరించుచున్నాయి. క్రము అనగా పదవిక్షేపే’ అనే అర్థమున్నది. అనగా ఒక వస్తువు ఇంకొక వస్తువుతో చక్కగా చేరుకొనుటను సంక్రాంతి అని పిలుస్తారు.

ప్రాచీన భారతీయ కాలజ్ఞానం ప్రకారం సూర్యుడు కాలగమనాన్ని నిర్దేశించు ప్రధాన దైవము. అతని గతిని అనుసరించి కాల విభాగములను నిర్దేశించినారు. అటువంటి గ్రహరాజు అయిన రవి మేషాది పన్నెండు రాశులలో సంచరించగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నెల (మాసము) ఏర్పడుచున్నది. ఉన్నవి పన్నెండు రాశులు కనుక పన్నెండు నెలలు ఏర్పడుచున్నవి. ఈ పన్నెండు నెలల సమిష్టియే ఒక సంవత్సరము. పన్నెండు మాసములలోనూ సంక్రాంతులు వస్తాయి. వాటిని ఆయా రాశి నామధేయముతో పిలువడముతో బాటు కొన్ని ప్రత్యేక నామములతో కూడా పిలుస్తారు. అవియేవనగా:

మృగకర్కటసంక్రాంతీ ద్వే తు దగ్దక్షిణాయనే|

విషువతీ తులమేషే గోలమవ్యే తథాపరాః||

 

ధనుర్మిథున కన్యాసు మీనే చ షడశీతయః:

వృష వృశ్చిక సింహేషు కుంభే విష్ణుపదీ స్మృతా||

భావము: మేషము మరియు తులారాశులలో సూర్యని సంచరించితే ఆ సంక్రాంతులకు “విషువత్” అని పేరు. కర్కాటక మరియు మకర రాశులలో సంచరించితే దక్షిణాయనము మరియు ఉత్తరాయణమని పేరు. మిథునము, కన్యా, ధనస్సు మరియు మీన రాశులలో సంచరించితే ఆయా సంక్రాంతులకు “విష్ణుపదీ”యని సామాన్య నామములు కలవు.

పన్నెండు మాస సంక్రాంతులలో “మకర సంక్రాంతి” మరియు “కర్క సంక్రాంతి”కి విశేష స్థానములు కలవు. ఎందుకనగా, ఈ సంక్రాంతులలోనే విశిష్ట కాలఖండికలయిన “ఉత్తరాయణము” మరియు “దక్షిణాయనము”లు కలుగుచున్నవి.

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
 

*****

మకర సంక్రాంతి – నామ వైశిష్ట్యము:

’మకరము’ అనగా మొసలి, మకరమను పేరుగల ఒక నిధి, మకరము అని పేరు గల ఒక రాశి అను అర్థములు కలవు (చూ. మేదినీకోశము).

మకరము అనునది జలచరములలోని ఒక జాతి. కుబేరుని వద్దగల నవనిధులు అనగా మహాపద్మము, పద్మము, శంఖము, మకరము, కచ్ఛపము, ముకుందము, కుందము, నీలము, ఖర్వము అను వాటిలో నాల్గవది. మేషము మొదలగు పన్నెండు రాశులలో పదవ రాశి.

మకర పదాన్ని మ+కర అని విడదీసినచో మరిన్ని అర్థములు వచ్చును. వీటిలో కొన్నింటిని పరిశీలించెదము.

శబ్దమునకు సమయము; శ్రీ కృష్ణుడు; విషము; తల; బంధనము అను అర్థములు కలవు. ఇవియన్నియూ పుంలింగములు.

మా యను స్త్రీలింగమునకు లక్ష్మీదేవి; వలదు (No) యను అర్థములు కలవు.

ఈవిధముననే:

కర యనిన చేయి; పూజాద్రవ్యము; సుంకము; ఏనుగు తొండము; కిరణము మొదలగు అర్థములు కలవు. వీటితో బాటు కం సుఖం రాతి ఇతి కర అను మరొక వ్యుత్పత్తి కలదు. (కర పదమునకు స్త్రీలింగ ప్రయోగము లేదు.)

పై పేర్కొన్న అర్థములను ’సంక్రాంతి’ పదముతో చేర్చి, క్షుణ్ణముగా పరిశీలిస్తే కొన్ని విశేషములు గోచరమవుతాయి.

మకర అనగా సమయ సంబంధము, శ్రీకృష్ణ సంబంధము అయిన పూజ అని అర్థము చేసికొనవచ్చును. సంక్రాంతి అనగా రెండింటిని కలుపునది అని ఇతఃపూర్వమే అర్థము చెప్పుకొన్నాము కనుక “మకర సంక్రాంతి” అనగా భగవత్సంబంధమైన పూజా సమయమని తెలుసుకొనగలము.

మకర అనగా విషపు చేయి (మ=విషము; కర=చేయి). అట్టి మృత్యురూపమైన కర (సుఖము)ను దూరముగా ఉంచి; లక్ష్మీ (మా=లక్ష్మీ) సంబంధమయిన బంధమును (సంక్రాంతి)ని పొందుటకు అనువైన కాలము.

ఇవి కొన్ని అర్థములు మాత్రమే. ఇటువంటి విశిష్ఠార్థములను మహానుభావులగు ఉత్తములచే తెలుసుకొని, ఆ అర్థములకు అనుగుణముగా సంక్రాంతి పండుగను ఆచరించినచో మన జీవితము సంపూర్ణ సాఫల్యమును పొందగలదు.

ఆవకాయ.కామ్ పాఠకులందరికీ ఆధ్యాత్మిక, ధార్మిక మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

@@@@@




Your views are valuable to us!